ముఖ్యమంత్రి ,ప్రధాని హోదాలో ఉన్నవారు ఇష్టారాజ్య o గా హామీలు ఇచ్చి అభాసుపాలు కాకూడదు
అధికారంలో కొనసాగినా ప్రజల ప్రయోజనాలు కాపాడవలసిన సేవకులే కానీ శాసించే వాళ్ళు కాదు. సామాన్య ప్రజలే గీటురాయిగా పని చేయాలి .
--- వడ్డేపల్లి మల్లేశం
అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు ఎవరైనా మేము ప్రజలకు సేవకులమే అని నమ్మబలికే ప్రయత్నం చేస్తారు . పైగా ప్రజల ప్రయోజనం కోసమే పనిచేస్తామని సామాన్య ప్రజలే మాకు ఆరాధ్యులని పదే పదే చెబుతూ ఉంటారు. ఆ క్రమంలో ప్రతిపక్షాలను ఒప్పించడానికో , పాలనపై త మ ముద్ర వేసుకోవడానికో ప్రజలు కోరకుండానే అనేక హామీలు ఇస్తూ ఉంటారు. ప్రజలు అనాదిగా ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు పేదరికం, ఉపాధి లేమి, కనీస సౌకర్యాలకు నోచుకోకపోవడం, పీడన, దాడులు, వివక్షత వంటి అనేక అంశాలతోపాటు అధిక ధరలు భూమి లేకపోవడం కనీసం ఇంటికి స్థలానికి కూడా నోచుకోకపోవడం వంటి అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటే వీటిని పక్కన పెట్టి ప్రపంచముతోనే పోటీ పడతామని ఒకరంటే, మరొకరు బంగారు తెలంగాణ అని, ఇంకొకరు వికసిత భారత్ అని , మరికొందరు భారత్ వెలిగిపోతోంది అని తమ పరిపాలన గురించి ప్రజలను బుజ్జగించే మాటలు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు సంబంధం లేని అంశాల పైన హామీలు ఇస్తూ ఉంటారు . 15% దారిద్రరేఖ దిగువన జీవిస్తూ ఉంటే మరొక 15% వలస జీవులు ఉపాధి కోసం దేశమంతా తిరుగుతూ అష్ట కష్టాలు పడుతూ పనికి ఆదాయానికి ఇతర కనీస అవసరాలకు నోచకుండా జీవిస్తూ ఉంటే ఇల్లు లేక తాత్కాలిక గుడిసెలు ఆశ్రయాలలో జీవిస్తున్న వారి గురించి మాత్రం పాలకులు పట్టించుకోరు .. "అసలు మానవాభివృద్ధి అంటేనే కదా కనీస జీవన అవసరాలను సమకూర్చి పెట్టేది" ఆ మానవాభివృద్ధినే పట్టించుకోని పాలకులు పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు భూస్వాములు సంపన్న వర్గాలకు ఉపయోగపడే పథకాలను ప్రకటించి ప్రజలందరికీ చెందవలసిన ప్రజాధనాన్ని కొన్ని వర్గాలకు మాత్రమే అప్పనంగా కట్టబెట్టే విధంగా ప్రభుత్వ హామీలు వాగ్దానాలు ఉన్న విషయాన్ని మరిచిపోగలరా ?
ఒకరు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తాను అంటే మరొకరు దళితులకు 10 లక్షల దళిత బంధు ఇస్తామని ప్రకటిస్తూ ఉంటారు . లక్షాధికారులైన కోటీశ్వరులైన దళిత బంధిస్తామని గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ప్రకటించి అమలు చేయకుండానే నామమాత్రంగా కొనసాగించిన విషయం తెలుసు . అది కూడా దళితుల్లో సంపన్నులకు ఇవ్వడం అంటే మళ్ళీ అసమానతలను పెంచి పోషించడమే కదా ! వివక్షతను, పేదరికాన్ని, కనీస జీవన ప్రమాణాలను, దారిద్రరేఖ దివన గల వారిని ప్రధానంగా చేసుకొని ప్రకటించవలసినటువంటి వాగ్దానాలు లేదా కార్యక్రమాలు పథకాలు ఉన్నత వర్గాలకు మాత్రమే మేలు చేసే విధంగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం అనేది ఈ మధ్యకాలంలో పాలకులకు రివాజుగా మారింది. ఎందుకంటే ఆ వర్గాల చేతుల్లోనే పాలకులు పనిచేయడం వాళ్ళు ఇచ్చే పార్టీ ఫండ్ కోసం ఆశపడి సామాన్య ప్రజానీకాన్ని విస్మరించడం అనేది దీని వెనుక గల అసలు కథ . "ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఒక వేదిక నుండి ఒక హామీ లేదా వాగ్దానం చేసినారంటే దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది అనే సోయి పాలకులకు లేకపోవడం విచారకరం ." "ఇచ్చిన హామీని కచ్చితంగా నెరవేర్చవలసి ఉంటుంది అది చట్టబద్ధము శాసనబద్ధము రాజ్యాంగబద్ధం కూడా అని తెలుసుకోవడం పాలకులకు కనీస అవసరం ."గతంలో ఢిల్లీ హైకోర్టు ఒక తీర్పు వెలువరించిన సందర్భంగా చేసిన ప్రకటనలో ప్రధాని ముఖ్యమంత్రి ఇతర రాజ్యాంగబద్ధ పెద్దలు సభలో సమావేశంలో ప్రకటించిన లేదా ఇచ్చిన హామీ మేరకు కచ్చితంగా ఆ వర్గాలకు అమలు చేయవలసి ఉంటుంది .పాలకులు గనుక విస్మరించి తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే కోర్టు ద్వారా రాజ్యాంగ రక్షణ పొందవచ్చు అని స్పష్టంగా చెప్పడం వల్ల ప్రధాన బాధ్యుల మాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో దీనిని బట్టి తెలుస్తుంది . ఒక వేదిక మీద ఇచ్చిన హామీని మరొక వేదిక మీద ఆ హామీ ఇవ్వలేదని మార్చడం, తప్పుకోవడం ,లేదా పత్రికలు వక్ర భాష్యం చెప్పినావని అవకాశవాద రాజకీయాలకు పాల్పడిన సందర్భాలు గతంలో అనేకo . అంతేకాదు చట్టబద్ధంగా ప్రజల చేతిలో చిక్కే అవకాశం ఉన్న ఈ తీర్పు మేరకు పాలకులు కనీసం రాజ్యాంగబద్ధంగా, హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా ఆలోచించి హామీలు ఇస్తే మంచిది . తద్వారా పేద వర్గాలకు అట్టడుగు ఆదిమ జాతులకు కనీస అవసరాలకు నోచని కోట్లాదిమందికి రాజ్యాంగబద్ధంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఒక పార్టీ అధికారంలో కొనసాగుతున్నది అంటే ప్రజల ప్రయోజనాలు ఆకాంక్షలను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఆ ప్రాంత ప్రజలందరిచే ఆమోదించబడినారని అర్థం . ప్రజలను కన్నబిడ్డల వలె చూడడమే పరిపాలన యొక్క అర్థం ఆ అర్థాన్ని తుంగలో తొక్కి ప్రజలు ప్రజాస్వామిక వాదులు కార్మికులు కర్షకులు చేతివృత్తుల వాళ్ళు రైతులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే కాల్పులు జరిపి చంపిన సంఘటనలు ఈ దేశంలో కోకోళ్ళలు. ఇటీవల షాద్నగర్ లో ఒక దళిత స్త్రీపై అకారణంగా నేరాన్ని ఆరోపించి చిత్రవధకు గురిచేసి తర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లుగా పత్రిక కథనాలు వస్తుంటే సమాధానం చెప్పలేని పాలకులు పెద్దపెద్ద హామీలు ఇచ్చి ఎవరికి మేలు చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. పిడికెడు మెతుకుల కోసం తప్పటడుగు వే సిన వాడిని నేరస్తులుగా చిత్రహింసలకు గురిచేసి జైలు పాలు చేస్తూ బడా నేరగాలను, చట్టసభల్లో ఉన్నటువంటి నేరస్తులను, నేరస్తులుగా ఉన్న వారికి టిక్కెట్ ఇవ్వడం ద్వారా రాజకీయ పార్టీలు పాలకులు తమ సభ్యులను ఏరకంగా కాపాడుకుంటున్నారో అర్థం చేసుకుంటే రాజకీయ పార్టీల వికృత రూపానికి పరాకాష్ట ఈ దేశంలో నేరం అవినీతి దోపిడి విధానం అనీ చెప్పక తప్పదు. గత 17వ లోక్సభలో 83 శాతం మంది నేరచరిత్ర ఉన్నవాళ్లు సభ్యులుగా ఉన్నారని , రాజ్యసభలో 36 శాతం మంది నేరచరిత్ర ఉన్నవాళ్లు అని అనేక ఆధారాలు విశ్లేషకులు ప్రకటిస్తున్న సందర్భంలో బడా నేరస్తులను తప్పించడానికి పేద వర్గాల పైన ఏ రకంగా నేరం ఆరోపించబడి శిక్షలకు గురవుతున్నారో మనం అర్థం చేసుకుంటే ప్రజాస్వామ్యమని గొప్పగా చెప్పుకున్నప్పటికీ ఈ దేశంలో కొనసాగుతున్నది ప్రజాస్వామ్యమే . అందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అనేక సందర్భాలలో చేసిన వ్యాఖ్య ప్రకారం "రాజ్యాంగబద్ధంగా పాలనను అధికార పార్టీ నాయకులు కొనసాగించ క పరిపాలనను బ్రష్టు పట్టించినప్పుడు ప్రజలు తమకు అనుకూలమైన పరిపాలన కోసం ఎంతటి స్థాయిలో ఉన్న పరిపాలకులనైనా ఓడిస్తారు ఆ ప్రభుత్వాన్ని చిదిమి వేస్తారు తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు" అని చేసిన హెచ్చరిక ప్రపంచంలోని అనేక దేశాలలో అక్షర రూపము దాలుస్తున్న ఉదాహరణలు అనేకం. అలాంటి దుస్థితి భారతదేశంలో రాకుండా ఉండాలంటే పాలకులు ఇబ్బడి ముబ్బడిగా వాగ్దానాలు చేయకుండా పేద ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పని చేసినప్పుడు, ఈ దేశ ప్రజాధనాన్ని వారి కోసమే వెచ్చించినప్పుడు, బడ్జెట్లో సుమారు 90 శాతాన్ని కేటాయించగలిగినప్పుడు మాత్రమే నిజమైన పరిపాలన, అదే సుపరిపాలన ప్రజలను కన్నబిడ్డల వలె పాలించే పాలన అని చెప్పుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఎన్ని హామీలు వాగ్దానాలు ఇచ్చినా, ఉచితాలు తాయిలాలు, ప్రకటించినా సామాన్యులకు రాజ్యాంగబద్ధంగా చేరనంతవరకు ఈ దేశంలో కొనసాగేది పెట్టుబడి దారి వర్గ పరిపాలనే అని చెప్పుకోవలసి ఉంటుంది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )