దేశాభివృద్ధి కోసం ఉపయోగపడని విద్య  తుప్పు పట్టిన కత్తిలాంటిది

Oct 13, 2024 - 21:14
Oct 14, 2024 - 16:21
 0  2

నైపుణ్య అభివృద్ధియే అందుకు గీ టు రాయి.*  65% యువతను  సద్వినియోగం చేసుకోగల ప్రణాళికలు ప్రభుత్వం వద్ద లేకపోతే  భవిష్యత్తు ప్రమాదంలో పడితే  ప్రభుత్వాలే బాధ్యత వహించాలి .

వడ్డేపల్లి మల్లేశం

చదువది ఎంత కలిగిన   రసజ్ఞత ఇంచుక లేక ఉన్న ఆ చదువు నిరర్థకం"  అన్నట్లు  పట్టాలు,  సంవత్సరాల తరబడి  డిగ్రీలు పుచ్చుకోవడమే చదువు కాదు  అది నిత్య జీవితానికి,  బావి జీవిత సవాళ్లను అధిగమించడానికి,  దేశ సాంకేతిక సాధారణ అవసరాలను  తీర్చడానికి,  ఉత్పత్తితో పాటు ప్రజాస్వామ్య  పాలనలో ప్రజలను భాగస్వాములను చేయడానికి విద్య ఉపయోగపడాలి.  మేలిమి విద్య అందించడంతోపాటు నైపుణ్య అభివృద్ధిలో  నవతరాన్ని తీర్చిదిద్దగలిగితేనే  దేశ అన్ని రకాల అవసరాలను తీర్చుకోగలమని  ఈ దేశ మేధావులు ఎప్పటినుంచో హెచ్చరిస్తూనే ఉన్నారు.  అందులో భాగమే  విద్యకు అధిక నిధులు కేటాయించాలని,  కామన్ స్కూల్ అమలుపరచాలని,  ఓకే యాజమాన్యంలో అందులో ప్రభుత్వ ఆధ్వర్యం లోనే నాణ్యమైన ఉచిత అందించాలని చేసిన డిమాండ్లు  ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిది.  నైపుణ్య అభివృద్ధి  యువతలో సాధ్యమైతే ఉపాధి అవకాశాలకు కొరత ఉండదు అనేది కూడా నగ్న సత్యం . దేశ అవసరాలను తీర్చుకోవడంతోపాటు ప్రపంచ దేశాలకు  మన ఉత్పత్తులను పంపిణీ చేయడం ద్వారా  అధిక లాభాలు ఆశించడానికి తద్వారా కుటుంబాలు దేశము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి  ఉత్పత్తి క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఆ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఉపయోగపడే నైపుణ్యాలే నేడు  మనకు కావాలి . ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన ఆర్థిక వేత్త  రాల్ఫ్ ఓస  కూడా యువతకు నైపుణ్య అభివృద్ధి కీలకమని  చేసిన సూచన కూడా  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వెంటనే అమలు చేస్తే  మంచిది.
      ప్రపంచవ్యాప్తంగా విద్య యొక్క ఆవశ్యకతను నైపుణ్యాభివృద్ధి పాత్రను గుర్తించిన   బొలివియా, నమీబియా, సౌదీ అరేబియా  వంటి దేశాలు తమ  స్థూల జాతీయ ఉత్పత్తిలో  6 శాతానికి పైగా విద్యపై ఖర్చు చేస్తుంటే  అమెరికా, అర్జెంటీనా, జర్మనీ ,తదితర దేశాలు  4 శాతానికి మించి  ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది . 1966లో భారత దేశంలో కొఠారి కమిషన్ కూడా  దేశవ్యాప్తంగా స్థూల జాతీయ ఉత్పత్తిలో  6 శాతం నిధులను కేటాయించాలని సూచిస్తే  3.5% కూడా దాటడం లేదు  అంటే 10% కేటాయించాలని సూచన చేస్తే ప్రస్తుతం రెండు 2శాతం మాత్రమే కేటాయించడాన్ని మనం గమనించవచ్చు.  ఇంకా గమ్మత్తయిన విషయం ఏమిటంటే రాష్ట్రాలు కేంద్రం కూడా నిర్మాణాలు, కార్యాలయాల పేరుతో  భవన నిర్మాణాలకు ఎక్కువగా ఖర్చు చేసి  విద్యా, పరిశోధన,  ఉపాధ్యాయ శిక్షణ, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాలను విస్మరించడమే మన దేశం యొక్క  వెనుకబాటుతనానికి ప్రధాన కారణం .అంటే కమీషన్ల కోసం కక్కుర్తిపడడమే కదా!
      మేలిమి విద్య, నైపుణ్య అభివృద్ధి ఎలా ఉండాలి?
::::::::::::::********†
  పాఠ్యాంశాలను బట్టి పట్టడం  మార్కులు ర్యాంకుల ప్రాతిపదిక కాకుండా  చదువు బయటి అవసరాలను  సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా ఉండాలి.  అందుకు ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలను మార్చాలి  విద్య ఆధారంగా నైపుణ్యాలను,  పని అనుభవాన్ని,  నూతన పరికల్పనలను  అందించడం ద్వారా  ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి  అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలి.  "సామాజిక మార్పుకు దోహదపడనీ విద్య  తుప్పు పట్టిన కత్తిలాంటిది" అని ప్రముఖ విప్లవ రచయిత  విరసం సభ్యులు  వరవరరావు గారు 1980ప్రాంతంలో ఒక సభలో  మాట్లాడిన మాట  ఇక్కడ సందర్భోచితంగా ఉంటుంది.  విద్య వేరు నైపుణ్యం వేరు అని స్పష్టంగా నిర్వచించుకున్నప్పుడే  నైపుణ్యాల యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకోగలుగుతాము,  ప్రపంచవ్యాప్తంగా ప్రకృతిలోనూ ఇతరత్రా సామాజిక ఆర్థిక రాజకీయ సర్వ రంగాలలో దాగి ఉన్న విషయాలను నేర్చుకోవడం తెలుసుకోవడం విద్య అయితే , తద్వారా ఆ పరిజ్ఞానాన్ని  అన్ని రంగాల అంశాలను  పరిష్కరించడానికి ఉపయోగపడే  సాంకేతిక పదమే నైపుణ్యం.  ఏటా దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా  పట్టభద్రులవుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తుంటే  అందులో మూడోవంతు కు మాత్రమే  ఉద్యోగాలకు తగిన అర్హతలు ఉన్నాయని తెలుస్తున్నప్పుడు  ఈ లోటును భర్తీ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోకపోవడం , అవసరాన్ని గుర్తించకపోవడం , నిర్లక్ష్యంగా వ్యవహరించడం  ఒక రకంగా నేరమే .
   పనిచేస్తూ చదువుకోవడం  ద్వారా కోర్సు పూర్తి అయ్యేనాటికి  ఏదో ఒక ఉపాధికి ఉపయోగపడే నైపుణ్యాలను సొంతం చేసుకోగలిగితే  బాగుంటుంది అదే అప్రెంటిషిప్  .ఈ మూలాన్ని గుర్తించినటువంటి ప్రపంచంలోని అమెరికా, చైనా, యూకే, జపాన్ వంటి  అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామికంగా  అప్రెంటిషిప్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తుంటే  భారతదేశంలో మాత్రం  నైపుణ్యాలకు సంబంధించిన విద్య,  మేలిమి విద్య,  బావి సవ్వాలని అధిగమించడానికి విద్య అని గొప్పగా ప్రభుత్వాలు  ప్రకటించడమే కానీ  అందుకు అనుగుణంగా పాఠ్యాంశాలను ఎప్పటికప్పుడు ఆధునికరించిన సందర్భాలు చాలా తక్కువ.  కంపెనీలు పారిశ్రామిక సంస్థల యొక్క సహకారంతో  దేశంలో  తగిన విద్యన భ్యసించి నైపుణ్యాలను సాధించినటువంటి యువతకు  ఉపాధి ఉద్యోగ అవకాశాలను గ్యారంటీ చేయగలిగే  పరిస్థితులు రావాలి. అందుకు  ప్రభుత్వాలు మాటలకంటే చేతల్లో ముందు ఉంటే   మంచిది.  35 ఏళ్ల లోపు యువత  భారతదేశ జనాభాలో  65% ఉన్నదంటే  ఇది ప్రపంచంలోనే భారతదేశానికి ఉన్నటువంటి హైలైట్. ప్రస్తుతం దేశంలో  అవసరమైన రంగాలలో కొరత ఉన్నటువంటి  నిపుణులను భర్తీ చేయడానికి  ప్రాధాన్యత అంశాలను గుర్తించడం  తద్వారా వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఆయా రంగాలలో  మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.  ఆరోగ్య పరిరక్షణ , హరిత ఇంధనాలు,  వ్యర్థాల నిర్వహణ  ,వ్యవసాయం, ఇతర రంగాల్లో డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం,  నిర్మాణ  రంగాలలో ఉపాధిని పెంచడం , ఆరోగ్య భీమా  మార్కెట్ ఇతర వాణిజ్య రంగాల  అవసరాలను తీర్చడానికి  ప్రస్తుతము  యువత కావాలని  తెలుస్తున్నది  .ఆ ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా మన యువతకు  నైపుణ్యాలను అందించాలి  కంప్యూటర్ సైన్స్ బిటెక్  సాఫ్ట్వేర్ రంగాలకే పరిమితం కాకుండా  విభిన్న రంగాలలో చేరే విధంగా విద్యార్థులను ప్రోత్సహించినప్పుడు మాత్రమే వైవిధ్యమైన  నిపుణులు తయారవుతారు . జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించే ఉపాధ్యాయ విద్య కూడా  ఆధునీకరించబడాలి  ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ ఇవ్వడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చు . ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి వృత్తి విద్యను సమాంతరంగా అమలుచేస్తే  నిరుద్యోగ సమస్య నిర్మూలించబడడంతో పాటు  పని ఔన్నత్యము శ్రామిక దృక్పథం  బలంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. . ఏటా రెండు కోట్ల ఉద్యోగాలని గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి  మొండి చెయ్యి చూపింది  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 65 శాతం ఉన్నటువంటి  యువతకు తగిన ఉపాధి కల్పించకపోయినా వారిని దేశాభివృద్ధిలో ఉపయోగించుకోకపోయినా ఆ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే.  తద్వారా దేశం అనేక రంగాల్లో వెనుకబడిపోయే ప్రమాదం ఉన్నది .ప్రమాదాన్ని  పసిగట్టవలసిన బాధ్యత నిపుణులు మేధావులతో పాటు పాలకవర్గాలపై  ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయిత ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333