సామాజిక చైతన్యమే ప్రభుత్వ లక్ష్యం కావాలి ..
మానవ పౌర హక్కులు, ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటే ప్రభుత్వ పరువు మరింత పెరుగుతుంది...
సాంస్కృతిక సారథి కళాకారులకు సామాజిక రుగ్మతల నివారణ బాధ్యతలు అప్పగించడమే పరిష్కారం.
---వడ్డేపల్లి మల్లేశం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలనలో అధికార మార్పిడి తప్ప సాధించినది ఏమీ లేదని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. .ఇందులో సామాన్యుల నుండి తెలంగాణ ఉద్యమకారుల వరకు ఈ ధోరణి కనబరచడాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది .అదే సందర్భంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేయడం కూడా మూర్ఖత్వమే. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల సమయంలో తక్షణ పరిష్కారానికి హామీ ఇవ్వడం కూడా తొందరపాటు చర్య అనక తప్పదు . .ఒకవైపు గత ప్రభుత్వము రాష్ట్రాన్ని లూటీ చేసి 7 లక్షల కోట్ల రూపాయల అప్పును చేసి పోయిన విషయం శ్వేత పత్రాల ద్వారా తెలుస్తున్నది . అంతేకాదు వివిధ పద్దుల కింద చెల్లించవలసిన సుమారు 64 వేల కోట్ల రూపాయలు బకాయి పెట్టి పరిపాలన గొప్పగా చేసినట్లు చెప్పుకున్న విషయాన్ని బయట పెట్టడం కూడా జరిగింది. ఇదంతా రేపు చేయబోయే పరిపాలనకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి వాస్తవాలను ప్రజలకు విప్పి చెప్పాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో జరిగిన ప్రక్రియగా భావించాలి. సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు అనేక సందర్భాలలో ప్రస్తుత ప్రభుత్వానికి హెచ్చరికగా" ఉన్న విషయాన్ని ప్రజా దృష్టికి తీసుకువెళ్లాలి, గత ప్రభుత్వ లోపాలను బయటపెట్టాలి , ప్రజలతో మమేకమై వాస్తవాలను విప్పి చెప్పడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందవచ్చు." అని చేసిన సూచన కూడా ప్రభుత్వానికి చాలా తోడ్పడుతుంది . అధికారాన్ని కోల్పోయిన అక్కసుతో ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ, తమ ఎదుగుదలకు ఆటంకం అని భావిస్తున్న బిజెపి ముఖ్యంగా ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ ఎక్కడికక్కడ విమర్శించడం ప్రజా పరిపాలనలో అంత మంచి సంప్రదాయం కాదు. టిఆర్ఎస్ పరిపాలన కొత్తలో కనీసం నాలుగు సంవత్సరాల పాటు ఎవ్వరు కూడా జోలికి వెళ్లలేదు ఆ తర్వాతనే ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు, మేధావులు విమర్శించడం ప్రశ్నించడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇంత గందరగోల పూరిత వాతావరణంలో అధికారానికి వచ్చిన ప్రభుత్వం తక్షణ అమలుకు హామీలు ఇవ్వవచ్చు కానీ పరిష్కారం చేయడానికి కొంత సమయం పడుతుంది అనే ఇంగిత జ్ఞానం విమర్శించే వాళ్లకు లేకపోతే ఎలా? .
ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్తవారితో నిర్మాణం చేసి కార్యక్రమాలను కొనసాగించడం, వివిధ కుల వృత్తులకు సంబంధించి కార్పొరేషన్ల నియామక ప్రక్రియ చేపట్టడం , నర్సులు రెసిడెన్షియల్ పాఠశాల ఉద్యోగులు పోలీసులకు సంబంధించిన సుమారు 30 వేల మందిని భర్తీ చేసినట్టు ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలుస్తున్నది .అదే సందర్భంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టు సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేసే ప్రకటన వెలవడడం వైద్య శాఖలో సుమారు 5000 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలపడం వంటి కార్యక్రమాలు యధావిధిగానే కొనసాగుతున్నాయి. కేవలం రైతుబంధు ఆలస్యమైనదని కళ్యాణ లక్ష్మి అమలు లేదని ప్రాజెక్టులలో నీళ్లు నింపక పంటలు ఎండిపోవడానికి ప్రభుత్వమే కారణమని లేని కరెంటు కోతను సృష్టించి అబూత కల్పనలు కల్పించడాన్నీ ప్రతిపక్షాలు మానుకుంటే మంచిది . ఇటీవల ఆవుల పంపకం, గొర్రెల పo పకం ,చేపల పెంపకం , భూ కబ్జాలు, ఫోన్ టాపింగ్ లో నేరస్తులు వంటి అనేక అవినీతి సంఘటనల పైన ప్రభుత్వం విచారణకు ఆదేశించడం శుభసూచకం . అలాగే విద్యుత్తు అవినీతిపైన కాలేశ్వరం ప్రాజెక్టు నిగ్గు తేల్చడానికి వేర్వేరు విశ్రాంత న్యాయమూర్తులను నియమించి 100 రోజుల్లోనే కొంత ప్రభుత్వ చర్యలను వేగవంతం చేసిన విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు . గత ప్రభుత్వ కాలంలో పదవ తేదీ వరకు కూడా రాని ఉద్యోగుల పెన్షనర్ల వేతనాలు క్రమంగా తొందరగా ఇస్తూ ఇటీవల మార్చి 1వ తేదీన చెల్లించిన విషయాన్ని కూడా మరిచిపోకూడదు.
ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణ,ప్రజా చైతన్యo సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా సాధించాలి:-
***************
ఇక పరిపాలనకు సంబంధించిన ఆచరణ, నిర్బంధము, అణచివేత వంటి విషయాలను గమనించినప్పుడు గత ప్రభుత్వ హయాములో తోటి మంత్రులకు శాసనసభ్యులకు ముఖ్యమంత్రినీ కలిసే అవకాశం లేకపోవడం ప్రజలు రాష్ట్ర బాధ్యులను కలవడానికి అసలే అవకాశం లేకుండా గడీల పరిపాలన కొనసాగిందని అనేకమంది విశ్లేషకులు అప్పట్లో ఇప్పట్లో నిరంతరం విమర్శిస్తూనే ఉన్నారు. కానీ దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరిస్తామని ,పౌర మానవ హక్కులను గౌరవిస్తామని , నిర్బంధం అణచివేత లేనటువంటి వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించడంతోపాటు ఇటీవల పౌర ప్రజాస్వామిక హక్కుల సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్నీ కూడా మనం స్వాగతించాలి . అయితే ఇది ఆచరణలో కొనసాగాలి, మంత్రివర్గం, సిబ్బంది, పోలీసు వ్యవస్థ, అధికారులు ఈ ప్రజా దృక్పథంతో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం ఇవ్వవచ్చు .అయితే గత ప్రభుత్వ కాలం లో సారథి పేరుతో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కళాకారులను సుమారు 550 మందిని ఎంపిక చేసి ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి మాత్రమే వాడుకున్న విధానం మనందరికీ తెలిసిందే. .అయితే ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదుల లక్ష్యం ప్రజా చైతన్యం ద్వారా ఉత్తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశించడం .అదే సందర్భంలో పాలకులు కూడా ప్రజల విశ్వాసాలను పొందాలని పదేపదే ప్రకటనలు ఇవ్వడం ఒకే రకంగా అనిపిస్తుంది. కానీ ప్రజా చైతన్యాన్ని పాలకులు ఎప్పుడూ అడ్డుకుంటూనే ఉన్నారు కానీ దానికి భిన్నంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రభుత్వ హామీ మేరకు సాంస్కృతిక సారథి కళాకారుల సంఖ్యను మరింతగా పెంచి, నిజమైనటువంటి కళాకారులను గుర్తించి ఎంపిక చేయడం ద్వారా కనీసం వెయ్యి మంది పైగా భర్తీ చేసి కనీస వేతన చట్టాన్ని అమలు చేయడం ద్వారా వారికి మేధావులు బుద్ధి జీవులతో ప్రత్యేక శిక్షణ ప్రజా కోణంలో ఇప్పించాలి . సంక్షేమం, అభివృద్ధి ,ప్రజా చైతన్యం , రాజ్యాంగ పలాలు ప్రజలందరికీ అందడం, తమ హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుకోవడమే కదా పరిపాలన అంటే ! ఇదే అంశాల పైన సామాజిక రుగ్మతలు, ప్రజా వెనుకబాటు, అనారోగ్య సమస్యలు,అంతరాలు,వివక్షత, మూఢనమ్మకాలు, విద్యా వైద్యం సామాజిక న్యాయాన్ని ప్రజలకు ఉచితంగా అందించడానికి గల అవకాశాలను తెలియచేసే కళాకారుల కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగాలి. నియోజకవర్గాల, మండలాల వారీగా బృందాలను ఏర్పాటు చేసి ప్రధానమైన సమస్యల పైన అవగాహనతో పాటు స్థానికంగా ఉన్న అంశాల పైన కూడా దృష్టి సారించే విధంగా రాష్ట్రస్థాయి మేధావులు సామాజికవేత్తలు హక్కులు ప్రజా సంఘాల బాధ్యులతోపాటు జిల్లా స్థాయిలో ఉండే మేధావుల సలహాలను కూడా తీసుకొని
ప్రజా ఉద్యమాన్ని ప్రజా చైతన్యాన్ని ప్రజల ఆలోచనల్లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడానికి ఉపయోగించాలి. నిజంగా అప్పుడు మాత్రమే ప్రజాసామిక విలువలను కాపాడినట్లు , పౌర హక్కులు మానవ హక్కులు విప్లవోద్యమాలను పరిరక్షించినట్లు లెక్క .నిజంగా తెలంగాణ ఉద్యమంలో పని చేసినటువంటి ప్రతిభావంతులైన కళాకారులు ఎంతోమంది గుర్తింపుకు నోచుకోకపోగా అనర్హులను అందలం ఎక్కించినట్లు అప్పట్లో అనేక ఆరోపణలు వచ్చినవి. ఆ ఆరోపణకు చెక్ పెట్టే విధంగా సమర్థవంతులైనటువంటి ప్రజా కళాకారులను గుర్తించడం ద్వారా వారికి ఉపాధి కల్పించి ప్రజా చైతన్యానికి ప్రభుత్వమే వినియోగించడం కూడా పరిపాలన విషయంలో ఒక నూతన అధ్యాయానికి నాంది అవుతుంది. అయితే ప్రభుత్వానికి ప్రజా చైతన్యాన్ని తట్టుకునే సహనం , ఆదర్శం , సంస్కారం, పెద్ద మనసు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకు భిన్నంగా సాచివేత వైఖరితో ప్రశ్నించి ప్రతిఘ టించి చైతన్యవంతంగా ముందుకు వెళ్లే ప్రజా సమూహాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగితే మాత్రం ఇచ్చిన హామీ తుంగలో తో క్కి వేయబడినట్లే . అందుకే ఇటీవల పౌర సంఘాల నాయకులు ఒక సూచన చేస్తూ ఆలోచన గొప్పదే., ఆచరించే క్రమములో "పాలకులు తమను సేవకులుగా ప్రజలను నాయకులుగా యజమానులుగా భావించగలిగినట్లయితే నూతన ప్రజాస్వాముక విలువలు అమలవుతాయి" అని చేసిన హెచ్చరిక ప్రజలు ప్రజా సంఘాల చైతన్యాన్ని అంగీకరించడానికి ప్రభుత్వాలు పూనుకుంటే గతంలో కంటే భిన్నమైన పరిపాలనను చూడవచ్చు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే మానవ పౌర హక్కులు ప్రజాస్వామ్య విలువల పునరుద్ధరణ అంతకుమించిన స్థాయిలో ప్రజా జీవితాలను మార్చి వేస్తుంది. ఆ స్పృహ ఉన్న పాలకులు ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడైనా చూరగొoటారు .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)