గత పదేళ్లుగా ధ్వంసమైన ప్రజా జీవితాన్ని కాపాడే సత్తా వున్న కాంగ్రెస్ కా?
ఓటమిపాలై పదేళ్లలో హామీలు నెరవేర్చక అన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసిన టిఆర్ఎస్ కా ?
ఓటమిపాలై పదేళ్లలో హామీలు నెరవేర్చక అన్ని వర్గాలను
నిర్లక్ష్యం చేసిన టిఆర్ఎస్ కా?
మోదీ, రామ మందిరం ప్రచారంతో కాంగ్రెస్ ను విమర్శిస్తూ
టిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్న బిజెపి కా?
పార్టీల లక్ష్యాలు ముఖ్యం కాదు ప్రజల ఆకాంక్షలు ముఖ్యం.
విచ్ఛిన్నమైన ప్రజా జీవితాన్ని కాపాడే వాళ్ళకే ప్రజల ఓట్లు...
---- వడ్డేపల్లి మల్లేశం
మే 13న తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రజలను మభ్య పెట్టదాన్ని కల్లారా చూస్తూనే ఉన్నాం .గత పదిహేళ్లుగా విచ్ఛిన్నమై సంక్షోభానికి గురైన ఈ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దవలసినటువంటి అవసరం ప్రస్తుత ప్రభుత్వం పైన ఉన్నది . ఆ ప్రభుత్వం బలంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది ప్రజల ఆకాంక్షలు నెరవేరి వినూత్న పరిపాలన కొనసాగాలంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మరింత మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉంది. అందుకు పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలిపించడం ప్రజల బాధ్యత. ఇక పదేళ్ల పాలనలో తన అవినీతి అరాచకాలు వివక్షత హామీలను నెరవేర్చక ముఖ్యమంత్రిని దళితుని చేస్తానని మాట ఇచ్చి మోసగించిన ప్రధాన వాగ్దానం భంగం జరిగిన ఈనేల ప్రజలు ఇటీవలనే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్కు పట్టం కట్టిన విషయం తెలిసిందే. ఇంతలోనే తాము తిరిగి అధికారానికి వస్తామని తమకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరడం అంటే అధికారానికి దూరంగా ఉండడానికి ఇష్టపడకపోవడమేనా?
స్వార్థం ఆ మాటల వెనుక ఉన్న కుట్ర తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఓటర్ల పైన ఉన్నది. అంతేకాదు నాలుగు మాసాలు కాలేదు అప్పుడే అనేక సందర్భాల్లో ప్రభుత్వం కూలిపోతుందని శాపనార్థాలు పెడుతుంటే ఏకంగా టిఆర్ఎస్ అధినేత సంవత్సరంలో ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించడం అధికారకాంక్షకు, ప్రభుత్వాలను గౌరవించని ఆదిపత్య ధోరణికి ప్రతీక కాక మరేమిటి ? ప్రభుత్వాలను కూలదోశే పార్టీలకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసి గంద ర గోళం తెచ్చుకుందామా? స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుందామా? ఇక రామ మందిరం ప్రధాని మోదీ మంత్రంతో ఎన్నికల్లో ప్రధానంగా ప్రవేశించినటువంటి బిజెపి పార్టీ ఈసారి రెండు అంకెల సీట్లు పార్లమెంట్ ఎన్నికల్లో వస్తే రాబోయే కాలంలో రాష్ట్ర పాలన తమదేనని చెప్పడం అంటే వాస్తవం ఎంతో ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రానికి గత పదేళ్లలో నిధులు ఇవ్వలేదని గత బి ఆర్ ఎస్ అధినేత ఎన్నోసార్లు విమర్శించిన సందర్భాలు తెలుసు. మెడికల్ కళాశాలలు నవోదయ పాఠశాలలు ఇతర నిధులు విభజన హామీలలోని అంశాలు నెరవేర్చలేదని అనేకసార్లు విమర్శించినా స్పందించలేదు. కేవలం మతం కులం దైవం పేరుతో ఎన్నికల్లో ఓట్లు రాలుతాయి అనుకోవడం అత్యాశ అవుతుంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కూడా ప్రజా వ్యతిరేకంగా, రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్య పరచడమే కాకుండా, సంపదను కేంద్రీకరించి, పెట్టుబడిదారులను ప్రోత్సహించే విధంగా ఉన్నప్పుడు అది సుస్థిరపాలన ఎలా అవుతుంది? అది రాష్ట్రానికి ఏ రకంగా ఉపకరిస్తుందో ఆలోచించుకోవాలి.
మూడు పార్టీల బలాలు--- బలహీనతలు
కాంగ్రెస్ పార్టీ ఇటీవల 65 సీట్లతో స్పష్టమైన మెజార్టీతో అధికారంలో కొనసాగుతూ మేధావులు బుద్ధి జీవులు పౌర సంఘాల యొక్క మద్దతుతో కొనసాగుతున్న విషయం తెలిసిందే . అంతేకాకుండా పౌర ప్రజాస్వామ్య మానవ హక్కులను గౌరవిస్తామని నిర్బంధం అణచివేతను నిషేధిస్తామని తెలియజేసినటువంటి ముఖ్యమంత్రి మాటలను పరిశీలించవలసిన అవసరం ఉన్నది. ఆ అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఎంతో ముఖ్యం. ఆరు గ్యారెంటీ ల పేరుతో ప్రకటించి కాల గడువు నిర్ణయించిన కారణంగా టిఆర్ఎస్ బిజెపి తొందరపడి చంచల స్వభావంతో పిల్లవాని చేష్టల మాదిరిగా గిచ్చికయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ కొంత గడువు ఇవ్వాలనే సంస్కారం ప్రతిపక్షాలకు ఉండడం అవసరం. ఇక సాగునీరు తాగునీరు కష్టాలు కరెంటు కోతలు వచ్చాయని హామీలు ఇచ్చినటువంటి వారికి బోనస్ రైతు రుణమాఫీ అమలు చేయలేదని ఆరోపణ చేసి ఓట్లు దండుకోవాలని ముఖ్యంగా టిఆర్ఎస్ బిజెపిలు చూస్తున్నాయి . అయితే ఈ దుస్థితికి రాష్ట్ర 7 లక్షల కోట్ల అప్పులకు బాధ్యులు టిఆర్ఎస్ అని ప్రజలు గుర్తిస్తే కొన్ని కష్టాలకు భరించడానికి త్యాగాలు చేయడానికి అయినా ప్రజలు సిద్ధంగా ఉంటే రాబోయే కాలంలో సుస్థిర ప్రభుత్వంలో అన్ని సాధ్యం చేసుకోవచ్చు అనే ఆలోచన ఉంటే బలమైన ప్రభుత్వాన్ని మనం కొనసాగించిన వాళ్ళం అవుతాం .
టిఆర్ఎస్ పార్టీ
ఈ రాష్ట్రాన్ని పాలించి పెత్తందారీ వర్గాలను ప్రోత్సహించి భూస్వాములకు మాత్రమే రైతుబంధును ప్రజాధనాన్ని అప్పనంగా కట్టబెట్టిన తీరు అందరికీ తెలుసు . భూ కబ్జాలు,కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి రాష్ట్రవ్యాప్తంగా పెచ్చు మీరిన ఫోన్ టాపింగులు ఇతరత్రా అన్ని ప్రభుత్వ పథకాలలో అవినీతి జరిగినట్లు ప్రస్తుతం కొనసాగుతున్న విచారణల ద్వారా తేలుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఓట్లు వేసి అవినీతిని మళ్ళీ ప్రోత్సహిద్దామా? ఓటర్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. ఇక తెలంగాణ తెచ్చింది మేమే తెలంగాణను కాపాడేది మేమే అని నమ్మబలికే ప్రయత్నం చేయడం కల మాత్రమే! తెలంగాణ సాధన అనేది ప్రజా ఉద్యమాల నుండి దశాబ్దాల నుండి జరుగుతున్నటువంటి పోరాటం ఆ విషయాన్ని ఇప్పుడు మర్చిపోవద్దు.ఎందరో బలైనవిషయం తెలిసిందే. పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తర్వాత ఓట్లు వేస్తే అధికారంలోకి మళ్లీ వస్తామని చెప్పడం అర్థం లేని మాట. ఆ విషయాన్ని ఓటర్లు ప్రజలు ఆలోచించుకుంటే ఆ పార్టీ వైపు కన్నెత్తి చూడరు.
బిజెపి పార్టీ *
దేశవ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని సందర్భం పేదరికం నిరుద్యోగము ఆకలి చావులు యధాతతంగా కొనసాగుతుంటే ధరల పెరుగుదల వల్ల ప్రజల యొక్క కొనుగోలు శక్తి భారీగా తగ్గిన విషయం తెలుసు. దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సింది .40 శాతం సంపద ఒక్క శాతం ఉన్న సంపన్న వర్గాల చేతిలో ఉన్నది అంటే ఈ దేశంలో అసమానతలు అంతరాలు ఎంత దుస్థితిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు . ప్రజల సమస్యలు ఆకాంక్షలు కేంద్రం ఇచ్చినటువంటి విభజన హామీల అమలు పక్కనపెట్టి ప్రజల విశ్వాసాల పునాది మీద గెలవాలని చూడడం అసంభవం. ప్రజలు ఇవ్వాలా నమ్మకాలకు భక్తికి సిద్ధంగా లేరు తమ కడుపు ఆకలి మంటలను చల్లార్చి, ఆదాయాన్ని సమకూర్చి, ఆత్మగౌరవాన్ని పెంపొందించే పార్టీలకు మాత్రమే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి గుర్తించడం అవసరం . కాబట్టి బిజెపి నినాదాలు ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతాయో ఆలోచించుకోవాలి. ప్రస్తుతం బిజెపికి ఓట్లు వేసినంత మాత్రాన రాష్ట్రంలో ప్రభుత్వం మారేది లేదు ప్రజల సమస్యలు పరిష్కరించబడేది అంతకూ లేదు. అది కేవలం కేంద్రంలోని పరిపాలనను శాశ్వతం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేయాల్సిన అవసరం అయితే అన్ని వర్గాల పైన ఉన్నది
ఈ సందర్భంలో హోరాహోరీగా పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీల యొక్క వాస్తవాల ని గ్గు తేల్చాలి ప్రస్తుత అవసరమేమిటి? ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సంక్షోభాన్ని పరిష్కరించుకోవడం ఎలా? ఈ సంక్షోభానికి ఎవరు కారకులు? దీనికి ఆజ్యం పోస్తున్నది ఎవరు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏమిటి? అన్ని అంశాల పైన విధానపరమైన ప్రకటనలు వచ్చేంతవరకు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజానీకం, యువత, మేధావులు, బుద్ధి జీవులు, ఓటర్లు పోరాటానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచి, ఉద్యోగాలను బలోపేతం చేసి, పేదరికంని నిర్మూలించి, విద్య వైద్యం సామాజిక న్యాయాన్ని ఉచితంగా అందించవలసినటువంటి అవసరం ఈనాడు రాష్ట్రంలో ఉంది .ఆ వైపుగా ప్రభుత్వాన్ని కదిలించాలంటే ఆ సమస్యలను పరిష్కరించాలంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును ప్రకటించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది పార్లమెంటు ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ అధికార పార్టీకి ఇచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వం కచ్చితంగా నిలబడుతుంది ప్రతిపక్షాల శాపనార్థాలను బెదిరింపులను తిప్పికొడుతుంది. ఆ వైపుగా నిర్ణయం తీసుకోవాల్సిన చారిత్రక అవసరం రాష్ట్ర ప్రజలకు ఓటర్ల పైన ఉన్నది. అయితే ఇది కాంగ్రెస్ పార్టీని గుడ్డిగా నమ్మడం మాత్రం కాదు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా విభిన్న వర్గాల పైన ఉన్నది కనుక ఆ సామాజిక బాధ్యతను మోయడానికి మాత్రమే ప్రస్తుతము ప్రభుత్వాన్ని పది కాలాలపాటు నిలుపుకోవాల్సిన చర్చ సాగుతున్నది ఎన్నికల వేళ.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)