సాహిత్యానికి మరో రూపమే కవిత్వం.
భాషలను గౌరవించడం, సామాజికతను కవిత్వంలో పొందుపరచడం, మానవ సంబంధాలను బలోపేతం చేయడం, వర్గ సంఘర్షణను దూరం చేసేది కూడా కవిత్వమే!* కవిత్వం తన బాధ్యతను నిర్వహించాలంటే కవులు సామాజికతతో రచనలు చేయాలి.
---- వడ్డేపల్లి మల్లేశం
"అర్థవంతమైన పదాలతో, సందర్భాను సారంగా సమస్యలను పరిష్కారిస్తూ, విలువలను మేలవించి ఉత్తమ సంస్కారాన్ని నిలపడం ద్వారా సమసమాజాన్ని స్థాపించే దిశగా తీసుకు వెళ్లేదే కవిత్వం" .కవిత్వం అంటే కేవలం వర్ణన మాత్రమే కాదు తక్కువ పదాలలో ఎక్కువ అర్థాన్ని వివరించి విమర్శించగలిగితే అది ఒక గ్రంథం గా మారగలిగినటువంటి సన్నివేశమే కవిత్వం. ప్రధానంగా కవిత్వాన్ని పరిరక్షించుకోవడం, కవిత్వాన్ని ప్రచారంలో తీసుకువెళ్లడం, అంటే భాషలను గౌరవించడ0తొ పాటు భాషలను సజీవంగా నిలుపుకోవడమే కవితా దినోత్సవ లక్ష్యం . ప్రపంచవ్యాప్తంగా గమనించినప్పుడు పురాతన కాలంలో రాజుల కాలం నుండి కూడా సాహిత్యాన్ని కవిత్వాన్ని ప్రజా సంస్కృతిని రాజులు కాపాడిన సందర్భాలు భారతదేశంలో ప్రధానంగా కనిపిస్తాయి కానీ ప్రపంచంలో చూసినప్పుడు 18వ శతాబ్దం వరకు కూడా ఇలాంటి సందర్భము లేదు అని చరిత్ర ద్వారా కొంతమంది విశ్లేషకుల ద్వారా తెలుస్తున్నది. 18వ శతాబ్ద ప్రారంభంలో ముఖ్యంగా ఇటలీ రోమ్ నగరాలలో ఈ సంస్కృతి ప్రారంభమైనదని ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా కవిత్వానికి సాహిత్యానికి పెద్దపీట వేసినట్లుగా మనకు తెలుస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా కవిత్వాన్ని నిరంతరం జీవనదిలా కొనసాగించడానికి, భాషలను పరిరక్షించుకోవడానికి, కవు లు కళాకారులు మేధావులలో సంస్కృతి సంప్రదాయాలు సామాజిక చింతనను సజీవంగా నిలపడానికి ఒక రోజంటూ ఉండాలి అనే ఆకాంక్ష కూడా బలంగా లేకపోలేదు ఆ ఆకాంక్షనుండి పుట్టినది ప్రపంచ కవిత దినోత్సవం.
1997లో ప్యారిస్లో జరిగినటువంటి 30వ యునెస్కో సమావేశంలో ప్రపంచ స్థాయిలో సాహిత్యం యొక్క అవసరాన్ని ప్రాధాన్యతను అర్థం చేసుకున్నటువంటి సభ్య దేశాలు సాహిత్యాన్ని సజీవంగా కాపాడడానికి, అంతరించిపోతున్న భాషలను పరిరక్షించుకోవడానికి, భాషకు సాహిత్యానికి కవిత్వానికి ఉన్న లంకెను నిరంతరం కొనసాగించడానికి ప్రపంచవ్యాప్తంగా సాహిత్యానికి ఒక దినం ఉండాలి అని ఆలోచించినటువంటి ఆనాటి సమావేశం మార్చి 21వ తేదీని ప్రపంచ కవితా దినోత్సవం గా ప్రకటించడం నేటి మన ఎదుగుదలకు, మన ఆలోచనకు, అక్షర రూపానికి వేదికగా భావించవలసి ఉంటుంది.
ప్రజల యొక్క ప్రజల జీవితాల వర్గ సంఘర్షణనుండీ విముక్తి చెంది, సమాజంలోని సంక్లిష్టతలను దూరం చేయడానికి, సమాజం యొక్క మేలును కోరేది సాహిత్యమైనప్పుడు ఆ సాహిత్యంలో అనేక ప్రక్రియల లో కవిత కూడా ఒకటి. అందులో మళ్ళీ వచన కవితలు గేయ కవితలు పద్య కవితలు అనే పేరుతో విభిన్న రకాలుగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కవిత్వం అంటే వర్ణన మాత్రమే అనే తప్పుడు భావనకు కొంతమంది బలవుతున్న విషయాన్ని గమనించినప్పుడు వర్ణనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా సామాజిక చింతనకు సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యల పరిష్కారాన్ని చూపించే దిశగా నిక్కచ్చిగా వివరించే ఒక ప్రక్రియ కవితగా భావించవలసిన అవసరం ఉన్నది .అట్లని కేవలం కవిత్వం మాత్రమే సాహిత్యం యొక్క పూర్తి బాధ్యతను నిర్వహించడం సాధ్యం కాదు. గేయం, వచనం, యక్షగానం,పల్లె పదాలు, సంభాషణలు, బుర్రకథ, హరికథ, కథలు, కథానికలు, విమర్శలు, నవల వంటి అనేక రకాల ప్రక్రియలు సాహిత్యాన్ని పరిపుష్టి చేస్తున్న విషయాన్ని మనం గమనించాలి. సాహిత్యకారులుగా మన బాధ్యత నిర్వహిస్తూనే సమాజంలో ఉన్నటువంటి భిన్న వర్గాలకు సాహిత్యం యొక్క రుచిని చూపించవలసిన బాధ్యత కూడా మనదే.
ఇక ఏ ప్రక్రియలో కూడా రచన చేసిన వాళ్లంతా సాహిత్యకారులు కవులు కళాకారులు రచయితలు అని నిర్దేశించుకున్నప్పుడు అది ఏ రూపం అనేదానికంటే ఏ మేరకు సమాజానికి మార్గ నిర్దేశం చేస్తున్నాము? ఏ రకంగా సమాజం యొక్క బాగు ను కోరుకుంటున్నాము? ప్రజల జీవన గమనంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి మన రచనలు ఎలా తోడ్పడుతున్నాయి?అని అంచనా వేసుకోవలసిన అవసరం మన పైన ఎంతగానో ఉంటుంది.
సాహిత్య ప్రయోజనానికి భరోసా ఇవ్వవలసింది కవులు కళాకారులు రచయితలే:-
పాలకుల యొక్క తప్పుడు విధానాల కారణంగా సమాజంలోని కొన్ని వర్గాల అకృత్యాలు అరాచకాలు దోపిడీ పీడన వలన కూడా అసమ సమాజంగా నేటి సమాజం మారిపోయింది, చీలిపోయింది కూడా. పాలకులు కూడా పెట్టుబడిదారీ విధానానికి వంత పాడుతూ, మెజారిటీ ప్రజల యొక్క సామాజిక బాధ్యతను విస్మరించి, తమ వైయక్తిక ప్రయోజనాలకు లబ్ధి కోసం ఆరాటపడుతున్న సందర్భంలో అవసరమైతే ప్రజలను శత్రువులుగా చూడడానికి వెనకాడడం లేదు. అందులో భాగమే. తన పిల్లలను తనే చంపుకునే తల్లి ఉంటుందో లేదో కానీ భారతదేశంలో మాత్రం తన ప్రజలను రాజ్యమే హరించి వేస్తున్న సందర్భాలను ఇటీవల మనం గమనించవచ్చు. ఈ వికృత చేష్టలు పోకడల నుండి ప్రభుత్వాలను పాలకులను పెట్టుబడిదారీ వర్గాన్ని మరల్చడానికి తగిన ప్రతిఘటన ప్రశ్న ఎత్తుగడలు ప్రజా ఉద్యమాలు పోరాటాల ద్వారా మార్చడానికి ప్రజా పోరాటాలు అమితంగా పనిచేస్తాయి. ప్రజా ఉద్యమాలకు సాహిత్యం పునాది అయినప్పుడు సాహిత్యం ఇలాంటి సందర్భంలో తన బాధ్యతను మరింత ఎక్కువగా నిర్వర్తించవలసిన అవసరం ఉంటుంది. కానీ సాహిత్యాన్ని సృష్టించే సృజన కారులకు ఆ సామాజిక చింతన, అసమ సమాజాన్ని సమ సమాజంగా స్థాపించాలనే సోయి, అసమానతలు అంతరాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేయడానికి పట్టుదల గనుక లేకపోతే సృష్టించే సాహిత్యం నిర్జీవమైనది మాత్రమే కాదు పైగా అది లక్ష్యాన్ని చేరుకోకపోగా ఈ సమాజాన్ని మరింత బ్రష్టు పట్టించే ప్రమాదం కూడా లేకపోలేదు. విద్యా సంస్థల్లో బోధనాభ్యసన ప్రక్రియలో పాల్గొని విద్యార్థులతో పాటు ప్రజల్లోపల కూడా రావలసినటువంటి మౌలికమైన పరివర్తనకు విద్యారంగంలో ఉపాధ్యాయులు, సాహిత్య రంగంలో సృజన కారులు క్రియాశీలక భూమిక పోషించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. అయితే వీటికి ఎక్కడో రాసిపెట్టబడి లేదు సమాజం యొక్క పరిణామ క్రమాన్ని, చలనశీలమైనటువంటి స్వభావం కలిగినటువంటి సామాజిక మార్పుకు ప్రతినిధులుగా ఉండడానికి సిద్ధపడిన వాళ్లు ఏ వర్గమైనా దీనికి అర్హులే. అందులో ముందు వరుసలో నిలబడవలసినది సృజన కారులు సాహిత్యకారులు కవులు కళాకారులు రచయితలు. ప్రక్రియ ఏదైనా కావచ్చు ప్రజల్లో ఆలోచన కలిగించి, మార్గాన్ని చూపించి,పరివర్తనకు దారితీసి,పరిణామ క్రమానికి బీజం వేయగలిగినది నిజమైన సాహిత్యం అదే నిజమైన కవిత్వం అంటే అతిషయోక్తి కాదు. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మొక్కుబడిగా జరుపుకోవాలని, కవితలతో కాలక్షేపం చేయడం, వర్ణనకు గిరిగిసుకొని , అచ్చయిన కవితను చూసి సంతోషపడడానికి మాత్రమే పరిమితమైతే అది నిజమైన సృజన కార్ల యొక్క కర్తవ్యం బాధ్యత కాదు. తాత్కాలిక ప్రయోజనాలను పక్కనపెట్టి శాశ్వత ప్రాతిపదిక మీద సమాజం యొక్క రూపురేఖలను మార్చడానికి సాహిత్యం ద్వారా ఏమేరకైనా కృషి చేయగలిగితే, అది సాధ్యమని తెలిస్తే, అందుకు నిరంతరం నిబద్ధతతో పనిచేస్తే అప్పుడు మాత్రమే కవులు కళాకారులు నిజమైన బాధ్యత పాత్ర పోషించినట్లు లెక్క. అందుకు ఈ ప్రపంచ కవిత దినోత్సవం ఒక స్ఫూర్తిగా ప్రేరణగా నిలబడాలని పాలకుల యొక్క దుశ్చర్యలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు హింస అణచివేతను నిర్బంధాన్ని ప్రయోగించడానికి సిద్ధపడినటువంటి పాలకవర్గాల గుట్టు రట్టు చేయడానికి నిక్కచ్చిగా ఎదురోడ్డి న వాళ్లే నిజమైన కవులు కళాకారులు సాహితివేత్తలు. ఈ విషయంలో సంపాదకులు జర్నలిస్టులు అనేకమంది సృజన కారులు సాహితీవేత్తలు కూడా కర్తవ్య నిర్వహణలో బలైన వాళ్ళు లేకపోలేదు. కానీ గత అనుభవాలతో పోల్చుకుంటే వర్తమానం రేపటి భవిష్యత్తు కూడా శూన్యమే అవుతుంది అనే సామాజిక అవగాహనతో సాహితీ కార్లు తమ కృషిని కొనసాగించవలసిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి స్ఫూర్తిని ప్రపంచ కవితా దినోత్సవం ద్వారా పొందడమే మన బాధ్యత అంతేకాదు ఈ వ్యవస్థ కోసం బలిపెట్టిన అమరవీరులకు మనమందించే నివాళి కూడా.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)