తోటి మనిషిని సాటి మనిషిగా చూసే సంస్కారం కనుమరుగవుతున్నది
మానవుడు సంఘజీవి అన్న అరిస్టాటిల్ సూక్తి మాటకే పరిమితమవుతున్నది.
అంతరాలు అసమానతలు లేని సమసమాజ స్థాపన ఊహగానే మిగిలిపోతున్నది.
అక్రమార్జనే రాజకీయాల ధ్యేయంగా మిగిలిపోతే పౌరసమాజం మౌనం
వ్యవస్థను మరింత ప్రమాదంలోకీ నె ట్టదా?*
---వడ్డేపల్లి మల్లేశం
దేశంలో చోటు చేసుకున్న అనేక చేదు వాస్తవాలను నిజాయితీగా పరిశీలించి అంగీకరించగలిగిన వారు ఉంటే సామాన్య ప్రజానీకానికి ఎంత ద్రోహం జరుగుతుందో ఈ దేశ సంపద ఎవరి పాలవుతున్నదో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వాస్తవాలను విప్పి చెప్పి పేద వర్గాలకు ఆదిమ, అట్టడుగు, వెనుకబడిన, నిమ్న జాతులకు జరుగుతున్న ద్రోహాన్ని కరాకండిగా మాట్లాడి వాళ్ళ పక్షాన పోరాటానికి సిద్ధపడగలిగిన నాడు ఈ దేశంలో మానవత్వం, నిజాయితీ, నీతి, తోటి మనిషిని సాటి మనిషిగా చూస్తే సంస్కారం ఉందని నమ్మడానికి ఆస్కారం ఉంటుంది . తమ కుటుంబ ఎదుగుదలనే సామాజిక ప్రపంచ ఎదుగుదలని భావించే కుహనా సంపన్న వర్గాలు, మేధావులు, ప్రతిభావంతులని చెప్పుకునే వాళ్ళు ఉన్నంతకాలం అసమానతలు అంతరాలు దోపిడీ, పీడన వంచన ఈ దేశంలో కొనసాగుతూనే ఉంటాయి. భారతదేశ పాలనకు సంబంధించినటువంటి సమగ్ర శాసనమైన రాజ్యాంగంలో పీటికలోనే సామ్యవాదాన్ని స్థాపించాలని ,లౌకికతత్వాన్ని న్యాయాన్ని ధర్మాన్ని సౌబ్రాత్రుత్వాన్ని పరిరక్షించాలని హెచ్చరిస్తూనే ఉంటే 76 ఏళ్ల పాలన తర్వాత కూడా ఈ తేడాలు అసమానతలు దారుణాలు ఎందుకు ఉన్నాయి? ఒక్కసారైనా మనం ప్రశ్నించుకున్నామా? ఇందుకు మనం ఏమైనా బాధ్యులమేమో అని ఆలోచించినామా? లేదు... బాధ్యులైనటువంటి పెట్టుబడుదారులు పాలకవర్గాలను ఏనాడైనా ప్రశ్నించినామా? అంటే మన కడుపు నిండితే చాలు, మన కుటుంబం చల్లగా ఉంటే చాలు, మన సంపద భద్రతే మనకు ముఖ్యం అని అనుకుంటున్నాము. కనుకనే రాజకీయాల్లోకి రావడానికి కారణం అక్రమార్జన అని ఇటీవల కాలంలో స్పష్టంగా తెలుస్తున్న సందర్భంగా అరాచకవాదులు స్వార్థపరులే ఎక్కువగా రాజకీయాలకు రావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో పాలకులం కాదు సేవకులం అనే వాళ్ల సంఖ్య ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని పదవులు అనుభవిస్తే అన్ని రకాల పెన్షన్లకు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అర్హులు అవుతుంటే ప్రైవేటు పనులతోనే కాలయాపన చేసినప్పటికీ ప్రజాప్రతినిధులకు వేతనంలో కోత ఎందుకు లేదో ఒకసారి ప్రశ్నించినారా? ఉద్యోగి ఒకరోజు ఆలస్యంగా వెళ్లిన అవసరం ఉండి సెలవు పెట్టిన అవి మంజూరు కావాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ దేశంలో రాజకీయ అవినీతి ప్రభలంగా పెరిగిపోయిన కారణంగా దానిని కప్పిపుచ్చుకోవడానికి ఉద్యోగస్వామ్యంలోపల కూడా అవినీతిని పెంచి పోషిస్తున్న రాజకీయాలను బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది . అప్పుడు మాత్రమే పేదలను గుర్తించే రాజ్యం , మనిషిని మనిషిగా చూచే సౌభాగ్యం, విలువల నేపథ్యంలో ఉండే సమాజం ఆవిర్భవిస్తుందేమో !
కొన్ని చేదు నిజాలు :-
ఈ దేశ పాలకులు ప్రజల యొక్క సౌభాగ్యానికి హక్కులను కాపాడడానికి భరోసా ఇవ్వడానికి సిద్ధపడవలసినది పోయి అక్రమార్కులకు వంత పాడుతున్న కారణంగా నేడు చట్టసభలన్నీ అవినీతిపరులతో నిండిపోయినవి. ప్రస్తుత లోక్సభలో 83 శాతం మంది అవినీతి చరిత్ర ఉన్నవాళ్లే ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తుంటే ఇక ఈ పాలన ఏ వర్గాల ప్రయోజనం కోసమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితులకు వస్తే భారతదేశంలో ఉన్న సంపద 10% గా ఉన్నటువంటి సంపన్న వర్గాల దగ్గర 80% ప్రజా సంపద మూలుగుతుంటే 80 శాతం గా ఉన్నటువంటి పేద వర్గాల దగ్గర కేవలం 20 % సంపద మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంటే ఇది ఆర్థిక అసమానతలు అంతరాలను పెంచి పోషించినట్లు కాదా! ఇక రాజకీయ రంగంలో బహుజనుల అవకాశాలను పరిశీలిస్తే ఆయా వర్గాల దామాషాలో రాజకీయ అధికారంలో ఉండవలసినటువంటి వాటా నా మ మాత్రంగా మిగిలిపోతే కొన్ని ఆధిపత్య వర్గాలు మాత్రమే రాజకీయాలను శాసిస్తున్నప్పుడు తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలరా ,? పేదవాళ్లను మనుషులుగా పరిగణించగలరా? ఈ దేశంలో 55 నుండి 60 శాతం గా ఉన్న బీసీలు రాజకీయ రంగంలో కేవలం 20 శాతం కూడా అవకాశాలు పొందలేదని గణాంకాలు చెబుతుంటే సామాన్యులను ఏనాడు పరిగణనలోకి తీసుకో ని ఆనాదిగా పరిపాలించిన పెత్తందారి పాలకవర్గాలు కారణము కాదా?
అత్యంత 10 సంపన్న కుటుంబాల సంపదను లెక్కించినటువంటి "ఆక్స్ఫామ్ ఇండియా" గత నివేదిక పరిశీలిస్తే ఆ పది సంపన్న కుటుంబాల సంపదను ఈ దేశంలోని విద్యార్థులందరికీ ఉచితంగా విద్య వైద్యం న్యాయం మౌలిక సౌకర్యాలను కల్పించడానికి వినియోగిస్తే 25 సంవత్సరాల పాటు ఆ సంపదతో మెయింటెన్ చేయవచ్చునని ఆ నివేదిక తెలియచేసినదంటే సంపద ఏ రకంగా పోగు పడిందో అర్థం చేసుకోవచ్చు . ఆదేశిక సూత్రాలు సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీక కరించబడడం రాజ్యాంగ విరుద్ధమని తెలియజేస్తున్నప్పటికీ అంతరాలను తొలగించి సమానత్వాన్ని తీసుకురావడానికి పాలకులు ఇన్నేళ్లుగా ఎందుకు చట్టాలు రూపకల్పన చేయలేదు అని ఇప్పటికైనా మనం ప్రశ్నించుకుంటే మంచిది. క్షేత్రస్థాయి నుండి అంతటా అసమానతలు అంతరాలు జీవన విధానంలోనూ, చదువు సంధ్యలు, సాంప్రదాయాలు అలవాట్లు ఆచార వ్యవహారాలు, నివసించే ప్రాంతాలు అంతటా తేడా ఉన్నప్పుడు మనుషులందరూ సమానమే అని ఎలా ఊహించుకోగలం? ఈ దేశంలో మనుషులందరూ సమానమే అని శాసించగలిగిన ఏకైక మతం బౌద్ధ మతం అయితే ఇప్పటికీ మనుషులందరూ సమానం అని మాట వరసకైనా పలకరించే పార్టీలు గానీ పెత్తందారులు గాని ప్రజలు కానీ ఎక్కడైనా తారసపడతారా !
స్వార్థం, సామాజిక చింతన లేకపోవడం, త మ కుటుంబ ఎదుగుదలనే ప్రపంచ ఎదుగుదలగా భావించడం , కులమత అంతరాలను నరనరానా జీర్ణించుకోవడం, కష్టాన్ని కన్నీళ్లను శ్రామిక తత్వాన్ని పేదరికాన్ని వివక్షతను మానవతా కోణంలో ఆలోచించే సంస్కారం లేకపోవడం, అందుకు తగినట్లుగా ఈ దేశంలో పాలన లోని లోపాలు, ఆర్థిక వ్యవస్థలోని అంతరాలు, అక్రమార్జనకు ఉన్నటువంటి అవకాశాలకు అలవాటు పడిన రాజకీయ పార్టీల కారణంగా మానవత్వం మూగబోతున్నది. సమానత్వం చచ్చిపోతున్నది. న్యాయం నత్తనడక నడుస్తున్నది. పేదరికం పెదవి విరుస్తున్నది . మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ హెచ్చరించినా, సామాజిక అంతరాలు లేకుండా సమానత్వాన్ని సాధించడానికి పౌర సమాజం లోపల కూడా కృషి చొరవ ప్రయత్నాలు జరగడం లేదు. ఎందుకంటే వారిని కలవకుండా ఆర్థిక సామాజిక అంతరాలు బలమైన అడ్డు గోడలుగా నిలబడ్డాయి కనుక . ఇక దేశంలోని సంపద ప్రజలందరికీ చెందాలి, సమ సమాజాన్ని స్థాపించాలి అంటూ నినదించిన స్టాలిన్, లెనిన్, మార్క్స్, ఎంగిల్స్ వంటి అనేకమంది ప్రపంచ ఆర్థిక సామాజిక వేత్తల కృషి, పోరాటం, చొరవ, ప్రపంచ ప్రజలందరికీ అందించిన చైతన్యం ఏమైపోయింది ?. అందుకే ఒక దగ్గర సంపద కేంద్రీకరించబడ్డది అంటే ఆ వ్యక్తి దొంగ అయినా అయి ఉండాలి లేకుంటే ప్రజా సంపదను దోచుకొని అయినా ఉండాలి అని కొందరు సామాజిక ఆర్థికవేత్తలు నినదించిన మాట నిజం కాక మరేం అవుతుంది? . ఉద్యోగులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ అనుమతితోనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నామంటున్నారు. కానీ ఏ రకమైన పరిమితులు అనుమతులు అవకాశాలు సహకారం లేకుండా ఉన్న వీధి చిరు వ్యాపారులు, కార్మికులు, కర్షకులు, చేతివృత్తుల వాళ్ళు, నిస్సహాయులు
శ్రమను మాత్రమే నమ్ముకుని బతకడం , చట్టాల ముసుగులో ఎలాంటి భరోసా లేకపోవడం మరింత అంతరాలకు కారణం అవుతుంటే పాలకులు దశాబ్దాలుగా విస్మరించబడిన ఈ అట్టడుగు వర్గాలకు రక్షణ కల్పించడానికి ఏనాడైనా ప్రయత్నించినారా? ఉచితాలు , తాయిలాలు, వాగ్దానాల పేరుతో అధికారంలోకి రావడానికి చొరవ చూపుతున్నారే తప్ప ఆ పేద వర్గాల ఆదాయాన్ని పెంపొందించి , కొనుగోలు శక్తిని పెంచి, ఉత్పత్తికి ప్రధానమైన ఆ వర్గాలను నిర్లక్ష్యం చేయడం వల్లనే కదా ఈనాడు మాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో దుస్థితి నెలకొన్నది . రాజకీయాలలోని నిగ్గు తేల్చి అక్రమార్జన చేసే వారిని నిర్ధారించి కటకటాలలోకి తోయాలి. అధిక వేతనాలు పెంచుకున్న చట్టసభల సభ్యులను, పెన్షన్ల మీద పెన్షన్లు తీసుకుంటున్న ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులను ఆర్థిక ప్రయోజనాలను తగ్గించుకోమని ప్రజా పోరాటం పెద్ద ఎత్తున కొనసాగిన నాడు తప్పకుండా అంతరాలు కొంతవరకైనా తగ్గుతాయి . పేదోడిపరంగా ఆర్థిక స్వావలంబన మరింత మెరుగుపడుతుంది . ఇక సామాజిక రాజకీయ రంగాలలో విస్మరించబడిన వర్గాలకే అధికారం కట్టబెట్టడం కూడా మరింత పరిష్కారం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)