పరిపాలనలో భిన్నకోణాలు సమన్వయం చేస్తేనే సుపరిపాలన సాధ్యం .
పాలకులు ప్రజల పక్షాన ఆలోచించాలి కానీ మను గడ కోసం,
మెప్పుకోసం మురిసిపోతే పాలన గాడితప్పుతుంది. మానవాభివృద్ధికి ఉపయోగపడే పథకాలు అభివృద్ధికి దిక్సూచి.
ప్రజలు మెచ్చిన పరిపాలన కావాలా? లేక పాలకులకు అనుకూలమైన పరిపాలన ముఖ్యమా? అనే చర్చ దేశవ్యాప్తంగా కీలకమైన సందర్భంలో పాలకులు తమ ఇష్టానుసారంగా పరిపాలించే క్రమములో రాయితీలు, ఉచితాలు, వాగ్దానాలు చేసి తాత్కాలికంగా ప్రలోభ పెట్టే సందర్భంలో కొన్ని వర్గాలు సంతోషపడవచ్చనేమో కానీ ఆ వెనువెంటనే విమర్శ కూడా ఉంటది అన్నది నగ్న సత్యం. "మా కుటుంబాలు గూడు గూడు గుడ్డ లేకుండా, ఉపాధి కాన రాకుండా, ఆదాయ మార్గాలు లేక , చదువు వైద్యానికి సంపాదనలో ముప్పావుల వంతు ఖర్చు చేస్తుంటే ఇదేం ప్రభుత్వం? ఏమి ఆసరా ఉన్నట్లు?" అని ప్రజలు విమర్శిస్తున్న సందర్భాలను కూడా పాలకులు గమనించాలి. ఉచిత బస్సు ప్రయాణం అని, అర్హులకు అకౌంట్లో కొంత మొత్తాన్ని వేస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అని ఒకవైపు ప్రస్తావిస్తూ మరొకవైపు గత పాలనలో రైతుబంధు పేరుతో కోట్ల రూపాయలు సంపన్న వర్గాలకు కట్టబెట్టిన సందర్భాలను కూడా గమనిస్తే ఈ రెండు పద్ధతులు కూడా ప్రజా మోదం కాదు అని అనేకమంది విశ్లేషకులు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానమైనటువంటి రంగాలు విద్యా వైద్యానికి ఆయా కుటుంబాల యొక్క ఆదాయంలో 60 శాతానికి పైగా ఖర్చు అవుతున్నట్లు ఈ రెండు రంగాలను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసి పేదరికాన్ని మరింత పెంచడానికి కారణమవుతున్నట్లు అనేక దృష్టాంతాలు మనకు కనిపిస్తున్నాయి. అనేక కమిషన్ల నివేదికలు విద్యారంగానికి వైద్య రంగానికి బడ్జెట్లో ఎక్కువ మొత్తం కేటాయించాలని , పూర్తిగ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత నాణ్యమైన స్థాయిలో అందించాలని చేసిన సిఫారసులు బుట్టదాఖలైన విషయం తెలిసిందే . ఇప్పటికీ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కానీ, దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు పాలించిన బారాస పార్టీ, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ ఒక్కనాడు ఉచిత విద్య వైద్యం సామాజిక న్యాయం ప్రజలకు అందించడం తప్పనిసరి అది మా బాధ్యత అని చెప్పకపోవడం విడ్డూరము .ఇటీవల ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ లలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పేరుతో కొనసాగిస్తున్న పథకం అనేక విమర్శలకు కారణం కాగా కోటీశ్వరులు, సంపన్న వర్గాలు, ఉద్యోగస్తులు కూడా అత్యంత పేద వాళ్లతో సమానంగా ఈ లబ్ధి పొందడం అనేది సమానత్వానికి సామాజిక న్యాయానికి విరుద్ధమైనది. మహిళలందరికీ ఉచితంగా ప్రయాణం కల్పించడం ద్వారా సాధికారత సాధ్యమని ప్రభుత్వం భావించినప్పటికీ అసమాన తలను మరింత పెంచే విధంగా ఉన్నప్పుడు ఏ రకంగా హేతుబద్ధమవుతుందో ప్రభుత్వం ఆలోచించాలి .
ఆరు గ్యారెంటీలలో మిగతా పథకాలను కూడా తెల్ల రేషన్ కార్డు ఆధారంగా వర్తింప చేస్తామని ఒక ప్రకటన వెలువ డ డం సమయోచితమే. అయితే ప్రతి మహిళ అకౌంట్లో 2500 రూపాయలు వేస్తామని చెప్పడం ద్వారా తాత్కాలిక అవసరాల కోసం ఖర్చులకు ఉపయోగపడవచ్చు కానీ వేలు లక్షలు ఖర్చు చేస్తున్న వైద్యం చదువుల ఫీజుల గురించి పేద వర్గాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది . తాత్కాలిక ఉపశమనాల కంటే గ్రామీణ ప్రాంతాలలో రెండు లక్షల వార్షికాధాయం, పట్టణ ప్రాంతాలలో ఐదు లక్షల వార్షికాదాయంలోపు ఉన్నవారికి ప్రాథమిక నుండి ఉన్నత విద్య వరకు కూడా ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యను అభ్యసిస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలి. మరో రకంగా ఫీజులను నియంత్రణ చేయడం కూడా తప్పనిసరి. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అనే సామెత మాదిరిగా మనిషి యొక్క కనీస అవసరాలను హుందాగా తీర్చుకోగలిగే విధంగా ప్రాథమిక అవసరాలను మౌలిక సౌకర్యాలను సమకూర్చుతూ నే విద్యా వైద్య రంగాల ఖర్చును ప్రభుత్వమే భరించే నూతన ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి అని ప్రజలు కోరుకుంటున్న వేళ భవిష్యత్తులో ప్రజలు అలాంటి ప్రభుత్వాలకి ఓటు వేస్తారని తెలుసుకుంటే మంచిది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులకు కటకట :-
తెలంగాణ రాష్ట్రంలో గత 1o ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనదని ఇటీవల శ్వేత పత్రాల ద్వారా మనకు తెలుస్తుంది. అంతేకాదు పేదరికం, నిరుద్యోగం ఏమాత్రం నిర్మూలించబడకపోగా ఉపాధి అవకాశాలలో శాశ్వతమైన ఉద్యోగ అవకాశాలు ఎo డమావిగా మారిన విషయం తెలిసినదే. యువజన విధానం స్పష్టంగా ప్రకటించని గత ప్రభుత్వాలు మద్యం మత్తు, పబ్బులు, క్లబ్బుల పేరుతో యువతను చిత్తు చేసిన సందర్భాలను గమనిస్తే కేవలం ఆదాయాన్ని పెంచుకోవడానికి చేసినట్లుగా భావించాలి. ఆ పొరపాటును ప్రస్తుతం ప్రభుత్వం సవరించుకుంటే మంచిది . సౌకర్యాలు, ఆదాయాలు కల్పించడం ఎంత ముఖ్యమో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని సాధించడం కూడా ప్రభుత్వానికి అంతే బాధ్యత . ధూమపానం, మద్యపానం, మత్తుపదార్థాలు, కల్తీ ఆహార పదార్థాలు, తినుబండారాలు అన్నీ కూడా జన జీవితాన్ని చిద్రం చేస్తుంటే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోనే పూర్తి చేయాలనే అతి ఉత్సాహంతో నీ ధుల కోసం ఆరాటపడడం అంత ముఖ్యం కాదు. అసలు హామీలను కూడా కొద్ది రోజుల్లోనే అమలు చేస్తామని ప్రజలకు ముందుగా భరోసా ఇవ్వడం కూడా సమంజసం కాదు . అందుకే ఎన్నికైన కొద్ది రోజులకే ప్రమాణస్వీకారం తర్వాత వెంటనే ప్రతిపక్షం హామీలు ఎప్పుడూ అమలు చేస్తారని అడగడాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం మేధావులు బుద్ధి జీవులతో ఆలోచించడంతోపాటు సామాజిక రాజకీయ ఆర్థిక పరమైన విషయాల పైన కమిటీలను వేయడం ద్వారా నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. ఇప్పటికీ కఠోరమైనటువంటి నిర్ణయాలు కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత పాలన అవినీతి, నిర్మాణాల్లోని నాణ్యత లోపం ,ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ప్రభుత్వ భూముల అక్రమ అమ్మకాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులు ఇతర నాయకులు అక్రమ భూ ఆక్రమణలకు పాల్పడిన దానిపై విచారణ జరిపించి దోషులుగా తేల్చి ఆ సొమ్మును రాబట్టి ప్రజల పరం చేయాలి. విద్యా వైద్యాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించడానికి ప్రైవేట్ రంగంతో ప్రభుత్వం ఏ రకంగా సర్దుబాటు చేసుకుంటుందో తన ఇష్టం. కానీ ప్రజలు మాత్రం ఢిల్లీ మాదిరిగా ప్రభుత్వ రంగంలోనే నాణ్యమైన విద్య కావాలని కోరుకుంటున్నారు .ఆ రకమైన వెసులుబాటు తక్షణమే కల్పించలేక పోతే అర్హులైనటువంటి కుటుంబాల పిల్లలకు మాత్రం విద్యా వైద్యం ఖర్చులను ప్రభుత్వం భరించాలి. ఇప్పటికీ ప్రజలు కూడా " ఎవరు అడగనటువంటి పథకాలు మాకు అవసరం లేదు . మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి, ఉచితంగా విద్య వైద్యం కావాలి, గృహ సౌకర్యం వ్యవసాయ భూమి కావాలని కోరుకుంటున్నారు. ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచించాలి. భూ పరిమితి, ఆదాయపరిమితి చట్టాలను తీసుకురాగలిగి సమానత్వాన్ని సాధించగలిగే కృషిలో ముందుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు మేధావులు ఆదరిస్తారు. అన్ని ప్రభుత్వాల మాదిరిగానే ఊచితాల పేరుతో కాలయాపన చేస్తే మాత్రం బుద్ధి జీవుల, ప్రజల ఆక్రోసానికి ఏ ప్రభుత్వమైనా గురికాక తప్పదు అని గుర్తిస్తే మంచిది .
-- వడ్డేపల్లి మల్లేశం
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమనేత హుస్నాబాద్ (చౌట పల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రo )