అవినీతి కేసుల్లో అతిగా ఏసీబీకి పట్టుబడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
పెద్ద చేపలతోపాటు ఏ రూపంలో ఉన్నా అవినీతిపై ప్రభుత్వాలు ఉక్కు పాదం మోపాలి.
ప్రజలను పీడించే ఉద్యోగులకు కేసులను బట్టి భారీ శిక్షలు, జరిమానాలు విధించాలి .
హక్కుల కోసం డిమాండ్ చేసే ఉద్యోగ సంఘాలు అవినీతి నిర్మూలనలో ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వాలి.
సమాజ ఆమోదం పొందిన మంచి దారిలో పయనించడం నీతీ అయితే దానికి భిన్నంగా అక్రమ సంపాదన, దోపిడీ, పీడన, లంచాల రూపంలో వసూలు చేయడం, భూ కబ్జాలు, అక్రమంగా ఇతరుల సొమ్మును స్వాహా చేయడం , ఇతరుల ఆస్తులను ఆశించడం అవినీతి అవుతుంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న సందర్భంలో పార్లమెంట్ లోను నేరస్తులే సభ్యులుగా ఉన్నారంటే ఇక ఈ దేశంలో ఏ రకమైన నీతి వంతమైన పాలన అందివ్వగలమో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వ సిబ్బంది ద్వారా సేవలు పొందడానికి ప్రజలు లంచం ఇవ్వక, ఇబ్బంది పడక తప్పడం లేదు అనేది సర్వసాధారణం. ప్రతి పనికి పైసలే ప్రధానమని లంచం ఇవ్వకపోతే పని కావడం లేదని ఇటీవల ఓ జాతీయ సంస్థ నిర్వహించిన సర్వేలో 73 శాతం సామాన్య ప్రజలు వెల్లడించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ,ఏపీ, కర్ణాటక, తమిళనాడు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ,పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ,పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ ల లో ముఖ్యంగా రవాణా రెవిన్యూ పోలీసు విద్యా వైద్యం వంటి 11 శాఖల పైన ఈ సర్వే జరిగినట్లుగా తెలుస్తున్నది .
ఆందోళన కలిగిస్తున్న లంచాల పర్వం:-
భూమి పట్టా మార్పిడికి, మెస్ బిల్లుల మంజూరు కి, టెండర్ ఓకే చేసేందుకు, పట్టాదారు పాసుబుక్కుకు, పేరు మార్పిడికి ఇలా ఒక్కటేమిటి ప్రజలకు సంబంధించిన ప్రతి పనికి లంచం విశ్వరూపం దాల్చినది. తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో మండల స్థాయి అధికారి కోటి రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన సందర్భం మనందరికీ తెలిసిందే . అంతేకాదు ప్రజలను పీడించి పనులను సాగదీసి ఇబ్బందులకు గురి చేసిన సందర్భంలో విసిగిపోయిన రైతు ఎమ్మార్వో ను పెట్రోలు పోసి తగుల పెట్టిన విషయం, మరొక్క మహిళా అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడితే అవమాన భారంతో రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆమె భర్త ఆత్మహత్య చేసుకోవడం ఇలాంటి సంఘటనలు కోకోల్లలు . డబ్బులు ఇస్తే కానీ ఫైలు ముందుకు కదలేకపోవడంతో అమాయకులైన సామాన్య ప్రజలు విసిగి వేసారి అనివార్య పరిస్థితులలో లంచం ఇవ్వక తప్పడం లేదని తెలుస్తున్నది.
ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే ఏసీబీకి వరుసగా ఫిర్యాదులు వస్తున్నట్లు తెలుస్తుండగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 22 నాటి వరకు అంటే 53 రోజులలో 28 అవినీతి కేసులు నమోదైనట్లు తెలుస్తుంటే గత సంవత్సరం 94 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి . అంటే సగటున 48 గంటలకు ఒకటి చొప్పున ఏసీబీ దగ్గర కేసులు నమోదు అవుతుండగా పట్టుబడిన వారి ఇళ్లల్లో తనిఖీలలో గుట్టలకొద్ది నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారము దొరకడాన్ని బట్టి ఉద్యోగ వర్గం ఎంత అవినీతిలో కూరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు . మెస్ బిల్లు చెల్లించేందుకు 50,000 లంచం తీసుకుంటూ కాకతీయ వర్సిటీలో ఒక అధికారి, ఔషధాల టెండర్ కోసం 3 లక్షలు తీసుకుంటూ నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ , మరొక కేసులో గిరిజన సంక్షేమ శాఖలో 84 వేలు లంచం తీసుకుంటూ బిల్లుల మంజూరు కోసం అవినీతికి పాల్పడిన మరొక అధికారి, హెచ్ఎండిఏలో వందల కోట్ల అక్రమ ఆస్తులను సంపాదించి ఏసీబీ అధికారులకు చిక్కిన మరొక అధికారి, షామీర్పేట్ తాసిల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసు బుక్కు కోసం రైతు నుంచి 40 లక్షలు లంచం డిమాండ్ చేసి 10 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనమ్ ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నాచితక కేసులు మరెన్నో చోటు చేసుకోవడాన్నీ సీరియస్ గా పరిగణించాలి. అంతేకాదు సమాజమనుగడకు తలవంపుగా మారిన ఈ అకృత్యాలను ప్రభుత్వం ఉక్కు పాదంతో అణిచివేయాలి... లేకుంటే ప్రభుత్వం మనగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి- ఉద్యోగ సంఘాలు వాస్తవాలు అంగీకరించాలి:-
సామాన్య ప్రజలకు ఎక్కువ అవసరాలు ఉండే రెవిన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధి, విద్యుత్ శక్తి ,పోలీసు, రంగాలలో అవినీతి ఎక్కువగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అధికారులు ఇంటిదగ్గర కార్యాలయాలలో లంచాలకు ఎగబడి దండుకుంటూ ఉంటే పోలీసు విభాగంలో కూడా కేసులో ఇరికించకుండా ఉండడానికి కేసు నుంచి పేరు తొలగించడానికి కూడా వసూలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవినీతిని మరింత కట్టడి చేయడానికి నియమించబడిన ఎసిబి చీఫ్ కు ప్రత్యేక అధికారాలను ఇచ్చి అమలు చేస్తున్న సందర్భం కూడా పెద్ద సంఖ్యలో అవినీతిపరులు పట్టుబడదానికి కారణం కావచ్చు. A C B ఉద్యోగులను అరెస్టు చేయడంతో పాటు తనిఖీలు పూర్తిస్థాయిలో విచారణ జరిపి స్వాధీనం చేసుకున్న నగదు బంగారం ఇతర ఆస్తులను ప్రభుత్వ పరం చేయడమే గాక కఠినమైన శిక్షలను విధించడం ద్వారా ఇతర ఉద్యోగులు తప్పుడు పనులకు పాల్పడకుండా హెచ్చరిక చేయవలసి ఉంది. రాజకీయ యంత్రాంగంలో అవినీతిని తుడిచి పెట్టకుండా ఉద్యోగ వర్గాలలో అవినీతిని కట్టడి చేయడం కొంత కష్ట సాధ్యమే. ఎందుకంటే శాసనసభ్యులు మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లే ఎక్కువ అక్రమాలకు భూ కబ్జాలకు అవినీతికి పాల్పడుతున్న సందర్భంలో కింది స్థాయిలో ఉన్న ఉద్యోగులకు వీరి అండ ఉండకపోతుందా? వీరి ప్రోత్సాహం రక్షణతోనే ఉద్యోగులు తెగబడుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ రాష్ట్రంలోనూ దేశంలోని అన్ని ప్రాంతాలలోనూ అవినీతిని కట్టడి చేయడానికి న్యాయవ్యవస్థ అవినీతి నిరోధక సంస్థలతో సమన్వయ పరుచుకొని ఉక్కు పాదం మోపడం తప్పనిసరి. అయితే ఇటీవల న్యాయవ్యవస్థలోని కొందరు కూడా అవినీతికి పాల్పడినట్లు తెలుస్తుంటే కంచే చేను మేసిన చందంగా ఉంటే ఇక ఈ దేశాన్ని కాపాడేది ఎవరు? అని సందేహం కలగక మానదు.
తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున అవినీతిపరుల గుర్తింపు వేగవంతం అవుతున్న సందర్భంలో ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే ఉద్యోగ సంఘాలు కూడా ప్రతిస్పందించాలి .అలాంటి అవినీతిపరులను ఒంటరి చేయడంతో పాటు సంఘ పరంగా సభ్యులకు హెచ్చరికలు జారీ చేయడం ద్వారా కూడా అధికారుల లోని అవినీతిని కొంతవరకు కట్టడి చేయవచ్చు. ఎన్ని శిక్షలు జరిమానాలు ఉన్నప్పటికీ స్వార్థ ప్రయోజనాల కారణంగా కొందరు వ్యక్తిగత అవసరాలు రీత్యా మరికొందరు ఈ అవినీతిలో కూరుకుపోక తప్పడం లేదు. హక్కులను బాధ్యతలను సమానంగా గుర్తించి ప్రజలు ఆత్మగౌరవంతో స్వేచ్ఛ స్వాతంత్ర్యా లతో బ్రతకడానికి, చైతన్యముతో అవినీతిని ప్రశ్నించడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే న్యాయ వ్యవస్థ వంటి ఇతర రంగాల కృషి కొంతమేరకైనా ఫ లవంతమవుతుంది . తెలంగాణలో గత ప్రభుత్వానికి భిన్నంగా వచ్చిన కొత్త ప్రభుత్వం అవినీతి నిర్మూలనను సవాల్గా తీసుకొని తన చిత్తశుద్ధిని చాటుకోవడం సందర్భోచితంగా ఉంటుంది.
---వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రక్షితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)