ఉపాధ్యాయ వృత్తిని  స్వీకరించడం గౌరవంగా భావించాలి

Nov 11, 2024 - 21:20
Nov 18, 2024 - 11:53
 0  3
 ఉపాధ్యాయ వృత్తిని  స్వీకరించడం గౌరవంగా భావించాలి

 ఉపాధ్యాయ వృత్తిని  స్వీకరించడం గౌరవంగా భావించాలి.అయితే అంతటితోనే సరిపోదు  సామాజిక మార్పుకు దోహదకారులుగా  సమాంతరంగా పనిచేయాలి .ప్రజాస్వామ్య సౌధానికి  మూల స్తంభాలు కావాల్సింది ఉపాధ్యాయులే

వడ్డేపల్లి మల్లేశం  19 -09--2024

జాతి నిర్మాణంలో  వ్యక్తిత్వ వికాసం చాలా గొప్పది  వ్యక్తినిర్మాణానికి , అంతర్గత శక్తులను పెంపొందించడానికి,  నైతిక విలువలతో కూడిన వ్యవస్థను ఆవిష్కరించడానికి,  సమాజాన్ని ఆ వైపుగా  తీర్చిదిద్దడానికి  విద్య ప్రధాన సాధనమైతే  దానిని ఆయుధంగా చేసుకొని  సామాజిక మార్పుకు ఉద్యమిస్తున్న  ఉద్యమకారులుగా ఉపాధ్యాయులను  చూడాల్సినటువంటి అవసరం ఉన్నది.  ఆ వైపుగా   ఉపాధ్యాయుల పక్షాన కృషి  జరగాలి కూడా . ఉపాధ్యాయులుగా పని చేస్తున్న వారిని  జాతి   గౌరవిస్తున్న సందర్భంలో  ఇతర వర్గాలు   తమకు ఎందుకు ఈ గుర్తింపు లేదని  ఆలోచిస్తూనే  ఉపాధ్యాయ లోకానికి ఉన్న ప్రత్యేకతను  అవగాహన చేసుకున్న  వైనం  ఆ పాత్రకు ఉన్నటువంటి మహోన్నత అవకాశంగా  కొనియా డపడుచున్నది . ఫ్రెంచ్ రచయిత ఆల్బర్ట్ కామస్  కు 1957లో  సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి వచ్చినప్పుడు  తన గౌరవానికి కారణం తనకు  చిన్ననాడు 
బోధించిన లూయిస్ జర్మెయిన్ అనే ఉపాధ్యాయుడు కారణమని భావించి " మీ మార్గదర్శకత్వం,  సాన్నీ హిత్యం,  ప్రేమ హస్తం  వళ్లనే నాకు ఈనాడు ఈ అవకాశం లభించింది." అని  తాను రాసిన లేఖలో గొప్పగా చెప్పుకున్నాడు అంటే  గురువు యొక్క స్థానం,  ప్రభావం,  రూపం, సారం   సమాజాన్ని ప్రభావితం చేస్తుందనడానికి పెద్ద  ఉదాహరణ.  ఇలాంటి అనుభవాలు, అంశాలు,  సందర్భాలు,  కారణాలు,  ప్రేరేపనలను  ఉపాధ్యాయ లోకం దృష్టిలో ఉంచుకొని తమ బోధనా అభ్యసన ప్రక్రియను కొనసాగించినప్పుడు మాత్రమే  కలకాలం  జ్ఞాపకం ఉండే ఉపాధ్యాయులుగా విద్యార్థుల మదిలో నిలిచిపోతారు.  అంతేకాదు  ప్రత్యక్షంగా పరోక్షంగా వారి వల్ల సామాజిక మార్పుకు బాటలు  పడతాయి.  అందుకోసమే ఉపాధ్యాయ లోకం  ఈ వృత్తిని  స్వీకరించడం గౌరవంగా భావించాలి.  ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నియామకమైన ఉపాధ్యాయ లోకానికి  స్వయంగా ముఖ్యమంత్రి మంత్రులు నియామక పత్రాలు అందించడంతోపాటు  సమాజానికి  వారి వల్ల వనగూరే ప్రయోజనాలను ప్రత్యక్షంగా  నొక్కి చెప్పడాన్ని  తమ వృత్తి చివరి వరకు కూడా జ్ఞప్తి ఉంచుకోవలసిన  అవసరం ఉంటుంది. అంతేకాదు  ఉపాధ్యాయులుగా నియామకమైన  నుండి తన ప్రస్థానాన్ని  స్నేహ హస్తాన్ని,  మానవతా విలువలను,  ప్రాపంచిక దృక్పథాన్ని, పరిశీలన అభ్యసన  అనుభవాలను నిత్యం బోధనలో  పాఠ్యాంశాలతో కలగలిపి  విద్యార్థులను ప్రభావితం చేయడానికి శపథం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది.  అయితే ఉపాధ్యాయ  బాధ్యత   ఇతర ఉద్యోగాల లాగా ఉద్యోగం అనుకుంటే పొరపాటే.  ప్రాపంచిక  సామాజిక స్ఫూర్తి , సమ సమాజ స్థాపనకు  అనుకూలమైన  ధోరణులు,  అభ్యుదయ  భావజాలాన్ని కలిగి ఉండే  తాత్విక చింతన  కలిగిన వాళ్లు మాత్రమే  ఈ పదవికి మరింత వన్నె  తె స్తారు అని  తెలుసుకుంటే అందుకు తగిన రీతిలో ఉపాధ్యాయులు తయారు కావలసినటువంటి అవసరం ఎంతగానో ఉంటుంది.  అది కేవలం ఉపాధ్యాయ శిక్షణ పుస్తకాలను అభ్యసిస్తేనే సరిపోదు  ప్రపంచ పరిస్థితులను, సమాజాన్ని,  సాహిత్యాన్ని  నిరంతరం అధ్యయనం చేస్తే తప్ప సాధ్యం కాదు.  ఇది  భారమైన పని అని  ఇతర ఉద్యోగాలకు ఈ అవసరం లేదు కదా అని అనుకునే వాళ్ళు ఉపాధ్యాయులుగా  వచ్చేముందు ఆలోచించుకుంటేనే మంచిది.  కలిసి వచ్చిన మహా అవకాశంగా భావించినప్పుడు  ఎంతటి కష్టానికైనా సిద్ధపడితే అంతకు మించిన గౌరవo  గర్వం  ఏ ఉద్యోగం లో ఏ వృత్తిలో దొరకదు.
       

ఉపాధ్యాయ వృత్తి ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులు:- దీనికున్న ప్రాధాన్యతను గుర్తించిన స్థాయిలో  ఈ వృత్తి ఎదుర్కొంటున్న అవాంతరాలను  అధిగమించడానికి  పాలకులు  సమాజం అంతగా పట్టించుకోని కారణంగా  చాలా సందర్భాలలో ఉపాధ్యాయులు అవమానాలు  ఓటమిని కూడా చవిచూడవలసి వస్తున్నది  ఇందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వాలు వహించాలి.  కాంట్రాక్టు పద్ధతిలో   నియమించి  వెట్టి చాకిరి ని ప్రోత్సహిస్తున్నప్పటికీ వారి పని భారం మాత్రం  అనేక రెట్లు పెరుగుతున్నది  .రాజ్యాలు  ఆధిపత్య ధోరణి అవలంబించినాకొద్ది  వృత్తిపరమైనటువంటి హక్కులు స్వేచ్ఛ  స్వయం ప్రతిపత్తి  సన్నగిల్లుతున్నది.  వృత్తికి సంబంధించిన పరిధిని విస్తరించుకోవడానికి,  అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి  జరుగుతున్న కృషి కూడా అంతంత మాత్రమే.  ఇక బోధన అభ్యసన ప్రక్రియలో ప్రధానమైనటువంటి  సామాగ్రి,  అవకాశాలు,  సౌకర్యాలు,  సిబ్బంది లోపం ప్రధానంగా కనపడుతున్నది.  ఇప్పటికీ అనేక పాఠశాలల్లో దేశవ్యాప్తంగా కూడా  మూత్రశాలలు మరుగుదొడ్లు సరైన రీతిలో లేకపోవడం అత్యంత విచారకరం.  అప్పట్లో దేశంలోని స్థితిగతుల పైన సుప్రీంకోర్టు  మందలించి హెచ్చరిస్తే కానీ  మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు అంటే  ప్రభుత్వాలు ఎంత మొద్దు నిద్ర  పోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. "దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది తరగతి గది"
అని డాక్టర్ డి ఎస్ కొటారి చాలా గర్వంగా  చెప్పినప్పటికీ  ఆ స్థాయిలో  వాటి ఉనికి లేకపోవడం కూడా ప్రశ్నార్థకమవుతున్నది.  ప్రజాస్వామ్య వ్యవస్థకు  మూల స్తంభాలుగా  ప్రజానీకాన్ని  సమన్వయం చేసి  రాజ్యాంగ పరిరక్షణ  హక్కులు బాధ్యతలను సగర్వంగా నిర్వర్తించే క్రమంలో,   తీర్చిదిద్దే బాధ్యతలో ఉన్న ఉపాధ్యాయులు
కేవలం వృత్తి గౌరవాన్ని చూసి మురిసిపోవడమే కాదు అందుకు తగినటువంటి సామాజిక బాధ్యతను కూడా భుజాలకు ఎత్తుకోవాలి.  మిగతా వృత్తుల లాగా  సేవలు లేదా ఉత్పత్తి  జరిగే పని పరిస్థితులు కాదు పాఠశాలలంటే.  అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో  మొక్కుబడి కార్యక్రమాలతో  సమయపాలనతో  తరగతులు పెరుగుతూ ఉంటే పిల్లల భవిష్యత్తు  ఆ స్థాయిలో పెరగకపోగా  వ్యక్తిత్వ వికాసం సన్నగిల్లి  విద్య జీవన ప్రమాణాలు కూడా వెనుకబడి పోవడాన్ని మనం గమనిo చవచ్చు.  మెరుగైన సౌకర్యాలతో పాటు ఉపాధ్యాయులకు అందిస్తున్న శిక్షణ కూడా  అంతర్జాతీయ ప్రమాణాలతో కూడి ఉండి,  నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు  వ్యవహారిక దక్షత  బావి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి తోడ్పడే విధంగా విద్య మౌలిక సూత్రాలు సిలబస్లో కూడా మార్పులు చేయవలసినటువంటి అవసరాన్ని  సీరియస్ గా విద్యావేత్తలు,  మేధావులు చర్చించవలసిన  అవసరం చాలా  ఉన్నది.
 ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలు:- భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావాలన్నా  ఈ సౌధం కలకాలం  పటిష్టంగా నిలబడాలన్న,  ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆధార భూతమైన రాజ్యాంగం
ద్వారా సంక్రమించిన  రక్షణలు హక్కులు అవకాశాలను  సామాన్య ప్రజానీకానికి చేరవేయాలన్నా  పాఠశాలలు విద్యాసంస్థలు  ప్రధాన వేదికలుగా పనిచేస్తే అందులో పనిచేసే ఉపాధ్యాయులు  మూల స్తంభాలుగా నిలబడాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది.  హక్కులు బాధ్యతలు,  ఆదేశిక సూత్రాలు,  రాజ్యాంగంలోని అధికరణములు,  జీవించే హక్కు, సమానత్వపు హక్కు  వంటి అంశాలను  సులభతరం చేసి జనం దృష్టికి తీసుకువెళ్లాలి. విద్యార్థులతో సహా . సభలు సమావేశాలలో  నిరంతరం చర్చలు కొనసాగించడంతో  పాటు ఉపాధ్యాయులు కూడా  సమాజంలోకి వెళ్లి  వీలున్న ప్రతిచోట  ప్రజాస్వామ్యం యొక్క  మూల సూత్రాన్ని,  వెసులుబాటును, ప్రజలకు దోహదపడుతున్న  తీరును తెలియజేయవలసిన అవసరం వున్నది.. అసమానతలు, అంతరాలు, వివక్షత, దోపిడీ, పీడన, వంచన  లేనటువంటి  సమానత్వాన్ని  సాధించే క్రమంలో  ఎదురవుతున్న ఆటంకాలను కూడా అధిగమించడానికి విద్యార్థులను  సంసిద్ధులను  చేయాలి.  పేదరికం ఏ స్థాయిలో ఉన్నది?  కొన్ని వర్గాలు ఎందుకు వివక్షతకు గురవుతున్నాయి?  అసమానతలు నిర్మూలనకు అవకాశం లేదా?  పెట్టుబడిదారీ విధానాన్ని ప్రభుత్వాలు  పెంచి పోషించడంలో ఉద్దేశాలు ఏమిటి?  సామాన్య ప్రజానీకానికి బడ్జెట్లో కేటాయిస్తున్న నిధుల శాతం ఎంత?  విద్యను ప్రభుత్వాలు ఏ రకంగా  నిర్లక్ష్యం చేస్తున్నాయి?  కామన్ స్కూల్ విధానం ఎందుకు అమలు కావడం లేదు?  కులం ప్రాతిపదికన పాఠశాలల ఏర్పాటు  లోని లోపం...  ఉపాధి ఉద్యోగ అవకాశాలు కేవలం ప్రచారానికే పరిమితం అవడం ఎందుకు?  మానవాభివృద్ధి అంటే ఏమిటి?  కనీస జీవన ప్రమాణాలను సాధించకపోవడానికి కారణం  సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతే  రాజ్యాంగ పీఠిక  లక్ష్యం దెబ్బతిన్నట్లు కాదా?  మత స్వేచ్ఛ అంటూనే ప్రభుత్వాలు  కొన్ని మతాలకు వంత పాడితే ఎలా?  స్వేచ్ఛ సమానత్వం న్యాయం  సౌబ్రాతృత్వం అని చెబుతూనే  నిర్బంధం అణచివేత  కొనసాగితే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?  ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న ఆ ప్రజాస్వామిక అంశాలు ఏమిటి?  వంటి అనేక అంశాల పైన  విద్యాసంస్థల్లో  చర్చ జరగాలి సదస్సులు నిర్వహించబడాలి. ఉపాధ్యాయులు చురుకుగా  తమ అనుభవాలను వ్యక్తీకరించాలి  వీలున్న ప్రతి చోట సమాజంలో పాల్గొనాలి.  నిజమైనటువంటి   ప్రజాస్వామ్యాన్ని  పరిరక్షించడంలో,  లోపాలని ఎత్తిచూపడంలో,  పాలకుల వైఫల్యాలను  ఎండగట్టడంలో  క్రియాశీలక పాత్ర పోషించే వాళ్ళు ఉపాధ్యాయులే కనుక  ప్రపంచంలోనే ఎవరికి లేని స్థానం వీరికి ఉన్నది.  అంతర్జాతీయ స్థాయిలో కూడా మొదటి స్థానం సంపాదించిన ఘనత  ఉపాధ్యాయ లోకానిదే.  ఉపాధ్యాయ వృత్తి   స్వీకరించడానికి  సిద్ధం కండి!  సామాజిక మార్పుకు సారథులుగా  బాధ్యత వహించండి.!(   ఉపాధ్యాయ లోకానికి అంకితం)
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333