పాఠశాలలు కళాశాలల వార్షికోత్సవాల వేల వక్తల సందేశాలు ఎలా ఉండాలి ?
పాఠశాలలు కళాశాలల వార్షికోత్సవాల వేల వక్తల సందేశాలు ఎలా ఉండాలి?.* తల్లిదండ్రులు, విద్యార్థులు, సమాజం బాధ్యతలపై దృష్టి సారిస్తే మంచిది. మొక్కుబడి ప్రసంగాలు నిష్ప్రయోజనం
-- వడ్డేపల్లి మల్లేశం
--08...12...2025
సాధారణంగా ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాలలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలో తో పాటు ప్రైవేటు రంగంలోని విద్యాసంస్థల్లో కూడా వార్షికోత్సవాలను నిర్వహించుకోవడం, క్రీడా దినోత్సవం గా మలచుకోవడం, అతిథులను పిలిచి విద్యార్థులకు తల్లిదండ్రులకు సందేశాలను ఇప్పించడం ద్వారా సమాజాన్ని పాఠశాలలో భాగస్వామిని చేయడం విద్యార్థులకు అవగాహన కలిగించడం సాధారణంగా జరుగుతున్న అంశం. ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థల్లో కూడా చాలా సందర్భాలలో మొక్కుబడి ప్రసంగాలను ఇప్పించడం ఇక ప్రైవేట్ విద్యాసంస్థలు అయితే పెద్ద హోదాల్లో ఉన్న వారిని రప్పించడం ద్వారా వాళ్ల స్థాయిని ప్రదర్శించుకునే ప్రయత్నం చేయడం మనం కల్లారా చూస్తున్న అంశం. ఇక మరొక విషయం ఏమిటంటే రెండు మూడు దశాబ్దాలకు ముందు కేవలం కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో మాత్రమే ఇలాంటి పాఠశాల వార్షికోత్సవాలు నిర్వహించబడేవి కానీ ఆ తర్వాత కాలంలో ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల్లో కూడా అంతకు మించిన స్థాయిలో అద్భుతమైనటువంటి ప్రదర్శనల ద్వారా ప్రజలకు సమాజానికి సందేశాలు ఇచ్చే కార్యక్రమాలు కొనసాగడాన్ని మనం గమనించవచ్చు.అయితే ఈ సందర్భంగా వచ్చే వక్తలు, ఇచ్చే ప్రసంగాలు, విద్యార్థులకు సమాజానికి లేదా తల్లిదండ్రులకు అందించే ఆలోచన ఏమిటి అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే మనం నడుస్తున్న చరిత్రను అధ్యయనం చేయడం, పిల్లలు తల్లిదండ్రులు సమాజం యొక్క అవసరాలను గుర్తించే విధంగా సందేశాలను స్ఫూర్తివంతంగా ఇచ్చేలా ప్రోత్సహించడం, అనివార్యమైనది. అంటే తప్పకుండా ప్రధాన వక్తలు, లేదా ముఖ్య అతిథి సందేశాలు జన రంజకంగా మాత్రమే కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేటి సమాజం అనేక రకాల సంఘర్షణలకు, సంక్షోభాలకు, మానసిక అశాంతికి, అసమానతలకు ఆలవాలమై ఉన్నందున విద్యార్థులు కూడా ఇంటా బయట విద్యా వ్యవస్థలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రసంగాలు ఉండాల్సినటువంటి అవసరం అనివార్యంగాఏర్పడ్డది. ఈ సందర్భంలో ప్రసంగాలలోని అంశం ఏ మేరకు ప్రభావితం చేయాలో ఒకసారి పరిశీలన చేద్దాం.
మొక్కుబడి ప్రసంగాలు నిష్ప్రయోజనం:*
**********6
ఆహ్వానించినటువంటి వక్తల యొక్క ప్రతిభ, సామాజిక చింతన, మేధస్సు, సామాజిక అవగాహనను బట్టి ఈ కార్యక్రమాలలో వ్యక్తం అయ్యే ప్రసంగాలు విద్యార్థుల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే చాలాచోట్ల సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నటువంటి వాళ్లను లేదా రాజకీయ ప్రజా ప్రతినిధిగా ఉన్న గొప్ప పేరుగాంచిన వాళ్లను లేదా పాఠశాల యాజమాన్యాలకు ప్రధానోపాధ్యాయులు సిబ్బందికి పరిచయం ఉన్న వాళ్లను ఆహ్వానించి ఆ పాఠశాల యొక్క స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చే వ్యక్తులు లేదా వారి యొక్క స్థాయి డెసిగ్నేషన్ను బట్టి కాకుండా సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు సంబంధించినటువంటి అంశాల పైన పూర్తి అవగాహనతో ఇచ్చే ప్రసంగాలు విద్యార్థులు అధ్యాపకులు తల్లిదండ్రులను ప్రభావితం చేసే విధానం పైన వారి యొక్క ప్రసంగాలు యొక్క స్థాయి ఆధారపడి ఉంటుంది. కేవలం గొప్పలు చెప్పుకోవడానికి, పాఠశాల యాజమాన్యాన్ని ఆకాశానికి ఎత్తడానికి, విద్యాసంస్థల్లో పిల్లల సంఖ్యను పెంచుకోవడానికి మాత్రమే పరిమితమైనటువంటి ప్రసంగాలు ఎవరు చేసినా అర్థరహితమే. అలాంటి ప్రసంగాలు నామ మాత్రమే కాగా వాటి వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు సమాజానికి ఏరకంగానూ ప్రయోజనము లేదు. అందుకే లబ్ద ప్రతిస్టులు, విద్య ఉద్యోగ సామాజిక రంగాలలో అవగాహన ఉన్నవాళ్లు, సామాజికవేత్తలు, మానసిక నిపుణులు, సమాజం యొక్క మేలును ఆకాంక్షించే వాళ్ళు వక్తలుగా విచ్చేసినప్పుడు మెరుగైన ఫలితాలు చేకూరే అవకాశం ఉంటుంది.
సందేశాలు సామాజిక సంక్షోభాన్ని ప్రభావితం చేయాలి..... పరిష్కారాలను చూపాలి :*
******
సామాజిక అవగాహన కలిగినటువంటి విద్యావేత్తలు సామాజికవేత్తలు మానసిక నిపుణులు న్యాయ కోవిదులు ,అధ్యాపకులు ఆచార్యులను ప్రధానంగా ఇలాంటి కార్యక్రమాలకు వక్తలుగా పిలిచినట్లయితే లక్ష్యం నెరవేరుతుంది అందవలసిన ఫలాలు అందుతాయి. ముఖ్యంగా ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు రేఖామాత్రంగా నైనా పరిష్కారం దొరకకపోతే మొక్కుబడి ప్రసంగాలతో ప్రయోజనం ఏమిటి అనే ఆలోచన ఉండాల్సిన అవసరం ఉంది.అదే సందర్భంలో విద్యార్థులు తల్లిదండ్రులు విద్యాసంస్థల అధినేతలను కలిసి ప్రయోజనకరంగా కార్యక్రమాలను తీర్చిదిద్దాలని అర్హత అనుభవము కలిగిన వక్తలను పిలిపించడం ద్వారా కార్యక్రమాలను మరింత జన రంజకంగా తీర్చిదిద్దాలని కోరినప్పుడు విద్యాసంస్థల యాజమాన్యాలు మరింత బాధ్యతాయుతంగా వుండే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానమైన అంశానికి వస్తే విద్యార్థులు అనేకమంది కూడా అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు కలిగించడమే కాకుండా తల్లిదండ్రులు కూడా శోకసంద్రంలో మునిగిన సందర్భాలను మనం అనేకం చూస్తూ ఉన్నాం. ఒకవైపు ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులను కల్పించకపోవడం, అనారోగ్యం బారిన పడితే ఆ కుటుంబాలకు కొనుగోలు శక్తి లేని కారణంగా చికిత్స అందకపోవడం, పోషకాహారాన్ని తగిన స్థాయిలో తీసుకోవడానికి అవకాశం లేక మొక్కుబడి ఆహారం వలన కూడా అనేక కుటుంబాలు వీధిపాలవుతున్న విషయం ప్రధానంగా చర్చించదగినది. తల్లిదండ్రులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో కుటుంబాన్ని పోషించలేక పిల్లలకు తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులందరికీ తగినటువంటి వైద్య చికిత్సలు ఇతర అవసరాలను తీ ర్చలేక అప్పుల పాలవుతున్న విషయాన్ని గమనించవచ్చు.అంతేకాదు అప్పులు తీర్చలేక కుటుంబాలను దారిలో పెట్టడం ఎలాగో తెలియక ఇటీవల కాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చంపి తాము కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలను పెద్ద మొత్తంలో గమనించవచ్చు. ఇక ప్రైవేటు విద్యాసంస్థలకు పంపిస్తున్నటువంటి అనేకమంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను మిగతా వాళ్ళలాగా గొప్పగా చదివించాలని కాంక్షతో విపరీతమైనటువంటి అప్పులు చేసి చదివిస్తున్న కారణంగా ఆ కుటుంబాలు నిలదొక్కుకోలేక ఏం చేయాలో అర్థం కాక నిర్వీర్యమైపోతున్న విషయాలను గమనించవచ్చు. కార్మికులు చేతివృత్తుల వాళ్ళు రైతు కుటుంబాలనుంచి వచ్చిన వాళ్ళు ప్రధానంగా అల్పాదాయ వర్గాలు తమ పిల్లలకు విద్యాభ్యాసాన్ని అందించడంలో అనేక ప్రయత్నాలు కృషి చేస్తున్నప్పటికీ ఆదాయం సరిగా లేని కారణంగా అందుకోలేక అనివార్యమైన పరిస్థితిలో తప్ప ట డుగులకు దారితీస్తున్న ఈ సంక్షోభాన్ని నిర్మూలించే విధంగా ప్రసంగాలు ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాదు సమాజంలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలకు పాఠశాల స్థాయిలో లేదా కళాశాల స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏ రకమైనటువంటి శిక్షణ ఇవ్వాలి? అవసరమైన విషయాలు చర్చకు వస్తే బాగుంటుంది. ఆర్థిక అసమానతలు అంతరాలు వివక్షత పేదరికము నిరుద్యోగము ఆకలి చావులు ఆత్మహత్యల వంటి అనేక రకాల ఇబ్బందులు సమాజంలో నిరంతరం చోటు చేసుకున్న తరుణంలో దేశంలో ఉన్న సంపద కూడా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతున్న కారణంగా కూడా లక్షలాది కుటుంబాలు దేనికి నోచుకోవడం లేదని తమ జీవితం ఇంతేనా అని నిస్పృహకు గురై క్రియాశీలకంగా వ్యవహరించలేకపోతున్నారు. ఆ కుటుంబాలలోని సభ్యులు లేదా పిల్లలు విద్యార్థులు విద్యావంతులు సృజనాత్మక శక్తి కలిగినప్పటికీ కూడా కుటుంబ ఆర్థిక మానసిక పరిస్థితుల నేపథ్యంలో నిస్సహాయులై పోతున్న విషయాన్ని కూడా గమనించవలసినటువంటి అవసరముంది. విద్యార్థులకు తగిన ధైర్యాన్ని, జ్ఞానాన్ని బోధించడంతోపాటు తల్లిదండ్రుల లోపల కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా వక్తల లేదా అతితుల ప్రసంగాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మారుతున్న సమాజ గమనంలో ఈ జాతి ఫలాలను అనుభవిస్తున్నది ఎవరు? ఎవరికి చెందాల్సినటువంటి అవసరం ఉంది? దీనికి కారణాలు ఏమిటి? ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న విద్య కారణంగా ఏ రకంగా లక్షలాది కుటుంబాలు విద్యకు దూరమవుతున్నాయో అర్థం చేయించవలసిన బాధ్యత కూడా వక్త లకు ఉంది. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో విద్య కొనసాగుతున్న కారణంగా కొన్ని కుటుంబాలు వివక్షతకు అవమానానికి గురి దాక తప్పడం లేదు. కొఠారి కమిషన్ సూచించినట్టుగా కోటీశ్వరుని పిల్లలు పేదవాడి పిల్లలు ఒకే విద్యాసంస్థలో కలిసి చదువుకునేటువంటి కామన్ స్కూల్ విధానం కావాలని అనాదిగా విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోలేదు. సమాజం కూడా ఆ వైపుగా ఆలోచించలేదు దానికి బలవుతున్నది మాత్రం పేద అట్టడుగు వర్గాల పిల్లలు మాత్రమే. ఈ రకమైన పరిస్థితులలో ప్రైవేటు విద్యారంగం తన డామినేషన్ను ప్రదర్శిస్తూ మొత్తం విద్యార్థులలో సగానికి పైగా తమ విద్యాసంస్థల్లోనే చదువుతున్నారని గొప్పలు చెప్పుకుంటూ ఉంటే ప్రభుత్వ రంగంలో మాత్రం నామమాత్రంగా విద్యార్థులు కొనసాగుతూ ఉంటే ఈ అవమాన భారాన్ని పాలకులు గుర్తించకపోవచ్చు కానీ ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యా రంగ నిపుణులు గుర్తించడం లేదా? అందుకే ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగే విధంగా సూచన చేయడంతో పాటు సమాజంలోని భిన్న వర్గాలు తల్లిదండ్రులకు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అవసరమైనటువంటి శక్తిని ఇచ్చే విధంగా ప్రసంగాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులు ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ రకమైన అవగాహన కనుక పెంపొందించుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వాలపైన ఒత్తిడి చేయడానికి అవకాశం ఉంటుంది అప్పుడు కేవలం విద్య మాత్రమే కాదు వైద్యాన్ని కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి ఆరోగ్యం జీవితానికి ప్రధానమైనది కనుక విద్యార్థులలో తల్లిదండ్రులలో ముఖ్యంగా సమాజంలోని అనేక వర్గాలు అనారోగ్యం బారిన పడి ఏ రకంగా సమాజం చి తికి శల్యం అవుతున్నదో అర్థం చేసుకోగలిగితే తమకు పూర్తిస్థాయిలో న్యాయమైన ఉచిత మెరుగైనటువంటి వైద్యాన్ని కూడా అందించాలని ప్రజలు డిమాండ్ చేసే విధంగా వక్తల ప్రసంగాలు వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. ఇక మిగతా రంగాలు ప్రైవేట్ లో కొనసాగినా తప్పులేదు కానీ ప్రధానంగా మనిషి ఆరోగ్యానికి వికాసానికి ఉపయోగపడే విద్యా వైద్య రంగాలు మాత్రం ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగినట్లయితే సమాజం మరింత పుష్టిగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చర్చించదగినటువంటి అంశం. .అయితే ప్రైవేటు పాఠశాలలు లేదా కళాశాలల యొక్క కార్యక్రమాలలో ఎలాగు వారు ప్రైవేట్ రంగాన్ని ప్రశ్నించడానికి ఆస్కారం ఉండదు కానీ ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయం స్థాయిలో జరిగే కార్యక్రమాల సందర్భంగా మాత్రం విద్యారంగ నిపుణులు సామాజికవేత్తలతో బలమైన కఠినమైన సామాజిక అవగాహనను పెంచే ప్రసంగాలు ఇప్పించినపుడు మాత్రమే ప్రజలు పెద్ద మొత్తంలో ప్రభుత్వాలను నిలదీయడానికి ప్రశ్నించడానికి ప్రతిఘటించడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైనటువంటి శిక్షణ ఇవ్వగలిగిన, ప్రేరణ కల్పించదగిన, స్ఫూర్తిని నింపదగిన అంశాలు వక్తల ప్రసంగాలలో ఉండవలసినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా మనం ఏకాభిప్రాయంతో సమర్ధించవలసినటువంటి అవసరం ఉంది. కార్యక్రమాలను కూడా అదే రీతిలో నిర్వహించడానికి అన్ని వర్గాల పూనుకోవాలి. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఫీజుల జులుం బాగా పెరిగిపోయిందని విమర్శ కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇవ్వాలా ప్రజలు కోరుకునేది నియంత్రణ కోసం కమిషన్ కాదు.. విద్య మొత్తం ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలనే ఏకైక డిమాండ్ తో ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు లేదా ఉద్యోగుల మీద ప్రైవేటు పాఠశాలకు తమ పిల్లలను పంపిస్తున్నారన్న విమర్శ నుండి తట్టుకోవాలన్నా నాణ్యమైన విద్యా ప్రభుత్వ రంగంలోనే అందాలన్నా ఖచ్చితంగా అనివార్యంగా ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయాలని డిమాండ్ చేయడమే నేడు ప్రజలు ప్రజాస్వామ్యవాదులు సమాజము తల్లిదండ్రుల ముందున్న కర్తవ్యం. విద్యా కమిషన్ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీ ఆకునూరి మురళి గారు కూడా గతంలో ప్రభుత్వ విద్యా రంగం మెరుగుపడాలంటే పేద వర్గాలకు నాణ్యమైన ఉచిత విద్య అందాలంటే ప్రయివేట్ విద్యాసంస్థలను మూసివేయడమే పరిష్కారమని మాట్లాడిన సందర్భాలు కూడా అనేకం. రాబోయే కాలంలో వారు ఇవ్వగలిగే విద్యా రంగ సంబంధమైన కమిషన్ సిఫారసులలో ప్రైవేటు పాఠశాలల యొక్క మూసివేతకు సంబంధించిన సిఫారసు ఉండాలని ఆ వైపుగా విద్యా కమిషన్ పైన కూడా ఒత్తిడి చేయాలని తద్వారా ప్రభుత్వాన్ని ఆలోచింపజేసే విధంగా ఏకాభి ప్రాయం సాధించడానికి కూడా ఇలాంటి వక్తల యొక్క ప్రసంగాల అవసరముంది. అలాంటి వ్యక్తులను మాత్రమే పిలవడం వల్ల విద్యారంగాన్ని పది కాలాలపాటు ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడానికి, ఉచితమైన నాణ్యమైన విద్యను అందించడానికి, పేద వర్గాలు అప్పుల పాలు కాకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని వక్తల యొక్క ప్రసంగాలు ఎక్కడ మాట్లాడినా కూడా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే దిశలో సీరియస్ గా ఉండాలని మనసారా కోరుకుందాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )