సార్థకత లేని జీవితం  తుప్పు పట్టిన కత్తి లాంటిది

Mar 12, 2024 - 15:52
Mar 13, 2024 - 00:16
 0  0

సామూహిక ప్రయోజనాలను భుజానికి ఎత్తుకోవడం సామాజిక బాధ్యత.

వ్యక్తిగత  విలువలు, చొరవ,  పట్టుదల,  సామాజిక చింతన పై చైతన్యం  ఆధారపడి ఉంటుంది.

మెరుగైన సమాజం  వైపు ఆలోచించడం మనందరి ఉమ్మడి  లక్ష్యం కావాలి.

---వడ్డేపల్లి మల్లేశం 

వ్యక్తిగత జీవితాన్ని సమర్థవంతంగా  గడిపిన ప్రతి వాళ్లు ఈ వ్యవస్థ  కు తోడ్పడకపోవచ్చు కానీ వ్యక్తిగత సామర్థ్యం విలువలు ఆచరణ  లక్ష్యం  సామాజిక చైతన్యానికి   మెరుగైన వ్యవస్థకు   సామాజిక బాధ్యత నిర్వహణలో  తోడ్పడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  సామాజిక చింతనను ఈ సమాజంలో  ఏ మేరకు ప్రభావితం చేయగలమో  ఆ స్థాయిని బట్టి సామాజిక చైతన్యం మెరుగైన సమాజం అనేది ఆధారపడి ఉంటుంది, అయితే ఇది నిరంతర ప్రక్రియ .  ప్రకృతి నుండి , చారిత్రక సామాజిక రాజకీయ ఆర్థిక వివిధ రంగాల నిపుణుల జీవితాల నుండి  అధ్యయనం చేసిన విలువలు,  ఆదర్శ జీవితం ఆధారంగా  నేటి పరిస్థితులను మరింత మెరుగుపరచుకొని  భవిష్యత్తు సవాళ్లను అధిగమించడానికి అవసరమైనటువంటి  మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవడానికి  గతం ఎంతో తోడ్పడుతుంది అయితే  గతం నుండి  వర్తమానాన్ని నిర్మించుకొని  భవిష్యత్తుకు సరైన బాటలు వేసే క్రమంలో మనం పాటించే విలువలు, ఆదర్శంగా తీసుకునే గొప్పవాళ్ళ చరిత్రలు,  శ్రమైక జీవనాన్ని ఆరాధించి ఉత్పత్తులను పెంచి  పాలనలో భాగస్వాములు  కావడానికి  మనము చూపే చొరవ,  వ్యక్తిగత సామాజిక జీవితంతో పాటు  రాజకీయ జీవితాన్ని అభివృద్ధిని దేశ సంక్షేమాన్ని  పరిపాలనలో విలువలను కూడా  ప్రభావితం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఒక్కొక్కసారి మన శక్తిని మనమే అంగీకరించం, విశ్వసించం, కానీ ఆలోచించి ఆచరణకు పూనుకొని ఒక్క అడుగు ముందుకు వేస్తే  ఎన్ని అడుగుల నైనా  వడి వడిగా పరిగెత్తి  గమ్యాన్ని చేరుకోవచ్చు. కావలసినది ప్రేరణ, ప్రోత్సాహం, నైతిక మద్దతు.  "ఎవరేమన్నను తోడు రాకున్నాను పోరా బాబు పోరా నీ గమ్యం చేరుకోరా" అంటూ సుమారు  నాలుగున్నర దశాబ్దాల క్రితం ఒక సినిమాలో  వచ్చిన పాట అనేక మందిని ప్రభావితం చేయడమే కాదు  నిరుత్సాహంతో  భయంతో  ఆందోళనతో  తనపై తనకే అనుమానంతో బ్రతికిన వాళ్ళు ఎందరో  తమలో దాగి ఉన్న శక్తులను  ఆ ప్రేరణతో  బయటికి తీసిన సందర్భాలను తదనంతర కాలంలో వచ్చిన మార్పులను కొంతవరకు మనం గమనించవచ్చు.  ఈ మార్పు ప్రస్ఫుటంగా  పరిమిత కాలంలో  గమనించకపోవచ్చు కానీ   ప్రభావం ఉంటుందనేది నగ్న సత్యం.

జీవితానికి సార్థకత లేకుంటే :-

అర్థవంతమైన జీవితాన్ని గడపడమే  సార్థకత అని అంటూ ఉంటాం . ఇటీవలి కాలంలో   కుటుంబ అభివృద్ధియే  సమాజ అభివృద్ధి అని ఆలోచించేవాళ్లు కోకోళ్ళలు.  వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం కాదు కానీ  అదే సందర్భంలో సమాంతరంగా సామాజిక స్పృహను పెంపొందించుకొని  సమాజ మార్పుకు తన వంతు భాగస్వామి కావడాన్ని బాధ్యతగా గుర్తించకపోవడమే  నేడు వ్యవస్థ ఎదుర్కొంటున్న పెద్ద సవాల్.  అక్కడో ఇక్కడో బుద్ధి జీవులు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు,  విద్యావంతులు, హేతువాదులు,  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారవంతులు  ఉండడం వల్లనే ఈ వ్యవస్థ కొంత మెరుగైన స్థితిలో నడుస్తున్నది . ఇక కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వాళ్ళు, చిరు వ్యాపారులు,  అల్పదాయ వర్గాలు, అట్టడుగు వర్గాలు,  తాడిత పీడిత గిరిజన ఆదివాసి  తెగలకు చెందిన వాళ్లు తమ ఉనికిని కాపాడుకోవడమే ప్రశ్నార్ధకమవుతున్న సందర్భంలో కూడా  ఉత్పత్తిలో భాగస్వాములవుతూ అమాయకంగా నైనా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములైనందుకు వారిని  మనం ఎలుగెత్తీ చాటి వారి ద్వారామనం ప్రేరణ పొందాలి. "ఇక విద్యావంతుల ముసుగులో  స్తబ్దంగా ఉండి సమాజాన్ని పట్టించుకోని వాళ్ళు,  సంపన్న కుటుంబాలకు చెంది ఈ వ్యవస్థ పైన బాధ్యతను విస్మరించిన వాళ్ళు,  సంపద కోసమే రాజకీయాలకు వచ్చి అక్రమార్జనకు పాల్పడి నిస్సహాయులు పేదలను పీడించేవాళ్లు , పెట్టుబడుదారి వర్గాలు ఇవాళ సామాన్యజనానికి మానవతా వాదానికి సమాజ ఎదుగుదలకు ద్రోహం చేస్తున్న వాళ్లుగా మనం గుర్తించవలసిన అవసరం ఉంటుంది ". సంపదను సృష్టించే వాళ్ళు,  శ్రమను గౌరవించి  ఉత్పత్తిలో భాగస్వాములయ్యే వాళ్ళు, సేవా రంగంలో పనిచేసే వాళ్లు,  సాహిత్య సామాజిక చారిత్రక ఆర్థిక సహా రంగాలలో వివిధ దశల్లో కృషి చేస్తున్న వాళ్లు  కొంతవరకు వ్యవస్థకు తోడ్పడిన వాల్లే. కానీ   తమ కోసం మాత్రమే బ్రతికి,  మార్పును ఆశించకుండా, మెరుగైన వ్యవస్థను ఆకాంక్షించకుండా,  వర్గ సంఘర్షణను వ్యతిరేకించి,  పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించి,  అంతరాలు అసమానతలు దోపిడీ పీడన ఇలాగే కొనసాగాలని కోరే కొన్ని వర్గాలతోనేఇవాళ  మానవతా విలువలతో కొనసాగాలని కోరుకునే వ్యవస్థకు పెద్ద ఇబ్బంది .

మనలను ప్రభావితం చేస్తున్న కొందరి మాటలు":-

1) మానవుడు సంఘజీవి అన్న అరిస్టాటిల్ మార్గాన్ని  కోట్లాది ప్రజానీకం ఆచరించక,  కుటుంబానికి పరిమితం చేసుకొని , తీరని ద్రోహం తలపెడుతున్న విషయం అందరికీ తెలిసిందే.

2) ఇక ప్రముఖ విప్లవ రచయిత సామాజిక  ఆర్థిక రాజకీయాలను  తనదైన రీతిలో శాసించిన  విప్లవ కవి శ్రీశ్రీ  "వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంతం పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం" అని హెచ్చరించినారు.  అంటే వ్యక్తిగతానికి ప్రాధాన్యత ఇస్తూనే  సామాజిక చింతనను విస్మరించకూడదు అని చేసిన హెచ్చరికగా మనం భావించాలి . కనీసం మనిషై పుట్టిన వారికి మానసిక సామాజిక చింతన తప్పనిసరి అని   శ్రీ శ్రీ నినాదం ద్వారా తెలుస్తున్నది.

3)ప్రశ్నించి యజమానిగా నిలబడతావా? ఆశించి సేవకుడిగా బానిసగా మిగిలిపోతావా? అంటూ  రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన  హెచ్చరికను కూడా  పాలకవర్గాలు  దుర్వినియోగం చేస్తూ  అడ్డదారిలో కొందరిని రక్షిస్తుంటే , సామాన్య ప్రజానీకం తగిన స్థాయిలో  చైతన్యాన్ని పునికి పుచ్చుకో ని కారణంగా  శ్రమ దోపిడికి గురి కావడం జరుగుతున్నది .తద్వారా తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడంతో  ఉనికి లేని జీవితం గా మారిపోవడం అత్యంత విచారకరం.

4)"ఇవాళ దున్నాల్సింది పొలాలతో పాటు మనుషుల మెదల్లను కూడా"  అని తన  పదునైన కలంతో  నినదించినటువంటి ప్రముఖ అంబేద్కరిస్టు, సామాజికవేత్త రచయిత కత్తి పద్మారావు  చేసిన సూచన కూడా  ప్రజల మానసిక దౌర్భాగ్యాన్ని బాధ్యతారాహిత్యాన్ని చైతన్య రాహిత్యాన్ని తెలియజేస్తూ  సార్థకమైన జీవితం కోసం  సామాజిక బాధ్యతగా మరింత  ముందుకు వెళ్ళమని తెలియజేస్తున్నది వాస్తవం కాదా!  

5)ప్రాచీన మతమైన బౌద్ధమతం ప్రకారం బుద్ధుడు  "మనుషులందరూ సమానమే" అని ఇచ్చిన రూలింగ్  వివక్షత అంతరాలు అసమానతలు లేని సమాజంతో పాటు  హక్కులను  స్వేచ్ఛను సమానంగా అనుభవించాలని,  సమాజ ఎదుగుదలలో  బాధ్యతను అంతే స్థాయిలో నిర్వహించాలని  చేసిన సూచనగా భావించవలసి ఉంటుంది.

6)" అద్దాల మేడలు రంగుల గోడలు మాత్రమే అభివృద్ధి కాదు నైతిక అభివృద్ధి దేశాభివృద్ధి"  అంటూ అభివృద్ధికి నిర్వచనం ఇచ్చిన గాంధీ ప్రకారం  నైతిక విలువలను సమాజంలో ఎంత మేరకు పునరుద్ధరిస్తామో ఆ స్థాయిలో  విలువలతో కూడినటువంటి వ్యవస్థను కాపాడుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మెరుగైన వ్యవస్థను ఆవిష్కరించుకోవచ్చు కదా!.

7)శ్రామిక తత్వాన్ని, శ్రమ పట్ల గౌరవాన్ని,  నిరంతర బాధ్యతను తెలియజేసే సోక్రటీస్ అనుభవాన్ని  ప్రస్తావించుకోవడం తప్పనిసరి . మరణశిక్ష ఖాయమై రెండు గంటలు కూడా లేని సమయంలో కూడా  అల్లంత దూరంలో కొత్త సంగీత పరికరాన్ని వాయిస్తున్న పిల్లాడి ద్వారా  ఆ కలను అభ్యసించడానికి అవకాశం ఇవ్వమని జైలు అధికారులను కోరి నేర్చుకున్న తీరు  అభ్యసనం, అభివృద్ధి ,బాధ్యత నిరంతర ప్రక్రియ అని గుర్తు చేస్తుంటే శాశ్వత ఆదాయాల మీద ఆధారపడి ఇక మన బాధ్యత ఏమీ లేదని  చేతులు ముడుచుకొని కూర్చోవడం  నిజంగా దేశద్రోహం కాక మరేమవుతుంది?

ఉమ్మడి లక్ష్యంగా సమాజాన్ని నిర్దేశించుకుని ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకుంటూ  పట్టుదల, దేశభక్తి, సామాజిక చింతన  వంటి లక్షణాలను పునికి పుచ్చుకొని జీవితాన్ని అర్థవంతంగా తీర్చి దిద్దుకోవడానికి వ్యక్తిగతంగాను సామూహికంగానూ పరస్పరంగానూ ప్రభావితం కావడం అనేది  జీవితానికి పెద్ద  అత్యున్నత దశగా భావించాల్సిన అవసరం ఉన్నది.  మార్క్స్, ఏంజెల్స్, స్టాలిన్, లెనిన్,  మావో వంటి సామాజిక  ఉద్యమకారుల  ఆలోచన  రూపమైన సమసమాజాన్ని స్థాపించుకోవడానికి  కనీసమైన స్థాయిలోనైనా మన ఆలోచనలు ఆచరణ లేకపోతే ఎలా ?  ప్రతిబంధకాలు కల్పించి ,వ్యవస్థ ఎదుగుదలను కూలదోసి , అంతరాలను కొనసాగించాలని చూసే దుర్మార్గ పాలకులు పెట్టుబడిదారులు ఇతర శక్తులను ప్రతిఘటించే క్రమంలో  వర్గ సంఘర్షణ అనివార్యమైన పరిస్థితులలో  ఆ పోరాటంలో  నిలబడడానికి కనీస మైన  సామాజిక చింతనను  ఆయుధంగా కలిగి లేకపోతే  అక్రమార్కులను ఎలా ఎదుర్కోగలము? సమసమాజాన్ని ఎలా స్థాపించగలము ?.

8)"సమాజ మార్పుకు దోహదపడనీ విద్య,  సార్థకతలేని జీవితం తుప్పు పట్టిన కత్తి వంటిది" అని  ప్రముఖ విప్లవ రచయిత  సామాజిక ఉద్యమకారుడు వరవరరావు గారు ఏనాడో మార్గ నిర్దేశం చేసి ఉంటే  మన ఆచరణలో ఎప్పుడైనా దాన్ని  ఒక అంశంగా తీసుకున్నామా? ఆలోచించుకొని ఇప్పటికైనా  ఆ దారిలో మన ప్రయాణాన్ని కొనసాగనిద్దాం. లక్ష్యాన్ని చేరుకుందాం.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333