ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసమైనా స్వరాష్టములో విద్యారంగం సాధించిన ఘనత ఏమున్నది? 

 ప్రైవేటీకరణ పెరిగింది. ప్రభుత్వ రంగం క్షీణ దశకు చేరుకున్నది .

Mar 12, 2024 - 15:58
Mar 13, 2024 - 00:14
 0  1

బారాస హయాములో ధ్వంసమైన విద్యారంగం  --1

తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రముతో 1956లో విలీనమై ఆంధ్ర ప్రదేశ్ గా అవతరించినప్పటి నుండి  ఈ బంధం సహజమైనది కాదని  ఈ ప్రాంత ప్రజల ప్రయోజనాలను తీర్చలేదని  అసంతృప్తి మొదలైన విషయం అందరికీ తెలుసు . ఆ ఆలోచన నుండి ఉద్భవించినదే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ప్రబల ప్రజల ఆకాంక్ష . సుదీర్ఘకాలం కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం ఇతర ప్రభుత్వాలు పరిపాలించినప్పటికీ  ప్రాంతీయ వివక్షత కారణంగా  తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆయా అధికార పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు మంత్రులు  త మదైన ఆధిపత్యాన్ని చూపకపోవడం వలన,  ఈ ప్రాంత ప్రయోజనాల కోసం నాయకత్వంతో పోరాట లేకపోవడం వలన  ఈ అసంతృప్తి  రాష్ట్ర కాంక్ష మరింతగా పెరిగింది అనేది చరిత్ర ద్వారా తెలుసుకున్న నగ్నసత్యం. అయినప్పటికీ కొన్ని విషయాలలో పరిశీలించినప్పుడు  ఏ ఆకాంక్ష కోసమైతే తెలంగాణ సా కారమైనదో  గత పది ఏళ్ల  టిఆర్ఎస్ పాలనా కాలంలో  అనేక వైఫల్యాలను మాత్రమే కాకుండా  నిర్లక్ష్యాన్ని మనం గమనించవచ్చు  .ఉమ్మడి రాష్ట్రంలో కంటే విద్యావ్యవస్థలో అనేక  అంశాలలో  వైఫల్యాలను బారాస ప్రభుత్వంలో  గమనించినప్పుడు స్వరాష్ట్ర సాధనలో ఉన్న ప్రత్యేకత ప్రయోజనం ఏమిటి? అని ప్రశ్నించుకోక తప్పదు . ఆ ప్రభావం ఇటీవల ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా పడే ప్రమాదం ఉన్నది . అందుకే గత పదేళ్ల పాలనా కాలంలో విభిన్న రంగాలలో జరిగిన విధ్వంసాన్ని చర్చించుకోవడం  రేపటి సుపరిపాలనకు తొలిమెట్టుగా భావించవలసి ఉంటుంది.

బారాస కాలంలో  ప్రైవేటీకరణకే మొ గ్గు:-

ప్రపంచం నివ్వెరపోయే స్థాయిలో పరిపాలన చేస్తామని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని  దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మాట ఇచ్చిన  బారాస ప్రభుత్వం  ఆ వైపుగా కనీసమైన కృషి జరగకపోగా విద్యారంగము తో పాటు అన్ని రంగాలలో ఈ దేశం నంబర్ వన్ అని చివరిదశలో  నినదించడాన్ని మాత్రం మనమంతా గమనించి ఉన్నాము . భారతదేశంలో రాష్ట్రాలతో పాటు  కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకున్నప్పుడు విద్యా ప్రమాణాలలో తెలంగాణ రాష్ట్రం  31 వ స్థానంలో ఉన్నదని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.  ఉమ్మడి రాష్ట్రంలో 17  శాతం నిధులను బడ్జెట్లో విద్యకు కేటాయిస్తే  2014లో తెలంగాణ ఏర్పడే  నాటికి 11% విద్యారంగానికి ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించబడితే  పదేళ్ల తర్వాత 2023 బడ్జెట్లో చూసినప్పుడు  7శాతానికి దిగజారింది  అంటే   విద్యా నిధులను తగ్గించుకోవడానికే నా? రాష్ట్రాన్ని సాధించుకున్నది అని ప్రశ్నించుకుంటే మంచిది.  తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో పాఠశాల విద్యలో సుమారు  ప్రభుత్వ రంగంలో 35 లక్షల పైగా విద్యార్థులు ఉంటే ప్రైవేట్ రంగంలో 25 లక్షల మంది  ఉండగా  ఆ సంఖ్య  టిఆర్ఎస్ ప్రభుత్వ ముగింపు నాటికి  గమనిస్తే  31 లక్షల మంది ప్రైవేట్ రంగంలో 29 లక్షల మంది ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి బారాస ప్రభుత్వం కారణం కాదా? ప్రభుత్వ విద్యను బలోపేతం చేసి, అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను అందిస్తూ , ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణను ఇప్పించి,  ప్రభుత్వ పెద్దలు కూడా పాఠశాలలను సందర్శించినటువంటి ఆదర్శన నమూనా ఢిల్లీలో కొనసాగుతుంటే  ఆ అంశాలను ఏవి పట్టించుకోకుండా కేవలం బారాస  పార్టీ మనుగడ కోసమే ఢిల్లీ ముఖ్యమంత్రితో  చేతులు కలిపిన విషయం మనందరికీ తెలుసు . విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వంతో పోటీ పడకుండా ఉండడం అంటే  తన బాధ్యతను విస్మరించడమే కదా ! ఢిల్లీ  కేరళ  ఇతర రెండు మూడు రాష్ట్రాలు 25 ,24% నిధులను విద్యారంగానికి కేటాయిస్తే  కెసిఆర్ ప్రభుత్వము  కంటి తుడుపు నిధులు    ప్రభుత్వ విద్యారంగ విధ్వంసానికి పరాకాష్ట కాదా?

సుమారు 4000 పైచిలుకు ప్రభుత్వ పాఠశాలలను  విద్యార్థులు లేరనే సాకుతో మూసివేసి,  ప్రైవేటు పాఠశాలలకు బార్లా తెరిచి , నిధులు  నియామకాలను జరపకుండా పాఠశాల విద్యా వ్యవస్థను విచ్ఛిన్నము చేయడమే కాకుండా  ప్రైవేట్ రంగంలో 5 విశ్వవిద్యాలయాలకు అనుమతించి పేద విద్యార్థుల పొట్ట కొట్టినది నిజం కాదా?  మరో 7 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి కోసం రాష్ట్ర గవర్నర్ దగ్గర  ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్న విషయాన్ని గమనిస్తే  బారాస ప్రభుత్వం ఎవరి కోసం పని చేసిందో తెలుసుకోవచ్చు .తాయిలాలు, ఉచితాలు, పెన్షన్లు, ఇతర  జనాకర్షణ పథకాల ముసుగులో ప్రజలు  ఆ ప్రభుత్వం విద్యా, వైద్య ,ఉపాధి,  సామాజిక న్యాయం తదితర రంగాలకు చేసిన ద్రోహాన్ని గుర్తించకపోవడం వలన  జరగవలసిన నష్టం ఈ రాష్ట్రానికి పేద ప్రజానీకానికి  జరిగిపోయింది వాస్తవం కాదా?  గత మూడు సంవత్సరాలకు పైగా  ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాల కు చెల్లించవలసిన  సుమారు 5000 కోట్లను  ప్రభుత్వము దాటవేసి  ఎగవేసినది తెలియదా? విశ్వవిద్యాలయాలలో  బోధన బోధనేతర సిబ్బందికొరత,  కనీస అవసరాల కోసం నిధుల లేమి కారణంగా  అద్వాన్న పరిస్థితిలో  కొనసాగుతుంటే  ప్రపంచంలోనే ఒక స్థాయి ఉన్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం నేడు  సిబ్బంది, నిధుల కరువు కాటకాల మధ్యన  తల్లడిల్లి పోతున్న విషయం  విస్మరిస్తే ఎలా?

హైదరాబాద్ తోపాటు పెద్ద పట్టణాలలో ముఖ్యంగా  ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగవుతుంటే,  ఆ నివార్యమైన పరిస్థితులలో పేద వర్గాలు సైతం లక్షలాది రూపాలు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపడం  ఆందోళన కలిగిస్తుంటే , గత ప్రభుత్వం ఏనాడు కూడా పేద ప్రజల పక్షాన ఆలోచించలేదు  ఆ వర్గాలకు విద్య అంద కుండా చేయడమే లక్ష్యంగా పనిచేసింది నిజం కాదా!  ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు అనే పేరుతో  ప్రభుత్వం కొంత విద్యారంగం పైన  అప్పుడప్పుడు సమీక్షిస్తూ వసతులు  విద్యా ప్రమాణాలను  అంచనా వేస్తూ పోతుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏనాడు కూడా విద్యారంగం పైన సమీక్ష చేయలేదు.మొక్కు  బడిగా ప్రారంభించిన "మన ఊరు మనబడి మనబస్తీ మనబడి" కార్యక్రమాలు  నిధుల లేమితో  నిర్ణీత గడువు దాటిపోయిన ఎలాంటి  అవకాశాలకు నోచుకోకపోవడంతో  మూత్రశాలలు మరుగుదొడ్లు లేని కారణంగా కూడా అనేక చోట్ల విద్యార్థులు  చదువు మానివేసిన సంఘటనలు అవమానకరం. మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా  పోషకాహారం అందకపోగా అనేక పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ , వసతుల కోసం విద్యార్థుల నిరసనలు ధర్నాలతో హోరెత్తిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ అసంబద్ధ   అర కొర సౌకర్యాలతో  పేద వర్గాలకు ద్రోహం కోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది?  "ప్రపంచం నివ్వెరపోయే  స్థాయిలో పరిపాలన" అంటే విద్యారంగంలో పేదలకు విద్య అందకుండా చేయడమేనా? అంతేకాదు విశ్వవిద్యాలయాలలో  పీహెచ్డీ ఇతర పరిశోధనలకు తదితర ఫీజులను కూడా పెద్ద మొత్తంలో పెంచడం ద్వారా పేదలకు విద్య అంద కుండా చేసిన ఘనత కూడా బారాస ప్రభుత్వానికే దక్కింది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు సందర్భంగా 317 g.o పేరుతో నిర్భందం కొనసాగించి 20 మంది మృతి,బలిదానాలకు కారణమైన ప్రభుత్వ తీరు.సిగ్గు చేటు.ఉమ్మడి రాష్ట్రంలో అలాంటి ప్రాణ నష్టం ఏనాడు జరగకపోవడం పరిశీలించతగినది.  విద్యారంగంలో బారాస   ప్రభుత్వ దుర్నీతినీ ఎండగడదాం.గత పాలకుల నేరాలు  ఘోరాలను  విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలి . అదే సందర్భంలో  కోల్పోయిన ప్రభావాన్ని, విస్మరించిన లక్ష్యాన్ని , నష్టపోయిన విద్యారంగాన్ని,ఆకాంక్షలను  కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల లోపల  ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా బలోపేతం చేసుకునే దిశగా  కొనసాగించడానికి మన వంతుగా సహకారం అందిద్దాం ! ప్రజల పక్షాన పని చేద్దాం.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333