కేంద్రంలో ప్రతిపక్షాలకు  కనీస ఉమ్మడి కార్యక్రమం అవసరం

Apr 7, 2024 - 18:56
 0  1

అధికారానికి రావాలన్నా , నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించాలన్న  ఉమ్మడి ఎజెండాలోని ప్రజా ఆకాంక్షలే కీలకం .

సీట్ల సర్దుబాటు తోనే కాలయాపన చేస్తే  బిజెపిని అడ్డుకోలేరు.

  ప్రజలు ఆశిస్తున్న ప్రజా పాలన నేతి బీరకాయలోని నెయ్యి చందo కాకూడదు.

--వడ్డేపల్లి మల్లేశం .

ప్రజాస్వామిక వ్యవస్థలో మనుగడ కొనసాగిస్తున్న ఏ రాజకీయ పార్టీకైనా లక్ష్యాలు, ఆదర్శాలు, ప్రజాకోణం తప్పనిసరి . ఇక అధికారానికి ఆ మడ దూరంలో ప్రతిపక్షంలో కొనసాగుతూ  బలహీన మైన చిన్న రాజకీయ పార్టీలు ఉమ్మడి లక్ష్యంతో ప్రభుత్వాన్ని  గద్దె దించాలని పాలన కొనసాగించాలని ఆశిస్తున్న తరుణంలో  కనీస ఉమ్మడి ప్రణాళిక కీలకమైనదిగా భావించాలి.  చిన్నాచితకా పార్టీలు 28 కలిసి ఇండియా కూటమి పేరుతో ఏర్పడిన ప్రస్తుత తరుణంలో   ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉమ్మడి ఎజెండాతో పాటు  ప్రణాళికాబద్ధమైన పోరాటాన్ని ప్రభుత్వం పైన కొనసాగిస్తేనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో  గెలుపు అవకాశాలు ఉంటాయి.  ప్రజాస్వామ్య బద్ధమైన సుస్థిర ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే,  ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్న  బలమైన ప్రతిపక్షం లేని కారణంగా 2023 జూన్లో ఇండియా కూటమి పేరుతో  ఏర్పడిన విషయం తెలిసిందే. అయాపార్తీలకు సొంత ఎజెండాతో పాటు ఉమ్మడి ఏజెండా అనివార్య మైన వేళ  ఒకటి రెండు సార్లు సమావేశమైనా స్తబ్దతకు గురైన ఇండియా కూటమి ఇటీవల డిసెంబర్ 19 2023  జరిగిన సమావేశంలో ప్రధాని అభ్యర్థిత్వము, ఈవీఎంల పనితీరు, సీట్ల సర్దుబాటు పైన మాత్రమే చర్చ జరిగినట్లు తెలుస్తుండగా ముఖ్యమైనటువంటి  ఉమ్మడి ఎజెండా కార్యక్రమం పైన శ్రద్ధ చూపకపోవడాన్ని రాజకీయ విశ్లేషకులు, బుద్ధి జీవులు విమర్శిస్తున్నారు .

ఎజెండా అంశాలు ఇలా ఉంటే బాగుండు':-

  కూటమికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్నప్పటికీ క్రమక్రమంగా రాష్ట్రాలలో  పార్లమెంట్ లోను సీట్ల సంఖ్య తగ్గడంతో పాటు  బలహీనమవుతున్న సందర్భంలో  ఉమ్మడి కార్యాచరణ పైన దృష్టి సారించవలసిన అవసరం ఉంది . బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం  తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం  అత్యంత కీలకమైన అంశం.  రాజ్యాంగబద్ధ సంస్థలను నిర్వీర్యపరిచిన విషయాన్ని,  ఎన్నికల  సంఘం బ్రష్టు పట్టిపోయిన సందర్భాన్ని,  ప్రభుత్వరంగ  సంస్థలను ప్రైవేటుపరం చేసినటువంటి కుటిల రాజకీయాలను,  అలాగే కాంగ్రెస్ హయాములోనే ప్రారంభమైనటువంటి ఉప,దేశ ద్రోహ చట్టాన్ని  రద్దుచేసే ఆలోచన తప్పనిసరి.ప్రభుత్వ  ప్రజా వ్యతిరేక నిర్ణయాలను గతంలో ఇండియా కూటమి వ్యతిరేకించిన నేపథ్యంలో  ఆ అంశాలలోనూ కార్మిక కర్షక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాల పైన  ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఉమ్మడి కార్యాచరణ అవసరం . మత రాజకీయాలతో  ప్రజాపాలన    దెబ్బ తీస్తున్నారనే ఆరోపణ బిజెపి ప్రభుత్వం పైన ఉన్నది.  న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో కూడా పార్లమెంటు జోక్యం చేసుకోవడం,  స్వతంత్ర న్యాయ వ్యవస్థకు భంగం కలిగించే పలు చర్యలు కేంద్రం తీసుకుంటున్నట్లుగా అనేక సార్లు ఆరోపించినటువంటి ఇండియా కూటమి ఆ  అంశాలను తమ అస్త్రం గా వాడుకోవలసినటువంటి అవసరం ఉన్నది.20 24 ఏప్రిల్, మే మాసాలలో జరగనున్నటువంటి పార్లమెంటు ఎన్నికలలో  ప్రభుత్వ  నిర్లక్ష్యం ప్రజావ్యతిరేక విధానాలను పెద్ద మొత్తంలో ప్రచారం చేయడం ద్వారా  అంశాలతో కూడుకున్న ఉమ్మడి ప్రణాళికను   ఇంటింటికి చేర్చడం ద్వారా  దేశ ప్రజలను  సుపరిపాలనలోకి తీసుకు వెళ్లడానికి ఆస్కారం ఉంటుంది.  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని,  ప్రతి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని  చెప్పి విస్మరించిన కేంద్రం  14 లక్షలు బ్యాంకులకు ఎగవేసిన పెట్టుబడిదారులకు  మద్దతివ్వడంలోని ఔచిత్యం ఏమిటో  ఇండియా కూటమి  సీరియస్గా ప్రచారం చేయవలసిన అవసరం ఉన్నది.

ఒక్కసారి గతంలోకి వెళితే:-

మూడున్నర దశాబ్దాలకు పూర్వం లోక్సభలో బిజెపి ఎంపీల సంఖ్య 2 మాత్రమే.  అప్పట్లో అజే య శక్తిగా  కొనసాగిన కాంగ్రెస్ పార్టీ క్రమంగా ప్రజా విశ్వాసాన్ని  కోల్పోవడంతో  2004 2009 ఎన్నికలలో రెండుసార్లు వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ  2014లో  కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని కోల్పోగా  బిజెపి  అత్యధిక సీట్లను సాధించి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటే   2019 ఎన్నికల్లో  ఇంత బలం పుంజు కొని 3o 3 స్థానాలను  సాధించినదంటే కాంగ్రెస్ గానీ మిగతా ప్రతిపక్షాలు గాని సరైన కృషి చేయకపోవడమే కారణం.  ప్రస్తుతం బిజెపి  ఇటీవల ఎన్నికలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్ ,ఛత్తీస్గడ్ తో పాటు  12 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా  మరో 4 చోట్ల సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తున్నది.  అదే సందర్భంలో కాంగ్రెస్  కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉన్నదంటే ఎంత దిగజారిందొ అర్థం చేసుకోవచ్చు.  అయితే ఇటీవల జరిగినటువంటి ఎన్నికలలో  రాజస్థాన్లో 39.53% మధ్యప్రదేశ్లో 40 శాతానికి పైగా ఓట్లను కాంగ్రెస్ సాధించగలిగింది అంటే  ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రజలకు చేరువ కావడం ద్వారా మరిన్ని సీట్లను సాధించడానికి  బలమైన ఎజెండా  పనిచేయవలసిన అవసరం ఉన్నది అని తేలి పోతున్నది.
        సీట్ల సర్దుబాటు  దగ్గరనే  సమయం అంతా గడిచిపోతే , బలమైన ఎజెండా ప్రజల దృష్టికి వెళ్లకపోతే  సర్దుబాటు విషయంలో సమస్యలు తలెత్తితే,  
ప్రజలు ఈ అతుకుల కూటమికి  మద్దతు ఇస్తారో లేదో  పెద్ద ప్రమాదం మాత్రం ముందు కనిపిస్తున్నది.  ఏది ఏమైనా ఈ దేశంలో గత రెండు  సార్లు బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం కొనసాగించిన పాలనా విధానం  ప ట్ల ప్రజలు ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిర్బంధం అణచివేత  పేరుతో అప్రజాస్వామిక  ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నట్లు  వ్యక్తమవుతున్న వేళ  కా రు చీకట్లో కాంతిరేఖ లాగా ఇండియా కూటమి తమదైన శైలిలో పనిచేయాలి.  ప్రజల సమస్యలను ఎజెండాగా ఎంపిక చేసి  ప్రజలకు చేరువ కావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు ఇప్పటినుండి ప్రారంభించక పోతే  ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి అయినా మరోసారి గెలవడానికి  ప్రస్తుత ప్రభుత్వం అడుగులు  వేస్తుందని తెలుసుకుంటే మంచిది.  ఇది అధికార ప్రతిపక్షాలకు సంబంధించిన అంశం కాదు  ప్రజల జీవితాలతో ఆడుకునే చెలగాటం ప్రజలకు ప్రాణ సంకటం కాకూడదు.  అంటే  ప్రతిపక్షాలు క్రియాశీలక పాత్ర పోషించడం ద్వారా మాత్రమే  ప్రజా ఆకాంక్షలను కాపాడే అవకాశం ఉంటుంది. ఆ కోణంలోనైనా ఇండియా కూటమి  బలమైన శక్తిగా ఎదగాలని ఎదుగుతుందని ఆశిద్దాం.  బుద్ధి జీవులు మేధావుల సలహా సూచనలతో  ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే చర్యలకు  ఇప్పటి నుండే శ్రీకారం చుడితే సాధ్యమవుతుంది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు  దీని ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్( చౌటపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333