నటన వాస్తవానికి దగ్గరగా ఉండకపోతే కృత్రిమమే అవుతుంది
నటన వాస్తవానికి దగ్గరగా ఉండకపోతే కృత్రిమమే అవుతుంది .
విశ్వసనీయత కోల్పోతే వ్యతిరేక ఆలోచనలకు పునాది పడే ప్రమాదం ఉంది.
అంతేకాదు నిజ జీవితాన్ని వెక్కిరించినట్లే.ప్రచారానికి నాగలి పట్టిన నటుడు,
నాయకుడు రైతు కంటే గొప్పవాడు అవుతున్నాడు! ఇది సిగ్గుచేటు కాదా ?*
---- వడ్డేపల్లి మల్లేశం
ఒక అబద్ధాన్ని పదే పదే వల్లిస్తే నిజమైనట్లు నిజాన్ని కూడా పెద్ద మొత్తంలో ప్రచారం చేస్తే అబద్ధమై, ఆరోపణై ,విమర్శగా నిలబడుతున్నది. ఈ రెండు సందర్భాలు కూడా వాస్తవ విరుద్ధం . సహజ న్యాయ సూత్రాలకు భిన్నమైనటువంటి వాస్తవానికి దూరమైనటువంటి ప్రచార ప్రసార ఆర్భాటాలను ఇక ఎంత మాత్రం కూడా సహించకూడదు .కానీ టీవీ ప్రసారాలు ,తెరమీద ,రాజకీయ చదరంగంలో నిరంతరం మనం చూస్తూనే ఉన్నాం . వ్యవసాయం తెలియని వ్యక్తి, రైతును కనీసం మనిషిగా గుర్తించని నాయకుడు రైతు వేషంలో నాగలి భుజానికి ఎత్తుకుంటే ప్రచారంలో భాగంగా కార్యకర్తలు నాయకునికి బహుకరణ చేస్తే అతడు నిజమైన రైతుగా మిగిలిపోతున్నాడు. కార్య క్షేత్రంలో అలుపు సొలుపు లేకుండా బక్క చిక్కి బురద బట్టలతో డొక్కలు ఎండిన నగ్న శరీరంతో ఆరుగాలం కష్టంచే రైతన్న నిజ జీవితం అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ ఆర్తనాదాలు చేస్తూ అనాధలుగా మిగిలిపోతున్న సందర్భాలు ఈ దేశాన్ని వెక్కిరిస్తుంటే నటనే జీవితం గా చలామని లోకి రావడాన్ని పౌర సమాజం ఇంకెంతకాలం సహిoచ కూడదు. వాస్తవాలను అంగీకరించరు, చేసిన కష్టాలను గుర్తించరు, అన్యాయాన్ని ప్రతిఘటించరు, న్యాయానికి మద్దతు పలకరు, మంచిని మంచిగా చెడును చెడుగా చిత్రీకరించకుండా తటస్థంగా ఉంటూ అవసరాల కోసం జీవితాలు గడుపుతున్న వారే ఎక్కువ. కనుక ఈ దేశంలో వాస్తవము నిర్జీవమైన శరీరంగా మిగిలిపోతే అవాస్తవం క్రూర మృగంలాగా స్వారీ చేస్తూ ఆకలి తీర్చుకుంటున్న విషయాన్ని మనం అందరం గమనించాలి. దోపిడీ పీడన వంచన ఈ దేశంలో సర్వత్రా రాజ్యమేలుతుంటే ప్రశ్నించడానికి కూడా మనసొప్పనివాల్లు కొందరైతే ప్రశ్నిస్తే, తమ జీవితాలకు రక్షణ లేదని తెలిసినా యుద్ధభూమిలో ఓటమిపాలైనా తమ మనుగడను కాపాడుకుంటున్నఉద్యమ వీరులు మరికొందరు, అధర్మాన్ని అగాధానికి నెట్టడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు ఇ o కొందరు.
వాస్తవాన్ని ప్రచారం చేయడం అంటే నేరమే కదా:-
కూల్ డ్రింక్స్ ఇతర అనారోగ్య కారకమైనటువంటి తినుబండారాలు, చిరుతిండ్లు, జంక్ ఫుడ్,నూనెలు వంటి కలుషిత ఆహార పదార్థాలను మార్కెట్లోకి తీసుకురావడానికి పేరెన్నిక గన్న సినిమా నటులు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు , ఇతర ప్రముఖులచే ప్రచారాలు చేయించడం అవాస్తవాన్ని ఆకాశానికి ఎత్తి అతిగా చూపించి అనారోగ్యాన్ని ప్రజల జీవితాలలోకి చూపించడం అంటే రాజ్యాంగ ద్రోహమే అని ఇప్పటికీ ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. కోట్లాది రూపాయలను కుమ్మరించి ఆయా కంపెనీలు దుర్మార్గపు భావజాలాన్ని మార్కెట్లోకి తీసుకు వెళ్లడానికి అమ్మకం భారీగా జరగడానికి ప్రజల మూలుగలను పీల్చే అనేక సందర్భాలను మనం తెరమీద సెల్ ఫోన్లలో టీవీలలో సినిమా క్షేత్రంలో పత్రికల్లో ఇతర ప్రసార మాధ్యమాలలో చూడవచ్చు. అప్పట్లో కూల్డ్రింక్స్ లో పురుగుల మందు భారీగా కలుపుతున్నారని ఆరోగ్యానికి తీరని ద్రోహం కలుగుతుందని వాటిని బహిష్కరించాలని పెద్ద ఎత్తున ప్రచారమైనా రోజురోజుకు వాటి అమ్మకాలు పెరుగుతూ ఉంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు, అక్రమాలను అడ్డుకోవలసిన ప్రభుత్వ రంగ స్వయం ప్రతిపత్తి గల తనిఖీ పర్యవేక్షణ సంస్థలు కూడా మొద్దు బారి పోవడం అంటే పాలకవర్గాలు పెత్తందారీ వర్గాలకు వంత పాడుతున్నట్లు కదా ? ఇలాంటి సందర్భాలలో ప్రచారం చేస్తున్నటువంటి విషయాలను గమనించినప్పుడు నిజాలకు అబద్దాలకు ఎంత తేడా ఉన్నదో గమనిస్తే సిగ్గు అనిపించక మానదు . తెరమీద నాగలి పట్టి రైతు వేషం వేసి రైతాంగ సమస్యల కోసం పోరాడుతున్నట్లు నటిస్తూ తనకు పేద వర్గాల మీద ఏనాడు కూడా సానుభూతి లేనటువంటి సన్నివేశం తద్వారా లభించే ఫలితాలు కోట్లలో ఉంటే దానికి భిన్నంగా సహజంగా వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న రైతులు దేశానికి తిండి పెట్టగలిగిన ప్రజల ఆకలి తీర్చుతున్న వాళ్లు మాత్రం అర్దాకలతోనే బ్రతుకుతున్న కోట్లాది కుటుంబాలకు పరిష్కారం లేదా? ఈ అసహజమైనటువంటి సన్నివేశాలను పక్క పక్కనే చూడగలిగినప్పుడు మనం సహిస్తున్నామంటే నిజజీవితంలో లేనట్లే! నేరాన్ని ముద్దాడినట్లే ! వాస్తవాన్ని వక్రీకరించినట్టే. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే సందర్భంలో రాజకీయ నాయకులకు ఒకరు గొర్రె పిల్లనిస్తే మరొకరు నాగలినిస్తారు . ఒకరి గొంగడి బహుకరిస్తే మరొకరు పంట గొలుసులు కానుకగా ఇచ్చి నటింప చేస్తారు. నటించిన వాడు కోట్లల్లో ఉంటే జీవిస్తున్న వాళ్లు లక్షల్లో అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలపాలై కౌలు రైతులు భూమిలేని కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్న విషయాలను నాగరిక సమాజం అని చెప్పుకుంటున్న మనం ఏనాడైనా ఆలోచించినామా ?గత రెండు సంవత్సరాల క్రితం 13 మాసాల పాటు జరిగిన రైతు ఉద్యమం, రైతులపై ఉక్కు పాదం మోపిన కేంద్ర ప్రభుత్వం , వందలాదిమంది బలికావడం, రైతుల హక్కుల కాలరాచే చట్టాలను రద్దు చేసేదాకా వదలని రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోకపోతే హాయిగా బతుకుతున్నామని బాగా చదువుకున్నామని బాగా ఎదిగినామని చెప్పుకునే మనకు మన జీవితాలకు అర్థం లేనేలేదు. స్వార్థం లేకుండా సదాశయంతో దేశానికి తిండి పెట్టే రైతన్నలు ముఖ్యంగా పేద రైతులకు సంబంధించి ప్రణాళికలు బడ్జెట్లలో ఎలాంటి ప్రాధాన్యత నివ్వకుండా రచిస్తున్న విధానాలను ఆర్థిక అరాచకత్వాన్ని ఎండగట్టవలసిన అవసరం కూడా చాలా ఉన్నది. దాని కారణంగానే ఈ దేశంలో పేదరికం తారా స్థాయికి చేరుకుంట్ సగం సంపద ఒక్క శాతం సంపన్న వర్గాల చేతుల్లో ఉన్నదంటే మనం సిగ్గుపడాల్సిందే కదా! కాదు కాదు ముందుగా పాలకులు సిగ్గుపడాలి !ఇకనుండి నటించడాన్ని అరికట్టి నటించే నటులను జీవించడానికి పురికొల్పి నటించడం ద్వారా నిజమైన జీవితాలకు రైతులకు అవమానం చేస్తున్నటువంటి సన్నివేశాలను రూపుమాపినప్పుడు మాత్రమే ఈ దేశంలో రైతులకు విముక్తి కలుగుతుంది .రైతులకు గౌరవం పెరుగుతుంది. " స్క్రీన్ మీద వ్యవసాయం చేస్తున్న నటులకు కోట్లాది రూపాయలు ఎక్కడివి? భూమ్మీద వ్యవసాయం చేస్తున్న రైతులకు లక్షలాది అప్పు ఎందుకు?" ఈ తేడాను పసిగట్టకుండా, ప్రశ్నించకుండా, పరిశీలించకుండా, అధిగమించకుండా నేను ఈ దేశ పౌరుడినే అని చెప్పుకునే అర్హత మనకు లేదు. కనీస జీవన ప్రమాణాలు లేకుండా ఉన్న అశేష ప్రజానీకానికి మానవాభివృద్ధిని అందించాలని అమర్త్యసేన్ చెప్పినా పాలకుల నిర్లక్ష్యం కారణంగా కనీస అవసరాలకు నోచుకోకుండా రోడ్లపై, మురుగు కాలువల పక్కన, అంధకారంలో జీవిస్తున్నటువంటి అభాగ్యుల జీవితాలలో వెలుగు నింపడానికి నీవేమైనా ప్రయత్నం చేయగలవా? నీ ఆలోచన కాంతిరేఖ అయితే కారు చీకటిని తరిమేయడానికి ఎంతైనా కొంత ఉపయోగపడుతుంది. ఆలోచించు !
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)