చేతి కందిన యువత  డ్రగ్స్ మత్తుకు  బలై నిస్తేజమైతే  కుటుంబాలకు, దేశానికి  భారీ నష్టం

Oct 13, 2024 - 21:03
Oct 30, 2024 - 18:30
 0  2
చేతి కందిన యువత  డ్రగ్స్ మత్తుకు  బలై నిస్తేజమైతే  కుటుంబాలకు, దేశానికి  భారీ నష్టం

60శాతం  యువత ఆత్మహత్యలకు డ్రగ్స్  కారణం  కావడం        ఆందోళనకరం.  బాధ్యత మరిచిన ప్రభుత్వాలు  డ్రగ్స్  పట్ల ఉదాసీనంగా  ఉంటే ఎలా ?
 

వడ్డేపల్లి మల్లేశం

చేతి కందిన యువత మద్యం, గుట్కాలతో పాటు ప్రత్యేకంగా  డ్రగ్స్ బారిన పడి  అయోమయానికి  బలిగావడంతో పరిష్కారం లేని దిశలో  ఆత్మహత్యలకు ఒడిగడుతున్న సందర్భాలను గమనిస్తే  వారంతా 18 నుండి 35 సంవత్సరాల వయస్సులో ఉన్న వారేననే  చేదు వాస్తవం బయటపడుతుంది .   డ్రగ్స్ బారిన పడ్డ వాళ్ల లక్షణాలను  సమాజంగానీ  తల్లిదండ్రులు గాని గుర్తించకపోవడం,  వారికి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా  ఆ మత్తు నుండి బయటపడే విధంగా  తీర్చిదిద్దే అవకాశాలు ఉన్న విషయాలను  తెలుసుకో ని కారణంగా  అనేక రంగాలలో నిపుణులు, విద్యావంతులై  ఈ దేశ   పురోగతిలో పాలుపంచుకోవలసిన వాళ్ళు కూడా కనుమరుగు కావడం  ఎంత ఆందోళనకరమో అర్థం చేసుకోవాలి.  అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశంలో  మధ్యము  మత్తు పానీయాలు  గుట్కాలు ధూమపానం  వంటి అనేక రకాల  మత్తు పదార్థాల బారినపడి,  దానికి తోడుగా క్లబ్బులు పబ్బులు ఈవెంట్లలో  కాలం గడిపి తమ ధైనందిన   బాధ్యతలను విస్మరించి,  క్షణకాలపు ఆవేశాలకు లోనై,  మరికొంతమంది పెళ్లి పేరుతో  ప్రేమించి  వంచన చేయడం వంచనకు గురి కావడం వలన  బలహీన క్షణాలలో,మద్యం మత్తులో ఆత్మహత్యల పాలు కా వడాన్నీ  కూడా మనం గమనించాలి.  అంటే 100%  ఆత్మహత్యలలో 60 శాతం కేవలం డ్రగ్స్ వల్లనే  జరుగుతున్నట్లుగా  తెలంగాణ రాష్ట్ర  సైకాలజిస్టుల అసోసియేషన్ సర్వేలో తేలిన విషయాన్ని  కుటుంబాలు పాలకులు, సమాజంలోని భిన్న వర్గాలు  చాలా సీరియస్ గా ఆలోచించాలి.  ఆ సంస్థ యొక్క  సర్వే నివేదికను  ప్రభుత్వాలు జాగ్రత్తగా పరిశీలించి ఆమోదించడం కూడా  యువతను రక్షించుకోవడానికి  ఎంతో తోడ్పడుతుంది . యువ రైతుల ఆత్మహత్యలు,.  వివిధ కారణాలతో విద్యార్థుల ఆత్మహత్యలు,  పేదరికంతో కార్మికులు కర్షకులు చేతివృత్తల వాళ్ళు నిరుపేదలు ఎందరో  పూట గడవక అప్పులపాలై  ఆత్మహత్యలు చేసుకుంటున్న  సంఖ్యలో కూడా  యువత ఎక్కువగా ఉండడం  దేశాభివృద్ధిలో  ప్రజాస్వామ్య  పటిష్టతలో పాలుపంచుకోవలసిన  త రుణములో  తీరని లోటుగా భావించాల్సి ఉంది. 
          తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్  అధ్యయన సారాంశం :-
**************
తెలంగాణ రాష్ట్రంలోని 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల  యువత పైన  రాష్ట్ర తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్  ఇటీవల అధ్యయనం చేసినట్టు ఆ సంస్థ అధ్యక్షులు డాక్టర్ మోత్కూరి రామచంద్రo గారు  తెలియజేశారు . డ్రగ్స్ అందుబాటులో ఉండడం, పరిస్థితులు అనుకూలించకపోవడం,  ఇతరత్రా అనేక కారణాల వలన  మాదక ద్రవ్యాలకు  అలవాటై యువత
తమ భావి జీవితాన్ని కోల్పోతున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు . ఇక ఆ అధ్యయనములోని అనేక అంశాలను పరిశీలిస్తే  డ్రగ్స్ తీసుకోకముందు తీసుకున్న తర్వాత వారి శరీరంలో వచ్చిన మార్పులను విశ్లేషించినట్లు,  బాధితుల కుటుంబ సభ్యుల నుండి  కూడా అభిప్రాయాలను సేకరించి కారణాలను విశ్లేషించినట్లు,  అదే సందర్భంలో ఈ పరిస్థితికి  కారణాలను అనేకమంది సైకియాట్రిస్టుల నుండి  అభిప్రాయాలను సేకరించినట్లుగా తెలుస్తున్నది.  డ్రగ్స్ తీసుకున్న తర్వాత  వారి కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పనిచేయక వారు ఏం చేస్తున్నారో కూడా తెల్యని పరిస్థితిలో  ఊహా లోకంలోకి వెళ్లిపోతారని  డ్రగ్స్ అలవాటు ఉన్న వారిని వెంటనే గుర్తించి సరైన సమయంలో కౌన్సిలింగ్  తో పాటు చికిత్స సకాలంలో అందిస్తే  మామూలు మనుషులయ్యే  అవకాశముందని  అధ్యయన సారాంశం.
      డ్రగ్స్ కు అలవాటు పడినట్లు గుర్తించడం ఎలా?  ఆ సర్వే ఇతర సిఫారసులు :-
**********
ఆ సర్వే ప్రకారం గా  సూచించిన లక్షణాలు ఉన్నటువంటి సందర్భంలో కుటుంబ సభ్యులు,  బంధువులు,  విద్యార్థి దశలోనైతే చుట్టుపక్కల ఉన్నటువంటి తోటి మిత్రులు  ఈ క్రింది లక్షణాలుంటే గుర్తించి  వెంటనే  కౌన్సిలింగ్కు చికిత్సకు  సమాయత్తం చేయాల్సిన బాధ్యత  వారి పైన ఉన్నది.
"కళ్ళు ఎర్రగా మారడం, ఒంటరిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడడం,  నిద్ర లేకుండా అనేక రాత్రులు గడపడం,  చేతులు కాళ్లు నిరంతరం వణుకుతూ ఉండడం,  అకారణంగానే ముచ్చెమటలు పట్టడం,  పల్స్ రేటు భారీగా పెరగడం,  తన శరీరం పట్ల తనకే శ్రద్ధ లేకపోవడం, తరచూ పనులను వాయిదా వేస్తూ  నిస్టేజంగా వ్యవహరించేవారు" డ్రగ్స్ కు అలవాటు పడినట్లుగా  భావించాలని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు . ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క శారీరక మానసిక స్థితిని  గమనించి పై లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణకు వస్తే  కౌన్సిలింగ్ తో పాటు సంబంధిత చికిత్సను ఇప్పించడం ద్వారా వారిని  కాపాడుకోవచ్చనీ సంస్థ అధ్యయనం ద్వారా తెలుస్తున్నది .
తెలంగాణలో  ఈ సంవత్సరం ఇప్పటివరకు డ్రగ్స్ తీసుకున్న కేసులు 938 నమోదు కాగా  దేశవ్యాప్తంగా  (ఎన్ డి పి ఎస్)  నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోత్రోషిక్ సబస్టాన్సిస్  చట్టం కింద 78, 331 కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది.  ఈ కేసులన్నింటిలోనూ యువత ప్రధానంగా ఉండడం వలన బాధితులకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనివార్యం కనుక  ప్రతి పాఠశాలలోనూ సైకాలజిస్ట్లను నియమిస్తే విద్యార్థులు చెడు దారిలో పోకుండా అడ్డుకోవడానికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని  ఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మోత్కూరి రామచంద్రo గారు  చేసిన సూచనను పాలకులు పాటిస్తే మంచిది.  అంతేకాదు కౌన్సిలింగ్ కోసం  9533  660  938  నంబర్ను సంప్రదిస్తే కౌన్సిలింగ్ ఏర్పా టు చేస్తామని  తెలపడం అభినందనీయం  అవసరమైన వారు ఈ నెంబర్కు ఫోన్ చేసి సలహా, సహకారం పొందవచ్చు.
      బాధ్యతలను విస్మరించడమేనా పాలకుల పని?:-
********
  చేతికి అందిన పిల్లలను  పలు కుటుంబాలు కోల్పోతుంటే,  ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న భారతదేశం కూడా  యువజన వనరులను కోల్పోతే  ప్రపంచం ముందు భారతదేశం తలవంచవలసి వస్తుంది.  ప్రజాస్వామ్యం సఫలం కావాలన్నా,  ఉపాధి అవకాశాలతో  స్వావలంబన ద్వారా భారతదేశ అభివృద్ధి చెందాలన్నా  యువతనే కీలకం కనుక  ఆత్మహత్యలలో 60 శాతంగా కొనసాగుతున్న డ్రగ్స్ మహమ్మారి  పరిణామాలను  కట్టడి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా  ఆ గంతకుల పైన ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉంది.  అదే సందర్భంలో ఉత్పత్తిని సరఫరాను అడుగడుగునా నిఘా వేసి  దేశం నుండి పారదలవలసిన బాధ్యత పాలకవర్గాలదే.  తమ రాజకీయ ఎత్తుగడలకోసం, గెలుపు కోసం,  స్వప్రయోజనాల కోసం , పెట్టుబడి దారి వర్గంతో  సానుకూలంగా వ్యవహరించడం కోసం  డ్రగ్స్ పట్ల బాధ్యతను విస్మరిస్తే  ప్రభుత్వాలే  ముందుగా శిక్ష అనుభవించక తప్పదు.  విద్యాసంస్థలలో యువతను చైతన్యం చేయడంతో పాటు  అక్కడక్కడ అందుబాటులో సైకాలజిస్టులను నియమించి  మొబైల్ టీం ద్వారా  పర్యవేక్షించడం , ఉత్పత్తి పంపిణీ చేస్తున్నటువంటి దగాకోర్లను పట్టుకోవడానికి  ప్రత్యేక కమిటీలను వేయడం,  పోలీసు చర్యలను ముమ్మరం చేయడం, దొరికిన దొంగలకు కఠిన చర్యలు విధించడం ద్వారా  ఈ మహమ్మారి నుండి భారతదేశ యువతను కాపాడుకోవచ్చు.  అదే సందర్భంలో  తమ పిల్లలకు స్వేచ్ఛనిచ్చి ఆర్థిక సౌకర్యాలు కల్పించి  డ్రగ్స్ కు  ఆకర్షితులవుతున్న  పర్యావసానాలకు తల్లిదండ్రులు కూడా పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది.  అప్పుడే ఈ రుగ్మతను  ఉమ్మడిగా తరిమికొట్టగలము .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333