అశ్లీల దృశ్యాలు, బూతు బొమ్మలను కట్టడి చేయనీ ప్రభుత్వాలెoదుకు ?
ప్రధాని నుండి ముఖ్యమంత్రుల వరకు
సెల్ఫోన్ బూతు పురాణాలకు నైతిక బాధ్యత వహించాలి.
సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నప్పుడు చూస్తూ
నిర్లక్ష్యం చేసేవాళ్లoథా నేరస్థులే
న్యాయస్థానాలు ప్రభుత్వాలను ముద్దాయిలుగా చేర్చాలి.
పిల్లవాన్ల దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ను ఒక తల్లి తీసుకొని ఇది నువ్వు చూసేది కాదు అంటూ సరిపెడుతుంది .కొడుకు సెల్ ఫోన్ చూస్తూ పరిశీలిస్తుంటే గమనించిన తండ్రి అవేం పిచ్చి బొమ్మలు రా ఎందుకు అంటూమందలిస్తాడు. .ఇదేదో ముఖ్యమైనది ఉన్నది అనుకోని వయసొచ్చిన పిల్లలు మరోసారి చూసే ప్రయత్నం చేస్తున్నారు .నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంటూ వస్తున్న ప్రకటనలను చూసి లైక్ చేయడం అటువైపే దృష్టి సారించడం అదేదో బ్రతుకుదె రువు విషయమైనట్టు ప్రపంచ జ్ఞానం అయినట్లుగా ఆ వైపే తొంగి చూడడాన్ని మనం గమనించవచ్చు. ఇది ఏదో పిల్లలు మాత్రమే చేస్తున్నారు అనుకుంటే పొరపాటు స్త్రీలు పురుషులు చివరికి అన్ని వయసుల వారు కూడా సెల్ ఫోన్ లోని యూట్యూబ్ ఫేస్బుక్ ఇతరత్రా విభాగాలలో కనిపిస్తున్నటువంటి స్త్రీల నగ్న చిత్రాలు, బూతు పురాణాలు, బొమ్మలు, వ్యాఖ్యలు, అంగాంగ ప్రదర్శనలు, రెచ్చగొట్టే చూపులు పిడిబాకు లాగా కనిపిస్తూ ఉంటే మనిషిని మనసును కట్టిపడేసే దృశ్యాల వైపు మనిషి మొగ్గు చూపక ఏమవుతాడు?
ఇది అందరికీ వర్తిస్తుందనుకోవడం పొరపాటు కానీ మెజారిటీ ప్రజలు అన్ని వయస్సుల వారిని ఇబ్బందులకు గురిచేసి, మనసును కట్టడి చేయకుండా ,కర్తవ్యం పైన దృష్టి సారించకుండా, చంచల స్వభావాన్ని మరింతగా రెచ్చగొట్టే ఈ బూతు సాహిత్యాన్ని సెల్ఫోన్ వ్యవస్థ నుండి పెకిలించి వేయాలి. సమాజాన్ని బ్రష్టు పట్టించడంతోపాటు అనేక అకృత్యాలు అత్యాచారాలు, దోపిడీలు పీడన, ప్రేమ పేరుతో జరుగుతున్న వంచన, తల్లిదండ్రులు సమాజం పెళ్లికి అంగీకరించడం లేదు కనుక ఆత్మహత్య చేసుకుందాం అంటూ నమ్మబలికి విషం తాగించి తను తాగినట్లు నటిస్తూ ఒకరినొకరు చంపుకుంటున్నారు చనిపోతున్నారు తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిపోతున్నారు ఇది నిజం కాదా ?
ఈ పరిణామాలకు తీసేటువంటి మూలాలు సెల్ఫోన్లో వ్యవస్థలో ఉన్నాయని మీరు భావించడం లేదా? ఉంటే ఎందుకు అంగీకరిస్తున్నట్లు? లేకుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తప్పును చూస్తూ అంగీకరిస్తూ ప్రశ్నించనీ వాళ్లంతా నేరస్తులే అవుతారు అనే సామాజిక సూత్రాన్ని మనకెందుకు వర్తింప చేసుకోవడం లేదు?. కొంతమంది ఆలోచనపరులు, నిరక్షరాస్యులు పేదవాళ్లు అయినా కూడా తప్పును తప్పని అంగీకరించే మనస్తత్వం ఉన్నవాళ్లు ఇలాంటి బూతు పురాణాలను సాహిత్యాన్ని దృఢ హస్తముతో అణచివేయాలని ఉక్కుపాదం మోపాలని ఇవి ప్రజలను యువతను పెడదారి పట్టిస్తాయని ఇలాంటి వాటికి పాలకులు జవాబు దారి తనం వహించాలని అక్కడక్కడ వ్యాఖ్యానిస్తున్నారంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించవలసిన నైతిక బాధ్యత పాలకులకు లేదా? అందుకే ప్రధాని నుండి ముఖ్యమంత్రుల వరకు ఈ విషయం పైన దృష్టి సారించి బాధ్యత తీసుకోవాలి మూలాలను వెది కీ కట్టడి చేసి బాధ్యులను శిక్షించి కారాగారాలలో బంధించాలి.
దీని అదుపు చేసే స్థితి భారత ప్రభుత్వము, రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర లేదని భావిస్తే దానికి సంబంధించి ఐక్యరాజ్యసమితికి సిఫారసు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఉన్నది కదా! ఎక్కడి వాళ్ళు అక్కడ పైకి ప్రశ్నించిన లోలోపల చూస్తూ ఆనందిస్తూ సంతోషపడుతూ ఉన్నారే కానీ దీని పర్యవసానం సమాజం మీద పడుతుందని యువత నాశనమైపోతుందని హత్యలు ఆత్మహత్యలు వంచనకు దారితీస్తుందని సోయి లేకపోవడం విచారకరం . కొందరు ఆవేశంతో బాధపడుతున్నారు, మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు , సుతి మెత్తగా మందలిస్తున్నారు అంతేకాదు దీనిని పెద్ద ఎత్తున ప్రతిఘటించాలని కోరుతున్న వాళ్లు కూడా ఎందరో! వీటికి సమాధానం, ప్రతిస్పందనగానే నా ఈ వ్యాసం మీ ముందు ఉంచుతున్నాను.
భారతదేశంలో అనేక రంగాలలో నిర్లిప్తత బాధ్యతారాహిత్యము స్పష్టంగా కనిపిస్తాయి పాలకులలోనూ ప్రజా సమూహాలలోను. విచారణ పేరుతో ఖైదీలను సంవత్సరాల తరబడి శిక్షిస్తున్నటువంటి న్యాయవ్యవస్థ, దానిని పెంచి పోషిస్తున్న పాలకవర్గాలు, మూలమైనటువంటి పోలీసు వ్యవస్థ ఏనాడూ కూడా ఇది అకృత్యం అని నేరం రుజువు కాకుండా శిక్షించడం నేరమని భావించడం లేదు కనుకనే అది చట్టబద్ధమైపోతున్నది. దానికి ఎందరో బుద్ధి జీవులు మేధావులు ప్రశ్నించే వాళ్ళు హక్కుల కార్యకర్తలు బలైపోతూనే ఉన్నారు. అదే మాదిరిగా రోజు రోజుకు సెల్ఫోన్ వినియోగాన్ని పెంచుకుంటూ అభివృద్ధిలోకి రావలసినటువంటి మానవాళి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మేధస్సును పరిజ్ఞానాన్ని విషయాలను ప్రసంగాలను చర్చలపై దృష్టిసారించి మేధస్సును పెంచుకునే బదులు ఆ వైపుగా కన్నెత్తి చూడకుండా కేవలం సెక్స్ బొమ్మల మీద దృష్టి సారించి అవినీతిపరులుగా నేరస్తులుగా అక్రమార్కులుగా బుద్ధిహీనులుగా మిగిలిపోతున్నారు. అందులో నేను, మీరు, మనమంతా భాగస్వాములు కావడం విచారకరం. అందుబాటులో లేకుంటే త ప్పుడు పనులకు ఆస్కారం ఉండదు అనేది కూడా ఒక సూత్రం కానీ ప్లాస్టిక్ మద్యపానాన్ని , మత్తు పదార్థాలను ఉత్పత్తి చేస్తూ ఉంటారు కానీ వాటి మీద నిషేధం విధించబడుతుంది. సిగరెట్లు బీడీల పైన ధూమపానం అనారోగ్యం అంటూ రాసి ఉంటుంది కానీ విచ్చలవిడిగా ప్రభుత్వ ఆమోదంతో అమ్ముతూ ఉంటారు.
సినిమాలు సీరియల్ లో హానికరమని తెరమీద కనపడుతూ ఉంటుంది ఒకవైపు మద్యపానం సేవిస్తుంటారు మరొకవైపు పొగ తాగుతూ ఉంటారు ఇది ద్వంద్వనీతి కాదా! ఇది కేవలం వాణిజ్య వ్యాపార వర్గాలదే మాత్రమే కాదు అందుకు అనుమతిస్తున్న పాలకవర్గాల వికృత విష ప్రచారానికి బాధ్యతారాహిత్యానికి పరాకాష్టగా భావించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది . ఈ సన్నివేశాలను చూస్తూ యువత చిన్న పిల్లలు ఎదిగి ఎదగని వయస్సులో తప్పటడుగులు వేయడానికి అనుకరించడానికి చూసిన పనులను ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ తప్పు దోవలో నడుస్తూ మరిన్ని నేరాలకు పాల్పడుతూ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతూ ఉంటే తెలిసి తెలియని వయస్సులో అనేకమంది నేరస్తులుగా విచారణ ఖైదీలుగా మిగిలిపోవడం బాధాకరం. బాధ్యతను విస్మరించిన ప్రభుత్వాలు ఆ వైపుగా దృష్టి సారించకపోవడం, కఠిన చర్యలు తీసుకో ని కారణంగా సమాజంలో ఇలాంటి దుష్ట కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటే దాని పరిణామాల ద్వారా సమాజం నిర్వీర్యమై బ్రష్టు పట్టిపోతూ ఉంటే చర్యలు తీసుకోవడానికి అప్పుడు పోలీసు వ్యవస్థ ప్రభుత్వం ఉపక్రమిస్తుంది ప్రయోజనం ఏమిటి ?అప్పటికే జరగవలసినదంతా జరిగిపోయింది ప్రజల్లోకి వెళ్ళవలసినదంతా వెళ్ళిపోయింది ప్రజల్లో విషం సర్వత్రా వ్యాపించింది
. మానసిక వైద్య నిపుణులు మేధావులు అనేక హెచ్చరికలు చేస్తూ సర్వ అనర్థాలకు సమాజంలో నెలకొన్న అనేక సామాజిక రుగ్మతలు కారణమని మద్యపానం ధూమపానం మత్తు పదార్థాలు క్లబ్బులు, పబ్బులు ఈవెంట్లు బూతు సాహిత్యం అంగాంగ ప్రదర్శన సెక్స్ బొమ్మలు సమాజాన్ని నిట్టనిలువున చీల్చి ద్రోహం తలపెడుతున్నట్లు తెలియచేసినప్పటికీ ఎక్కడ స్పందన కనిపించదు. అధికారులు, పోలీసులు, న్యాయవ్యవస్థ మౌనంగా ఉండి జరిగిన తర్వాత విచారణ పేరుతో హల్చల్ చేస్తే ప్రయోజనం ఏమున్నది ? .
సెల్ఫోన్ వ్యవస్థతో పాటు టీవీ ప్రసారాలలోని అనేక అంశాలలో కూడా స్త్రీని అంగడి సరుకుగా, ఆట బొమ్మగా ,మార్కెట్ వస్తువుగా, సెక్స్కు ప్రతినిధిగా అశ్లీల దృశ్యాలు సమాజం మీద విచ్చలవిడిగా కుమ్మరిస్తూ పోతూ ఉంటే టీవీ ప్రసారాలు సినిమాలకు అనుమతిచ్చే సెన్సార్ బోర్డు గాని ఇతర కార్యక్రమాలకు ప్రభుత్వమే దగ్గరుండి అనుమతించడం ద్వారా ఆదాయం కోసం ఆశిస్తున్నట్లుగా మనం భావించవలసి ఉంటుంది. "పరిపాలన అంటే వేతనాలు ఇవ్వడం, ఉచితాలు, వాగ్దానాలను అమలు చేయడం మాత్రమే కాదు. నిర్మాణాత్మకమైనటువంటి సమాజాన్ని నిర్మించడం,, ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, నేర సామ్రాజ్యాన్ని ఉక్కు పాదంతో అణచివేసి నైతిక విలువలు కలిగిన సమాజాన్ని స్థాపించడం, మానవాభివృద్ధిని సాధించడం మాత్రమే నిజమైన పరిపాలన అని పాలకులు సోయి తెచ్చుకోనంతవరకు వ్యాపార వ్యాణిజ్య వర్గాలు కొన్ని ఏజెన్సీలు లాభాపేక్షతో ఇలాంటి దుష్ట సంస్కృతిని బూతు పురాణాలను అశీల ప్రదర్శనలను కొనసాగిస్తూనే ఉంటాయి .
అంతవరకు రాకముందే భారతదేశ ప్రధాని ముఖ్యమంత్రి రాష్ట్రాల ప్రతినిధులు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో కూడిన కమిటీలను వేసి మూలాలను వెతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. జ్ఞాన సమాజాన్ని విస్తరించి తయారు చేయవలసిన బాధ్యత పాలకులది కానీ నేర సామ్రాజ్యాలను అవినీతి పరులను పెట్టుబడిదారులను కోటీశ్వరులుగా తయారు చేయడంతో పాటు ఇలాంటి బూతు సామ్రాజ్యాలను నిర్మించడంలో ప్రభుత్వాలు పాత్ర నిర్వహించకూడదని వీటన్నింటినీ దృఢ హ స్తముతో అణచివేసి సామాన్య ప్రజల పక్షాన పని చేయాలని ఆలోచించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేద్దాం . మద్యపాన నిషేధం ఇతర సామాజిక అంశాల పైన వచ్చిన ఉద్యమాల లాగా సెల్ఫోన్ వ్యవస్థలోని బూతు సాహిత్యాన్ని రద్దు చేయాలని ప్రజా ఉద్యమం కూడా రావాల్సిన అవసరం ఉన్నది . ప్రజల గూర్చి బాధ్యతాయుతంగా పాలకులు వ్యవహరించనప్పుడు ప్రజలు తమను తాము రక్షించుకోవడం కోసం ప్రజా ఉద్యమాలు పుట్టుకస్తూనే ఉంటాయి. దానిని ఆలోచించవలసిన బాధ్యత పాలకులది.
----వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)