ఒత్తిళ్లు, మానసిక సంఘర్షణ, మితిమీరిన స్వేచ్ఛను కోరుకోవడం

  వివాహ బంధాలు విడిపోవడానికి కారణాలు .

Jun 23, 2024 - 14:37
Jun 23, 2024 - 19:06
 0  31

పరస్పర అంగీకారం, విశ్వాసం  బలహీన పడుతుంటే  విడాకులు కాక మరేమవుతాయి?

సామాజిక విలువలు పాటించకపోవడం  వ్యక్తి స్వేచ్ఛ  

టీవీ సీరియల్ ప్రసారాలు  మరింతగా రెచ్చగొడుతున్నాయంటే  అతిశయోక్తి కాదు .

-----  వడ్డేపల్లి మల్లేశం

మానవ బంధాలు కుటుంబ సంబంధాలను శాశ్వతం చేసి జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని విలువలను అందించి రేపటి తరానికి వారసులను తీర్చిదిద్దే క్రమంలో బలమైనటువంటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ దానికి భార్యాభర్తల బంధం స్థిరమైన ప్రాతిపదిక.  ఇప్పటివరకు ప్రపంచంలోనే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నదని గొప్పగా చెప్పుకునే అవకాశం ఉండే కానీ ఇటీవల కొన్ని గణాంకాలను పరిశీలిస్తే  పాశ్చాత్య దేశాలతో పాటు మనదేశంలో కూడా స్వేచ్ఛ ఎక్కువై, ఆధునిక పోకడలు ,టీవీ ప్రసారాల ముసుగులో  విడాకులు గణనీయంగా పెరుగుతున్నట్లు  తెలిస్తే ఆందోళన కలగక మానదు .  భిన్నాభిప్రాయాలను  పరస్పర అంగీకారంతో పరిష్కరించే ప్రయత్నాలు చేయకపోగా  పంతాలు పట్టింపులతో కోర్టు మెట్లు ఎక్కడo  విడాకులకు తొలిమెట్టుగా భావించవచ్చు.  

వివాహ వ్యవస్థ కుటుంబ సంబంధాలు మారుతున్న ఆర్థిక నేపథ్యంలో ఒత్తిళ్లకు గురి కావడం,  సామాజిక  వ్యక్తిగత భావాలు సంఘర్షణకు గురి కావడం వంటి కారణాలు విడాకుల అభిప్రాయాన్ని గననీయంగా పెంచడంతోపాటు  కోర్టులలో లక్షలాది కేసులు పేరుకు పోవడానికీ  ఒంటరిగా బతకగలమని దుర్మార్గపు ఆలోచన కలగడానికి కారణం అవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు . ఎంతో ఆర్భాటంగా  జరుగుతున్నటువంటి పెళ్లిళ్ల తంతు ఏడాది రెండేళ్లకే  ఆసక్తి తగ్గిపోవడం స్వేచ్ఛ స్వాతంత్రాలు పెరిగిపోవడం విడిపోవాలని ఒంటరిగా జీవించాలని దురభిప్రాయానికి రావడం వంటి కారణాల వలన  పెళ్లయిన ఏడాది రెండేళ్లకే జంటలు విడిపోతుంటే  దాని పర్యవసానంగా మహారాష్ట్రలో అత్యధికంగా 18.7% తర్వాత స్థానాల్లో కర్ణాటక, యుపి  కొనసాగుతూ ఉంటే 6.7%తో  తెలంగాణలో విడాకుల పర్వాలు ఆందోళన కలిగిస్తుంటే కుటుంబ సభ్యులకు  తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నాయి .ఈ క్రమంలో పెళ్లయిన జంటలు   పంతాలు పట్టింపులతో ఉంటే వాళ్ల వారసులకు కూడా  ఆ దుర్మార్గపు వారసత్వాన్ని అందించరని గ్యారెంటీ ఏమిటి?

పెళ్లంటే నూరేళ్ల పంట అని  అర్థవంతమైన ఆలోచనలు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించడం ద్వారా సమైక్య జీవనం గడిపి తమ వారసులను ఈ వ్యవస్థకు అందించడం ద్వారా జీవితానికి సార్థకం చేసుకోవాలనే పవిత్ర  లక్ష్యంతో ఏర్పడిన కుటుంబ వ్యవస్థ  ప్రస్తుతము ఏ మార్గము గమ్యము లేక కొట్టుమిట్టాడుతూ ఉంటే  టీవీ ప్రసారాలు ఇతర సామాజిక మాధ్యమాల విస్తృత ప్రదర్శనలు ఆలోచనలు  ఏవగింపు కలిగించే దుష్టశక్తుల కారణంగా  కలిసి ఉండే బదులు విడిపోవడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితులను మనం బాగా గమనించవచ్చు . క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు, మత్తు పానీయాలు మాదకద్రవ్యాలు  వంటివి కూడా మనుషులను ఆగం చేస్తూ వర్గ సంఘర్షణకు గురి చేస్తూ అనారోగ్యం పాలు చేస్తూ  అనివార్యమైన పరిస్థితులలో ఇక కలిసి ఉండలేము అనే ఆలోచనకు తొందరలోనే రావడం దాని పర్యవసానంగా విడిపోవడమే ప్రత్యామ్నాయ మార్గమని కోర్టులోకి వెళ్లడం ద్వారా  లక్షలాది కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తున్నది.

విడాకులు పెరగడానికి  నిపుణులు సూచిస్తున్న కారణాలు:-

కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందులు, భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన సమాచార భావ ప్రసారం లేకపోవడం,  బావో ద్వేగాలకు గురికావడం,  ఒకరి పట్ల మరొకరికి విశ్వాసం సన్నగిల్లి దురభిప్రాయం కలగడం, అసంతృప్తి, అభద్రతాభావము,  ఆత్మ న్యూనతకు గురికావడం కూడా విడాకులు కోరుకోవడానికి ప్రధానమవుతున్నట్టు తెలుస్తుంది. భిన్నమైనటువంటి కుటుంబ నేపథ్యాలు కలిగిన వ్యక్తుల మధ్యన  బంధాలు విలువలలో  చాలా తేడా ఉండడం,  స్వతంత్రంగా జీవించాలనే తపన ఎక్కువ కావడం, ఇటీవల ఉద్యోగాలు ప్రధానమవుతున్న సందర్భంలో పనిచేసే ప్రాంతాలు సుదూరంలో ఉండడం,  అంతరాలు పెరిగిపోవడం, సమయంలో తేడా ఉండడం మద్యపానము ధూమపానము మత్తు పానీయాలకు కుటుంబ సభ్యులు అలవాటు పడటం వంటి కారణాలు కూడా  ప్రత్యక్షంగా పరోక్షంగా విడాకులకు  దారితీస్తున్నట్టు తెలుస్తున్నది .

కొన్ని గణాంకాల ప్రకారం 2022 నాటికి దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టులోను  ఇతరత్రా నమోదైన కేసుల ప్రకారంగా 11.4 లక్షల విడాకుల కేసులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్లోని ఒక్క ఇండోర్ ఫ్యామిలీ కోర్టులోనే 8,400 కేసులు పెండింగ్లో ఉండగా 5,500 విడాకుల కోసం వస్తే  ఇందులో 3000 కేసులు పెళ్లైన ఏడాదిలోపు నమోదైనవే అని తెలుస్తుంది . "అక్షరాస్యతకు  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సాంకేతికతకు విడాకులకు ఎలాంటి సంబంధం లేదని అనేక ఉదాహరణలు ద్వారా తెలుస్తుంది ." అత్యధిక అక్షరాశ్యత ఉన్న కేరళలో గత పది ఏళ్లలో విడాకులు 350 శాతం పెరిగినాయంటే  అర్థం చేసుకోవచ్చు.  ఇక ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలోనే విడాకుల సంఖ్య  గణనీయంగా ఉన్నట్లు  పంజాబ్ ,హర్యానా, ఢిల్లీ , ముంబై, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరా లలో విడాకుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తూ ఉంటే  ఆర్థికపరమైన కారణాలే కాకుండా వ్యక్తి స్వేచ్ఛ ఆధునిక  స్వతంత్ర పోకడలు కూడా ప్రధాన కారణం అని చెప్పక తప్పదు.

మానసిక నిపుణులు సూచిస్తున్న కొన్ని పరిష్కారాలు:-

కుటుంబ బంధాల పట్ల సరైన అవగాహనను కల్పించడం,  ముఖ్యంగా తల్లిదండ్రులు జోక్యం చేసుకోకుండా ఉండడం,  పరస్పర బంధాల మధ్యన భిన్నాభిప్రాయాలను  అనుమానాలను రేకెత్తించకుండా  వ్యవస్థ పనిచేయడం,  పరస్పరం తప్పులను ఎత్తిచూపకుండా గత లోపాలను  ప్రస్తావించకుండా  ఉండడం చాలా అవసరం అని సూచిస్తున్నారు.  అకారణంగా కుటుంబ సభ్యులు తోబుట్టువుల  జోక్యం వల్ల కూడా వీటి సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తున్నది .  ఇప్పటికీ పాత సంప్రదాయ పద్ధతులలోనే ఆలుమగల బంధాలు ఉండాలని పెద్దవాళ్లు కోరుకోవడాన్ని నిరసించవలసిన అవసరం ఉంది . జీవితం యొక్క మాధుర్యాన్ని విశాల అర్థాన్ని గుర్తించి పరస్పరం అర్థం చేసుకోవాలని,  మేము ఏ విషయంలో తక్కువ కాదు అనే భావన అమ్మాయిల్లో కలిగినప్పుడు దానిని అబ్బాయిలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా విడాకుల వరకు రాకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉద్యోగాలు చేయవలసిన రావడం , ఉమ్మడి వ్యవస్థతోపాటు, అలసట, చికాకులు కూడా  విడాకులకు రెచ్చగొడుతున్న సందర్భంలో సాధ్యనంతవరకు జీవిత మాధుర్యాన్ని ప్రధానంగా చేసుకొని ఇద్దరూ ఉద్యోగాలకు కాకుండా ఒకరు పరిమితం చేసుకోవడం ద్వారా పరిష్కారాన్ని చూపవచ్చు. ఆధునిక కాలంలో సంపాదనకు  అలవాటు పడుతున్నటువంటి యువత  ఇద్దరూ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ వెనువెంటనే అలసిపోయి రెచ్చిపోయి  పని భారం ఒత్తిడి పెరగడంతో కూడా  విసుగుదల విడాకులకు దారితీస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో  వివాహ వ్యవస్థలో కూడా ప్రధానమైనటువంటి లోపం ఉన్నట్లుగా గుర్తించాలి. ఆర్థికపరమైన బంధాలు మాత్రమే   జీవితం అనుకోవడం కూడా విడాకులకు ప్రధాన కారణమని గుర్తిస్తే ప్రేమానురాగాలతో  "అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం" అనే భావనను విశ్వవ్యాప్తం చేయడానికి అవకాశం ఉంటుంది . అతిగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఊహించి  ఊహల్లో తేలిపోవడం కూడా ప్రధాన కారణంగా భావించినప్పుడు  ఆ వైపుగా దృష్టి సారించకుండా ఉంటే  విడాకుల వరకు రాకుండా ప్రేమానురాగాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది.   భార్యాభర్తల బంధాలు సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలు బలోపేతంగా ఉండడానికి  మానవ సమాజం మరింత బలవంతoగా నిర్మాణం కావడానికి ఆస్కారం ఉంటుంది.

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333