ఉద్యోగ విరమణ దారులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడం వారిని వంచించడమే అవుతుంది.*

Feb 13, 2025 - 20:56
 0  3

పెన్షన్ చట్టభద్దమని  సుప్రీంకోర్టు తీర్పున్నా ఏడాదిగా చెల్లించకపోవడం రాజ్యాంగ విరుద్ధమే

హైకోర్టు ఆదేశం మేరకు  వెంటనే చెల్లించి తెలంగాణ ప్రభుత్వం  తన నిబద్ధతను చాటుకోవాలి.

--- వడ్డేపల్లి మల్లేశం 

ఉద్యోగ విరమణ దారులు  తమ సర్వీస్ పూర్తి అయిన అనంతరం  1982లో ఆనాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవిచంద్ర చూడు  ఇచ్చిన తీర్పు ప్రకారంగా పూర్తిస్థాయి పెన్షన్ బెనిఫిట్స్ కు అర్హులు .ఆ తీర్పు సందర్భంగా వారు  పెన్షన్ అనేది  బిక్ష కాదని  ఉద్యోగుల యొక్క రాజ్యాంగబద్ధమైన హక్కు అని  దానిని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలదని హెచ్చరించడం కూడా జరిగింది.ఆ తీర్పు రావడానికి ఉద్యోగులకు పెన్షన్ హక్కును సాధించడానికి డిఎస్ నకారా గారు  ఆనాడు ఉన్న వివక్షతలపైన పోరాడి   పిటిషన్ సమర్పించగా ఈ తీర్పు వెలువడినట్లు మనందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ  ప్రభుత్వాలు అక్కడక్కడ ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున లేదా అప్పుల్లో కూ రుకుపోయినందున  రిటైర్డ్ కాగానే ఇవ్వలేమని సాకుతో సంవత్సరాల తరబడి కాలయాపన చేయడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గనక గమనిస్తే  ఉద్యోగ విరమణ చేసి  సంవత్సరం గడిచిపోయిన ఇప్పటివరకు ఎలాంటి బెనిఫిట్స్ వారికి  చెల్లించక వారిని మానసికక్షోభకు గురి చేయడం ప్రభుత్వానికి తగదు

మింగ  మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె" అన్నట్టుగా ప్రభుత్వ0  కొన్నిటికి  అత్యధిక నిధులు కేటాయిస్తూ  రాజ్యాంగబద్ధమైన వాటికి మాత్రం  ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించిన  బెనిఫిట్స్ పట్ల సవత్ తల్లి ప్రేమ చూపడం సరైనది కాదు.  చట్టసభల్లో చట్టసభల బయట పాలకపక్షం ప్రతిపక్షం ఎప్పుడు రైతుల గురించి మాత్రమే ఆలోచించడం అంటే  ఇక  సమాజంలో ఏ వర్గం లేనట్లుగా భావిస్తే  అది ప్రభుత్వానికే ఇబ్బందికరమవుతుంది. ఇప్పటికీ ఆశ వర్కర్లు అంగన్వాడీ ఆయాలు  టీచర్లు  ఫీల్డ్ అసిస్టెంట్  అనేక రకాల సిబ్బంది  వేతనాలు సరిగా రాకపోవడం వారికి వేతన పెంపు కనీస వేతన హక్కు చట్టం ప్రకారంగా ఇవ్వకపోవడం వలన ఆందోళన చేస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న విషయాలను గమనించవలసిన అవసరం ఉంది.. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేసే విభిన్న రంగాలకు చెందిన ఉద్యోగులు బజారునపడితే  ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ పోరాటాలకు దిగితే ప్రభుత్వ ప్రతిష్ట కూడా దిగజారుతుందని ఆలోచించవలసిన అవసరం ఉంది. కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ తోపాటు అత్యల్ప వేతనాలతో పనిచేస్తున్నటువంటి  గ్రామపంచాయతీ మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికుల సమస్యలను కూడా పరిశీలించవలసిన అవసరం ఉన్నది .అప్పుడే ఉద్యోగుల పాలిట ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అనే పేరు సార్థకమవుతుంది ప్రజా పాలన అనే  పేరు స్థిరపడుతుంది.

పెన్షనర్లకు జరుగుతున్న  అన్యాయం-- మానసిక క్షోభలో  అనేకమంది 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతినెలా ఒకటవ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామనే  మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ  నెలల తరబడిగా వేతనాలు లేక బాధపడుతున్న వారు కూడా ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో  వాటిని సవరించుకోవలసిన అవసరం చాలా ఉన్నది. 2021 లో ఆనాడు ఉన్నటువంటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం  బెనిఫిట్స్ను చెల్లించలేక  తమ పబ్బం గడుపుకోవడానికి  పదవి విరమణ వయస్సును 58 నుంచి 61 పెంచడం వలన  వారంతా 2024లో అంటే 7995 మంది  ఉద్యోగ విరమణ చేయడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులు 3.5 9 లక్షల మంది ఉండగా  అందులో  ఉపాధ్యాయులు 1.1 లక్షలు గా ఉన్నట్టు తెలుస్తున్నది.  వీరంతా క్రమక్రమంగా ఏడాదికి కొందరు చొప్పున  ఉద్యోగ విరమణ చేయవలసి ఉంటుంది.అదే క్రమంలో వారందరికీ ఉద్యోగ విరమణ బెనిఫిట్స్  వెంటనే చెల్లించాలి ఉమ్మడి రాష్ట్రంలో కూడా వెంటనే చెల్లించిన  పరిస్థితులు ఉన్నాయి. కానీ టిఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత  వెంటనే బెనిఫిట్స్ చెల్లించలేక  కాలయాప న కోసం మూడు సంవత్సరాలు ఉద్యోగ విరమణ వయస్సును పెంచడం వల్ల  ఒక రకంగా నిరుద్యోగులకు నష్టమే జరిగింది. అయినప్పటికీ మూడు సంవత్సరాలు పని చేసిన తర్వాత వీరికి 2025 అంటే సంవత్సరం గడిచిన   బెనిఫిట్స్ రాకపోవడంతో మానసిక ఆందోళనలో ఉన్నారు.  ఉద్యోగ విరమణ చేసిన వాళ్లు  సచివాలయము చుట్టూ తిరుగుతూ తమ బాధలను చెప్పుకుంటూ ఉంటే,మరికొందరు శాసనసభ్యులు మంత్రులను  కలుస్తూ ఉన్నారు,  ఏ ఆర్  ఏ ఎస్  ఐ సాధిక్ ఇటీవల  ఉద్యోగ విరమణ  చేసినా  బెనిఫిట్స్ రాకపోవడంతో అప్పుల్లో ఉన్న తనకు  వేరే మార్గం లేదని  సెల్ఫీ వీడియో .  ద్వారా ప్రకటిస్తూ తనకు ఆత్మహత్య శరణ్యమని  వేదనకు గురి కావడం ఆందోళన కలిగించే విషయం.

 2025 జనవరి మొదటి వారంలో  కొందరు పెన్షనర్లు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తున్నది .ఉద్యోగ విరమణ దారుల యొక్క హక్కులను, రాజ్యాంగబద్ధమైన విషయాలను,  పెన్షన్  స్వభావాన్ని ఆలోచించిన  రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం  పెన్షనర్ల వైపున  సానుకూలమైన ప్రకటన చేస్తూ ఆరువారాలలోపల  ఉద్యోగులకు ఇచ్చే అన్ని బెనిఫిట్స్  వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశించడం గమనార్హం. జిపిఎఫ్, జిఐఎస్,   కమ్యూటే షన్,  ఏపీ ఎల్ఐసి,  సరెండర్ లీవ్ వంటి  బెనిఫిట్స్ ప్రతి పెన్షనర్ కు రావాల్సి ఉంటుంది.  ప్రభుత్వ అంచనాల ప్రకారంగా 7995 మంది  విరమణ చెందిన ఉద్యోగులకు  అన్ని రకాల బెనిఫిట్స్ తో కలుపుకొని సుమారు 4000 కోట్లు అవసరమని  గణాంకాలు తెలియ చేస్తుంటే ప్రభుత్వం మాత్రం  ఎలాంటి ఆలోచన చేయకుండా ఎటువంటి సమాచారం లేకుండా  మౌనంగా ఉండడం అంటే  పెన్షనర్లను అవమాణించడమే.

ప్రతి పనికి నిధులలేమి అప్పుల భారం అని చెబుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడం  రైతు భరోసాల కేవలం పండించిన  భూములకు మాత్రమే  చెల్లించడం  అది కూడా 10 ఎకరాల లోపు వరకు మాత్రమే పరిమితం చేయడం వంటి చర్యల వలన  వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అయ్యే అవకాశం ఉన్నది. భూస్వాములను ప్రోత్సహించడం, గత ప్రభుత్వం మాదిరిగానే పండించని బీడు భూములకు కూడా రైతు భరోసా చెల్లించడం అంటే  ఇంతకు  మించిన అసంబద్ధ విషయం మరొకటి ఉండదు.  నిరంతరం రైతు సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులు   పెన్షనర్లు  తాత్కాలిక ఉద్యోగులు  వారి సాధక బాధకాల పట్ల కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది.. హైకోర్టు ఉత్తరువుల  మేరకు గనుక  సకాలంలో పెన్షనర్లకు చెల్లించకపోతే అన్ని ఉపాధ్యాయ ఉద్యోగ   పెన్షనర్ సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన  పోరాటానికి సిద్ధంగా ఉన్నారని  తెలుసుకుంటే మంచిది. రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం,  చట్టాన్ని గౌరవించకపోవడం,  సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులను అమలు చేయకపోవడం  ప్రత్యక్షంగా పరోక్షంగా  రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది.  ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి  పొదుపు చర్యలను పాటించడం ద్వారా నిధులను సమీకరించుకొని వెంటనే పెన్షనర్లకు బెనిఫిట్స్  చెల్లించాలని  చెల్లిస్తుందని ఆశిద్దాం.
  చావు తప్ప తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని  హెచ్చరించే వాళ్ళ సంఖ్య ఎక్కువ కాకముందే  ఫైనల్ డెసిషన్ తీసుకోవడం చాలా అవసరం .
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333