ఏది అభివృద్ధి ?ప్రభుత్వ పథకాలు కొనసాగించి వేతనాలు రాయితీలు
ఈ నైతిక అభివృద్ధికి స్థానం లేని మానవాభివృద్ధిని విస్మరించి కోట్ల రూపాయల ప్రాజెక్టు లేనా ? పేదరికం వెక్కిరిస్తుంటే అవినీతి అందలమెక్కితే ప్రభుత్వం అభివృద్ధికి ఇచ్చే నిర్వచనం ఇదేనా?
వడ్డేపల్లి మల్లేశం
అభివృద్ధిని నిర్వచించుకోవడం, లక్ష్యాలను ఎంపిక చేసుకోవడం, పథకాలను సమన్వయపరచి కార్యాచరణను ప్రకటించడం శాస్త్రీయంగా ప్రజా దృక్పథంలో జన జీవితానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే అది నిజమైన అభివృద్ధి అవుతుంది . కానీ ప్రభుత్వాలు కోటాను కోట్ల రూపాయలను వెచ్చి స్తూ యాంత్రికరణ ముసుగులో ప్రజా జీవితముతోని సంబంధం లేకుండా పెట్టుబడిదారీ వర్గాలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ పరిశ్రమలను ఆహ్వానిస్తున్నట్లు వేల లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఒప్పందాలలో ప్రకటించినప్పటికీ అది మానవాభివృద్ధికి దారి తీయకపోవడం విచారకరం . పిడికెడు మెతుకుల కోసం, నివసించడానికి ఇల్లు కోసం, కట్టుకోవడానికి గుడ్డల కోసం , కనీస అవసరాల కోసం కోట్లాదిమంది ఈ దేశంలో ఇప్పటికీ యాచిస్తూ బ్రతుకుతూ ఉంటే ప్రభుత్వపరంగా రావలసినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు సంక్రమించని పరిస్థితిలో అభివృద్ధి నుండి ఆ వర్గాలు వెలివేయబడినట్లా ? ప్రభుత్వ పథకాలు అనేకం ప్రవేశపెట్టిన పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు మెరుగు పడవి ఎందుకు? ఇక గమ్మత్తయిన విషయం ఏమిటంటే కొంతమంది ప్రజలు కూడా ప్రభుత్వాలు ఈ దేశం వెలిగిపోతుంది వికసిస్తున్నది దేవాలయాలు నిర్మించబడుతూ ఉంటే భక్తి భావం ఉప్పొంగుతున్నది అని చేస్తున్న ప్రకటనలు వర్ణనలకు ఆకర్షితులై తమ హక్కులను కూడా కోల్పోయి అందవిశ్వాసాలలో మునిగి తేలడం కూడా పాలకుల నిర్లక్ష్యానికి దోహదం చేసినట్లే!.
ఇటీవల ఒక సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేతనాలు ఇవ్వడం ఒక పార్టీ కంటే మరొక పార్టీ ఎక్కువగా రాయితీలను ప్రకటించడం మాత్రమే పరిపాలన కాదు యువతకు ఉపాధి కల్పించే నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా బలోపేతం చేయడమే అని మాట్లాడడం అభినందనీయం . అయితే ఏ స్థాయి ప్రభుత్వాలైన ఉచితాలు రాయితీలు, ప్రలోభాలు వాగ్దానాల బారిన పడక తప్పడం లేదు . కనుక నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి కాకుండా పైపై పూతగా ఉ న్నటువంటి కార్యక్రమాల వలన దీర్ఘకాలికమైనటువంటి అభివృద్ధి సమాజంలో సాధ్యం కాకపోగా వ్యక్తిగత అభివృద్ధి కూడా కుంటుపడుతున్న విషయాన్ని గమనించాలి. కారణం ఏమిటంటే అనేక ప్రభుత్వం ప్రకటిస్తున్న పథకాలకు భవనాలు నిర్మాణాలు కోట్ల రూపాయల కేటాయింపులు చేస్తూ ఉంటే అవి ప్రజలకు చేరువ అయ్యే వరకు అవినీతి నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం కారణంగా అందులో సగభాగం కూడా ప్రజలకు అందడం లేదు. ఇది గతంలో కూడా ఈ దేశంలో రుజువైనదే సాక్షాత్తు ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ కూడా ఈ మాట అన్నారంటే వాస్తవాన్ని ఇప్పటికైనా పాలకులు గుర్తించవలసింది . మరొక సందర్భంలో మహాత్మా గాంధీ అభివృద్ధి గురించి మాట్లాడుతూ" అద్దాల మేడలు రంగుల గోడలు మాత్రమే అభివృద్ధి కాదు నైతిక అభివృద్ధి ఏ దేశాభివృద్ధి" అని నిర్వచించడం జరిగింది. దేశ ప్రజలలో , పాలకులతో సహా నైతిక విలువలను పెంపొందించినప్పుడు తమ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి అవినీతికి ఆస్కారం లేనటువంటి నీతి బద్ధమైనటువంటి వ్యవహారాలు నడిచినప్పుడు ఖచ్చితంగా అందవలసినటువంటి సాయం చేరవలసిన చోటుకు చేరుతుంది. కానీ ప్రభుత్వాలు ఒక రంగానికి కేటాయించిన నిధులను మరొక పద్దుకు మళ్ళించడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోక దాటవేయడం, ఒక సంవత్సరానికి కేటాయించిన నిధులను వాడుకోకపోతే మురి గిపోవడం వంటి అనేక సందర్భాలను కూడా మనం చూస్తున్నప్పుడు ఇక అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజలకు ప్రభుత్వ ఫలాలు ఎలా అందినట్లు? నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ భారతీయ అర్థశాస్త్రవేత్త అమర్త్యసేన్ నిర్వచనం ప్రకారం " కనీస అవసరాలను మెరుగైన స్థాయిలో ప్రజలు తీర్చుకోగలిగిన ఆర్థిక పరిస్థితి మానవాభివృద్ధి" ఉన్నప్పుడు ఇప్పటికీ ఈ దేశంలో 20 శాతం దారిద్రరేఖ దిగువన జీవిస్తూ ఉంటే వలస జీవులు సంచార జాతులు ఆదివాసులు అణగారిన వర్గాలు ఇప్పటికీ ప్రభుత్వ పలాలకు నోచుకోకపోవడమే కాదు కనీసం బర్త్ సర్టిఫికెట్ గాని ఇతర ధ్రువీకరణ పత్రాలు కానీ ప్రభుత్వ పథకాలు గానీ అందనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఆదిమ జాతుల గురించి ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయి?
ప్రభుత్వాలకు అభివృద్ధి అంటే మానవాభివృద్ధి అని స్పృహ ఉండాల్సిన అవసరం ఉంది స్పష్టంగా నిర్వచించుకోవడం, అందుకు తగిన కార్యాచరణను ప్రకటించడం, నిధులను సామాన్య జనానికి బడ్జెట్లో భారీగా కేటాయించిన ప్పుడు మాత్రమే మానవాభివృద్ధి సాధ్యమవుతుంది . 90 శాతం గా ఉన్నటువంటి సామాన్య పేద వర్గాలకు బడ్జెట్లో 10 శాతం కూడా కేటాయించడం లేదని ఆ నిధులు కూడా క్రింది స్థాయికి అందడం లేదని ఆరోపణలు వస్తున్న తరుణంలో ఈ ఆరోపణలను థి ప్పికొట్టగలిగే సామర్థ్యం పాలకులకు ఉన్నదా? అని సామాన్యుడు ప్రశ్నిస్తుంటే సమాధానము ఎక్కడ ?
ఉపాధి లేక లక్షలాదిమంది యువత రోడ్లమీద ఆందోళనలు చేస్తుంటే , అదే యువతకు ప్రభుత్వమే అనుమతించి అలవాటు చేసినటువంటి క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు మద్యం మత్తు పానీయాలకు అలవాటు పడి తమ జీవితాలను నిర్వీర్యం చేసుకుంటుంటే ఆ ముసుగులో జీవిత నావకు దారి దొరకక క్షణికావేశంలో ఆత్మహత్యల పాలవుతుంటే అందులో 60 శాతం కేవలం డ్రగ్స్ వల్లనే నని రుజువు చేస్తుంటే ఇక అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రభుత్వాలు చెప్పగలుగుతాయి? . మధ్యము మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలు గుట్కాల తోపాటు క్లబ్బులు పబ్బుల్లో జరిగే అవినీతి బాగోతాలు డాన్సులు అశ్లీల ప్రదర్శనలు యువతను పెడదారి పట్టడానికి ప్రేరేపిస్తున్న విషయం నిజం కాదా? ఈ విషయంలో కేంద్రం నుండి రాష్ట్రం వరకు ప్రభుత్వాలు ఎందుకు దాటవేస్తున్నాయి గుజరాత్లో ప్రారంభమైన మద్యపాన నిషేధాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రధానికి వచ్చినటువంటి ఆటంకం ఏమిటి? మద్యం ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలను నడపడానికి గనుక పూనుకుంటే ఆ అభివృద్ధిని ప్రజలు కోరుకున్నారా? అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది . ప్రజలకు ఎన్ని రకాల అలవాట్లను చేస్తే ఆ అలవాటుకు బానిసలై అది లేకుంటే బ్రతకలేము అనేటువంటి గడ్డు పరిస్థితికి దిగజారిన సందర్భాలను గ్రహించవచ్చు. కానీ ప్రజల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఆర్థిక ప్రగతిని ఆశించిన ప్రభుత్వాలు ప్రజలకు ద్రోహం తలపెట్టే అవసరాలను అవకాశాలను అందుబాటులో ఉంచకుండా ప్రయత్నం చేయాలి అదే నిజమైన ప్రభుత్వాలు యొక్క సామాజిక బాధ్యత నిజమైన అభివృద్ధి. కానీ కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణాలు, మెట్రో రైల్వే లైన్లు, ప్రైవేట్ రంగంలో కొనసాగించే అంతర్జాతీయ సంస్థలకు ఇచ్చే అనుమతులు సామాన్యులకు ఒరగబెట్టింది ఏమిటి అని ప్రశ్నిస్తుంటే అవును నిజమే అని అనిపించక మానదు . తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో విచ్చలవిడిగా ప్రభుత్వ కార్యాలయాలు మెడికల్ కళాశాలలు అనేక రకాలైన భవనాలను నిర్మాణం చేసినప్పటికీ అందులో ఉండవలసిన సిబ్బంది గానీ వైద్య సిబ్బంది గానీ అవకాశాలు అవసరాలు యంత్ర పరికరాలు లేకపోవడంతో విద్యా వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు ప్రజలకు తీరడం లేదు. ప్రభుత్వ వైద్యరంగంలో అవసరాలు తీరని సందర్భంలో ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగితే వేలు లక్షల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తున్నది ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వగలథా? ఉచిత విద్య వైద్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారు.వీటిని పక్కనపెట్టి బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలసరి రాయితీలు, ఇతర హామీలతో మభ్య పెడితే నిజంగా ప్రజల్లో అభివృద్ధి సాధ్యం కాదు పైగా అభివృద్ధి నిరోధక ప్రభుత్వాలుగా ముద్ర పడక తప్పదు." ప్రజల కోణంలో ఆలోచించాలి, ప్రజల అవసరాలను కిందిస్థాయిలో పరిశీలించాలి, అందుకు అనుగుణమైనటువంటి పథకాలను ప్రవేశపెట్టాలి, ఉపాధిని మెరుగుపరిచే దిశగా పేదరికం ని తొలగించే స్థాయిలో ఆర్థిక అంతరాలు అసమానతలు లేని వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దాలి. అది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి తక్షణ కర్తవ్యం." ఈ సవాల్లను అధిగమించడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పథకాలు ఏమిటో ఇప్పటికైనా ప్రకటిస్తే ప్రజలు సంతోషిస్తారు లేకుంటే నిరంతరం ప్రభుత్వాలపైన అసంతృప్తి అసమ్మ తిని వ్యక్తం చేస్తూనే ఉంటారు. ఏది కోరుకుంటారో పాలకుల ఇష్టం .( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )