సంపదలు ఆదాయాల్లో అసమానతలను  కొనసాగితే ఇక  ప్రభుత్వాలు ఎందుకు?

Jun 23, 2024 - 13:21
 0  13

అసమాన తల నిర్మూలనకు రాజ్యాంగబద్ధంగా సమాన అవకాశాలు కల్పించాలి.

అంతరాలను  తొలగించకుండా , పేదలను  వృద్ధిలోకి తేకుండా  మాట్లాడే అర్హత ప్రభుత్వాలకు లేదు.

---వడ్డేపల్లి మల్లేశం 

  ఆదాయము సంపదలో అసమానతలు  కొనసాగినంత కాలం   దేశంలో సమానత్వం సాధించడం కానీ సమసమాజ స్థాపన గాని సాధ్యం కాదు . ప్రపంచంలో భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా  చెప్పబడుతున్నప్పటికీ ప్రజల ఆదాయాలు సంపదల మధ్య  భారీ తేడా ఉండడాన్ని గమనిస్తే  దీర్ఘకాలికంగా ఈ అంతరాలను నియంత్రించలేని  బాధ్యతారాహిత్యం ప్రభుత్వాలదేనని తేలిపోతున్నది  .భారతదేశంలో అంతరాల పైన  అంతర్జాతీయ స్థాయి సంస్థ  నిర్వహించిన సర్వేలో  భయంకరమైన చేదు వాస్తవాలు  ప్రజలను పాలకులను  కలవర పెట్టే స్థాయిలో ఉన్నాయి. కానీ  "ప్రజలు తమ హక్కుల కోసం పోరాడి సమానత్వాన్ని  సాధించుకోవడానికి సిద్ధంగా లేరు,  ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు సంపన్న వర్గాలకు పారిశ్రామికవేత్తలకు వంత పాడుతున్న కారణంగా కొన్ని సంపన్న కుటుంబాల చేతిలో మాత్రమే సంపద  పేరుకు పోతుండడం విచారకరం."  వరల్డ్ ఇన్ ఈక్వాలిటీ ల్యాబ్  అనే సంస్థ "భారతీయుల ఆదాయ సంపదల్లో వ్యత్యాసాలు 2022- 23 "పేరున  విడుదల చేసిన నివేదిక  వలస పాలకులైన ఆంగ్లేయుల నాటికంటే స్వప రిపాలనలోనే  వ్యత్యాసాలు అసమానతలు ఎక్కువగా ఉన్నట్లు  విశ్లేషించడం సిగ్గుచేటు.  సంపన్న వర్గాల జాబితాను  పరిశీలించినప్పుడు పై వరసలో ఉన్నటువంటి ఒక్క 1శాతం  చేతిలో  దేశానికి సంబంధించినటువంటి 22.6%  ఆదాయం,  40. 1 శాతం సంపద  పోగు పడినట్లు ఈ నివేదిక గతంలో వెలువరించింది.  ఇక మరింత అబ్బురపరిచే విషయం ఏమిటంటే  సంపన్న వర్గాల యొక్క తలసరి వార్షిక ఆదాయం 53 లక్షల అయితే  అట్టడుగు స్థాయిలో జీవిస్తున్న  సగం జనాభా కేవలం 15% ఆదాయంతో 6.4 శాతం సంపదతో సరిపెట్టుకోవలసి రావటం  పాలకుల పూర్తి బలహీనత అని చెప్పక తప్పదు

ఇక ఈ సామాన్యుల తలసరి వార్షికాదాయం  73000 మాత్రమే అని  ఈ నివేదిక లెక్క కట్టింది.  ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ అంతరాలు ఉన్నప్పటికీ భారత్లో మరీ ఎక్కువగా ఉండటం  మన దేశ అభివృద్ధికి సమానత్వ సాధనకు,ల క్ష్యాలకు శ్రేయస్కరం కాదు.  ఇది అశాంతికి, వర్గ సంఘర్షణకు, పోరాటానికి , చివరికి ప్రభుత్వ మనుగడకు కూడా ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఉంటాయి.  అందుకే భారతదేశాన్ని సంపన్నులున్న పేద దేశం అంటారు  ఈ దేశంలో సంపద బాగానే ఉన్నప్పటికీ అది కొద్ది మంది చేతిలో ఉండడం మెజారిటీ ప్రజల చేతుల్లో  లేకపోవడంతో  అప్పులు,  పేదరికం, నిరుద్యోగం, ఆకలి చావులతో అలమటిస్తూ  మానవ వనరులను ఈ దేశం కోల్పోతున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం విచారకరం. అందుకే ఈ అంశాల పైన దృష్టి సారించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే.

మరికొన్ని విషయాలలోకి వెళితే

1953 నుండి 85 మధ్యకాలంలో ఈ దేశంలో  ఎస్టేట్ సుంకం పేరుతో వారసత్వ పన్ను ఉండేదని  57 నుండి 2015 వరకు సంపద పైన కూడా పన్ను లు విధించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది  ఈ పన్నుల వసూలు కష్టతరం కావడంతో, వసూలయ్యే మొత్తం స్వల్పంగా ఉండడం వల్ల ఈ రెండింటిని రద్దు చేసినట్లుగా  విశ్లేషకులు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  అనేక దేశాలలో ప్రభుత్వ నియంత్రణతో సంబంధం లేకుండా ఆర్థిక సంస్థలు డిమాండ్ సప్లై ప్రజా సంబంధాలపైన ఆధారపడి మార్కెట్ వ్యవస్థలను  నడుపుతున్న సందర్భంలో ఇండియా కూడా  అటువంటి మిశ్రమ ఆర్థిక విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది .ఈ రకమైన ఆర్థిక వ్యవస్థలో ఎంతో కొంత అసమానతలు ఉండడం సహజమని భావించినప్పటికీ  ప్రభుత్వాలు ఈ వ్యత్యాసాలను  నియంత్రణలో ఉంచడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉన్నది.

ఈ దేశంలో పుట్టిన ప్రజలందరికీ దేశ వనరులు  అవకాశాలను ఉపయోగించుకునే  రాజ్యాంగ బద్ధమైన హక్కు ఉంది కానీ ప్రభుత్వాలు అలాంటి అవకాశాలు కల్పించకపోవడం ప్రజలు అమాయకత్వంతో  పెట్టుబడుదారుల వలలో చిక్కి  నిరక్షరాస్యత పేదరికం ఇత్యాధి కారణాల వలన తమ హక్కులను కోల్పోతుండడం విచారకరం.  ఈ పరిస్థితులలో విద్యా వైద్యానికి  సుమారు 10 శాతం చో"  బడ్జెట్లో కేటాయించడం ద్వారా పేదవర్గాలు ప్రజాధనాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది . నైపుణ్యం ప్రతిభ ఆధారంగా ముఖ్యంగా పేద వర్గాలకు  విద్యాభివృద్ధి అవకాశాలను ఉపాధి ఉద్యోగాలను  కల్పించడం ప్రభుత్వం తన చట్టబద్ధ బాధ్యతగా గుర్తించి ప్రత్యేక ప్రణాళిక చేపట్టినప్పుడు  కొంతవరకు అసమాన తలను తగ్గించే అవకాశం ఉంటుంది.  సంపద  ఆధారంగా  పురోగామి పన్నులను విధించడం ద్వారా  ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం తో పాటు  ఆ ఆదాయాన్ని పేద వర్గాలకు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. కరోనా సమయములో దేశ ఆర్థిక వ్యవస్థను  మెరుగు పరచడం కోసం I R S అధికారుల బృందం  కేంద్రానికి సంపన్న వర్గాల పైన అదనపు భారాన్ని మోపి  పన్ను వసూలు చేయాలని సూచించినప్పుడు ప్రభుత్వం ఆమోదించకపోగా  వారి పైన దేశద్రోహ కేసు నమోదు చేసినట్లుగా చరిత్ర ద్వారా తెలుస్తున్నది .అంటే ప్రభుత్వం ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రత్యక్ష పన్నుల  శాతాన్ని పారిశ్రామికవేత్తలు సంపన్న వర్గాలు పెట్టుబడిదారుల పైన  ఎక్కువ మొత్తంలో పెంచాలి  పరోక్ష పన్నులు సామాన్య ప్రజలు భరించవలసి ఉంటుంది కనుక  కనీస స్థాయికి తగ్గించాలి. తద్వారా కూడా  ఉన్నత వర్గాల సంపద ప్రజల కు  చేరువయ్యే అవకాశం ఉంటుంది.  ప్రస్తుత ప్రత్యక్ష పన్నుల  శాత 34 పరోక్ష పనుల శాతం 68  అంటే  ఈ విధానం అసమానతలను మరింత పెంచే విధంగా ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ప్రత్యక్ష పనుల భారాన్ని భారీగా పెంచడం ద్వారా ధనవంతుల పైన పనులు వేసి  పేదవారి మీద భారం పడకుండా చూసినప్పుడు అసమానతులను తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఈ వైపుగా ప్రభుత్వం దృష్టి సారించాలి.  అంటే ప్రత్యక్ష పన్నుల వాటాను భారీగా పెంచడంతోపాటు  పరోక్ష పన్నులను నామమాత్రం చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.  "భారత రాజ్యాంగంలోని 38 ,39 వ అధికరణాలు  వ్యక్తులు సమూహాలు, సంస్థల మధ్యన ఆదాయాలు సంపదల్లో అంతరాలు తగ్గించే దిశగా  కృషి జరగాలని  సంపద ఏ కొద్ది మంది చేతుల్లో పోగు పడకుండా ప్రభుత్వ విధానాలు కఠినంగా ఉండాలని" ఆదేశిస్తున్నప్పటికీ  భారతదేశ సంక్షేమ  రాజ్యమని  నిర్దేశించుకున్నప్పటికీ  మెజారిటీ ప్రజల సంక్షేమం కాకుండా  అల్పసంఖ్యాకులు సంపన్న వర్గాల  ప్రయోజనం కోసమే ప్రస్తుత పాలకులు పనిచేయడం విచారకరం . మూడవసారి కేంద్రంలో ఎన్నికైన మోడీజీ ప్రభుత్వం అయినా  ప్రజల ఆదాయాలు సంపదల్లో విపరీతమైనటువంటి అసమానతలను  భారీగా తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా  పెట్టుబడి దారి వర్గాలను  ఒప్పించి నచ్చజెప్పి లేదా బెదిరించి అయినా  పేద వర్గాలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది.  ఇప్పటికీ  దేశ సంపద అనేక రూపాలలో సంపన్న వర్గాలకు  రుణ మాఫీ పేరుతో 14 లక్షల కోట్లను కేంద్రం కట్టబెట్టినట్లు తెలుస్తుంటే  అట్టి డబ్బును కూడా ప్రభుత్వం విధిగా వాపస్ తీసుకుని ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం ద్వారా,నల్లధనాన్ని తెప్పించడం ద్వారా తన చిత్తశుద్ధిని రుజువు చేసుకుంటే ఆదాయ సంపదల్లో అంతరాలను  భారీగా  తగ్గించవచ్చు.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం (చౌటుపల్లి)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333