నిద్రలేమి కారణాలు నివారణ చర్యలు
నిద్ర ప్రాధాన్యత, ఆహారానికి నిద్రకు గల సంబంధాలు
నిద్రలేమి అనర్థాలు, పరిష్కార మార్గాలను తెలుసుకుందాం .అవగాహన పెంచుకుందాం...
--- వడ్డేపల్లి మల్లేశం
ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలు ఏవైనా నిద్ర యొక్క ప్రాధాన్యత అందరికీ సమానమే మంచి నిద్ర రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు, మానసిక ప్రశాంతతకు, స్థిరత్వానికి, ఉల్లాసానికి ఉత్సాహానికి ఇతోదికంగా పనిచేస్తుందని నిపుణులు ఏ నాడో తెలియజేశారు. వైద్యపరమైన సాంకేతిక అంశం అయిన నిద్ర వెనుక అనేకమంది మేధావులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, వైద్యుల యొక్క కృషి సూచనలు సలహాలు ఉన్నప్పటికీ సామాన్య మానవాళికి అందుబాటులో ఉండే విధంగా నిద్రను గురించి తెలుసుకోవడం ద్వారా తగు చర్యలు తీసుకోవడానికి జాగ్రత్త వహించడానికి ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఈ వ్యాసం తోడ్పడుతుందని భావించి సమాచారాన్ని సేకరించి పాఠకుల ముందు ఉంచడం జరుగుతున్నది . అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ విషయం పైన చర్చ జరిగిన సందర్భంలో లేదా నలుగురు కూడి న చోట తమకున్నటువంటి అవగాహన ఆలోచన సరళిని 10 మందితో పంచుకోవడానికి ఉపక్రమిస్తే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అవగాహన రాహిత్యంతో అనారోగ్యం బారిన పడే ప్రమాదం నుండి సులభంగా తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నిద్రకు ఉపక్రమించిన తర్వాత అతిగా ఆలోచనల వైపు మనసును జారకుండా కాపాడుకోగలిగితే సుఖ నిద్రకు అవకాశం ఉంటుందని డాక్టర్ షరీమాహ్ తన పరిశోధన ద్వారా తేల్చినట్లుగా తెలుస్తున్నది . ఆలోచనలకు కళ్లెం వేయడంతో పాటు మసక వెలుతురులో నిద్రకు అనుకూల వాతావరణ ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు . ఊపిరిని గాఢంగా తీ సుకొని వదలడం వంటి చర్యలతో నాడీ వ్యవస్థ విశ్రాంతి పొంది నిద్రకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని పరిశీలకుల అభిప్రాయం .
కొన్ని అంచనాల ప్రకారంగా ప్రపంచ జనాభాలో సుమారు 10 శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమితో బాధపడుతున్నట్లు, 30 నుండి 60 శాతం మంది తరచుగా నిద్రలేమితో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియచేస్తున్నాయి . నిద్రరాకపోవడానికి గల కారణాలను సాన్ ఫ్రాన్సిస్కోలోని పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ షరీమాహ్ తెలిపిన వివరాల ప్రకారం గా మద్యం, కాఫీ, టీ ,కూల్ డ్రింక్స్ , వేపుడు వంటకాలు, తీపి పదార్థాలు, టమాటాలు, టమాటాలతో తయారు చేసిన పదార్థాలు, ఐస్ క్రీములు, చాక్లెట్లు తీసుకోవడం ద్వారా నిద్రను దూరం చేస్తాయని తెలుస్తున్నది. ఇక అంతే కాకుండా జీవనశైలిలోని తప్పిదం ,కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యల వంటివి కూడా నిద్ర సకాలంలో రాకపోవడానికి దీర్ఘకాలంలో నిద్రలేమికి కారణాలు అవుతున్నట్లుగా తెలుస్తున్నది .
నిద్రలేమితో శరీరానికి ఒనగూరే అనర్థాలు-చర్యలు
******
సాధారణంగా 7 నుండి 8 గంటల పాటు మనిషికి నిద్ర అవసరమని పిల్లలకు మరీ ఎక్కువ కాలం నిద్రించడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్న సందర్భంలో నిద్రలేమి వలన కలిగే అనర్థాలను గురించి తెలుసుకోవడం ద్వారా మరింత జాగ్రత్త పడడానికి పరిష్కార మార్గాలను వెతకడానికి అవకాశం ఉంటుంది.
-- నిద్రలేమి వలన చురుకుదనము లోపించి సమయస్ఫూర్తి మానసిక ప్రశాంతతకు దూరమయ్యే అవకాశం ఉన్నది.
-- రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉన్నది.
-- వాహనాలు నడిపే టప్పుడు ప్రమాదాలు జరగడంతో పాటు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది .
-- పిరికితనం, ఆందోళన , నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆత్మ న్యూనతకు గురి కావడం తో పాటు భయం బారినపడి శారీరక మానసిక వ్యక్తిత్వం దెబ్బతింటుంది.
-- దీర్ఘకాలికంగా నిద్రలేమికి గురైన వాళ్ళు గుండె జబ్బులు, రక్తపోటు, పక్షవాతం , నరాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది .నిద్రలేమి కారణంగా ఏదో చిరుతిండికీ అలవాటు పడడంతో స్థూలకాయం కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు.
ఇక పరిసరాల పరిశుభ్రత, ఇంటి వాతావరణంలో నవ్యత నాణ్యత నూతనత్వం వంటి అవకాశాలను కల్పించుకోవడంతోపాటు రాత్రిపూట తేలికైన భోజనం మాత్రమే చేయడం, ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ప్రతిరోజు తగిన స్థాయిలో వ్యాయామం చేయడంతో నిద్రలేమి నుండి తప్పించుకునే అవకాశం ఉన్నది . అదే సందర్భంలో రాత్రిపూట ముఖ్యంగా తీపి పదార్థాలు, బటానీలు, డ్రై ఫ్రూట్స్ తో పాటు గ్యాస్ పెరిగే ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉన్నట్లయితే సకాలంలో సరిపోయినంత నిద్ర పడుతుంది.
. మంచి నిద్రకు దోహదపడే ఆహార పదార్థాలు:-
*********
_అరటి పండ్లను తీసుకోవడం వలన నిద్రకు దోహదపడే ట్రిప్టోపాన్ అమైనో ఆసిడ్స్ తో పాటు మెగ్నీషియం పొటాషియం కూడా పుష్కలంగా లభించి సుఖ నిద్ర పడుతుంది.
_ నిద్రకు దోహదపడే మెలటోనిన్ హార్మోన్ సకాలంలో ఉత్పత్తి కావాలంటే రాత్రి భోజనములో పెరుగుతో పాటు ద్రాక్ష పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. .
-- ప్రతిరోజు నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం వలన అందులో ఉండే ట్రిప్టో పాన్ అనే అమైనో ఆసిడ్స్ వలన మంచి నిద్ర లభిస్తుందని అంతర్జాతీయ పరిశోధనలో రుజువైనట్లు తెలుస్తున్నది.
-- నిద్రకు ఉపక్రమించే ముందు అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తీసుకోవడం వలన వీటిలో ఉండే ట్రిప్టోపాన్ మెగ్నీషియం మంచి నిద్రకు దోహదం చేస్తాయి.
-- గుడ్లు, చికెన్ వంటి ఆహార పదార్థాలలో ట్రిప్టో పాన్ పుష్కలంగా లభించినప్పటికీ వీటిని వండడంలో మాత్రం మసాలాలను దూరం పెట్టినట్లయితే నిద్రకు ఎంతో ప్రయోజనం ఉంటుంది .
మంచి నిద్రకు శారీరక మానసిక ఆరోగ్యం, పోషకాలతో పాటు నిద్రకు తోడ్పడే వనరులు పుష్కలంగా కలిగినటువంటి ఆహారం ఎంతో తోడ్పడుతుంది అని తెలుసుకోవడం ద్వారా జీవనశైలిలో మార్పులు తెచ్చుకోవడంతో పాటు ఆహారంలోనూ తగినన్ని మార్పులు చేసుకోవడంతో నిద్రలేమి సమస్య నుంచి తప్పించుకోవచ్చు . తద్వారా జరిగే ఎన్నో అనర్థాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అంటే నిద్ర శరీర ఆరోగ్యానికి అత్యంత కీలకమైనటువంటి అంశమని గుర్తించినప్పుడు మాత్రమే ఈ రకమైన ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది .కాబట్టి నిద్ర గురించిన పూర్తి అవగాహనను వైద్య ఆరోగ్యశాఖతోపాటు కళాశాలలు పాఠశాలలు ఇతరత్రా శిక్షణ సందర్భాలలో కూడా కల్పించినట్లయితే ఆరోగ్య భారతాన్ని నిర్మించడానికి ఎంతో అవకాశం ఉంటుంది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )