ఉపాధ్యాయ వృత్తి కున్న ప్రాధాన్యత ఉపాధ్యాయ దినోత్సవానికి కారణమైనది.
వృత్తి గౌరవాన్నికాపాడి విద్యా లక్ష్యాలను, సామాజిక పరిణతిని,
సమానత్వ భావనను సా కారం చేసేది ఉపాధ్యాయులే
హక్కులకై కలబడుతూ బాధ్యతలకు నిలబడుతూనే విద్యార్థులను భావి సవాళ్లకు సంసిద్ధుల చేయాలి
--వడ్డేపల్లి మల్లేశం
ప్రపంచవ్యాప్తంగా అన్ని వృత్తులలో కెల్లా ఉపాధ్యాయ వృత్తి ఉత్తమ స్థానంలో నిలిచినట్లుగా అనేక సందర్భాల్లో పత్రికల్లో చదివి ఉన్నాము . హక్కులకై కల బడుతూనే బాధ్యతలకు నిలబడే విధంగా ఉపాధ్యాయ వృత్తిని నిర్వచించుకున్న సందర్భంలో జాతీయ విద్యా లక్ష్యాలను సామాజిక మార్పుకు విద్య ఏ రకంగా దోహదపడుతుందో ఆ సామాజిక బాధ్యతను విద్యారంగం అందులో పనిచేసే ఉపాధ్యాయులు వృత్తి గౌరవాన్ని ఇనుమడింపజేసే విధంగా ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేయడం వృత్తి ప్రాధాన్యతను తెలియజేస్తున్నది. అక్టోబర్ 5వ తేదీని అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకుంటూ ఉంటే ఉపాధ్యాయ వృత్తికి గౌరవాన్ని ఇనుమడింపజేసి రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం ఈ దేశంలో ఆనవాయితీగా మారింది. 19వ శతాబ్దంలో ఆంగ్లేయు ల పాలనా కాలంలో చదువుకు నోచుకోని అనేకమంది పేద వర్గాల కోసం తాను విద్య నేర్చుకొని విద్యార్థులకు నేర్పించిన ఘనత వహించిన శ్రీమతి సావిత్రిబాయి పూలే నిజమైన తొలి ఉపాధ్యాయురాలని ఆమె జయంతిని భారత జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవాలని ఇటీవల కాలంలో కొత్త డిమాండ్ రావడాన్నీ కూడా మనం గమనించాలి.
తరాల మధ్య అంతరాలను తొలగించి, సమానత్వ భావనను జోడించి, శాస్త్రీయ వైఖరులను అభివృద్ధి పరచడం ద్వారా భావి సవాళ్లను అధిగమించే విధంగా విద్యార్థులను తయారు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉన్నది. కనుక అందుకోసం ఉపాధ్యాయులు కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను , కాలానుగుణంగా వస్తున్న శాస్త్రీయ వైఖరులు ఆవిష్కరణలను జీర్ణించుకున్నప్పుడు మాత్రమే విద్యా లక్ష్యాలను నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది .హక్కులకై కల బడుతూనే బాధ్యతలకు నిలబడే విధంగా ఉపాధ్యాయులు తమ కార్యాచరణను సంసిద్ధం చేసుకోవడంతో పాటు చొరవ ,పట్టుదల , అంకిత భావం, వృత్తిపట్ల నిబద్ధత, సేవా దృక్పథం అలవరచుకున్నప్పుడు మాత్రమే విద్యార్థులను సరైన క్రమంలో తీర్చి దిద్దడానికి అవకాశం ఉంటుంది . ఇవాళ విద్యా వ్యవస్థ అనేది బోధన అభ్యసన అంశాలను సమ్మిళితం చేసి సమాజాన్ని పాఠశాలలోకి తీసుకురావడంతో పాటు సమాజానికి ప్రతిబింబమైన పాఠశాలను కూడా అప్పుడప్పుడు సమాజంలోకి తీసుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది .ఈ బాధ్యత అంతా నిండు మనసుతో ఉపాధ్యాయులు కర్తవ్య దీక్షగా పనిచేసినప్పుడు మాత్రమే విద్యా లక్ష్యాలు నెరవేరుతాయి. ఏం బోధించాలి? ఎందుకు బోధించాలి? ఎక్కడ బోధించాలి? ఎంతవరకు బోధించాలి? అనే అంశాలు ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క శక్తి సామర్ధ్యాలను స్థాయిని ఆసరాగా చేసుకుని నిర్ణయించుకోవలసి ఉంటుంది .ఈ క్రమంలో పాఠ్యాంశాలు పుస్తకాలు కేవలం ఉపాధ్యాయునికి గైడ్గా మాత్రమే వ్యవహరిస్తాయి. తమ జీవిత అనుభవాలు, అధ్యయనము, పరిశీలన , క్షేత్ర పర్యటన ద్వారా పొందిన పరిశోధన అంశాలు విద్యా బోధనలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఇక విద్యార్థులు కూడా ఎంతవరకు తెలుసుకోవాలి.? ఎందుకోసం తెలుసుకోవాలి? వాటి ప్రయోజనం ఏమిటి ?అవి నిర్వహించబోయే పాత్ర ఎంతవరకు ఉంటుంది ? అనే అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులను ప్రశ్నించి దానితోపాటు సమాజంలో అనేక సందర్భాల్లో పరిశీలించడం తమ సమవయస్కులతో చర్చించుకోవడం కాలానుగుణంగా కొంత జ్ఞానాన్ని ప్రకృతి నుండి పొందడం ద్వారా అభ్యసన అనుభవాలను సమున్నతంగా సొంతం చేసుకోవలసి ఉంటుంది. ఈ బోధనాభ్యసన ప్రక్రియ పాఠశాలలో నియమిత వేళలో కొనసాగినప్పటికీ పాఠశాల బయట కూడా సమాజంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. వారి వారి శక్తి యుక్తులు, ఆకాంక్షలు , ఆసక్తుల మేరకు నిత్యం విద్యార్థిగానే కొనసాగవలసి ఉంటుంది. అంతెందుకు ఉపాధ్యాయులు కూడా ప్రతిరోజు ఏదో విషయాన్ని తెలుసుకుంటూ నిత్య విద్యార్థి గానే కొనసాగుతున్నారు కనుక విద్యార్థులకు అది ఒక సమస్య కానేకాదు అది జీవితం లో ఒక భాగంగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది .
ఇక ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే క్రమంలో ఏం బోధించాలి? ఎందుకు బోధించాలి? అని ప్రశ్నించుకొని లక్ష్యాలను నిర్ధారించుకొని అందుకు అనుగుణమైనటువంటి అంశాలను సిలబస్ను పాట్య అంశాలకు అదనంగా జోడించుకున్నప్పుడు మాత్రమే తన లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. విద్యార్థులను భావి సవాళ్లను అధిగమించే విధంగా తీర్చి దిగలుగుతారు. శాస్త్రీయ ఆలోచనలతో, కార్యకారణ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక అంశానికి సంబంధించినటువంటి ఉనికి, కారణాలు , పరిణామము, ఫలితాలను విశ్లేషించుకోవడం ద్వారా సమగ్రమైనటువంటి అవగాహన పెంపొందించుకోవలసిన బాధ్యత ఉపాధ్యాయుల పైన ఎంతో ఉన్నది. మిగతా రంగాల్లో పనిచేస్తున్న వారంతా వృత్తి నిబంధనలకు అవసరాలకు చట్ట పరిధిలో పనిచేయవలసి ఉంటుంది కానీ అందుకు భిన్నంగా పాఠశాలల్లో విద్యా రంగంలో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రం ఇలాంటి పరిమితి విధించబడలేదు. సముద్రంలో ఈ దే చేప పిల్ల విశాల ప్రాంతాన్ని ఈదినట్లుగానే ఉపాధ్యాయులు కూడా సేకరించిన జ్ఞానాన్ని, పరిశీలించిన అనుభవాలను, అధ్యయనము ద్వారా సమపాధించినటువంటి విషయాన్ని విద్యార్థులకు చేరవేసే క్రమంలో చొరవ పట్టుదల ప్రదర్శించవలసిన అవసరం ఎంతగానో ఉంటుంది. ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని అందించే సందర్భంలో విద్యార్థులు అందరిని కూడా ఉద్యోగులుగా తయారు చేస్తామని హామీ ఇవ్వలేరు. కానీ తన శక్తి సామర్ధ్యాల మేరకు వారిని ప్రయోజకులుగా, నైతిక విలువలు కలవారి గా , మానవ సంబంధాలను కాపాడే వ్యక్తులుగా తీర్చిదిద్దగలమని హామీ ఇవ్వడమే కాదు చాలెంజ్ కూడా చేయవచ్చు ఎందుకంటే ఇది ఉపాధ్యాయుల పరిధిలో ఉన్న అంశం కనుక . ఇవాళ విద్యా లక్ష్యాలు కూడా ఉద్యోగులుగా తయారు చేయడం మాత్రమే కాదు జాతి గర్వించదగిన స్థాయిలో ప్రయోజకులుగా సమర్థులుగా నైపుణ్యం కలవారిగా సంసిద్దులచేయడం కూడా ఉపాధ్యాయుల అదనపు కర్తవ్య మని అవగాహన చేసుకోవడం ఈ సందర్భంగా చాలా అవసరం.
ఏటా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన కొంతమందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించడం ఆనవాయితీగా మారినప్పటికీ ఉత్తమ ఉపాధ్యాయుల యొక్క లక్షణాలను కూడా ఒక్కసారి మననం చేసుకోవడం, పునర్ నిర్వచించుకోవడం , హక్కులతో పాటు బాధ్యతలను రెట్టింపు స్థాయిలో గుర్తించడం, వృత్తి ధర్మానికి అదనంగా కొన్ని బాధ్యతలను జోడించడం ద్వారా ఉపాధ్యాయులు తమ ప్రత్యేకతను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది . .ఏ మేరకు సమాజంతో అనుసంధానమైనారు? సజీవ మానవ సంబంధాలను కాపాడే విషయంలో చొరవ కృషి జరిపినారా? విద్యా లక్ష్యాల సాధనలో చేసిన కృషి ఎంతవరకు ఉన్నది? సాహిత్య సామాజిక సాంస్కృతిక రంగాలలో ప్రవేశం ఉన్నదా? ప్రజా సంబంధాల విషయంలో వీరికి ఉన్నటువంటి అనుభవం ఏ పాటిది ? వంటి అంశాలను ప్రాతిపదికగా చేసుకొని ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించినప్పుడు నిజమైనటువంటి ఉపాధ్యాయులకు కొంతవరకైనా గుర్తింపు దక్కుతుంది ,అంతేకాదు ప్రోత్సాహం ఉల్లాసం కలగడానికి ఆస్కారం ఉంటుంది,. అయితే ఉపాధ్యాయ పురస్కారాల కోసమే అని ఉపాధ్యాయులు ఆలోచిస్తే ఎంత మందికి ఇవ్వగలరు కనుక ఉపాధ్యాయ వృత్తి అనేది ఉపాధిగా భావించకుండా అది ఒక సమర్థవంతమైన నైపుణ్యం అని గుర్తించినప్పుడు మాత్రమే ఆయా శిక్షణ పొందినటువంటి వాళ్ళు వృత్తికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది.
ఉపాధ్యాయ వృత్తిలో ప్రవృత్తి లక్షణాలు ఎక్కువగా ఉన్నవాళ్లు మాత్రమే రాణిస్తారని తెలుసుకోవడం అవసరం ఎందుకంటే ఇది జీవనోపాధికి సంబంధించినటువంటి అవకాశం అని భావిస్తే దీని ప్రయోజనం నిండు సున్నా అని తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే వ్యక్తిలో దాగి ఉన్నటువంటి అంతర్గత శక్తులను వెలికి తీసేదే విద్య అయినప్పుడు ఆ శక్తులను గుర్తించి పరిష్కరించే సత్తా ఉన్నవాళ్లు మాత్రమే నిజమైన ఉపాధ్యాయులుగా రాణిస్తారు. కానీ పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితమై బోధించడానికి సిద్ధపడిన ప్రతి వాళ్లు కూడా ఉపాధ్యాయులు అంటే ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు .ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తి ఒక సవాలు వంటిది దాన్ని హృద్యంగా స్వీకరించే మనస్తత్వం ఉన్నవాళ్లే నిజమైన ఉపాధ్యాయులుగా రాణించగలుగుతారు .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ) కే