అవును నిజమే  బీసీలు హక్కుల సాధన కోసం  సాయుధ పోరాటాలు చేయాల్సిందే  

Jun 23, 2024 - 13:30
 0  5

డిమాండ్ చేయకుండా యాచించడం,

నిరసన తెలపడం,  ధర్నాలతో  ఇక పని కాదు.  

రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి చ్చిన పిలుపును  

జాతీయస్థాయిలో  అమలు చేస్తేనే పాలకులు దిగి వస్తారు.

---వడ్డేపల్లి మల్లేశం

ప్రపంచవ్యాప్తంగా  దేశాలు,  ప్రాచీన రాజ్యాలు, జాతులు, తెగలు , ఇటీవలి కాలంలో సామ్రాజ్యవాద కూటముల మధ్యన  నిరంతరం ఏదో రూపంలో ఘర్షణ కొనసాగుతూనే ఉన్నది. ఎక్కడైతే నిర్బంధం అణచివేత హక్కులను హ రించి వేసే ప్రయత్నం జరుగుతుందో  అక్కడ  ప్రతిఘటన తప్పదు.  శక్తి లేకపోయినా, ఓటమిపాలైన , బలాన్ని  సమూహాలను కూడగట్టుకుని  మృత్యువూ కైన తెగించి పోరాడి హక్కులను సాధించుకున్న చరిత్ర  ప్రపంచంలో అనేక ప్రాంతాలకు ఉన్నది.  అమెరికా లాంటి  ప్రస్తుత అగ్రరాజ్యం కూడా ఒకనాడు ఆంగ్లేయుల ఆధీనంలో  బానిసలుగా బ్రతికినటువంటిదే  భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఆంగ్లేయుల  బానిస సంకెళ్లలో చిక్కి శల్యమై  ఆత్మాభిమానముతో స్వాతంత్యకాక్షతో పోరాడి  తమ  దిక్కార స్వరాన్ని వినిపిస్తేనే కదా నేడు స్వేచ్ఛ వాయువులు పిలుస్తున్నది,తెలంగాణ సాయుధపోరాటం ఆకోవాలోనిదే.  అయితేనేమి స్వతంత్ర భారతదేశంలో  కొన్ని ఆదిత్య కులాలు అగ్రవర్ణాలకు మాత్రమే  అవకాశాలు  అధికారాలు అధిపత్యాలు కొనసాగుతూ ఉంటే  దళితులు ఆదివాసీలు అట్టడుగు వర్గాలు పేదలు  ఇప్పటికీ దారిద్రరేఖ దిగువన జీవిస్తూ  అధికారానికి దూరమై బతుకుతున్న సందర్భాలను గమనించవచ్చు.

స్వాతంత్రం సాధించిన తర్వాత కూడా ఈ వివక్షత, అస్వతంత్రత, అసమ సమాజం  ఎందుకు ఉన్నది? అనే సోయిలేని పాలకులు  చైతన్యం తగిన స్థాయిలో ప్రదర్శించని ప్రజల వలన నేడు దేశంలో ఈ గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.  ఇప్పటికీ 56 శాతానికి పైగా ఉన్నటువంటి బీసీ జనాభా ఎలాంటి అధికారాలకు నోచుకోకపోవడం,  రాజ్యాంగ రచన కాలంలో బీసీ వర్గాల కోసం రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆలోచించినప్పటికీ ఆనాడు ఉన్నటువంటి కొన్ని ఆధిపత్య వర్గాలు ప్రశ్నించి ప్రతిఘటించిన కారణంగా  వాయిదా పడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తున్నది.  అయినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం ద్వారా కమిషన్ ఏర్పాటు చేసుకొని బీసీ వర్గాల ప్రయోజనాన్ని సాధించుకోవచ్చును అనే ఒక ప్రాతిపదికను  రాజ్యాంగంలో ఉంచిన కారణంగా  గత పాలకులు కమిషన్లను వేసినప్పటికీ  పెద్దగా సిఫారసులు చేసింది లేదు పాలకులు అమలు చేసింది అంతకు లేదు.  

మండల కమిషన్ సిఫారసులను  అమలు చేసే క్రమంలో వీపీ సింగ్ ప్రభుత్వ కాలంలో బిఎస్పి ఇతర రాజకీయ పార్టీల  చొరవ ప్రమేయంతో  అమలు చేసినప్పటికీ 27 శాతానికి మాత్రమే విద్య ఉద్యోగాలలో అవకాశాలను కల్పించడంతోనే సరిపోయింది కానీ ఈ వర్గాలకు రాజ్యాధికారం గురించిన చర్చ ఆనాడు జరగలేదు.

భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుండి  ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్, గౌడ్, దాసు సురేష్, గుజకృష్ణ , నరేందర్ గౌడ్ వంటి అనేక  నాయకుల నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బీసీ సంఘాలు  ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర స్థానికంగా వివిధ రాష్ట్రాల రాజధానుల్లోపల పోరాటం చేసి నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ ప్రయోజనం ఏమాత్రం కలగలేదు.  అందుకే ఇటీవల హైదరాబాదులోని  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  6 జూన్ 2024 రోజున  "కామారెడ్డి లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ "పైన వివిధ  సంఘాల నాయకత్వంలో జరిగిన సమావేశంలో  రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు  దశాబ్దాలుగా బీసీల  రిజర్వేషన్లు ప్రమోషన్లు అవకాశాలు విద్య ఉద్యోగాలలో అధికారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి  ఆర్ కృష్ణయ్య గారు చేసిన వ్యాఖ్య  సందర్భోచితం అని చెప్పక తప్పదు.ఈ సమావేశం బీసీ కులసంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు కాటం నరసింహాయాదవ్,బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ ల నాయకత్వంలో జరిగింది.

బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకున్నప్పటికీ గత పది ఏళ్లలో  కేంద్ర మంత్రివర్గములో  బీసీల సంఖ్య  30 శాతం మాత్రమే కొనసాగడం,బీసీలకు మంత్రిత్వ శాఖ లేకపోవడం గమనించవచ్చు.  అంతేకాదు రాష్ట్రంలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా   కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ  స్థానిక సంస్థల ఎన్నికల్లో  రిజర్వేషన్లు హామీ మేరకు 42 శాతానికి పెంచి ఎన్నికలకు వెళ్తారా ? లేదా జనగణన జరిపించి జనాభా ప్రాతిపదికన మించిన స్థాయిలో  రిజర్వేషన్ల బిల్లును అమలు చేసి  ఎన్నికలు నిర్వహిస్తారా?

 తేల్చుకోవాలని కాంగ్రెస్కు సవాలు విసరడం తో పాటు బీసీలు  ఉద్యమ రూపాన్ని మార్చుకోవాలని సాయిధ పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం  హర్షినియం.  దేశంలో అనేకమంది తమ హక్కుల కోసం పోరాడి ప్రాణాలకు ఒడ్డి  సాధించుకున్న సందర్భాలు ఉన్నప్పుడు సమాజంలో మెజారిటీగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు రాజకీయ పార్టీలు అవకాశాలను కల్పించవు, రాజ్యాంగపరంగా రిజర్వేషన్ సౌకర్యం లేకపోవడంతో పరిపాలనలో వారి శాతం నామమాత్రంగా మిగిలిపోతే  బీసీ వర్గాలు ఇప్పటికీ ఓటు బ్యాంకు గానే తలవంచుకొని బతకడానికి సిద్ధంగా ఉంటే  ప్రయోజనం ఏమిటి? సోయి తెచ్చుకొని , పోరాటానికి సిద్ధమై , ప్రతిఘటన,  ప్రశ్నించడం , నిలదీయడం ద్వారా  మరో రకమైనటువంటి సాయిధ పోరాటానికి బీసీ వర్గాలు దేశవ్యాప్తంగా ఉప్పెనలా కదలివస్తేనే  బీసీలకు రాజ్యాధికారంలో వాటా లభిస్తుంది .

 చట్టసభల్లో రిజర్వేషన్ బిల్లు సాధ్యమవుతుంది అంతేకాదు కుల గణన కూడా ప్రభుత్వం చేయడానికి తలవంచి  అంగీకరిస్తుంది  .1931 తర్వాత సుమారు వందేళ్లలో  ఇప్పటికీ కుల గణన జరపకపోతే బీసీ వర్గాల యొక్క జనాభా ఎంతో తెలవనటువంటి పరిస్థితుల్లో  చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఇంకా సహిస్తే ఎలా ? అందుకే "సాయుధ పోరాటం" అనే పదాన్ని ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వాడడం సందర్బోచితమే కాదు  ప్రతి బీసీ బిడ్డకు  జ్ఞానోదయం కలగాలి. ప్రాంతాలు రాష్ట్రాలు, భాషకు అతీతంగా దేశవ్యాప్తంగా  ఇప్పటికీ అనేకమంది పాదయాత్రలు పోరాటాలు, ధర్నాలు, చైతన్య యాత్రల పేరుతో కొనసాగిస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు తెలపడం ద్వారా  సంఘటిత శక్తిని ప్రదర్శించాలి .మరో స్వాతంత్ర పోరాటం లాంటి  సాయుధ పోరాటం ఎంచుకుంటే తప్ప బీసీల యొక్క సమస్యలు పరిష్కారం కావు.  5 శాతం, 2 శాతం, 1 శాతం ఉన్నవాళ్లు రాజ్యాన్ని దేశాన్ని ఏలితే 60 శాతం గా ఉన్న బీసీ వర్గాలకు  అధికారం లేక యా చించే పరిస్థితి రావడం సిగ్గుచేటు కాక మరేమిటి ? "అయితే పాలకులు తమ అధిపత్యం కొనసాగుతుందని ఆశిస్తారు కానీ ఉమ్మడి పోరాటంతో ప్రతిఘటనతో  డీలపడక తప్పదు.  అయితే అంత స్థాయిలో చైతన్యంతో సంఘటితశక్తితో  పోరాటం పెద్ద ఎత్తున కొనసాగాలి దానికి మరో రూపమే సాయుధ పోరాటం."  అంటే  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పాలకులను కదిలించే స్థాయి పోరాటం అని అర్థం చేసుకోవాలి .బీసీ ఐక్యవేదిక బీసీ జనసభ బీసీ టైమ్స్ పత్రిక,రాజ్యాధికారసమితి వంటి అనేక  సంఘాలు సంస్థలు అధ్యక్షులు  తమ యంత్రాంగాన్ని పెద్ద ఎత్తున కదిలించడమే  మన ముందున్న తక్షణ కర్తవ్యం .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333