బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, శ్రమను గౌరవించకపోవడం ఉత్పత్తి పై తీవ్ర ప్రభావం చూపుతున్నది
"ఉత్పత్తిలో భాగస్వామి కాని వాళ్లకు జీవించే హక్కు లేదని నినదించడం నేటి తక్షణ కర్తవ్యం".
పౌర సమాజం చొరవ, సామాజిక బాధ్యత వ్యవస్థ రూపురేఖలను మార్చుతుంది .
ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది.
--- వడ్డేపల్లి మల్లేశం
మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ నొక్కీ చెప్పడం అంటే సామాజిక బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించాలని హెచ్చరించడమే అవుతుంది. వ్యక్తిగత నిర్ణయాలలో వ్యవస్థా పరంగా బాధ్యతలను నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించి శ్రమను గుర్తించకపోవడమే కాదు ఇతరుల శ్రమను దోపిడీ చేసే వాళ్ళు కూడా మన మధ్యలో లేకపోలేదు. సామాన్యులు గా ఉన్న వాళ్లే ఇతర అట్టడుగు వర్గాలను పేదలను దోపిడీ చేయడానికి, శ్రమను దోచుకోవడానికి, పీడించడానికి సిద్ధపడుతున్నటువంటి సంఘటనలు మన కళ్ళ ముందు ఎన్నో కనబడుతున్నాయి. వాస్తవాలను మాట్లాడుకోవాలి.,కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, నిష్కర్షగా వ్యవహరించాలి. నిజాయితీ, నీతి, విలువల ముందు స్నేహం బంధుత్వం పరిచయాలు మినహాయింపు కాకూడదు . పనిచేయకుండా, ఉత్పత్తిలో భాగస్వామి కాకుండా, పరిపాలనలో తన వంతు బాధ్యతను నిర్వర్తించకుండా, పౌరునిగా తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో సోయి లేకుండా వ్యవహరించే వాళ్లను ఎక్కడికక్కడ నిరసించాలి నిలదీయాల్సిన అవసరం ఉంది . నిజంగా పనిచేయకుంటే జీవించే హక్కు లేదని నినదించడం నేటి తక్షణ కర్తవ్యం. పౌ ర బాధ్యతలను సరిగా నిర్వర్తించకపోవడం నిబంధనలను తుంగలో తొక్కి విలువలను కాపాడకుండా వ్యక్తి స్వేచ్ఛను అడ్డుకోవడంతోపాటు ఇతరులను మోసగించడానికి ప్రయత్నించడమే నేడు రివాజుగా ప్రతి వ్యక్తి యొక్క ధర్మంగా మారిపోయింది. పని చేయకుండా, పనులను ప్రోత్సహించకుండా, శ్రమను గౌరవించకుండా పైపై మెరుగుల జీవితం గడిపే వాళ్ళు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగించే ప్రమాదం ఉన్నది. కానీ ప్రజలందరి చెమటతో సృష్టించబడే ప్రజాధనాన్ని మాత్రం అప్పనంగా పొందడానికి అందరూ అర్హులు కావడమే అంతులేని విషాదకరం. సంపన్నులు అడ్డగోలుగా సంపాదించడానికి సిద్ధపడి ప్రభుత్వానికి చెల్లించే పన్ను లను ఎగవేయడానికి ఆరాటపడుతుంటే ప్రభుత్వం వాళ్లకే వంత పా డుతున్నది. పేదవాళ్లను మాత్రం ముక్కు పిండి వసూలు చేయడానికి పాలకులు పెట్టుబడిదారులు వెనుకాడడం లేదు. తమ శ్రమను నమ్ముకుని బతికే కోట్లాది ప్రజానీకం స్వతంత్రంగా జీవించడానికి, ఆత్మగౌరవంతో బతకడానికి అలవాటు పడతారే తప్ప ఇతరులపై ఆధారపడని తత్వాన్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది.
పౌర సమాజం చొరవ-- సామాజిక బాధ్యత :-
బాధ్యతలు నిర్వహించకుండా హక్కులకై పోరాడే అర్హత ఎవరికి ఉండదు అది ఆశించడం కూడా అత్యాషే అవుతుంది. ప్రజా ప్రయోజనం కోసం పాలకులు బాధ్యతాయుతంగా పరిపాలన చేయడం ఎంత ముఖ్యమో పాలనను సుసంపన్నం చేయడానికి ప్రజలు కూడా తమ సంపూర్ణ సహకారాన్ని అందించడం అంతే ముఖ్యం. అందుకే జాగరూకులైన ప్రజావలి, చైతన్యవంతమైన జన నినాదం ప్రజాస్వామ్యం విజయవంతం కావడానికి దోహదపడుతుందని అనేక సందర్భాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన హెచ్చరిక
మన పౌర బాధ్యతను మరింతగా జ్ఞాపకం చేస్తున్నది. . అంతరాలు, అసమానతలు, పేదరికము, నిరుద్యోగము, ఆకలి చావులు ,ఆత్మహత్యలు, వివక్షత వంటి రుగ్మతలను పెంచి పోషించడంలో మన వంతు పాత్ర కూడా ఉన్నది అనేది నిర్వివాదాంశం . సామాజిక రుగ్మతలు, ఆర్థిక అసమానతలు, వివక్షతలపైన ప్రజా ఉద్యమాలను కూడా తీవ్రతరం చేయడం ద్వారా అందుకు బాధ్యులైన పెట్టుబడిదారీ విధానాన్ని పాలకవర్గాల ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టవలసిన అవసరం కూడా ఉన్నది . సోయి లేకుండా నిర్లక్ష్యంతో బాధ్యతారాహిత్యంగా ప్రజలు వ్యవహరించినప్పుడు ప్రజాస్వామ్యం విజయవంతం కాకపోగా మరింత అంధకారంలోకి నెట్టి వేయబడే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వాలు తమ బాధ్యతను అప్పుడప్పుడు స్వార్థ ప్రయోజనాల రీత్యా విస్మరించినా త ట్టి లేపవలసిన బాధ్యత ప్రజానీకం పైన ఉన్నది . బుద్ధి జీవులు, మేధావులు, ఆయా రంగాల నిపుణులు ప్రజాసం స్రవంతిలో కలిసి పోరాడవలసిన అవసరం ఉంది. అనేక సందర్భాలలో ప్రజా ఉద్యమాలను పాలకులు అణిచివేసినప్పటికీ ప్రజలే చరిత్ర నిర్మాతలని అంతిమ విజయం ప్రజలదే అని అనేక సందర్భాలలో మనం గమనించి ఉన్నాం. తాత్కాలికంగా పాలకులు ప్రజల స్వేచ్ఛ స్వాతంత్యాలను హరించి వేయవచ్చు కానీ ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా పాలకుల తలరాతలను మార్చి పాతర పెట్టిన సందర్భాలను కూడా మనం చూసి ఉన్నాము . అంబేద్కర్ హెచ్చరించినట్టుగా రాజ్యాంగం ప్రకారం పాలన చేయనప్పుడు ఆ పాలకులను తృణీకరించి తమకు అనుకూలమైనటువంటి వ్యవస్థను ప్రజలు నిర్మించుకుంటారు అనేది చారిత్రకంగా ఎన్నో సందర్భాలలో ఋజువైనది . అయితే ఆ వైపుగా స్పృహ, సోయి, పట్టుదల ,చైతన్యం మాత్రం ప్రజలకు ఉండాల్సిన అవసరం ఉంది. ఆద మరిచి నిద్రిస్తే సమస్యలు వాటి అంతరవే పరిష్కారం కావు శోధించి సాధించాల్సిన బాధ్యత పౌర సమాజం పైన ఉన్నది కనుకనే ఈ అంశాలను కటువుగానైనా ఆలోచించక చర్చించక తప్పడం లేదు . ఎవరికి వారు తమ బాధ్యతను ఎంతవరకు నిర్వహిస్తున్నారు? నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామా ?అవినీతిని ప్రోత్సహిస్తున్నామా? తప్పుడు విధానాలకు మద్దతు పలుకుతున్నామా? నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నామా? కళ్ళ ముందు జరిగిన నేరాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఈ వ్యవస్థ మరింత ఉన్నతంగా ఉంటుంది. చట్టాలు, న్యాయవ్యవస్థ అమలులో ఉన్నప్పటికీ వ్యక్తి పరివర్తన, వ్యక్తి ప్రవర్తన ఇవే సామాజిక రాజకీయ ఆర్థిక అభివృద్ధికి గీటురాళ్లు అని ప్రతి వ్యక్తి గుర్తించాలి .
ఇక ఉత్పత్తికి శ్రమకు సంబంధం లేకుండా ఒక వ్యక్తి లేదా సంస్థలు ఆర్థికంగా పుంజుకున్నాయంటే అక్కడ దోపిడీ పీడన జరిగి ఉండాలి... లేకుంటే అక్రమంగా పరోక్షంగా ప్రభుత్వ లేదా పెట్టుబడిదారుల మద్దతుతో సంపద చేతులు మారి ఉండాలి.... అని చరిత్రకారులు ఆర్థికవేత్తలు చేసిన హెచ్చరిక సామాన్య ప్రజానీకానికి గుణపాఠం కావాలి. ఎందుకంటే సంపద, శ్రమ , చెమట మనదైతే అనుభవించే వాళ్లు మరొకరు కావడం ఏ నాడు శ్రమను గౌరవించకపోవడం బాధాకరం కాక మరి ఏమవుతుంది.? అందుకే మరింత మెరుగైన వ్యవస్థను సాధించుకోవడం ద్వారా అంతరాలు లేని సమ సమాజాన్ని స్థాపించుకునే క్రమంలో రాజ్యాంగంలోని పీఠికలో ప్రస్తావించిన మేరకు పాలకులు చర్యలు తీసుకోనప్పుడు ప్రజా ఉద్యమాలు శరణ్యమని ప్రపంచంలో అనేక సందర్భాలు గుర్తు చేసినా భారతదేశంలో ఇంకా ఆ పరిపక్వత రాకపోవడం బాధాకరం. పైగా ప్రజల పక్షాన పోరాటం చేసి తమ మద్దతు అందించినటువంటి బుద్ధి జీవులు జైలు పాలు కావడం విచారణ ఖైదీలు గానే సంవత్సరాల తరబడి శిక్ష అనుభవించడాన్నీ ప్రజలు ప్రశ్నించి పాలకుల అవినీతిని ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటంచడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. ఇంతకు మించిన పౌర బాధ్యత మరేముంటుంది?
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌ టపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )