సమీక్ష సమావేశాలు అంటే ఓటమిని జీర్ణించుకోలేకపోవడమే కదా?

Mar 12, 2024 - 15:50
Mar 12, 2024 - 23:57
 0  3

 పార్టీ లోపాలను  నాయకత్వం వైఫల్యాలను సమీక్షించుకుంటే మంచిది.

ప్రభుత్వాన్ని బెదిరించడం మానుకొని  కార్యకర్తలు ప్రజల మనోభావాలగౌరవించడం బి.ఆర్.ఎస్ నేర్చుకోవాలి.

ఇప్పుడు చేయవలసిందల్లా  తప్పులను గుర్తించడమే.

  ---వడ్డేపల్లి మల్లేశం

బాధ్యతలను సరిగా నిర్వర్తించని వారికి  హక్కులను ప్రశ్నించే అర్హత ఉండదు.  సక్రమ పాలన నిర్వహించకుండా ప్రజలకు ద్రోహం తలపెట్టిన గత పాలకులకు  ప్రస్తుత ప్రభుత్వాన్ని  ప్రశ్నించే అర్హత  లేదు . అయితే ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్నేతలు కనుక ప్రజలు  ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రశ్నిస్తారు, నిలదీస్తారు, తమ ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన చేయని ప్రభుత్వాలను బొంద పెడతారు.  ఎన్నికల్లో గత 10ఏళ్ల పాలనను  అంగీకరించని ప్రజలు  బి ఆర్ ఎస్ ను ఓడించి కాంగ్రెస్కు పట్టము కట్టిన విషయం తెలిసిందే.  ఆర్థిక దివాలా కోరుతనంతో బాధ్యతలను విస్మరించి, పెట్టుబడిదారీ విధానాన్ని ప్రోత్సహించి, ప్రైవేటీకరణను చట్టబద్ధం చేసి, ఉద్యమ ఆకాంక్షలను గాలికి వదిలిన విషయంపై   ప్రజలు  ఆగ్రహంతో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటే మంచిది . 2 శాతం ఓట్లతోనే ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చిందని  ఈ మాత్రానికే కాంగ్రెస్ ప్రభుత్వానికి  పరిపాలించే అర్హత ఉంటుందా? అని ఎద్దేవా చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడo , ప్రజలిచ్చిన రాజకీయ అధికారాన్ని   ధిక్కరించడం గా భావించవలసి ఉంటుంది.  నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవము,  స్వయం పాలన వంటి అంశాలను   ఏనాడు పట్టించుకోని టిఆర్ఎస్ ప్రభుత్వం  ప్రజాకర్షక పథకాల పేరుతో ప్రజల మెప్పు పొందే ప్రయత్నం ఓట్ల కోసం  ఆడిన నాటకంగా గత పాలనను మనం చూడవలసి ఉంటుంది.  అందుకే అసంతృప్తికి గురై ఆగ్రహంతో ప్రజలు ఓడించిన దానిని గుణపాఠంగా తీసుకునే బదులు  6 గ్యారెంటీలను ఎప్పుడు అమలు చేస్తారని పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నించి  ప్రజలను రెచ్చగొట్టి ప్రజల పక్షాన నిలబడతామని చెప్పడమంటే  B R S అడ్రస్ గల్లంతైన ట్లు భావించాలి.

అధికారం లేకుంటే బతకలేని పార్టీ:-

2021 లో ప్రభుత్వం నియమించిన బిశ్వాల్ కమిటీ 1,91000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు  తెలిపితే  అన్ని భర్తీ చేసినట్లు 80 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయవలసి ఉన్నదని  కల్లబొల్లి కబుర్లు మాట్లాడి  గత మూడు సంవత్సరాలుగా పోటీ పరీక్షల పేరుతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను అపహాస్యం చేసి  అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోగా  సుమారు 35 లక్షల మంది నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలను  అడియాసలు చేసిన టిఆర్ఎస్ పార్టీకి  ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత  లేనేలేదు.  కేవలం రెండు శాతం ఓట్లతోనే ఓడిపోయినామని  సమీక్ష సమావేశాల పేరుతో  టిఆర్ఎస్ పదే పదే ప్రకటించడం అంటే  అధికారం లేకుంటే బతకలేమని  గుర్తు చేయడమే కదా!  టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ అని గొప్పగా చెప్పుకున్నప్పటికీ  అధికారం చేపట్టిన తొలి రోజునే  టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కాదని  రాజకీయ పార్టీల వంటిదే అని  మాట మార్చిన విషయాన్ని మేధావులు గుర్తు చేస్తుంటే  ఇక టిఆర్ఎస్  చైతన్యం ఎంతో అర్థం చేసుకోవచ్చు.  ఇక నీళ్ల పేరుతో ప్రాజెక్టులను నిర్మించినప్పటికీ  కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి    వేల కోట్ల రూపాయలను అక్రమార్కులకు కట్టబెట్టి నాణ్యత లేకుండా నిర్మించి తెలంగాణ రాష్ట్ర పరువును దిగజార్చిన టిఆర్ఎస్ పార్టీకి  ప్రజలకు ముఖం చూపించే అర్హత లేదని తేలిపోయింది.  దానికి బదులు ప్రతిరోజు సమీక్షా సమావేశాలు అని చెబుతూ  కార్యకర్తలు ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లు ప్రకటిస్తూనే  ప్రభుత్వం మీద లేనిపోని  ఆరోపణలు చేయడం,  ఎప్పుడు హామీలు పరిష్కరిస్తారని  బెదిరించడం వంటి చౌకబారు విధానాలు  మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని తెలుసుకుంటే మంచిది . ఇక నిధుల విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ ఏర్పడితే మన నిధులు మనకే ఖర్చు చేసుకోవచ్చని చెప్పినటువంటి టిఆర్ఎస్ పార్టీ    తెలంగాణ నిర్మాణాలకు సంబంధించి  ప్రాంతేతరులకు అప్పగించడమే కాకుండా  ప్రజాధనాన్ని అక్రమార్కులకు కట్టబెట్టి, భూకబ్జాలు  ప్రభుత్వ భూముల అమ్మకాల పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీయించిన విషయం ఎవరికీ తెలియదు.   బంగారు తెలంగాణ,  పెన్షన్లు ,షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి , ప్రభుత్వ పథకాలు, ఉచితాల పేరుతో ప్రజలను మభ్యపెట్టిన విషయాన్ని  ప్రజలు  తెలుసుకున్నారు అనే సోయి  టిఆర్ఎస్ పార్టీకి వస్తే మంచిది .   రైతుబంధులో వేల కోట్ల రూపాయలు  భూస్వాములకే ముట్టజెప్పి , దళిత బంధు పేరుతో కొంతమందికే ఇచ్చి సంపన్నులకు జేబులు నింపి,  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి   సబ్ ప్లానును  దూరం చేసి,  పేదరికాన్ని మరింత పెంచి పోషించి, అంతరాలను  అసమాన తలను  చట్టబద్ధం చేసిన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం  ప్రజలకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు. అంతేకాకుండా  7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి  ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని  డిమాండ్ చేయడం అంటే  టిఆర్ఎస్ పార్టీ యొక్క "  గిచ్చి కయ్యం విధానం" అర్థమవుతున్నది.  ఇక సమీక్ష సమావేశాలలో  పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కూడా పార్టీ యొక్క విధానాన్ని ధిక్కరించినట్లు,  స్వేచ్ఛ సమానత్వం కోల్పోయినట్లు,  క్రింది స్థాయి కార్యకర్తలు  కనీసం హరీష్ రావు కేటీఆర్ గారులను కూడా కలిసే అవకాశం లేక వెని తిరిగి వచ్చి మాట వరసకు మాట్లాడినట్లు అబద్ధం ఆడిన తీరు    ఆ పార్టీలో ఏ పాటి ప్రజాస్వామ్యం ఉందో   తెలుస్తుంది.  ముఖ్యమంత్రి ఏనాడు కూడా ప్రజలను కలవకపోగా, ప్రజలకు  ముఖ్యమంత్రిని మంత్రులను శాసనసభ్యులను కూడా కలిసే అవకాశం లేనటువంటి ఒక దయనీయ స్థితి ఈ రాష్ట్రంలో గత పాలనలో కొనసాగింది.  బుద్ధి జీవులు, మేధావులు, ఉద్యమకారులు,  తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు కూడా ఎ లాంటి ప్రాధాన్యత ఇవ్వని ఏక  వ్యక్తి పాలన  అంటే ప్రజలంతా అసహ్యించుకున్నారని ఇప్పటికైనా గుర్తించి  తమ పార్టీని ప్రక్షాళన చేసుకునే క్రమంలో  ఉండాలి తప్ప ప్రభుత్వాన్ని ప్రజలను తప్పు పట్టడానికి ప్రయత్నిస్తే   తిప్పి కొడతారని తెలుసుకోవాలి . మంత్రులు శాసనసభ్యులతోపాటు  విప్లవ రచయిత  ప్రజాయుద్ధనౌక గద్దర్ లాంటి వాళ్లు కూడా ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు  అవకాశం ఇవ్వనటువంటి దుర్మార్గ పరిస్థితులు  మనం కల్లారా చూసినాము . టిఆర్ఎస్  ఓటమికి ఇది ప్రధాన కారణం కాదా?  తప్పులను తెలుసుకుని,  ప్రజల ముందు తలవంచి,  లో పాలను సమీక్షించుకొని,  ప్రజలకు క్షమాపణ చెప్పి,  ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు చేయడం మాత్రమే బిఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి  అవకాశం. అంతకుమించి  అతిగా వ్యవహరించినా,  అధిపత్యాన్ని ప్రదర్శించినా,    ప్రభుత్వాన్ని హెచ్చరించినా  తగిన మూల్యం చెల్లించుకోవలసివుంటుంది.  తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన జయ జయహే తెలంగాణ అనే గీతాన్ని , అలాంటి గీ తాలను రచించిన రచయితలు, ఉద్యమకారులు,   సభ్యులను కోల్పోయినటువంటి అమరవీరుల కుటుంబాలు,  కేసులతో తల్లడిల్లుతున్న ఉద్యమ కారుల స్థితి ఇప్పటికీ దయనీయంగానే ఉంటే  ఆ ఒక్క కుటుంబం మాత్రమే కోటానుకోట్లు సంపాదించినదని ప్రజలు  గుసగుస పెడుతున్నారు.  ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు  లక్ష కోట్ల అవినీతికి ముఖ్యమంత్రి పాల్పడినాడని కేసీఆర్ పైన చేసిన ఆరోపణపై  దర్యాప్తు జరిపించాలని , గత శాసనసభ్యులo దరి  అవినీతి , భూకబ్జాలు, అక్రమార్జనపై  నిగ్గు తేల్చి దోషులను శిక్షించి ప్రభుత్వ ఖాతాకు నిధులను జమ చేయాలని  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ వైపుగా కొత్త ప్రభుత్వం  విచారణకు ఆదేశించడం  తక్షణ కర్తవ్యం గా భావించినప్పుడే  లోటును భర్తీ చేసుకోగలము, నిధులను రాబట్టుకోగలము, అవినీతిపరులకు తగిన శిక్షలు విధించగలము,  ప్రభుత్వాన్ని బెదిరించే దుర్మార్గుల నోరు మూయించగలము.  ఈ అంశం  ప్రజల కంటే పాలకులకే మరి అవసరం.
     పార్లమెంటు ఎన్నికల్లో  ఓడించాలి :-
---*******
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో  అక్రమాలకు పాల్పడి  ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కిన టిఆర్ఎస్ పార్టీని ఓడించాలని  అనేక ప్రజా సంఘాలు మేధావులు బుద్ధి జీవులు పిలుపు ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.  ప్రత్యామ్నాయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ను ప్రజలు  గుర్తించి  పరిపాలన కట్టబెట్టిన  సందర్భములో  గత పాలనకు భిన్నంగా ప్రజాస్వామ్య పద్ధతిలో  ఆకాంక్షల కనుగుణంగా పరిపాలించవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పై  ఉన్నది. ఇదే సందర్భంలో  అధికారం లేకుంటే జీర్ణించుకోలేని టిఆర్ఎస్ పార్టీ  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చూపాలని  తద్వారా  తమదే నిజమైన గెలుపని  మరొక్కసారి ప్రజలను మోసగించడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న విషయం కూడా  కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రజలు గుర్తించాలి. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి బిఆర్ఎస్ పార్టీని  ఆమడ దూరం తరిమినపుడే ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణాత్మకంగా మెరుగైన పాలన అందించగలదు. ఈ విషయాన్ని గమనించి ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు ,అఖిలపక్షాలు కూడా  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని  కాంగ్రెస్ అన్నట్లుగా 100 మీటర్ల లోతున కాకుండా 200 మీటర్ల లోతున పాతి  ప్రజాస్వామిక శక్తులను గెలిపించుకోవడం ద్వారా  ఆ పార్టీ దుందుడుకు విధానానికి అడ్డుకట్ట వేయాలి . సక్రమ పాలనకు,  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా  తీసుకునే నిర్ణయాల కోసం  కాంగ్రెస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును ప్రకటించడం ద్వారా లభించేగతం కంటే మెరుగైన పాలన,  కాంగ్రెస్ని గెలిపించిన  నిర్ణయానికి సరైన అర్థం ఉంటుంది.  అందుకే పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు  పదేళ్ల పాలనలో చేసిన  విద్రోహాన్ని మరొక్కమారు దృష్టిలో ఉంచుకొని  ఆ పార్టీకి తగిన శిక్ష విధించడం,  ఉద్యమ ప్రజాస్వామిక శక్తులను ప్రోత్సహించడం  తమ బాధ్యతగా స్వీకరించాలని  విజ్ఞప్తి చేద్దాం.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333