ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంతోపాటు పునర్వినియోగపు అవకాశాలను పరిశీలించాలి
జీవరాశిపై దాని ప్రభావాన్ని ప్రపంచ స్థాయిలో సుదీర్ఘంగా చర్చించాలి.* మనసుంటే మార్గం ఉంటుంది,
మానవ అవసరాలను తీర్చగల పద్దతిలో ప్రజలు,ప్రభుత్వాలు మరింత దృష్టి సారించాలి.
---వడ్డేపల్లి మల్లేశం
నిత్యజీవితంలో భాగమైన ప్లాస్టిక్ వినియోగము, తద్వారా వ్యర్ధాలు భూమి జలవనరుల్లో చేరడంతో కాలుష్యం బారిన పడి వాటిని ఆహారమని భ్రమించి తిన్న జలచరాలు, పశువులు, పక్షులు, జీవరాశులు అదే సందర్భంలో ప్లాస్టిక్ బాటిల్లు ఇతర కవర్ల వాడకంతో మానవజాతీ మృత్యు బారిన పడుతున్న విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయినప్పటికీ ప్రపంచ దేశాలు తీసుకోవలసిన స్థాయిలో శ్రద్ధ చేపట్టకపోవడం
ప్రపంచాన్ని వనికిస్తున్నది . ఉత్పత్తి, వినియోగం అతిగా పెరిగి ప్లాస్టిక్ వ్యర్థాలలో కేవలం 10 శాతం మాత్రమే పునర్వినియోగంలోకి వస్తుండడంతో మిగతా 90 శాతం పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుండడం మానవ మనుగడకు పెద్ద ప్రమాదంగా పరిణమించినది. భారతదేశంలో ప్రతి సంవత్సరం 34 లక్షల టన్నుల ప్లాస్టిక్ సామాగ్రి ఉత్పత్తి అవుతుంటే కేవలం 30 శాతం మాత్రమే పునర్వినియోగానికి నోచుకుంటున్నట్లు మిగతా 70 శాతం పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి . నిర్దిష్ట ప్రమాణాలకు లేనటువంటి వాటిని అతిగా వినియోగించడం వలన కూడా పెద్ద చిక్కు వచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు . వినియోగం తర్వాత విచ్చలవిడిగా పడేయడంతో ముఖ్యంగా డ్రైనేజీలలో అడ్డుపడి వరద సమస్య తలెత్తుతుంటే , పశువులు ఇతర ప్రాణులు ఆహారమని భ్రమించి తినడంతో మృత్యువాత పడుతున్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు .
మరిన్ని వివరాలలోకి వెళితే :-
జీవితంలో భాగమై పోయిన ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతోపాటు దానికి బదులుగా ప్రత్యామ్నాయ విధానాలను కూడా రూపొందించుకోవలసిన అవసరం ఉంది. అంతేకాదు "ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి తద్వారా జరిగే పరిణామాలను అడ్డుకోవాలి*" అనే స్పృహ మానవాళికి ఉన్నప్పుడు మాత్రమే అతి పెద్ద ప్రమాదం నుండి బయటపడగలము. ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాలు సముద్ర ప్రాంతాలలో మరణిస్తున్న పక్షులు, చేపలు, జంతువులు, జీవరాశి శరీరాలను పరిశీలించిన వైద్య నిపుణులు వాటి పొట్టలో ప్లాస్టిక్ అవశేషాలు కనిపించినట్లు ప్లాస్టిక్ ముక్కలను ఆహారమనీ భ్రమించి అవి మింగినట్లు రేణువులు జీవరాశి జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి మృతికి కారణం అవుతున్నట్లుగా మేధావులు నిర్ధారించారు. మానవ మునగడకు ఆధార భూతమైనటువంటి పక్షులు, ఆవులు, చేపలు, థి మింగళాలు ఇతర జంతువులు, పాడి పశువులు ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వలన ఒక్కొక్క జంతువులలో సుమారుగా 300 వరకు ప్లాస్టిక్ కవర్ల ము క్కలు ఉన్నట్లు గుర్తించి నిర్గాంత పోయిన చరిత్ర ప్లాస్టిక్ కు ఉన్నదంటే అతిషయొక్తి కాదు. ప్లాస్టిక్ ద్వారా జీవరాశి చనిపోయే ఈ స్థితినీ ప్లాస్టిక్ కోసిస్ అని నిర్ధారించిన శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని తరచుగా చేస్తున్న హెచ్చరికలను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలన్నింటికీ తగు ఆదేశాలు జారీ చేయడం ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్తో వనగూరుతున్న కాలుష్యాన్ని నివారించడానికి వచ్చే సంవత్సరంలోగా ఒప్పందాలు కుదుర్చుకోవడంతోపాటు పటిష్టంగా అమలు చేయడానికి 170 దేశాలు గతంలో ఒప్పందాలకు నిర్ణయించిన విషయం ఆచరణలో మరిచిపోకే పోతే మంచిది.
పరిణామాలను హెచ్చరికగా భావించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి:-
సాధారణ వినియోగంతో పాటు, పర్యటనలు, యాత్రలు, దేవస్థానాలు,విందులు,శుభ,అశుభ, ఇతర సందర్భాలలో ప్లాస్టిక్ వినియోగం మరింత ఎక్కువ కావడంతో భారతదేశంలోని గంగా, కావేరీ, యమునా, పెన్నా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి అనేక జీవనదులలో టన్నుల కొద్ది ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకు పోతుండడం పైన పర్యావరణ ప్రేమికులు అనాదిగా ఆవేదన వ్యక్తం చేస్తూ హె చ్చరిస్తున్న విషయం తెలిసిందే. మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు ప్రజలు ప్రభుత్వాలు పట్టుదలతో సమాంతరంగా దృష్టి సారిస్తే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయుక్తంగా ప్రత్యామ్నాయ అవసరాల కోసం వినియోగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఉక్కు ఇతర పరిశ్రమలలో బొగ్గుకు బదులుగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించవచ్చునని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. రసాయన ఎరువుల మూలంగా భూమి, జలం, వాతావరణం నిరంతరం కాలుష్యం అవుతు భూసారం తగ్గి దిగుబడి తగ్గిపోతున్న వేళ ప్లాస్టిక్ వ్యర్థాలతో జీవ ఎరువులను తయారు చేయవచ్చునని తెలుస్తున్నది .ముంబాయి వంటి కొన్ని పట్టణాలలో తడి చెత్త పొడి చెత్త లను వేరుచేసి చెత్తలో అంతర్గతంగా ఉన్నటువంటి మెగ్నీషియం, జింక్, క్యాల్షియం వంటి ఎన్నో రకాల ఖనిజ ధాతువుల సహాయంతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నట్టు తెలుస్తున్నది . కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ హరిత ట్రిబ్యునల్ చొరవ మార్గదర్శకాల మేరకు ఈ రకమైనటువంటి ఎరువులను భారీగా తయారు చేయడం ద్వారా జీవరాశి ప్రమాదాల బారిన పడే దుస్థితి నుండి అడ్డుకోవచ్చు. ప్లాస్టిక్ వినియోగించగానే వాటి వ్యర్థాలతో పునర్వినియోగానికి సంబంధించినటువంటి శాస్త్రీయ అవకాశాలను పాలకులు చట్టబద్ధం చేయడం కట్టడిగా వినియోగించడంతోపాటు ప్లాస్టిక్ అతి వినియోగాన్ని తగ్గించే క్రమంలో ప్రజలు కూడా జనుము, కాటన్ వంటి ప్రత్యామ్నాయ సంచులను వినియోగించడంతోపాటు కవర్లు బాటిళ్లకు బదులుగా మట్టి పాత్రలు పేపర్ వస్తువులను వినియోగించే అవకాశం ఎక్కువగా ఉన్నది . యాంత్రికరణ పెరిగిన తర్వాత రెండు మూడు దశాబ్దాలుగా కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పెట్టుబడిదారుల లాభం కోసం అతిగా ఉత్పత్తి చేస్తూ జనం వినియోగంలోకి తెచ్చినటువంటి ప్లాస్టిక్ పెను భూతాన్ని ప్రత్యామ్నాయ విధానాల ద్వారా ప్రభుత్వ చర్యల ద్వారా తిరిగి తరిమికొట్టవలసిన అవసరం మనందరి పైన ఉన్నది. ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మిస్తున్నట్లు, టైల్స్ తయారు చేస్తున్నట్లు తెలుస్తున్నది. శాస్త్రవేత్తలు మరింతగా దృష్టి పెట్టి పరిశోధనలు చేస్తే ఆ పరిశోధనలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తే ప్రత్యామ్నాయ వాడకాలు అవకాశాలను మరిన్ని కనిపెట్టే వీలున్నది. ఇది పాలకుల, ప్రజల నిబద్ధత అంకిత భావం కాలుష్య నివారణ పై గల శ్రద్ధ పై ఆధారపడి ఉంటుంది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయి తల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)