పేదరికం తరిమికొట్టాలంటే అసంఘటిత రంగ కార్మిక విధానం ప్రకటించాలి
మానవాభివృద్ధికి దూరంగా ఉన్న మానవాళిని మనుషులుగా చూడకపోతెలా?
పరిపాలనకు గీటు రాయి విధానపరమైన ప్రకటనలే కానీ రాయితీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు కాదు.
---- వడ్డేపల్లి మల్లేశం
ఒకనాడు అసంఘటిత రంగంలో అధ్వాన్న స్థితిలో ఉన్న రైతులు ఇటీవల కాలంలో కొంత చైతన్యమై సంఘటితమైన సందర్భాలను గమనించవచ్చు. అందులో భాగమే కదా గత రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడి నల్ల చట్టాలను ఉపసంహరింప చేసినది . అయితే నేమి గత రెండు మాసాల క్రితం తిరిగి చలో ఢిల్లీ పేరున కొనసాగించిన రైతు సంఘాల ఉద్యమాన్ని ఆయుధాలతో చట్టాలతో బలవంతపు నిర్బంధాలతో అణిచివేసి ప్రధాన డిమాండ్లను పక్క దారి పట్టించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ దేశానికి తిండి పెట్టే రైతన్నలు కేంద్రాన్ని అడిగింది గొంతెమ్మ కోర్కెలు కానే కాదు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, రైతుకు భరోసా కల్పించాలని ప్రధాన డిమాండ్లతో ముందుకెళితే కనీసం ఆమోదించకుండా చర్చించకుండా మొక్కుబడిగా చర్చలు జరిపి దాటవేసిన తీరు చూసినప్పుడు రైతు సంఘాలు కూడా బలోపేతం కావలసిన అవసరాన్ని చాటి చెప్పినట్లే. ఇక అదే దారిలో చూసినప్పుడు అసంఘటిత రంగమైనటువంటి ప్రైవేటు ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు ,వీధి వ్యాపారులు, దినసరి కూలీలు, బస్టాండ్లలో వీధుల్లో బస్సుల్లో రైల్వే స్టేషన్లలో తినుబండారాలు చిల్లర సామాన్లు తిరిగి అమ్ముకొని బ్రతికే వాళ్ళు, పాత పేపర్ పాత ఐరన్ సామాను కొనే వాళ్లతో సహా అనేక వర్గాలు ఇవ్వాలా అసంఘటిత రంగంలో కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వర్గాల కోసం కేంద్రం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రత్యేకంగా చట్టాలు రూపొందించిన దాఖలాలు ఏమీ కనిపించడం లేదు . అంతో ఇంతో రైతు వర్గాల గురించి చర్చ సమాజంలో ప్రభుత్వ రంగంలో ప్రతిపక్షాలలో కొనసాగుతున్నది దానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ అదే మాదిరిగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి బీద బిక్కి జనానికి రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలకు దారిద్రరేఖ దిగువన ఉన్నటువంటి కోట్లాది ప్రజానీకానికి కూడా భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని సమాజంలో చర్చ జరిగితే మంచిది.
బుద్ధి జీవులు మేధావులు, విద్యావంతులు ఒక స్థాయిలో ఆదాయాన్ని సంపాదిస్తూ తృప్తిగా ఉన్న వాళ్లు కూడా ఏనాడు పేద వర్గాల గురించి ఇలాంటి అసంఘటిత రంగ కార్మికుల గురించి అంతగా ఆలోచించకపోవడం శోచనీయం . పైగా ఇలాంటి కుటుంబాలు సర్వత్ర ఒక చర్చ చేస్తున్న విషయం ఏమిటంటే మా కుటుంబాలు అంత "వెల్ సెటిల్డ్" ఎo తసేపు ఉద్యోగస్తులు వ్యాపారులు పారిశ్రామికవేత్తల గురించి జరుగుతున్న చర్చలో కుటుంబాలు హాయిగా ఉన్నాయని, అంతా సంపాదనలో సెటిలైపోయారని, ఎదిగిపోయారని గొప్పగా చెప్పుకోవడమే కానీ సమాజాన్ని ఉద్ధరించడానికి సిద్ధంగా లేకుండా, సామాజిక చింతన ఏమాత్రం లేకుండా, డబ్బు సంపాదించడం కోట్లకు పడగలెత్తడమే సెటిల్మెంటు ఎదుగుదల అనుకుంటే బహుశా అంతకంటే మూర్ఖత్వం లేదేమో ఒక్కసారి సమాజమా! ఆలోచించాలి.
స్పష్టమైన విధాన ప్రకటన అవసరం :-
సంపదకు దూరంగా చాకిరి కోసమే, సేవ కోసమే, బానిసత్వం కోసమే బ్రతుకుతున్నారా! అనుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్న కోట్లాది ప్రజానీకం ఈరోజు దేశంలో పాలకులకు మిగతా సమాజానికి అంటరాని వారిగా మారారు అంటే అతిషయొక్తి కాదు. ఓట్ల కోసం , ఉత్పత్తి కోసం, సేవల కోసం మాత్రమే ఈ వర్గాలు తమ శ్రమను వెచ్చిస్తున్నాయి తప్ప ప్రతిఫలం రాజ్యాంగ పలాలను అనుభవించడానికి కాదు అని నిజజీవితంలో తెలిసిపోతున్నది. అందుకే బజారు బతుకుల్లో జీవిస్తు న్నటువంటి కోట్లాదిమందికి ఇప్పటికీ రక్షణ కల్పించలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దయనీయ దుర్నీతిని ఇకనైనా ఎండ కట్టాల్సిన అవసరం చాలా ఉన్నది .
రాయితీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, హామీల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సత్వర ఉపశమనం కోసం పేద వర్గాల కోసం ప్రకటనలు చేస్తున్నారే తప్ప వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడానికి కాదు అని మనకు తెలుసు. కనీసం మానవ అవసరాలను తీర్చుకోగలిగినటువంటి పరిస్థితిలోకి క్రమంగా పేదవర్గాలను నెట్టడం ద్వారా ఆదాయాలను గణనీయంగా పెంచగలిగే స్థితిని మానవాభివృద్ధి అని డాక్టర్ అమర్త్యసేన్ ఏనాడో చెబితే ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైపుగా పెద్దగా పట్టించుకోని కారణంగా మో డు వారి న జీవితాలుగా కొనసాగుతున్న అభాగ్యుల గాథ లకు బాధలకు అంతే లేదు. ఇది స్వతంత్ర భారతదేశంలో కొనసాగుతున్న పాలకుల నిర్లక్ష్య, దాస్టీకాలకు ఆనవాలు కాక మరేమిటి ? ఉపాధి కల్పించడానికి మనసు ఒప్పదు, ఉద్యోగాలు ఇవ్వడానికి హామీలే తప్ప ఆచరణ ఉండదు, కేంద్రం ఏటా రెండు కోట్ల మందికీ ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చి పదేళ్లు దాటిపోయింది కానీ ఎక్కడో ఆ ఉద్యోగాల జాడ ఇప్పటికీ లేదు. తెలంగాణలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం మాటలతోనే గడిపిందే కానీ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలా లేనేలేదు. ప్రకటించిన అనేక పథకాలు పేద వర్గాలకు మాత్రమే ఉపయోగపడే స్థాయిలో ఉండాలి కానీ ధనవంతులకు ఉపయోగపడే స్థాయిలో ప్రకటించి అమలు చేసి ప్రజాసంపదను పెట్తం దారి భూస్వామ్య వర్గాలకు అప్పనంగా కట్టబెట్టిన తీరు టిఆర్ఎస్ పరిపాలల్లో స్పష్టంగా చూడవచ్చు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అలాంటి విధానమే కొనసాగితే పేద ధనికుల మధ్యన అంతరాలు మరీ పెరిగే ప్రమాదం ఉంటుంది కనుక దళిత బంధు రైతుబంధు లాంటి పథకాలను దారిద్రరేఖ దిగువన ఉన్న వాళ్లకు లేదా పరిమిత ఆదాయము భూములకు మాత్రమే వర్తింప చేయడం ద్వారా అసంఘటిత రంగానికి కొంతనైనా ఊరట కలిగించవచ్చు. భూమిలేని పేదలకు భూములను పంపిణీ చేయడం, ఆ భూములను సాగు చేసుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం, స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలను పెద్ద మొత్తంలో సబ్సిడీపై అందించడం , గృహ నిర్మాణ పథకాలను భారీగా అమలు చేయడం ద్వారా పేదరికాన్ని తొలగించవచ్చు, మానవ అభివృద్ధిని సాధించవచ్చు. దారిద్రరేఖ దిగువ నగల వారిని పైకి తీసుకురావడానికి కూడా అవకాశం ఉంటుంది. క్రమంగా ప్రభుత్వ చర్యల ద్వారా అంతరాలను తగ్గించి పేద వర్గాలలో ఆత్మస్థైర్యాన్ని పెంచగలిగే విధానపరమైన ప్రకటన స్పష్టంగా చేయాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పేద వర్గాల కోసం, వారి ఉద్ధరణ కోసం, మానవాభివృద్ధి కోసం , అడుగంటుతున్న జీవితాలను ఉద్ధరించడం కోసం విస్తృతమైనటువంటి ఉపాధి ఉద్యోగ ఆదాయ మార్గాలని ఇచ్చే పథకాలను రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తూ ఆ వర్గాలను ఉత్పత్తిలో మరింతగా భాగస్వాములను చేయడం ద్వారా సంపద సృష్టించాలి... ఆ సంపదను మెజారిటీగా పేదవర్గాలకి పంపిణీ చేయాలి అప్పుడు మాత్రమే అసంఘటిత రంగం ఆత్మవిశ్వాసంతో జీవిస్తుంది. ప్రభుత్వ భరోసాను అందుకుంటుంది . ఆదాయ మార్గాలను పెంచుకొని కొనుగోలు శక్తిని భారీగా రూపకల్పన చేసుకోవడం ద్వారా అన్ని రకాల నైపుణ్యాలను పోటీ పరీక్షలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని పేద వర్గాలకు అసంఘటిత రంగానికి అందించడానికి ప్రభుత్వ పథకాలను భారీగా ప్రత్యేకంగా రూపకల్పన చేయడం కూడా చాలా అవసరం. తోటి మనిషిని సాటి మనిషిగా చూడాలి అనే సహజ న్యాయాన్ని పాటించే క్రమంలో మనుషుల మధ్యన తారతమ్యాలను మానవ సంబంధాలను కూడా పునరుద్ధరించే విధంగా విధానపరమైన ప్రకటన ఉన్ననాడు బుద్ధుడు నిర్వచించినట్లు మనుషులంతా సమానమే అని బౌద్ధమత సూక్తి నీతి భావజాలం సర్వత్ర వ్యాపించే అవకాశం ఉంటుంది .ఆ రకమైన వెలుగు కోసం ప్రస్తుత చీకట్లను తరిమికొడదాం . అసమానతలు, అంతరాలను, దోపిడీ, పీడనను ప్రతిఘటించి నిర్లక్ష్యంతో వివక్షతతో పనిచేస్తున్న పాలకవర్గాల కళ్లను తెరిపిద్దాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా తెలంగాణ)