కాళోజీ మాటలను అమలు చేయడానికి పోరాడవలసిన బాధ్యత ప్రజలదే
ప్రాంతే తరుడు దోపిడీ చేస్తే ప్రాంతం దాకా తర్ముదం.. ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేద్దాం"* పీడనకు గురైన సోయిలేని మనం కాలోజీ స్ఫూర్తితో అణచివేతను ప్రశ్నించాలి.*
************
--వడ్డేపల్లి మల్లేశం
---09...09...2024(కాళోజీప్రతేక వ్యాసం)
పీడన దోపిడీ వంచన భారతదేశంలో సర్వత్ర కనపడుతున్న కొనసాగుతున్న అరాచక కృత్యాలు . ఇటీవల మణిపూర్లో ఒక వర్గంపై ప్రత్యేకంగా జరిగిన దాడులు, వాటికి పరాకాష్టగా నగ్నంగా ఊరేగించిన అరాచక దృశ్యాలు, నెలల తరబడి బయటికి రాకుండా ఉంచినటువంటి దుర్మార్గ పాలన, ఆ పాలనకు వ0 త పాడుతూ మౌనంగా ఉండి పోయిన కేంద్ర ప్రభుత్వం , అవిశ్వాసం ప్రకటిస్తే గాని మాటరాని ప్రధానమంత్రి ఇవన్నీ దేనికి సంకేతాలు? ఒక్కసారి ఆలోచించుకోవాలి దేశ ప్రజలు. సుమారు 17 లక్షల కోట్ల రూపాయల రుణ ఎగవేతదారులకు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేటు పరం చేస్తూ ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ భవిష్యత్తు భారతానికి రక్షణ లేకుండా చేస్తున్నటువంటి పాలన పరోక్షంగా దోపిడీ పీడన వంచన కాక మరేమవుతుంది ? ప్రభుత్వ పెద్దలతో పాటు కార్పొరేట్ శక్తులు, పెట్టుబడి భూస్వాములు, గుండాలు, నేరస్తులు, భూ కబ్జాదారులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాత్ర పోషిస్తూ ఉంటే కాళోజీ మాటలను అమలు చేయాలంటే ఎక్కడ ప్రారంభించాలో ఎక్కడ ముగింపు చేయాలో ఎవరిని బోనులో నిలబెట్టాలో ప్రజా కోర్టులో శిక్షించాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఆందోళనలో ఉన్నారు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టసభలకు ఏనాడు రానటువంటి నాయకుడు కొన్ని మాసాల పాటు జైలు శిక్ష అనుభవించి నేరారో పణతో నేరస్తుడి గా ముద్ర పడినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర పాలకుడుగా కొనసాగుతూ ఉంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలను ప్రజా సంఘాలను ఉద్యోగ సంఘాలను ప్రతిఘటించినటువంటి అన్ని వర్గాలను కూడా ఎక్కడికక్కడ అణచివేస్తున్న విధానం చూస్తే ఇది దోపిడీ వంచన కాదా? హక్కులను కాలరాస్తూ రాజ్యాంగానికి తీరని ద్రోహం తలపెడుతున్న పాలక పక్షాలను ఎక్కడి దాకా తరుముదాం? ఎక్కడ పాతర వేద్దాం? ఎవరు ముందుకు వచ్చి ఈ శిక్షను అమలు చేయాలి ? ఒక నేరస్థుడు రాష్ట్ర పాలకులుగా కొనసాగడానికి అనర్హుడే అయినప్పటికీ అనుమతించినటువంటి చట్టం, ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజలు అతని అరాచకాలకు తిరిగి రీ కాల్ చేసే పరిస్థితి లేకపోవడం వలన దుర్మార్గ పాలన అనుభవిస్తున్నారు . నేరస్తుడు ఎవరైనా శిక్ష పడాల్సిందే నేరస్తులకు చట్టసభలు ఆలవాల0 కావడం ఆందోళనకరం.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉమ్మడి పరిపాలన సందర్భంగా పాలకుల యొక్క వివక్షత నేపథ్యంలో కాళోజీ మాట్లాడిన ఈ మాటలు కేవలం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేస్తే
కాళోజీ కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన వాడవుతాడు . తన మాటల్లో ఎక్కడా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే ప్రస్తావన లేదు. అది రాష్ట్రాల సరిహద్దులకు దేశ సరిహద్దులకు కూడా ఆ మాటలను వర్తింప చేసుకోవచ్చు పాలకుల యొక్క తీరును బట్టి .దోపిడి, అణచివేత ,పీడన, నిరంకుశత్వం వైపు వ్యక్తులు సమూహాలు నేరగాళ్లు కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారులు చివరికి పాలకులు ఎవరైనా పాల్పడితే వారందరికీ కూడా ఈ శిక్షను అమలు చేయవలసిందే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలన సందర్భంగా ప్రజల మధ్యన ఎలాంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేవు . రాష్ట్రానికి తెలంగాణ ప్రాంతానికి ఒకవేళ ద్రోహం జరిగినది అంటే దురాలోచనతో ఉన్న నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఒక కారణమైతే, అందుకు సమ్మతించి తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా నేరస్తులే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులను రాష్ట్రము నుండి తరిమి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని కలలు కంటూ కాళోజి మాటలు నిజం చేసినామని సంబరపడుతున్న పాలకవర్గం తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి గత తొమ్మిదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో చెప్పవలసిన అవసరం ఉన్నది. ప్రాంతానికి చెందిన వాడే పాలకులు గా కొనసాగుతూ ఉద్యమంలో పని చేసిన వారు ప్రస్తుతం పార్టీలో కానీ మంత్రివర్గంలో కానీ లేకుండా ఎక్కడి వాళ్ళను అక్కడ తరిమివేసి ప్రశ్నించేవారు లేకుండా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసినటువంటి ఆనాటి కొన్ని రాజకీయ పార్టీల నాయకులను బారాసాలో కలుపుకొని తెలంగాణ రాష్ట్ర పాలన కొనసాగిస్తుంటే బారాసా ఉద్యమ పార్టీ ఎలా అవుతుంది? Brs పరిపాలన ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ఉన్నప్పుడు పరిపాలకులకు వేయవలసిన శిక్ష కాళోజీ ప్రకారంగా ఏమిటో ప్రజలు ఆలోచించుకోవాలి ₹
-రాష్ట్ర సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు మాత్రమే అప్పజెపుతున్న పాలనకు అనేక ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి.
-- ఇచ్చిన హామీలు వాగ్దానాలు నెరవేర్చబడలేదు ప్రధానంగా రాష్ట్ర పాలనను దళితులకు అప్పగిస్తానని చేసిన హామీ మరిచి వంచనకు గురి చేసిన విషయం మనందరికీ తెలిసిందే . భూస్వాములు పెట్టుబడిదారులు వ్యవసాయం చేయకుండానే గు ట్టలు అడవులు ఇండ్ల స్థలాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరున కోట్ల రూపాయలు కుమ్మరిస్తుంటే ఇది పేద ప్రజలను దోపిడీ చేసినట్లు కాదా? అనుత్పాదక రంగాలపైన కోటాను కోట్ల రూపాయలు వె చ్చించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచక ,పేదరికాన్ని నిర్మూలించక, కాయిలా పడిన పరిశ్రమలను తెరిపించక , ఒక్క కొత్త పరిశ్రమ కూడా ప్రభుత్వ రంగంలో ప్రారంభించక కేంద్ర ప్రభుత్వాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించడంలో అర్థం ఉందా ? ఇది అమాయక ప్రజలను మరింత వంచనకు గు రి చేయడం కాదా ?
- ఉద్యమ సమయంలో గుట్టలు, ప్రకృతి విధ్వంసాన్ని ఉమ్మడి రాష్ట్రంలో విమర్శించిన బారాస స్వరాష్ట్రంలో పాలకులు మంత్రులే గుట్టల విధ్వంసానికి పూనుకుంటూ ఉంటే ఇది దోపిడీ కాదా?
-- పరిమితం చేయవలసిన మద్యపానాన్ని క్లబ్బులు పబ్బులు దా బా లను చట్టబద్ధం చేసి రాత్రి వరకు కొనసాగించేలా అనుమతించి బయటికి రాగానే డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో శిక్షిస్తున్నటువంటి ద్వంద్వ విధానం ప్రజలను అవమానించడం కాదా ? 0.5 శాతం ఉన్నటువంటి సామాజిక వర్గం చేతిలో పాలన కొనసాగుతుంటే, ఐదు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ చట్టసభల్లో ఊరేగుతూ ఉంటే, అన్ని రాజకీయ పార్టీల నాయకత్వం ఆధిపత్య కులాల చేతిలో ఉంటే ,60 శాతం ఉన్న బీసీ వర్గాలు మౌనంగా ఉండేలాగా బానిసలుగా తయారుచేసిన ప్రభుత్వ విధానం దోపిడీ కాకుండా మరి ఏమవుతుంది?
Brs ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజానీకానికి చేస్తున్నటువంటి ద్రోహానికి అణచివేత పీడన వంచనకు ఐక్యత లేని ప్రజానీకం ఆకర్షణ పథకాలకు బానిసలుగా మారుతూ ఉంటే , కులాల పేరుతో సమీకరించి చట్టాన్ని పాలకులు ఉల్లంఘిస్తుంటే, బీసీ వర్గాలు ఇప్పటికీ ఆయా రాజకీయ పార్టీలలో తలవంచి బానిసలు గా జెండాలు మోస్తూ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతూ ఉంటే ప్రభుత్వం దోపిడీపీడిన చేయకుండా మరేం చేస్తుంది ?
కాలోజీ మాటలను నిజం చేయాలంటే ప్రాంతం వాళ్లే దోపిడీ చేస్తే ప్రాణాలతో పాతరేద్దాం అన్న మాటలకు పాలకులకు వేయాల్సిన శిక్షను ఖరారు చేయవలసింది ప్రజలే . ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే జాగ రూకు లైన ప్రజావళి అవసరమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరిస్తే , ప్రజలు నిస్తేజంగా బానిసలుగా యాచకులుగా బతుకుతూ ఉంటే , మేధావులు మౌనంగా పాలకవర్గాల కొమ్ముకాస్తూ ఉంటే, విద్యావంతులు తమకేమీ పట్టనట్లు స్వార్థానికి ఒడిగడుతూ ఉంటే స్వరాష్ట్రంలో కూడా మనం పీడనకు గురవుతున్నాం భవిష్యత్తులో కూడా గురి కావలసినదే. రాష్ట్ర ఏర్పాటు అనేది ఒక బూటకం అది అధికారం కోసం ఆరాటపడినటువంటి నాటకం అని గ్రహించినప్పుడు మాత్రమే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో దళితులు ఆదివాసీలు బహుజనులు ఆనాటి ఉద్యమ నాయకత్వాన్ని తెలంగాణలో మా వాటా ఏమిటి? అని అడిగినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చర్చించుకుందాం అని దాటవేసి ప్రజా సంఘాలను దారి మళ్లించి అందరి సహకారాన్ని తీసుకొని బారాస నాయకత్వంలో పాలన తెచ్చుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో కంటే స్వరాష్ట్రంలో అణచివేత నిర్బంధం సాచివేత వైఖరి విద్యారంగం ఇతర ఇతర రంగాల ప్రైవేటీకరణతో రాష్ట్రం వెనుకబడి పోతుంటే ఇదంతా దోపిడీ కాదా? శిక్ష ఎవరికి వేద్దాం ? ఏ శిక్ష వేద్దాం ? తెలంగాణ అనే పదాన్ని వాడడానికి ఇష్టపడని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంపై దాడులు చేసిన వాళ్లు నేడు రాష్ట్ర పాలన కొనసాగిస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం దోపిడి ఇంకేమైనా ఉంటుందా ? అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా నేరం ఎక్కడున్నా శిక్ష పడాల్సిందే అనే రాజ్యాంగబద్ధ సూక్తి ప్రకారంగా మన హక్కులను కాపాడుకునే విషయంలో రాజీ లేకుండా పోరాడాలి. మన పోరాటంలో న్యాయబద్ధమైన డిమాండ్లు, నేరస్తులకు శిక్షలు , ఆకాంక్షల అమలు కోసం ఒత్తిడి చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ 2011లోనే హెచ్చరించినట్లుగా మరోసారి తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని ఉద్యమాన్ని ప్రారంభించడమే మన ముందున్న కర్తవ్యం .ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం brs కు భిన్నంగా పాలన చేస్తేనే అర్థం వుంటుంది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ చౌటపల్లి జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)