వాహన కాలుష్యం నుండి  రక్షించబడాలంటే  విద్యుత్ వాహనాల  వినియోగం భారీగా పెంచాలి.

Jan 24, 2025 - 16:24
 0  1

అయితే అందుకు తగినట్లు  పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు  అందుబాటులో ఉండడం కూడా  కీలకమే.

-- వడ్డేపల్లి మల్లేశం 

  ప్రపంచంలోనే అత్యధికంగా  కాలుష్యకారక  వాహనాలను వినియోగించడం, పరిశ్రమలను నడిపించడం,  పర్యావరణం  ప్రకృతి  విషతుల్యమయ్యే  రీతిలో  పలు సంస్థలను నడిపించడంలో భారతదేశం ముందున్నది అనడంలో అతిశయోక్తి లేదు.  అయితే అదే స్థాయిలో  పరిశ్రమల నుండి విడుదలయ్యే  వ్యర్థ జలాలు, పదార్థాలు  వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్న నేపథ్యంలో అదుపు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం,  ప్రభుత్వాలు కూడా అదుపు చేయకపోవడంతో  భారతదేశంలో ఈ దుస్థితి మరింత ఎక్కువగా కనబడుతున్నది.  అంతెందుకు ప్రపంచంలోనే భూగర్భ జలాలను అత్యధిక స్థాయిలో వినియోగించే దేశాలలో భారతదేశం ముందున్నది అయితే  అంతే స్థాయిలో వ్యర్థ జలా లను  తిరిగి శుద్ధి చేయడం కానీ  ప్రజారోగ్యానికి హాని చేయకుండా  చర్యలు తీసుకోవడంలో మాత్రం భారత్ వెనుకబడి ఉండడాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. జల కాలుష్యం, వాయు కాలుష్యం,  వాతావరణ కాలుష్యము,  ధ్వని కాలుష్యము,  ప్రకృతి యావత్తు పూర్తిగా కలుషితమవుతున్న నేపథ్యంలో  మానవ జాతిని ఎంతో కొంత  కాపాడే ఓజోన్ పొర కూడా  ఇటీవల అనేక సందర్భాల్లో నష్టపోయిన విషయాన్ని గమనించినప్పుడు ముఖ్యంగా భారతదేశంలో  అన్ని రకాల కాలుష్యాలను అడ్డుకోవడానికి ప్రభుత్వ ప్రైవేటు  సమాజ పరంగా కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన  సందర్భం అనివార్యం అని చెప్పక తప్పదు.  1960 ప్రాంతంలో ప్రపంచంతో పాటు భారతదేశంలోకి విస్తరించినటువంటి హరిత విప్లవం కారణంగా  ఎరువులు క్రిమిసంహారక మందుల వాడకం  భారీగా పెరగడంతో  భూమి తన అస్తిత్వాన్ని  కోల్పోయింది.  పండించబడుతున్న పంటలు విషపూరితమై  ఉన్న ఆమాత్రమైన పోషకాలు లేకపోగా  ఆహారం మానవ అనారోగ్యానికి కారణమవుతూ వైద్యంకోసం   ఏటా ప్రైవేటు ప్రభుత్వ పరంగా కోట్లాది రూపాయలు దుబారాగా ఖర్చు చేయవలసి రావడం అత్యంత విషాదకరం.  ఐదారు దశాబ్దాలకు ముందు  గమనించినట్లయితే సేంద్రియ పద్ధతిలో సహజమైన ఎరువుతో పండించిన ఆనాటి పంటల  తీరు ఆనాటి ఆహారము  ప్రజలను ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉంచింది.  ప్రస్తుతము క్రిమిసంహారక ఎరువుల వలన విషపూరిత పదార్థాల వాడకం, ఇందన వినియోగం  వలన ఉత్పత్తి ఎక్కువగా జరిగినప్పటికీ ప్రశాంతతలేదు తృప్తి లేదు ఆరోగ్యము అంతకు లేదు.  శాస్త్రం పేరుతో  హరిత విప్లవం ముసుగులో వచ్చినటువంటి ఈ నూతన  రసాయనాల వినియోగం కారణంగా  నిలువెల్లా విషపూరితము కావడాన్ని  మనం గ్రహించాలి. సేంద్రీయ పద్ధతిలో  రాబోయే కాలంలో వ్యవసాయాన్ని భారీగా విస్తరించడం మాత్రమే దీనికి పరిష్కారం, తద్వారా భూమి కాలుష్యాన్ని అరికట్టగలము,. పండించే పంటల్లో కనీసమైన పోషక విలువలను మనం చూడగలము, అంతేకాదు ఆహారంతో అనారోగ్యం నుండి కూడా తప్పించుకునే ఆస్కారం ఉంటుంది. అయితే అదే సందర్భంలో  జనాభా పెరినాకొద్ది వాహనాల వినియోగం భారీగా పెరగడంతో కూడా వాహనాలు  వాతావరణం లోకి వెదజల్లుతున్న క్లోరో ఫ్లో రో కార్బన్స్, పొగతో  వాతావరణం అంతా కాలుష్యమై  ప్రకృతికి, చెట్లకు, ప్రజలకు  పీల్చే గాలిని కలుషితం  చేసి ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి  పెద్ద మొత్తంలో కారణమవుతున్న విషయాన్ని ఇప్పటికీ  సీరియస్ గా తీసుకోకపోతే ఎలా?

వాహన కాలుష్యాన్ని అరికట్టడానికి కఠిన చర్యలు మరింత ముమ్మరం చేయాలి.

  వాహనాల పొగతో వాతావరణం  కాలుష్యం కావడమే కాదు  ప్రాణహాని అంతా ఇంతా కాదు అదే సందర్భంలో  భూతాపం పెరిగి వాతావరణం అనేక మార్పులకులోనై  ప్రకృతి  విపత్తులు  సంభవిస్తూ  నదులు సముద్రాల నీటి మట్టాలు కూడా పెరగడంతో  భూ ప్రాంతాలు కూడా మునిగే ప్రమాదంలోకి జారుకోవడం కూడా విచారకరమే.  జలచరాలు పశుపక్షాదులు  చెట్లు చే మలు మానవజాతి యావత్తు  వాహనాల అతి వినియోగం వల్ల నష్టపోతున్న  నేపథ్యంలో  ఇంధన  వాహనాలను భారీగా తగ్గించడంతోపాటు విద్యుత్ వాహనాలను  పెద్ద మొత్తంలో వినియోగంలోకి తేవాల్సిన అటువంటి అవసరం ఉన్నది.  ఆ రకమైనటువంటి ఆదేశాలను ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు జారీ చేయడంతో పాటు  వాటికి అవసరమైనటువంటి   విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా అన్ని ప్రాంతాలలో రాష్ట్రాలలో ముమ్మరంగా ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కృషి  చేయాలి.  అవసరమైతే ప్రభుత్వ రంగంలో ఆ వాటిని ఏర్పాటు చేయడం కూడా  కీలకమే.  గత నాలుగైదు సంవత్సరాలుగా ఢిల్లీలో తరచుగా జరుగుతున్నటువంటి వాయు కాలుష్యం యొక్క  విష ఫలితాలను ప్రజలు ఏరకంగా అనుభవిస్తున్నారో  తెలిసిందే.  ఇక దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ విషయంలో కఠిన చర్యలు కూడా అవసరం  ప్రస్తుతం వాడుకంలో ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్    వాహనాలను క్రమంగా తగ్గించడం,  పనిచేయలేని స్థితిలోకి చేరుకున్న తర్వాత వాటిని నిర్మూలించడం, వాటి స్థానంలో కూడా విద్యుత్ వాహనాలను అత్యంత నాణ్యమైన స్థాయిలో నిర్మాణం చేయడం కూడా ముఖ్యమే. ఇటీవల కాలంలో  విద్యుత్ కార్లు బైకులు ఇతర వాహనాలు  ప్రమాదాలకు గురవుతున్నట్లు కాలిపోతున్నట్లు మంటలు చెలరేగు  తున్నట్లు వస్తున్న వార్తలను కూడా ప్రభుత్వం సాంకేతిక నిపుణులు పరిగణనలోకి తీసుకోవాల్సిన  అవసరం ఉన్నది..  ఇంధన  వాహనాలను నడుపుతున్నప్పుడు అవసరమైన ఇంధనాన్ని నింపుకోవడానికి  పెట్రోల్ పంపులు అందుబాటులో  ఉన్నట్లు  అన్ని ప్రాంతాల లోపల కూడా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లను అందుబాటులో ఉంచడం  ప్రభుత్వం తన బాధ్యతగా స్వీకరించాలి. కానీ ఇటీవల  కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ చార్జీల స్టేషన్ల అందుబాటును గురించి ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన సందర్భంలో  పేర్కొన్నటువంటి  స్టేషన్ల అందుబాటును  దృష్టిలో ఉంచుకుంటే  ఈ రంగంలో అరకొర వసతులే  ఉన్నట్లు అర్థమవుతున్నది.. స్వయంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వం  వెల్లడించిన  గణాంకాల ప్రకారంగా కర్ణాటక రాష్ట్రంలో 5765 స్టేషన్లు,  మహారాష్ట్రలో 3728 స్టేషన్లు,  ఉత్తరప్రదేశ్లో  1989 స్టేషన్లు,  ఢిల్లీలో  1941 స్టేషన్లు,  తమిళనాడు రాష్ట్రంలో 1 413 స్టేషన్లు,  కేరళ రాష్ట్రంలో 1212 స్టేషన్లు,  రాజస్థాన్లో  11 29 స్టేషన్లు,  గుజరాత్ లో 992 స్టేషన్లు,  తెలంగాణ రాష్ట్రంలో 956 స్టేషన్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 601 స్టేషన్లు  అందుబాటులో ఉన్నట్లుగా  తెలుస్తున్నది. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమాచారం రావలసి ఉండగా  విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచడం కీలకమైనట్లు  ప్రజల్లో అవగాహన కలిగించడం కూడా అంతే  ముఖ్యం.  అంతే స్థాయిలో చార్జింగ్ స్టేషన్లు  అందుబాటులో ఉంచడం వలన కూడా  ఇందన  వాడకం పెద్ద మొత్తంలో తగ్గుతుంది. తద్వారా వాతావరణం కూడా కలుషితం  కాకుండా ఉంటుంది. అనారోగ్యం బారిన  పడకుండా మనల  మనమే కాపాడుకోవడానికి ప్రజలతో పాటు  ప్రభుత్వాలు సామాజిక బాధ్యతగా భావించి  పెద్ద మొత్తంలో ప్రచారం చేయడం, అందుబాటులో ఉంచడం, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం కూడా చాలా అవసరం.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333