బి.ఆర్.ఎస్. ది అర్థం లేని రాద్దాంతం.

పదేళ్లలో తెలంగాణ అస్తిత్వాన్ని గాలికి వదిలి
తెలంగాణ ఉనికి కోసం వెతుక్కో వలసి రావడం సిగ్గుచేటు .
ప్రజలను మరిచిన పాలనను కప్పిపుచ్చుకోవడానికిన్నీ నాటకాలా?
చిత్కరించే రోజు ఎంతో దూరంలో లేదు.
నేల విడిచి సాము చేస్తే ఎంత అనర్తమో ప్రజలను మరిచిన పాలన కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది బిఆర్ఎస్ పట్ల రూఢీ అయింది. తెలంగాణ సాధన కోసం దశాబ్దాల తరబడిగా ప్రజలు ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు అనేకమంది కూలి నాలి చేసుకుని బ్రతికే వాళ్ళు సబండవర్గాలు పోరాటాలలో నిమగ్నమై అణచివేత నిర్బంధాలను ఎదుర్కొని ఎంతోమంది బలైన సందర్భం తెలుసు. కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీ వళ్ళనే తెలంగాణ వచ్చింది అని చెప్పుకుంటున్న వారికి ప్రజలు వేస్తున్న సూటి ప్రశ్న మీ నుండి ఎవరైనా ఒక్కరు బలిదానానికి పాల్పడినారా?
అంతేకాదు అనేక సందర్భాల్లో తమ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చిందని తెలంగాణ కోసమే తమ పార్టీ పుట్టిందనే వాదన ప్రజలు అంతో యి 0తో నమ్మడం వల్ల నే ఈ దుస్థితి వచ్చింది. నిజంగా ఒక రాజకీయ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినది అంటే ఎవరు అంగీకరించరు. అంతిమంగా ప్రజలే చరిత్ర నిర్మాతలు ఈ తెలంగాణ చరిత్రకు కర్త కర్మ క్రియ కూడా అన్ని వర్గాల ప్రజలే అని ముందుగా అందరం అంగీకరించాలి .టిఆర్ఎస్ అందరి త్యాగాలను పోరాటాలను గుర్తించాలి. అప్పుడు మాత్రమే తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడే అధికారం బి ఆర్ ఎస్ కు ఉంటుంది . పదేళ్ల పరిపాలనలో తెలంగాణ అస్తిత్వం, ఉనికి , రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం ,తెలంగాణ తల్లి విగ్రహం పైన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలే తప్ప ప్రజాస్వామ్య బద్ధంగా అఖిలపక్షాలతో సమావేశం నిర్వహించినది లేదు. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజలందరినీ కదిలించి అనువణువునా భావజాలాన్ని నింపి పోరాటానికి ఉరకలేత్తించిన "జయ జయహే తెలంగాణ" గీతాన్ని ఎందుకు రాష్ట్ర గీతం గా ఆమోదించలేదు అంటే అణచివేత కాదా?
ఇక తెలంగాణ తల్లి విగ్రహాన్ని పరిశీలిస్తే తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి పెద్దగా తేడా లేదని చెప్పుకోవచ్చు. భుజకీర్తులు, కిరీటాలు, ఆభరణాలు అంద చందాలతో వెలిగే విగ్రహం తెలంగాణ తల్లిది కాదు అనే మాట ఇటీవల కాలంలో పెద్దగా విమర్శకు గురవుతున్న వేళ కనీసం టిఆర్ఎస్ అంగీకరించకపోవడం బాధాకరం. అంతేకాదు రాష్ట్ర చిహ్నం లోపల కూడా అమరవీరులకు ప్రతిబింబమైనటువంటి స్థూపాన్ని చేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సందర్భంలో ఎందుకింత వ్యతిరేకత ? ప్రజలను ప్రజాస్వామ్యవాదులను అమరవీరులను గుర్తించినటువంటి ఒక రాష్ట్రం ఉంటుందా? అవసరమైతే చర్చించాలి నిర్మాణాత్మక సూచనలు చేయాలి కానీ ప్రభుత్వానికి చరిత్ర తెలియదు, ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కానే కాదు అని ప్రగల్భాలు పలకడం సరైనది కాదు. అట్లా అంటే తెలంగాణ ఉద్యమం దఫ దఫాలుగా జరిగిన సందర్భంలో అనేకమంది విద్యార్థులు, గాయకులు, అమరవీరులు, కవులు, కళాకారులు, మేధావులు వారి స్థాయిలో పేద వర్గాలైనా పోరాడి అమరత్వాన్ని పొంది ఈ రాష్ట్రాన్ని సాధించడంలో కృతకృతులైనారు . అందులో కేసీఆర్ కుటుంబం ఏనాడైనా పాల్గొన్నదా? రాజకీయ ప్రక్రియ తప్ప అలాంటప్పుడు మీకు మాత్రం చరిత్ర ఏం తెలుసు? ఎవరైనా చరిత్రను అధ్యయనం చేయాల్సిందే పరిశీలించాల్సిందే దానిని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. ఆ ఇంగిత జ్ఞానం, సంస్కారం ఉన్న వాళ్లకు మాత్రమే చరిత్రను నిర్మించే అధికారం అవకాశం ఉంటుంది .
2014 జూన్ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గత సంవత్సరమే బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో భారీ ఖర్చుతో ఉత్సవాలను కొనసాగించినప్పటికీ ఏ రాజకీయ పార్టీని కూడా చేర్చుకోకపోవడం తెలంగాణ అంటే తమ పార్టీ మాత్రమే అని చెప్పుకోవడం మనం గమనించి ఉన్నాo . "పదేళ్లు కాకముందే దశాబ్ద ఉత్సవాలను నిర్వహించినటువంటి బిఆర్ఎస్ పార్టీ పదేళ్లు పూర్తయిన తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిర్భావ దినోత్సవాల పేరుతో ఒక్కరోజు కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధపడితే ఎన్ని విమర్శలా? "ఎంత అసంబద్ధమో అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్ర గీతాన్ని చిహ్నాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఆమోదించే క్రమంలో దఫాలుగా చర్చలు సాగుతూనే ఉన్నాయి ఒక్క టిఆర్ఎస్ పార్టీ మినహా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు మేధావులు కళాకారులను ఆహ్వానించడం జరిగింది . రాష్ట్ర గీతం పైన నిర్ణయానికి వచ్చినప్పటికీ విగ్రహం అలాగే చిహ్నం పైన మరింత చర్చ అవసరమని ప్రభుత్వం వెనుకడుగు వేసింది అంటేనే ప్రజాస్వామ్య ఆలోచన ఉన్నట్లుగా ప్రతిపక్షం భావించవలసిన అవసరం ఉంది . మెజారిటీ ప్రజానీకం ఆమోదించాలి కానీ ఒక ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని మరొక్క ప్రభుత్వం పూర్తిగా తుడిచిపెడితే ఎలా? కేసీఆర్ ఆనవాలు లేకుండా చేస్తారా?
అంగీకరించం అని డామినేట్ చేయడం తగదు. కాలా నుగుణంగా జరిగిన లోపాలను సవరించే క్రమంలో వచ్చిన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అది ప్రజల ఆమోదం పొందినదా లేదా అనేది ప్రధానం.ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం నిజమైన తెలంగాణను సాధించుకోలేకపోయినామని, కేవలం భౌగోళిక తెలంగాణతో ప్రజలకు ఒరిగింది లేదని, ఇప్పటికీ పదేళ్ల తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని వెతుక్కోవాల్సి రావడం సిగ్గుచేటని వక్తలు , విప్లవ రచయితల సంఘ సభ్యులు ప్రజా సంఘాలు వాపోయినయి అంటే బి ఆర్ ఎస్ తెలంగాణ అస్తిత్వానికి చేసిన ద్రోహాన్ని అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కొందరి సూచనలు *
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా సోనియాగాంధీని ఆహ్వానించడం పైన అభ్యంతరం లేదని రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు తుడిచిపెట్టుకుపోతాయని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన త్యాగాన్ని గుర్తించాలని ఆనాడు పోరాటం చేసినటువంటి అనేకమంది కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులను కూడా ఆమోదించవలసిందేనని ప్రముఖ రచయిత సామాజికవేత్త జర్నలిస్టు పాశం యాదగిరి చేసిన సూచన అందరికీ ఆమోదయోగ్యమే. అయితే ఇలాంటి సందర్భంలో ఆయా రంగాలలో నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అంతేకాదు గత ప్రభుత్వం ఇచ్చిన పెండింగ్ సమస్యల పైన నిర్ణయం తీసుకోవడం అంటే ఉద్యమకారుల పైన గల కేసులను ఎత్తివేయడం, ఉద్యమకారులను గుర్తించడం.
అమరవీరుల కుటుంబాలను గుర్తించి ఆర్థిక సహకారం చేయడం, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదించినటువంటి అమరవీరుల యొక్క కుటుంబాల సహాయాన్ని ప్రకటించడం వంటి చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వానికి ఈ అర్హత ఉంటుందని బల్ల గుద్దినట్లుగా చేసిన ప్రకటనలో కొంత వాస్తవం లేకపోలేదు. 1969 స్థూప నిర్మాత ప్రస్తుతము కొన ఊపిరితో ఉన్నట్లు అతనికి వైద్యం గాని ఆర్థిక సహకారం అందించకపోవడం అంటేనే మన బాధ్యతారాహిత్యం తెలియజేస్తున్నదని వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా యాదగిరి గారు ప్రభుత్వానికి చే సిన సూచన కూడా అంగీకరించవలసినదే . .ఇప్పటికీ కేసులతో అనేకమంది కోర్టుల చుట్టు తిరుగుతున్నారు, నక్సలైట్ల పేరుతో కొందరి పైన మోపిన కేసులకు భయపడు సందర్భాలను కూడా మనం గమనించవలసిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచన . గత ప్రభుత్వం విస్మరించిన హామీలతో పాటు ప్రస్తుత ప్రభుత్వ ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడు మాత్రమే ఇలాంటి ఉత్సవాలను హుందాగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని అలాంటి అవకాశాన్ని ప్రభుత్వం అందుకోవడానికి కృషి చేయాలని యాదగిరి గారితో పాటు పలువురు చేసిన సూచన
తెలంగాణ అస్తిత్వాన్ని మరింత ఉన్నతంగా నిలబెడుతుంది అనడంలో సందేహం లేదు . గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు అఖిలపక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి ఏనాడు కూడా ఏర్పాటు చేయలేదు కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం టిఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలతో మేధావులతో సంప్రదింపులు చేసింది. అదే సందర్భంలో బిఆర్ఎస్ పార్టీని కూడా పిలిచి ఉంటే బాగుండేది ఆ సంస్కారం ఎదుటివారికి లేకపోయినా మనకు ఉండాలి కదా! అన్నదే ఇక్కడ సూటి ప్రశ్న. టిఆర్ఎస్ తన పాలన కాలంలో చేసిన తప్పులు మరిచిపోయిన బాధ్యతను కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం తప్ప అందులో పసలేని వాదన అందుకే ప్రజలు రాబోయే కాలంలో మరింతగా చేత్కరించడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తిస్తే మంచిది. ఇక తెలంగాణ గీతం విషయంలో తెలంగాణేతరులు పాల్గొనడం అనే చర్చ సభబే. కానీ గత ప్రభుత్వం కూడా అనేక రంగాలలో ఆంధ్ర వాళ్లకు అవకాశం ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్ర పౌరులు నిపుణులు కవులు కళాకారులతోనే కార్యక్రమాన్ని కొనసాగించడం సందర్భోచితం అని గుర్తిస్తే మంచిది.
---వడ్డేపల్లి మల్లేశం
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు)