వరద బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకొని  భవిష్యత్తు కార్యాచరణ    ప్రకటించాలి

Sep 13, 2024 - 09:03
Sep 25, 2024 - 17:14
 0  2

హైడ్రా  వంటి కార్యక్రమాలను ప్రాంతాలకు అతీతంగా  ఆక్రమణల తొలగించడానికి దేశమంతటా   చేపట్టాలి.

కాలువలు ప్రాజెక్టులు చెక్ డ్యాములు  రోడ్ల పై  దృష్టి సారించి నష్టనివారణ చర్యలు పాలకులు చేపట్టాలి.

--వడ్డేపల్లి మల్లేశం 

అల్పపీడనం ఏర్పడి వాయుగుండం గా మారిన ప్రతి  సారీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు  జరుగుతున్న  ప్రాణ,  ఆస్తి,   పంట నష్టముతో పాటు అనేక కాలువలు ప్రాజెక్టులు చెక్ డ్యామ్లకు కూడా  నష్టము జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వాలు సీరియస్గా పట్టించుకోవాలి . అక్కడక్కడ  పేదల  ఇండ్లు  కొట్టుకుపోవడమే కాకుండా  ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు  వరదల్లో కొట్టుకుపోవడాన్ని గమనించినప్పుడు పక్కా ఇండ్ల నిర్మాణానికి బృహత్ ప్రణాళిక చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అని అర్థమవుతున్నది.  ప్రభుత్వ సహకారం అందక   అరకొరగా ఉన్న ఇంటి స్థలంలో ఆర్థిక భారం కారణంగా  నాలుగు రేకులు వేసుకుని తాత్కాలికంగా నివాసం ఏర్పరచుకుంటున్న వాళ్ళు  గుడిసెలు ఇతరత్రా  సౌకర్యాలు కల్పించుకుంటూ  పొట్ట పోసుకుంటున్న కుటుంబాలు అనేకం.  ముఖ్యంగా  గోదావరి కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి లంక గ్రామాల దుస్థితిని గనుక గమనించినప్పుడు  ఆందోళనకరంగా ఉంటుంది . ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనించినప్పుడు పట్టణాలతోపాటు గ్రామాలలోనూ ముంపు గ్రామాలలోనూ
 పడవలలో ప్రయాణం చేయవలసిన పరిస్థితులు ఒకవైపు ఉంటే  మరొకవైపు గుక్కెడు మంచినీళ్లకు నోచుకోక  అందని ఆహార పొట్లాల కోసం    అర్రులు చాచి  దీ నంగా బతకాల్సినటువంటి గడ్డు పరిస్థితులు  పేదలతో పాటు  మధ్యతరగతి కుటుంబాలకు కూడా తప్పడం లేదు. అనేక ప్రాంతాల్లో ఇండ్లపైకి ఎక్కి  తలదాచుకున్న వాళ్లు , వ్యవసాయ బావుల దగ్గర రైతులు, పశువుల కాపర్లు,కూలీలు,ఎందరో  వరద బీభత్సంలో కొట్టుకుపోతుంటే మరికొన్ని ప్రాంతాలలో  ప్రాణ నష్టం ఆస్తి నష్టం తో పాటు  ఇంట్లోనే వస్తువులు ఆహార పదార్థాలు  తడిసి ముద్దయి  నీటిలో కొట్టుకుపోతుంటే  ఇబ్బందులు పడుతున్న ప్రజల బాధ వర్ణనాతీతం.
        కష్టమైనా కఠిన చర్యల తోనే పరిష్కారం  :-
*********
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాలలో  కుంటలు చెరువులు, ఆక్రమణలకు గురై  వరద నీరు దారి మళ్లించబడుతున్న సందర్భంలో అనివార్యంగా  నివాస ప్రాంతాలలోకి వరద చేరి ముంపు ప్రాంతా  లుగా మిగిలిపోతూ దయనీయ పరిస్థితులు  ఏర్పడడాన్ని వరదల సందర్భంలో మనం చూస్తున్నాం  .ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1  మూడు రోజులుగా కురుస్తున్నటువంటి  భారీ వర్షాలకు ఎనలేని  నష్టాన్ని చవిచూడవలసి వచ్చింది. ఒకవైపు ప్రభుత్వా  ప్రభుత్వాల యొక్క  తోడ్పాటు కృషి అధికారుల యొక్క  తీరికలేని పని పరిస్థితులను గమనించవచ్చు  .అంతే స్థాయిలో ప్రజాప్రతినిధులు కూడా  ముంపు ప్రాంతాలలో పర్యటించి  సరైన సూచనలతో ప్రజలకు భరోసా ఇస్తున్న సన్నివేశాలు అనేకం.జరగుతున్న నష్టం అపారం,మన కృషి సరిపోని పరిస్థితి.మరొకవైపు ప్రకృతితో పోరాటం..... అవసరమైన చోట లక్షల ప్యాకెట్ల ఆహార పదార్థాలను  తయారుచేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లుగా మనం వార్తల్లో చూస్తున్నాం. అయితే  ఈ దుర్భర పరిస్థితులకు ప్రధానమైనటువంటి కారణాలను కనుక అన్వేషిస్తే ఇటీవల కాలంలో హైదరాబాదులో జరుగుతున్నటువంటి   కుంటలు చెరువులోని ఆక్రమణల తొలగింపు కార్యక్రమం  సందర్భోచితం , పరిష్కారమని కొంత ఆలస్యంగానైనా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో  నిబద్ధతగా కట్టుదిట్టంగా  రాజకీయాలకు పార్టీలకు అతీతంగా నిర్వహించవలసిన అవసరం ఎంతో ఉన్నది .తద్వారా  ప్రస్తుతము కొంత ఇబ్బంది లేదా ఘర్షణ వైఖరి తలెత్తినప్పటికీ శాశ్వతంగా వరద ముప్పును తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అనేక ప్రాజెక్టులు కాలువలు  చెక్ డ్యాములు కుంటలు  రోడ్లను తెగిపోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. " ప్రకృతిని ఆపడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా  ప్రకృతి ప్రకోపిస్తే దాని పర్యవసానాన్ని మనం అనుభవించక తప్పదు అనే ప్రకృతి సూత్రాన్ని  ప్రభుత్వాలు ముందుగా ఆకలింపు చేసుకొని  ఆక్రమణకు గురైనటువంటి ప్రాంతాలను నిర్ధారించి  వాటి నిర్మూలన ద్వారా  తిరిగి మామూలు పరిస్థితులను కొంతవరకైనా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చట్టబద్ధంగా ఆ సంస్థలను నెలకొల్పి  వరద ముప్పును తప్పించి  ప్రజలకు మేలు చేయవలసినటువంటి బాధ్యత సత్తా పాలకులదే ." ప్రస్తుతం హైదరాబాదులో హైడ్రా పేరుతో కొనసాగుతున్నటువంటి ఈ చర్యలను  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ గ్రామీణ ప్రాంతాల వరకు కూడా విస్తరించడం ద్వారా  ప్రస్తుత  వాయుగుండం కారణంగా రెండు రాష్ట్రాలు ఏ నలేని నష్టాన్ని చవిచూడవలసి వస్తున్న నేపథ్యంలో కొంతవరకైనా  రక్షించుకోవడానికి అవకాశం ఉన్నది.  ఇదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు  ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడం కూడా చాలా అవసరం . ఒక విప్లవాత్మక కార్యక్రమం తీసుకున్నప్పుడు అది మెజారిటీ ప్రజానీకానికి ఉపయోగపడినప్పుడు  అక్రమార్కులకు వ్యతిరేకమైనప్పటికీ దానిని ప్రోత్సహించే పద్ధతిలో  ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు సహకరించినప్పుడు మాత్రమే  అది సాధ్యమవుతుంది. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలకు అనేక రాజకీయ పార్టీల నుండి మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ  ప్రజా సంఘాలు బుద్ధి జీవులు మేధావులు ఈ చర్యలను సమర్థిస్తున్న విషయాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి .అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొనసాగించడం ద్వారా  వరద ముప్పును తగ్గించుకోవడం  భారీ నష్టాల నుండి కాపాడుకోవడం  ప్రభుత్వ అనవసరపు వ్యయాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది . ఇదే సందర్భంలో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టులు కాలువలు రోడ్లను నాణ్యతగా నిర్మించడానికి ప్రభుత్వాలు పూనుకోవాల్సిన అవసరం ఉంది. అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి భారీ వరదలను కూడా తట్టుకొని నిలవ గలవు  తెలంగాణ రాష్ట్రంలో కాలేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బరాజుల నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి కారణంగా ప్రస్తుతం నీటిని నిలువ చేయలేని పరిస్థితులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే కదా ! మానవ తప్పిదం,  అక్రమార్కుల  ఆక్రమణలు,  ప్రకృతి ప్రకోపం,    కారణాలు ఏవైనా ఇలాంటి ప్రకృతి బీభత్సం సందర్భంగా జరుగుతున్న నష్టాన్ని తగ్గించే ప్రయత్నాలకు
శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు ,విపత్తుల నుండి రక్షించే  దళాలు, ప్రత్యేక  నైపుణ్యం పొందిన వాళ్లు  మరిన్ని చర్యలు తీసుకోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలను  నష్ట నివారణ చర్యలను ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది.  ప్రాంతాలకతీతంగా జరగాల్సినటువంటి ఈ కృషికి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించి రాష్ట్రాలలో సంభవించిన విపత్తుకు తగిన  ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు శాశ్వత ప్రణాళికల రూపకల్పనలో కూడా  దృష్టి సారించినప్పుడు దీర్ఘకాలికంగా ప్రభుత్వాలపైన  అనవసరపు భారం పడదు. ఏ నిర్మాణమైన  ప్రారంభించేముందు దీర్ఘకాలం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని  అవినీతికి అక్రమాలకు  థా వు లేకుండా నిర్మించే చిత్తశుద్ధి గల పాలకులు ఉన్నప్పుడు మాత్రమే  మన ఆలోచనలు అక్షర రూపం తాలుస్తాయి.  వరద బీభత్సములో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సిద్దిపేట తెలంగాణ )  యి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333