పాఠశాలకు పురుగులు బియ్యం సరఫరా

మోత్కూర్ 23 జులై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు మధ్యాహ్నం భోజనం కోసం సరఫరా చేసిన బియ్యంలో పురుగులు (తెల్ల పురుగు, లక్క పురుగు) అధికంగా కనిపించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బుజాలాపురం ఉన్నత పాఠశాలకు జూలై నెలలో పంపిణీ చేసిన బియ్యం నాణ్యత లేకపోవడంతో ఉపాధ్యాయులు రెండుసార్లు సివిల్ సప్లై గోదాం వద్దకు వెళ్లి తిరిగి ఇచ్చేయాల్సి వచ్చిన ఘటన స్థానిక అధికారుల నిర్లక్ష్యాన్ని వెలికితీసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, పాఠశాలలో సుమారు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు మధ్యాహ్నం భోజనం కోసం ప్రతి నెల సివిల్ సప్లై గోదాం నుంచి సుమారు క్వింటా 50 కిలోల బియ్యం కేటాయింపుగా వస్తోంది. జూలైలో వచ్చిన బియ్యం మొత్తం పురుగులతో నిండిపోయింది. పిల్లలకు వండి పెట్టే పరిస్థితి లేకపోవడంతో మేము గోదాం వద్దకు తిరిగి ఇచ్చి వేరే తీసుకున్నాం. అయితే రెండోసారి ఇచ్చిన బియ్యంలో కూడా అదే సమస్య ఎదురైంది, రెండవసారి కూడా తిరిగి పంపించి మళ్లీ తీసుకెళ్తున్నామని ఆయన వివరించారు. దీంతో విద్యార్థులు ఆకలి ఇబ్బందులు పడకూడదనుకుని ఇప్పటివరకు తాత్కాలికంగా బయట నుంచి బియ్యం కొనుగోలు చేసి మధ్యాహ్నం భోజనం నిర్వహించాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ విషయంపై సివిల్ సప్లై గోదాం ఇన్‌చార్జి లాయక్ అలీ స్పందిస్తూ, మండలంలోని మిగతా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్టీమ్ రైస్ పంపాం. పొరపాటున బుజాలాపురం పాఠశాలకు రా రైస్ వెళ్లింది. పురుగులు ఉన్నట్టు ఉపాధ్యాయులు తెలిపిన విషయం నిజమే. రిటర్న్ తీసుకొని స్టీమ్ రైస్ పంపించాం, అని అన్నారు. స్థానికులు, తల్లిదండ్రులు మిడ్ డే మీల్స్ నాణ్యతపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని, నిల్వ సదుపాయాలు శుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సరఫరాలో ఎక్కడ లోపం జరుగుతోందో గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు....