పట్టణ జనాభా అదుపు చేయకపోతే విషపరిణామాలే
జనాభా కేంద్రీకరించి తప్పుడు పనులకు ప్రభుత్వాలు పాల్పడకూడదు.
చిన్న పట్టణాలు గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంలోనే విజ్ఞత దాగి ఉన్నది .
---వడ్డేపల్లి మల్లేశం
జనాభా పెరిగినా కొద్ది భూ వైశాల్యం పెరిగే అవకాశం లేదు అనేది కనీసమైన అవగాహ .దానికి అనుగుణంగానే జనాభా పెరుగుదలను అదుపు చేయడం కొనసాగించడం నియంత్రించడం ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం వంటి నిర్ణయాలు ప్రభుత్వపరంగా కొనసాగవలసి ఉంటుంది. దేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు ప్రజల జీవన స్థితిగతులు ఆదాయ మార్గాలు రాబోయే నిర్మాణాలు లేక ప్రజల అవసరాల కనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయం కూడా గమనించాలి .ఇప్పటికిప్పుడు ఆలోచిస్తే భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రకృతి వనరులైనటువంటి గుట్టలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బలహీనత లేదా ముందుచూపు లేని కారణంగా చైనా వంటి ఇతర దేశాలకు గ్రానైట్ కోసం గుట్టలన్ని మాయమవుతున్న సందర్భాన్ని మనం గమనించవచ్చు .మరొకవైపు జనాభా పెరుగుదలను కొంతసేపు అటు ఉంచితే ఉన్న జనాభా గ్రామాలు పట్టణాలలో సమతూకంలో జీవించినప్పుడు మాత్రమే సమస్యలు ఉద్భవించవు. కానీ పట్టణాల మీద మోజు, విద్యా అభ్యాసం కోసం ఆరాటం, ఉపాధి అన్వేషణ అనేక కారణాల వలన గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు వలస పోవడం వలన పట్టణాల పైన విపరీతమైన ఒత్తిడి పడుతున్నది. తద్వారా అనేక మైనటువంటి సవాళ్లు ఎదుర్కోవలసి వస్తున్నది.
140 కోట్లు గా ఉన్నటువంటి భారత జనాభాను ఒకసారి పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతంలో 61%గా ఉంటే పట్టణ ప్రాంతాలలో 39 శాతం జనాభా ఉన్నట్లు ప్రభుత్వ గనాంకాల ద్వారా తెలుస్తున్నది. అయితే ఒకటి రెండు దశాబ్దాలకు పూర్వం గనక గమనిస్తే గ్రామీణ ప్రాంతాలలో 75 శాతానికి పైగా జనాభా ఉండేది. గ్రామీణ ప్రాంతాలు స్వయం పోషకంగా ఉండడం ఆనాటి కాలంలో వర్షాలు కురియడం భూములను నమ్ముకుని కష్టాలు కన్నీళ్లున్నా కలిమిడిగా జీవించే మనస్తత్వం కారణంగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడానికి ఎక్కువగా మొ గ్గు చూపే వాళ్ళు. గత రెండు మూడు దశాబ్దాలుగా ఎప్పుడైతే ప్రైవేటు విద్యాసంస్థలు విద్యారంగంలో ప్రవేశించినాయో అప్పటినుండి ప్రతి కుటుంబం కూడా కాయ కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళు, డొక్కాడని నిరుపేదలు పేద వర్గాలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించకూడదని ప్రైవేటు పాఠశాలలకే పంపించాలని అవసరమైతే దగ్గర్లో ఉన్నటువంటి పట్టణాలకు వలస పోవడానికి ఇష్టపడుతూ తల్లిదండ్రులు తమనివాసం అక్కడికే మార్చిన సందర్భాలను గమనించవచ్చు. ఆ కారణంగానే గ్రామాలు చిన్నబోయి గ్రామీణ జనాభా క్రమంగా తగ్గుతూ వస్తున్న ది.32 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి భారతదేశంలో పరిమితికి మించినటువంటి జనాభా ఉండడం ఒక అంశం అయితే జనాభాలో ఎక్కువ భాగం పట్టణాలలోకి వలస పోవడం వలన పట్టణాల పైన విపరీతమైన భారం పడుతున్నది.కనీసమైన మౌలిక సౌకర్యాలు కల్పించలేక అనేక రకాల ప్రమాదాలు సంఘటనలు ఇబ్బందులు అనారోగ్య పరిస్థితులు చోటు చేసుకోవడాన్ని మనం గమనించవచ్చు. భారతదేశంలో గనక జనసాంద్రతను గమనించినప్పుడు ప్రతి చదరపు కిలోమీటర్కు 336 మంది జనాభా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 312 మాత్రమే ఉన్నట్లుగా తెలుస్తున్నది. అయితె సారవంతంగా ఉండి యోగ్యమైన భూములు ఉన్నా చోటనే ప్రజలు ఉండడం వలన కూడా ఒత్తిడి ఎక్కువగా పడుతున్నది .
పట్టణాలపై ఒత్తిడి మంచిది కాదు
**---*******
భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీ మూడు కోట్ల పైచిలుకు ముంబై రెండు కోట్ల పైచిలుకు కలకత్తా కోటిన్నరకు పైగా
బెంగళూరు కోటి 20 లక్షలు జనాభా ఉంటే హైదరాబాద్ ఇవ్వాలా కోటి పది లక్షల కు చేరుకోవడం అంటే ఆ పట్టణాల వైశాల్యంతో పోల్చుకున్నప్పుడు ఈ జనాభా కిక్కిరిసిపోయింది అనడంలో సందేహం లేదు. .ఉపాధి ఉద్యోగ అవకాశాలు చదువులు ముఖ్యంగా ఇటీవలి కాలంలో సాఫ్ట్ వేరు ప్రైవేటు కంపెనీల పేరుతోనే గ్రామీణ ప్రాంత యువకులంతా పట్టణాలకు తరలి రావడంతో పల్లెలు వెలవెల పోతుంటే పట్టణాలు రద్దీగా కనీసం కదలలేని పరిస్థితిలో రోడ్ల దుస్థితిని గమనించవచ్చు. ఈ రకమైనటువంటి ఒత్తిడి మంచిది కాదు అభివృద్ధి పేరుతో ఎదిగిన పట్టణాలనే మరింత డెవలప్ చేయడం మానుకొని ప్రభుత్వాలు చిన్న నగరాలు పట్టణాలను డెవలప్ చేయడం, ఆ పట్టణాలకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకు మరింత సౌకర్యాలను కల్పించడం, కొన్ని రకాల పరిశ్రమలను స్థాపించడం ద్వారా అభివృద్ధిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యాసంస్థలు వైద్య పరమైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ కంపెనీలను పరిశ్రమలను జిల్లా కేంద్రానికి మండల నియోజకవర్గ కేంద్రాలకు అవసరమైతే విశాలమైన ప్రాంతాలు ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించి పరిశ్రమలు స్థాపించడం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పించడంతోపాటు పెద్ద పట్టణాల మీద పడే ఒత్తిడి తగ్గించవచ్చు
పరిశ్రమల వలన కాలుష్యం పెరిగి పట్టణ జీవితం అనారోగ్యంగా ఉంటుంది .మౌలిక సౌకర్యాలు సరిపోయే స్థాయిలో లేకపోవడంతో నివాసాలు లేక పేదవాళ్లు సంచార జీవులు మురికికూపాళమధ్య ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది.వర్షాకాలంలో అనేక ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజా జీవితం అతలాకుతులమవుతున్నది దానికి కారణం ప్రణాళిక బద్దంగా లేకుండా ఎవరిష్టం ఉన్నట్టుగా వారు ఇల్లు కట్టుకోవడం దారులు గోడలు ఇతర నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవడం వల్లనే అని తెలుస్తున్నది. ఇక ట్రాఫిక్ రద్దీ సమస్య గణనీయంగా ఉంటుంది అత్యవసర ప్రయాణం చేసే వాళ్లకు అవకాశం లేకపోగా ఇప్పటికీ పట్టణంలోని కొన్ని దారులను గమనిస్తే ఇరుకైనటువంటి సందు లోపల వేగంగా వచ్చే వాహనాల వలన విపరీతమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్న విషయాలను కూడా గమనించవచ్చు.. కాలుష్యంతో కూడుకున్నటువంటి వాతావరణం కారణంగా పట్టణ జీవితం మరీ అనారోగ్యం పాలవుతున్నా కూడా నగరం అభివృద్ధి అనే ముసుగులో అక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలు వాస్తవంగా సంతోషంగా ఏమీ లేరని చెప్పడానికి సందేహ పడవలసిన అవసరం లేదు.
భారతదేశంలో 1960 ప్రాంతం నుండి 2022 రెండు వరకు గనక పట్టణ జనాభా పెరుగుదలను గమనించినప్పుడు భయంకరమైనటువంటి నిజాలు వెలుగు చూసే అవకాశం ఉన్నది. ఇకనైన ప్రభుత్వాలు సాధ్యనంత పట్టణ జనాభాను తగ్గించే ప్రయత్నం చేస్తూ చిన్న పట్టణాల అభివృద్ధికి గ్రామీణ స్వయంపోషకత్వానికి పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాల్లోనే నిర్మించే కొత్త ఆలోచన ద్వారా ఈ అనారోగ్య పరిస్థితుల నుండి బయటపడవచ్చు. పట్టణ జనాభా పెరగడం కోట్లకు పడగెత్తడం అంటే విపరీత పరిణామాలను కొని తెచ్చుకోవడమే అవుతుంది.
నగర జనాభా వివరాలు సంవత్సరాల వారిగా
*************
1960లో 17.92% 1970లో 19.76% 1980లో 23.1 0% 1990లో 25.5% 2000 సంవత్సరంలో 27.67 శాతం 2010లో 30.93% 2022లో 35.87 %ఈ రకంగా గత ఆరు దశాబ్దాలు పట్టణ జనాభా పెరుగుదలను గమనించినప్పుడు విపరీతమైన స్థాయిలో పెరిగినట్లు కనపడుతున్నది అంటే గ్రామీణ ప్రాంతాలు స్వయం పోషకంగా ఉండాలని భావించినటువంటి భారతదేశం యొక్క మౌలిక లక్ష్యం దెబ్బతిన్నట్లే. అంతే కాదు పట్టణాలలో భారీగా జనాభా పెరగడం వలన కూడా పరిశ్రమలు ఇతర ఐటీ కంపెనీలు వివిధ రకాల పారిశ్రామిక సంస్థలు వదిలే వ్యర్థ జలాలు లేక ఇతరత్రా ప్రమాదకరమైనటువంటి కారకాల వలన వాతావరణం గాలి నీరు వలన అక్కడి ప్రజల జీవితం కూడా చిన్నాభిన్నం కావడాన్ని కూడా మనం గమనించవచ్చు. అందుకే జనాభా పెరినాకొద్దీ ఆసుపత్రుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నదంటే మనం అర్థం చేసుకోవచ్చు అందుకే క్రమంగా ఈ జనాభాను తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల లోపల కనీస సౌకర్యాలను ముమ్మరంగా కల్పించడానికి పూనుకున్నట్లయితే చాలా కుటుంబాలు తిరిగి వాళ్ల వాళ్ల ప్రాంతానికి వచ్చి నివాసముండే అవకాశం ఉంటుంది.తద్వారా జనాభాను ఒకే ప్రాంతం పైన ఒత్తిడి కలిగించకుండా స్థిరంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది. సామాజికవేత్తలు శాస్త్రవేత్తలు మేధావులతో ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేసి పట్టణ జనాభాను క్రమంగా తగ్గించడానికి అవసరమైనటువంటి చర్యలను ఆలోచించడం ద్వారా పరిష్కారాలను వెతకవలసిన అవసరం ఉంది. కానీ ఎదిగినటువంటి పట్టణాన్ని మరింతగా డెవలప్ చేస్తాం అంటూ హైదరాబాద్ను ఇప్పటికే కోటి పైచిలుకు జనాభా ఉంటే ముఖ్యమంత్రి మంత్రులు ప్రపంచంలోనే నంబర్ వన్ గా తయారు చేస్తామంటూ జనాభా పెంచుతూ వాతావరణన్ని కాలుష్యం చేస్తూ అనేక పరిశ్రమలు అక్కడే నిర్మిస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలను కూడా విషతుల్యం చేయడం తగదు. గ్రామాలను పచ్చగా బ్రతకనివ్వండి పట్టణాలలో ఉన్నటువంటి జనాభా తగ్గేలా మార్గాన్ని అన్వేషించండి.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )