ప్లీజ్ ప్రాణం ఉండగానే పలకరించండి.

Apr 1, 2025 - 20:52
 0  4

కొనఊపిరిలోనైనా పరామర్శించండి. చనిపోయినాక మా వంతు భోజనాలo టూ పోటీ పడడం ఎందుకు?

మరణశయ్యపై కూడా పంతాలు పట్టింపులా? ---వడ్డేపల్లి మల్లేశం.

ఏ ఒక్క కుటుంబాన్ని గూర్చి ప్రత్యేకించి రాసినది ఏమీ కాదు ఎందుకంటే ఇలాంటి బలహీన బంధాలతో మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు అంతటా విచ్ఛిన్నమవుతున్న నేపథ్యంలో కత్తి మెడ పైకి వచ్చిన సందర్భంలో కూడా ఆలోచించి సమీక్షించుకొని వెనుక ముందు చూసుకోకపోతే ఎలా? గతంలో జరిగిన చిన్న సంఘటన, మాటలు జారిన నేపథ్యం, తల్లిదండ్రులు లేదా దగ్గరి బంధువుల ద్వారా తప్పుడు మాటలతో పెంచుకున్న అపనమ్మకం,, ఆదిపత్య ధోరణి, ఆస్తులు ఆదాయాలలో తేడాలు, కావాలని కొన్ని కుటుంబాలను చిన్న చూపుగా చూడడం వంటి కారణాలు ఏవైనా కొంతమంది కుటుంబ బంధాలకు కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోక అవమాన భారంతో కుంగిపోతున్న విషయాన్ని మనం అంగీకరించి తీరాలి. ఈ రకమైన నేరాలు చేస్తున్న వారికి చెంప చెల్లుమనిపించే మరొకరు సంబంధంలో ఉంటారని తెలుసుకోవడం అవసరం. నీ వరసలో నీవు తప్పు చేస్తే నీ పట్ల ఇతరులు కూడా అదే రకంగా వ్యవహరిస్తారని ఎందుకు ఆలోచించవు? మూర్ఖంగా వ్యవహరించి మానవ సంబంధాలను దూరం చేసుకుని కర్కషత్వానికి పాల్పడి ప్రేమ అనురాగాలకు తిలోదకాలిచ్చి ఏదో సాధించినామని బ్రమ పడితే ఒరిగేది ఏమీ లేదు. పైగా ఆ ఊరిలో, వాడలో, కుటుంబంలో, బంధువర్గంలో వెలి వేసినట్లు ఒంటరిగా మిగిలిపోతావు జాగ్రత్త! 

 సినీ కవి పాటలో వర్ణించినట్లు "నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ చావాలి రా చచ్చినాక నవ్వలేవు రా ఎందరేడ్చిన తిరిగి రావు అన్నట్లు" మన జీవన సంబంధాలను ఈ పాటకు వర్తింప చేసుకుంటే ఉన్నప్పుడే మాట్లాడండి ప్లీజ్! కడచూపుకైనా నోచుకోనివ్యాధిగ్రస్తులను పరామర్శించి కనికరించి కడుపు నింపండి!మనసు తృప్తి చేయండి. చచ్చినాక నవ్వలేనట్లే చనిపోయినాక మాట్లాడలేము. "కానీ ఏదో ఒక మూల బ్రతికి ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎదుటి వ్యక్తి ఎంత బాధ పడిందో రేపు నా గతి ఇలా అయితే ఎలా? నా పిల్లలు బంధువులు తోటి వాళ్ళు వాడవాళ్లు నన్ను చూస్తున్నారు కదా! నేను ఎంత కుమిలిపోవలసి వస్తుందో! మరీ వృద్ధాప్యంలో ధైర్యం లేని దీన పరిస్థితిలో బలహీన మనస్తత్వం నన్ను కన్నీటి పర్యంతం చేస్తే ఎ లా తట్టుకుంటాను?" అని బాధ పడవలసిన రోజులు వస్తాయి అంటే మన నుండి దూరమై మన మాటకు నోచుకోని వాళ్ళు కూడా ఇలాగే బాధపడ్డారు అని తెలుసుకుంటే మంచిది. అలాంటి దుర్భర పరిస్థితులు ఏ ఒక్కరికి రాకూడదు శత్రువు కైనా ఇలాంటి బాధలు రాకూడదు అని అప్పుడప్పుడు మన అనారోగ్యాన్ని గురించి ప్రస్తావించి మాట్లాడతాము అది సంతోషమే శత్రువుకు కూడా బాధలు రాకూడదని కోరుకోవడం మహోన్నతమైనది... కానీ నీ కన్న తల్లిదండ్రులను, నీ తోబుట్టువులను, నీ బందు వర్గంలోని పెద్దలను, వృద్ధాప్యంలో రోజులు లెక్కపెడుతున్నటువంటి వాళ్లను మాట్లాడకుండా హింసించి మానసిక క్షోభకు గురిచేసి ఏం సాధిస్తావు? నీవు ఒరగపెట్టేది ఏమిటి? నీ పిల్లలకు నీ తల్లిదండ్రులకు నీ కుటుంబ సభ్యులకు ఈ సమాజానికి నీవు ఇచ్చే సందేశం ఏమిటి? కుట్ర లు కుతంత్రాలు, నీచ మనస్తత్వాన్ని రూడి చేసుకోవడమే తప్ప.

మరణశయ్యపై ఈ పoతాలు పట్టింపులా? 

అందుబాటులో లేక ఇతర దేశాలలో ఉంటూ రాలేని పరిస్థితి ఉంటే వేరు కానీ అందుబాటులో ఉండి, ప్రతిరోజు చూస్తూ ఉన్నప్పటికీ, ఆ వైపుగా కన్నెత్తి చూడకుండా దూర ప్రాంతం నుండి వచ్చినప్పటికీ పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకోకుండా కావాలని వెలివేయడం మాట్లాడకపోవడం అంటే నీ మొండితనం ఏమిటి? " నా పిల్లలు బంధువులు వచ్చి నన్ను పలకరించలేదు, నన్ను కడసారై నా చూడలేదు అని ఆ వృద్ధులకు అనారోగ్యంతో ఉన్నవారికి తెలిస్తే ఎంత బాధ పడతారో ఎప్పుడైనా నీ బండరాయి మనసుతో ఊహించినావా? ఆలోచించినావా?

దయచేసి అలాంటి క్రూర మనస్తత్వంతో ఉన్నటువంటి వృద్ధులైన పెద్దలైనా పిల్లలైనా యువత అయిన మీ మనసు మార్చుకోండి! కఠిన పాషాణ హృదయంలోనైనా ఏ మూలకో ప్రేమ ఉంటుందని పెద్దలు అంటారు. ఆ ప్రేమను మీలో జ్వ లింపజేసి, మనసు మార్చుకొని, ప్రేమను పెంచుకొని, మానవ సంబంధాల పైన అవగాహన నింపుకొని, మీకూ జీవితం ఉన్నదని మీ జీవితాలు అలాగే అసంపూర్తిగా ముగిసిపోకూడదని భావించి ఇబ్బందుల్లో ఉన్నవారికి వృద్ధాప్యంలో ఉన్నవారికి అనారోగ్యములో నోటి మాట నోచుకోని వారికి మరణశయపైన రోజులు లెక్కపెడుతున్న వారికి నీ ప్రేమను పంచండి.... "చనిపోయిన తర్వాత మా వంతు భోజనాలకు మేము ఎన్ని డబ్బులైనా ఇస్తాం! మేము ఇక్కడ లేకపోయినా ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధం! మా వంతుకు ఎన్ని డబ్బులు అయినా పంపిస్తాం! అంటూ పోటీపడే మనస్తత్వం నీచమైనది. ఆ ఆలోచన నుండి బయటపడి ఏ మేరకైనా వీలైన ఇప్పుడే మనిషిని చూడండి, మనసెరిగి చూడండి, రేపటి మరణాన్ని దృష్టిలో పెట్టుకోకండి, భోజనాల కోసం పోటీ పడకండి.

అక్కడక్కడ ఇలాంటి నీచ మనస్తత్వానికి భిన్నంగా మనుమలు మనవరాన్లు ముది మనుమలు కూడా అమ్మమ్మలు తాతమ్మలు నాయనమ్మలు వృద్ధులైన రక్తసంబంధీకుల బంధువులను చూడడానికి వెళుతున్నట్లు సమాచారము తెలియగానే నాతో సహా కొంతమందికి చెప్పరాని అనుభూతి మిగులుతుంది. అయ్యో ఇలాంటి హృదయాలు అందరికీ ఎందుకు లేవు? పేద నిరక్షరాస్య కుటుంబాలలో కూడా ప్రేమకు ఆత్మీయతకు కొరతలేదు కానీ ఆస్తులుండి ఉన్నత విద్యావంతులైన వారికి కూడా ఆ మనసు లేకపోతే వారి వల్ల ఎందరో అభాగ్యులు ప్రేమకు నోచుకోవడం లేదు. ఏదో కోల్పోయినట్లుగా దుఃఖపడుతున్నారు.నోట మాట రాని వాళ్ళు సైగ చేస్తూ కన్నీరు పెడుతున్నారు తామేదో కొందరికి దూరమైనట్టు మేము వాళ్లకు ఏం నష్టం చేశాము ఏం ద్రోహం చేశాము అని ప్రశ్నించే ధోరణి వారి చూపుల్లో వ్యక్తం అవుతుంటే అక్కడ ఉన్న వాళ్లకు సంబంధం లేని వాళ్లకు కూడా దుఃఖం ఆగడం లేదంటే సంబంధం ఉన్నవాళ్లు ఇంత పాషాణ హృదయంతో జీవించడాన్ని ఎలా తట్టుకోగలం ? ఇప్పటికే కన్న కొడుకుతో సహా కోడండ్లు మూగ భాషలో ముదిమి వయస్సులో నరకాన్ని చూపిస్తుంటే తట్టుకోలేని తల్లిదండ్రులు కొడుకుల బిడ్డల పిల్లలైనా వచ్చి పలకరిస్తారేమోనని ఆశపడుతూ ఉంటే ఆ ఆశ కూడా తీర కపోతే నిజం గా వాళ్ళ జీవితాలకు నిరాశ కాక మరేంటి.?

మానవ సంబంధాలు విచ్చినం కావడం వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు అంతా కాదు .అసూయ ద్వేషాలు పగలు, పంతాలు పట్టింపులు, హింస హత్యలు ఆత్మహత్యలు, ఆస్తుల విధ్వంసం పరస్పర నిందలు, కోపతాపాలు తప్ప .ఈ వైరుద్యాలు సంఘర్షణ నుండి సమాజాన్ని రక్షించలేమా? ప్రతి కుటుంబంలో మానవీయ కోణంతో ఆలోచించే వ్యక్తులను తీర్చిదిద్దుకోలేమా? శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందిన మని గర్వంగా చెప్పుకుంటున్న నాగరిక ప్రపంచం అయినప్పటికీ కూడా మానవ సంబంధాలు కుటుంబ బంధాలను కనీస స్థాయిలో కూడా కాపాడుకో లేకపోవడం సిగ్గుచేటు. ఈ దుస్థితికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పడవలసిందే! విద్యా సిలబస్లో, సామాజికంగా కొన్ని స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో, ప్రభుత్వ పరమైనటువంటి మానవ సంబంధాల కమిటీల తో కుటుంబ బంధాలు మానవ సంబంధాల లో ఏర్పడిన పగుళ్లను మరమ్మతు చేయడానికి ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉంది. "తోటి మనిషిని సాటి మనిషిగా చూడలేని మనం గొప్పలు చెప్పుకోవడం, విశ్వ మానవ కళ్యాణానికి పాల్పడుతున్నామని ఎగిరి గంతులు వేయడం, సమ సమాజ స్థాపన మా లక్ష్యం అని చెప్పుకోవడం మాట వరసకే తప్ప అది ఏ రకంగా సాధ్యం? నేల విడిచి సాము చేయడం ఎంత అసాధ్యమో మానవ బంధాలను పటిష్ట పరచకుండా వ్యవస్థను బలంగా నిర్మించడం కూడా అంతే. కష్ట సుఖాలలో ఆపద సంపదలో కూడా ఇరుగుపొరుగు తోటి వాళ్ళు బంధువులు కుటుంబ సభ్యులు సమాజంలోని భిన్న వర్గాల వాళ్లే కదా మనకు ఆసరాగా తోడుగా భరోసాగా నిలబడేది.... ఈ మానవ సంబంధాల బలోపేతానికి వీలైనన్ని మార్గాలను వెతుకుదాం !చట్టపరంగా న్యాయపరంగా సమాజపరంగా కుటుంబ పరంగా మార్గాలను అన్వేషిద్దాం! ఇలాంటి సమస్యల పరిష్కారంలో చర్చలు సర్వత్రా సాగాలని కోరుకుందాం! పలు సూచనలను స్వీకరించడం ద్వారా మనుషుల మధ్యన ఏర్పడిన పగుళ్లకు మరమ్మత్తు చేద్దాం! చెదలు పట్టిన మానవ స్వభావానికి జీవం పోద్దాం! తద్వారా మానవుడే మహనీయుడు శక్తియుతు డు యుక్తిపరుడు అన్న మాటను నిజం చేయడానికి కుటుంబ బంధాలను బలోపేతం చేసే ఉత్కృష్ట కార్యక్రమాల ద్వారా జీవం పోద్దాం. ఆ మార్పును, ప్రక్షాళన సంస్కరణను మనతోనే ప్రారంభిద్దాం. మన మనసులను కడుక్కుందాం, వీలైనన్ని మార్గాలను అన్వేషిద్దాం ఈ చర్చలో పాల్గొనాలని మనసారా ఆహ్వానిస్తూ...

(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333