రచన అంటే ప్రజల పక్షాన చేసే యుద్ధమే.
అంటే రచయితలు, కవులు, కళాకారులు, బుద్ధి జీవులు, సామాజిక చింతన కలవారంతా యుద్ధ వీరులే కదా!
--వడ్డేపల్లి మల్లేశం
తెగలు, జాతులు, భాషల అస్తిత్వంకోసం, అణచివేత నుండి కొన్ని వర్గాల విముక్తి కోసం ఇప్పటికీ పాలకుల పైన ఆ పీడిత వర్గాలు పోరాడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ వర్గానికి వంత పాడినట్టుగానే అనేక ప్రభుత్వాలు కూడా అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాలకు కాకుండా సంపన్న వర్గాలకు లేదా పీడించే వర్గాలకు మాత్రమే వo తపా డడాన్ని మనం గమనించవచ్చు. మణి పూర్ లో రెండు జాతుల మధ్యన అస్తిత్వం కోసం పోరాటం కొనసాగుతూ ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వర్గాల మధ్యన ఉన్నటువంటి వైశమ్యాలు వివక్షతను శాస్త్రీయంగా పరిశీలించకుండా కేవలం ఒక వర్గానికి మద్దతు పలికిన కారణంగా అక్కడ జరిగిన మారణకాండ, స్త్రీలపై కొనసాగినటువంటి అమానవీయ ఘటనలు, రాష్ట్రం అగ్నిగుండంగా మారిన అనేక సందర్భాలను ఇక్కడ మనం ప్రస్తావించవచ్చు. అంటే పోరాడే వాళ్లు చేసే పోరాటంలో ఉన్న న్యాయం ఎంత? మెజారిటీ ప్రజల కోసం కొనసాగుతున్న పోరాటమేనా? అక్కడ ఉన్న బుద్ధి జీవులు మేధావులు ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు? నిజంగా ఎవరు అణచివేత వివక్షత గురవుతున్నారు? అనే ఆలోచన కనుక పాలకవర్గాలకు లేకపోతే ఎక్కడైనా ఇలాంటి ఘర్షణలకు ఆస్కారం ఉంటుంది. ప్రపంచంలో అనేక దేశాలలో మాదిరిగా భారతదేశంలో కూడా అసమ సమాజం స్పష్టంగా మన కళ్ళ ముందు తన వైకల్యాన్ని ప్రదర్శిస్తున్న విషయాన్ని ఎవరు కాదనలేరు. అసమానతలు అంతరాలు దీర్ఘకాలం కొనసాగడానికి న్యాయబద్ధమైన కొన్ని పోరాటాలను పరిశీలించకుండా వ్యతిరేక నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకొని అణచివేస్తున్న కారణంగా కూడా ప్రజా పోరాటాలకు చోటు ద క్కకపోగా పీడించే వాళ్లే పాలకులుగా చలామణి కావచ్చు అనే సంకేతం వెళుతున్నది ఇది చాలా బాధాకరం. ఈ పరిస్థితులలో వ్యవస్థ లో పాలకులు ప్రజలను వంచించడం, మోసగించడం, బానిసలుగా చూడడం, ఉద్యోగ వ్యవస్థలో బానిసత్వం, రాజ్యాంగబద్ధమైన హక్కులకు పాలకులు మంగళం పాడి ప్రజల హక్కులను హరించడం, ప్రజా ధనాన్ని కొల్లగొట్టడం, కొద్దిమంది చేతిలో ప్రజా సంపద బందీ కావడం, ప్రభుత్వమే అసమానతలు అంతరాలను పెంచి పోషించడంతోపాటు క్లబ్బులు పబ్బులు ఈవెంట్లు ధూమపానం మద్యపానం మత్తు పదార్థాలు అనారోగ్యక కారక వస్తువులను అనుమతించి యువతను ప్రజానీకాన్ని నిర్వీర్యం చేయడం వంటి పరిస్థితుల పైన కవులు కళాకారులు మేధావులు బుద్ధి జీవులు సమరభేరి మ్రోగించాలి. ప్రజల పక్షాన చేసే యుద్ధమే రచన ప్రతి రచయిత సైనికుడే, సైనికురాలే :-
సామాజికంగా కొన్ని వైరుధ్యాలు అందవిశ్వాసాలు తప్పుడు భావనలు ప్రజలను కొల్లగొట్టి అరాచక అకృత్యాలతో పాటు ముఖ్యంగా మహిళలు కార్మికుల పైన జరుగుతున్నటువంటి దాడులు చాలా బాధాకరం. ఉద్యోగ వ్యవస్థలో కూడా సమాన పనికి సమాన వేతనం కాకుండా కొంతమందితో వెట్టి చాకిరీ చేయించుకోవడానికి ఔట్సోర్సింగ్ కాంటాక్ట్ పద్ధతిలో ఉద్యోగుల నియామకంలో మనం చూడవచ్చు. పని మిగతా ఉద్యోగుల మాదిరిగానే ఉన్నప్పటికీ వేతనం మాత్రం నామమాత్రాంగా ఉండడాన్ని గమనిస్తే ఈ అంతరాలు ఏ ప్రయోజనం కోసం పాలకులు తెలుసుకోవాలి. అందుకే పాలకులకు తెలియజేయవలసిన బాధ్యత రచయితల పైన ఉన్నది ఇది నిజంగా ఒక పోరాటమే. సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు, సవాళ్లకు పరిష్కారాలను చట్టసభల్లో ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడమే కాదు ప్రభుత్వం మెడలు వంచి ఒత్తిడి చేసి ఆచరణకు సిద్ధపడేలా చేయాలి. కానీ పాలకులు అంత సులభంగా ప్రజల సమస్యలు పరిష్కరించరు. అంతెందుకు ఉచిత విద్యా వైద్యం రాజ్యాంగంలో రాసుకున్నా , అంబేద్కర్ హెచ్చరించినా పాలకులు ఇప్పటికీ ఏ ఒక్కనాడు కూడా తమ ప్రకటనల్లో మ్యానిఫెస్టోలో పొందుపరచకపోవడం సిగ్గుచేటు కాదా! విద్యారంగంలోనైతే అనేక అంతరాలు అసమానతలు బడ్జెట్లో అధిక నిధులు కేటాయించకపోవడం, కామన్ స్కూల్ ప్రవేశపెట్టక కులాల వారిగా పాఠశాలలతో కుల వ్యవస్థను పెంచి పోషించడం వంటి అనేక దుర్మార్గపు విధానాలు కొనసాగుతున్నవి. చట్టసభల్లో ప్రతిపక్షాలు పాలకపక్షాలు కూడా ఒకే రకంగా వ్య వహ రించడం నవమాత్రంగా యుద్ధం చేయడం అది నిజమైన యుద్ధం కాదు. అందుకే పాలకుల పైన ఒత్తిడి చేయడానికి నిజమైన యుద్ధం చేయవలసింది కవులు కళాకారులు మేధావులు. రాసే రచనల్లో సామాజిక అంశాలతో పాటు రాజకీయపరమైనటువంటి అంశాలను సవాలుగా తీసుకొని ప్రభుత్వాలపైన ఎక్కు పెట్టాల్సిన అవసరం ఉంది. సంభాషణలు కవితలు, కథలు, నాటకాలు చిత్రలేఖనము వ్యాసాలు అనేక రకాల ప్రక్రియల ద్వారా కవులు రచయితలు కళాకారులు మేధావులు ప్రజల దృష్టికి తీసుకు వెళ్లడంతో పాటు పాలకులు, సిగ్గుపడేలా గుర్తించేలా చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ప్రజాజీవితమంతా రాజకీయంతో ముడిపడితే రాజకీయమే సాహిత్యనికి మూలమైన నేపథ్యంలో అరాచక రాజకీయంపైన సాహిత్యకారులకు అమితమైన బాధ్యత ఉంటుందనేది అంగీకరించి తీరాలి.
అంటే సాహిత్య లోకం నిజంగా ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన అవసరం ఉంది నిజమైన యుద్ధ వీరులుగా శాంతిని కోరే శాంతి కాముకులుగా యుద్ధాన్ని రెచ్చగొట్టే పాలక ఇతర పెట్టుబడిదారీ వర్గాల యొక్క దమన నీతిని ఎండగట్టే విధంగా రచనలు కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కుబడి వర్ణనలు, అంద విశ్వాసాలను పెంచే రచనలు, లక్ష్యం లేని సాహిత్యం, సామాజిక ప్రయోజనం లేని రచనలు సమాజం అంగీకరించకూడదు. అలాంటి రచయితలను బహిష్కరించవలసిన అవసరం కూడా ఎంతగానో ఉన్నది. అప్పుడు మాత్రమే నిజమైన సాహిత్యాన్ని ప్రజలు ఆమోదిస్తారు ప్రజల పక్షాన పని చేయడానికి కవులు రచయితలకు అవకాశం లభిస్తుంది.తోటి మనిషిని సాటి మనిషిగా చూడలేనటువంటి అమానవీయ సంఘటనలకు ఈనాడు సమాజం నిలయమైనది అలాంటి పరిస్థితుల నుండి తప్పించడానికి,నైతిక విలువలను పునరుద్ధరించడానికి, సమానత్వాన్ని సాధించడానికి, వివక్షత, పేదరికం, నిరుద్యోగము, ఆకలి చావులు, ఆత్మహత్యల వంటి వాటిని ప్రధానంగా రచన అంశాలుగా ఎక్కుపెట్టి పాలకుల పైన యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ప్రజల పక్షాన ఇప్పటికీ ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు కానీ ప్రభుత్వాలు మాత్రం ధమన నీతిని ప్రయోగించి, నిర్బంధంగా అణచివేతకు పాల్పడి, రాజ్య హింస కొనసాగిస్తుంటే వేలాదిమంది బలవుతున్న విషయాన్ని కూడా గమనించవలసిన అవసరం ఉంది. అనుకూలమైనటువంటి అంశాల పైన సానుకూల దృక్పథాన్ని ప్రకటిస్తూనే వ్యతిరేక అంశాల పైన రాజీ పడకుండా పోరాటం చేసే యుద్ధ వీరులు రచయిత కవి కళాకారులు. యుద్ధం తప్పకుండా నిరంతరం కొనసాగాలని కాదు కానీ శాంతియుత సమభావనతో సమానత్వం ప్రాతిపదికగా సామ్యవాద ధోరణిలో కొనసాగాలనేది ప్రజల విశ్వాసం. సమసమాజ స్థాపనకు అడ్డుకట్టలు వేసే పెట్టుబడిదారీ వ్యవస్థ గాని రాజ్యహింసను కానీ ఖచ్చితంగా ప్రతిఘ టించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. ఎందుకంటే పాలకులకు ప్రజల ప్రయోజనాల కన్నా స్వ ప్రయోజనాలేమిన్నా. ఎవరి రక్షణ కోసం వాళ్లు పోరాడాల్సిందే ఎవరి సమస్య కోసం వాళ్లు నడుం కట్టాల్సిందే. అందుకే ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలు సాహిత్య వస్తువుగా స్వీకరించి సామాజిక చింతనతో వివిధ కళారూపాలు కథ వ్యాసము వివిధ ప్రక్రియలలో ఎక్కుపెట్టి సంధించడం ద్వారా నిజమైన యుద్ధ వీరులుగా సాహిత్య కారులు నిలబడవలసిన అవసరం ఉన్నది. ప్రతి రచయిత కవి కళాకారుడు కూడా తన స్వప్రయోజనం కంటే సమాజ ప్రయోజనం మిన్నగా సాహిత్యానికి అత్యున్నత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించినప్పుడే నిజమైన సాహిత్యం వర్ధిల్లుతుంది, సమ సమాజం సాధ్యమవుతుంది, మరో నూతన ప్రపంచం ఆవిష్కృతం అవుతుంది.
బాల సాహిత్యంలో కూడా ఈ రకమైన మార్పు చోటు చేసుకున్నప్పుడే ప్రశ్నించే తత్వాన్ని స్వభావాన్ని నిల దీసే మనస్తత్వాన్ని ప్రతి మనిషిలో నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలు, కార్మిక వివిధ ఆస్తిత్వవాధ ఉద్యమాలకు సంబంధించినటువంటి సమస్యల పైన పోరాడే క్రమంలో ప్రజలు ప్రజాస్వామిక వాదులకు రచయితలు మద్దతుగా భరోసాగా నిలబడాలి. పాలకులు, పెట్టుబడిదారీ వర్గం, ఉగ్రవాధ ముఠాలు ప్రజలపై ప్రజాస్వామ్యవాదులపై మేధావుల పైన చేస్తున్నటువంటి అక్రమ ప్రయోగాలు అణచివేత నిర్బంధాన్ని ప్రజా ఉద్యమాల శక్తితో ఉక్కు పాదం మోపాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. "ప్రజల మీద పాలకులు చేస్తున్న యుద్ధం అసహజం, అవివేకం, అమానవీయం. కానీ పెట్టుబడిదారీ వర్గం, ఉగ్రవాద ముఠాలు, పాలకుల పైన ప్రజలు ప్రజాస్వామికవాదులు సృజన కారులు సాహితీవేత్తలు చేస్తున్న యుద్ధం సమంజసం న్యాయమైనది ధర్మబద్ధమైనది. సమసమాజ స్థాపనకు దారి తీసేదిగా అంగీకరించినప్పుడు మాత్రమే అసమ సమాజాన్ని సమ సమాజoగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో సాహిత్య రంగం గురుతరమైన పాత్ర పోషించవలసిన అవసరం ఉంది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు రసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)