"పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప!" అవును నిజమే...
ఎన్నో చట్టాల రూపకల్పన, ప్రభుత్వ చర్యలు సాధ్యమవుతాయి
ప్రజలకు ఆరాటం ఉండాలి కానీ !
ప్రశ్నించడం, ప్రతిఘటించడం ,విశ్లేషించడం,
అంతిమంగా సమైక్య ఉద్యమాల ద్వారా ఏకమైతే...
-- వడ్డేపల్లి మల్లేశం
ప్రజా ఉద్యమాలు, పాలకుల పనితీరుపైన ప్రశ్నించే సందర్భం, చట్టసభల్లో ప్రభుత్వం పైన ప్రతిపక్షాల సమరభేరి , వివిధ దేశాల మధ్యన జరిగే యుద్ధం , అవినీతి అక్రమాల పైన చేసే పోరాటం సందర్భంగా మనం తరచుగా వాడే ఆత్మస్థైర్యాన్ని ఇచ్చే నినాదం "పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప" అన్న విషయం మనందరికీ తెలిసిందే. మాట్లాడడం వేరు ఆచరించడం వేరు సిద్ధాంతం వేరు పోరాటం మరింత భిన్నంగా ఉంటుంది . అయితే ఇక్కడ లక్ష్యసాధనకు పోరాటం, ప్రతిఘటించడం, ప్రశ్నించడం ప్రధానంగా కొనసాగినప్పుడు కొంతైనా ఫలితాలు రావడం సహజం .బానిసత్వంలో మగ్గుతున్న జాతులు విముక్తి పొందే సందర్భంలో నినాదం రూపకల్పన జరిగినప్పటికీ ప్రయత్నిస్తే ఎంతో కొంత సాధ్యమవుతుంది అని యుద్ధభూమికి తరలించడానికి చైతన్యం చేసే శక్తివంతమైన ఆచరణాత్మక ప్రేరణగా మనం భావించవలసి ఉంటుంది. హ క్కులను సాధించుకోవడానికి, ఆ క్రమంలో విధులను సంపూర్తిగా నిర్వహించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందడానికి , చిత్తశుద్ధిగా ఉద్యమాన్ని కొనసాగించడానికి, కష్టాలు ఎన్ని అయినా కడదాకా పోరాడ టానికి , అనుకున్న లక్ష్యాన్ని చేరడమే ఇతివృత్తంగా ఆచరించడానికి , అది ఏ రంగంలోనైనా నిలదీసి ప్రశ్నించడం నిగ్గు తేల్చడం అవసరమే. ఇటీవలి కాలంలో పాలకుల దుశ్చర్యలు, పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాల యొక్క ఆగడాలు, భూ దందాలు భూ దోపిడి ,ఉద్యోగ వర్గాల లంచాల పర్వం, కామాంధుల అకృత్యాలు అత్యాచారాలను ఉక్కు పాదంతో అణచివేయాలంటే ప్రజల యొక్క శక్తి వంచన లేని సమైక్య ఉద్యమాలు అనివార్యం. అయితే విభిన్న కారణాల వలన పాలకులు ప్రకటించే ఉచితాలు రాయితీలు వాగ్దానాల కారణంగా ప్రజలు విడిపోతున్నారు ఐక్యం కావడానికి అవరోధాలుగా మిగిలిపోతున్నాయి. సమైక్య ఉద్యమాల ద్వారా యాచించి బానిసలుగా జీవించటం కంటే రాజ్యాంగబద్ధంగా హక్కులను సాధించుకోవడానికి, స్వతంత్ర ఆలోచనతో ఓటు వేయడంతో మొదలుపెట్టి ఏ స్థాయి వాళ్ళనైనా నిలదీసి ప్రశ్నించి ప్రతిఘటించి చట్టాలను రూపకల్పన చేసుకోవడానికి, రాయితీలను పొందడానికి , నిధులను మంజూరు చేయించుకోవడానికి , అసమానతలకు అడ్డుకట్ట వేయడానికి , ప్రభుత్వ దుబారాను తగ్గించడానికి, పెట్టుబడిదారులకు వంత పాడుతున్న ప్రజా వ్యతిరేక విధానాన్ని తీపి కొట్టడానికి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న దుశ్చర్యలపైన నిరసన ప్రదర్శించి సాధించడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచి ప్రజల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ఉద్యమాలే అని వార్యం.
ఐక్య ఉద్యమాలతో ఎన్నో సాధించవచ్చు '-
ప్రజల ప్రయోజనాలను మరింత మెరుగుపరిచి జీవన ప్రమాణాలను ఉన్నతీకరించడానికి మరిన్ని చట్టాలు రావలసిన అవసరం ఉన్నది . సామాజిక న్యాయం నేపథ్యంలో శాస్త్రీయ అవగాహన ఆలంబనగా అంద విశ్వాసాలను నిరాకరించే క్రమంలో అసమాన తలను అంతం చేయడానికి ప్రజా ఉద్యమాలు గే టు రాయిగా పనిచేస్తాయి.
--- ఒక ప్రభుత్వం తన కాలంలో చేసినకోట్ల అప్పులు ఆర్థిక అరాచకత్వాన్ని ప్రజల ప్రమేయం లేకుండా చేసిన దోపిడిని అడ్డుకోవడానికి అదే ప్రభుత్వ పెద్దలు అప్పును తీర్చి తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలంటే ప్రజల పోరాటం ద్వారా ఈ ప్రతిపాదనను సాధ్యం చేయవచ్చు అందుకు సంబంధించి పార్లమెంటు చట్టం చేస్తే సరిపోతుంది కదా!
- భూ పరిమితి చట్టాన్ని సమగ్రంగా తీసుకువచ్చి మిగులు భూమిని నిర్ధారించి భూమిలేని ప్రజలందరికీ పంచాలంటే పాలకులు అంత తొందరగా అంగీకరించరు అదే ప్రజా పోరాటం ద్వారా సాధ్యం కావచ్చు కూడా.
- --- రాజ్యాంగ పీఠికలో రాసుకున్న సామ్యవాదం, ఆదేశిక సూత్రాలలోని సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకరించబడకూడదు అనే అధికారణలు అమలయితే సమానత్వాన్ని అంతరాలు లేని వ్యవస్థను సాధించవచ్చు. ఈ రహస్యాన్ని ప్రజలకు విప్పి చెప్పి ప్రజా ఉద్యమాలను నిర్మిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయక తప్పదు దిగిరాక అంతకు తప్పదు .
--ప్రజా జీవితాన్ని నిర్వీర్యం చేస్తున్న మద్యం క్లబ్బులు పబ్బులు, మత్తుపదార్థాలు ఈవెంట్లు అశ్లీల అర్థనగ్న శృంగార ప్రదర్శనలు స్త్రీలు కార్మికులు పేదలు దళితులు ఆదివాసుల పట్ల చూపుతున్న వివక్షత, దేశంలో అనేక అంతరాలకు ఆకృత్యాలకు, పేదరికానికి, హత్యలు ఆత్మహత్యలు, దోపిడీలు పీడన వంచనకు కారణమవుతున్న విషయం పాలకులకు తెలియదా? అందుకే పోరాడితే పోయేదేమీ లేదు పై సమస్యల సాధన ,ప్రశాంత జీవితం తప్ప .
--- రాజ్యాంగం హామీ ఇచ్చిన విద్య వైద్యం సామాజిక న్యాయం నినాదాలుగా మారి ప్రైవేట్ రంగం రాజ్యమేలుతుంటే పాలకులు ప్రైవేటు రంగానికి నిధులు నీరు విద్యుత్ శక్తి భూమి రాయితీలు చివరికి తీసుకున్న అప్పును కూడా మాఫీ చేస్తూ పెట్టుబడిదారీ విధానాన్ని శాశ్వతం చేస్తున్న సందర్భం మనకు కనపడుతూనే ఉంది. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఈనాడు ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థగా మారిపోయింది అంతేకాదు ఇటీవల 16 లక్షల కోట్ల రూపాయలను బడా పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ ద్వారా కట్టబెట్టిన వింత ధోరణి పాలకుల ఒంటెద్దు పోకడ నిర్మూలించాలంటే పోరాటాలు ప్రతిఘటన అందుకు ప్రజల ఆరాటం తప్పదు కదా!
పర్యావరణ విషతుల్యం కావడం, ప్లాస్టిక్ అతి వినియోగం, అధిక రసాయనాల వల్ల పోషకాలు లేని పంటలకు పరిమితం కావడం, విద్య వైద్యం ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోయి కనీస అవసరాలు అవకాశాలను కూడా వినియోగించలోని పరిస్థితికి సామాన్య ప్రజలు చేరుకున్న సందర్భంలో ఆత్మ రక్షణ కోసం మనుగడ కోసం దేశ ప్రజలు పోరాడాలి. సమకాలీన చైతన్యాన్ని పునికి పుచ్చుకొని మానవ హక్కుల కార్యకర్తలు ప్రజాస్వామిక వాదులు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతులు, కార్మికులు, చిరు వ్యాపారులు, వీది వ్యాపారులు, దినసరి కూలీలు, వల స జీవులు వీరికి తోడుగా విద్యావంతులు ఉపాధ్యాయులు ఉద్యోగులు నిజాయితీపరులు శ్రామిక దృక్పధాన్ని గౌరవించే అందరూ కూడా తమ శక్తిని ఉమ్మడిగా ప్రదర్శిస్తే నిరసనను సరైన సందర్భంలో తెలియచేస్తే పోరాట పతాకను ఎగరవేస్తే అన్ని రకాల వివక్షతలు చట్టబద్ధమైన దోపిడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పక్కదారి పడతాయి. ప్రజా ఉద్యమాల లక్ష్యానికి అనుగుణంగా పాలకులు ఆలోచించి చర్యలు తీసుకునే అవకాశం, చట్టాలను రూపకల్పన చేసే సందర్భం రావచ్చు. అది మన పోరాట పటిమ ఒత్తిడి పైన ఆధారపడి ఉంటుంది ! ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఏర్పడిన చట్టాలు, అందుతున్న న్యాయం ,అమలులో ఉన్నటువంటి చర్య లు అంతోఇంతో మన పోరాటాల ద్వారా సాధించుకున్న వే కదా !
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)