భారత స్వాతంత్ర్య సంగ్రామం లో
తొలి సాయుధ పోరాట యోధుడు. పరిపూర్ణ వ్యక్తిత్వం గల చంద్రశేఖర్ ఆజాద్(.23-7.24 జయంతి వ్యాసం)
వడ్డేపల్లి మల్లేశము
నమ్మిన సిద్ధాంతం కోసం కొన్ని విశ్వాసాలు ఏర్పరచుకొని విశ్వాసాల పునాదిగా కార్యాచరణ కొనసాగిస్తేఏ పోరాటం అయినా విజయవంతం అవుతుంది. అది మరెందరికో ప్రేరణగా నిలిచి ఐక్య ఉద్యమాలకు దారి తీసి విజయపథం వైపు నడిపిస్తుంది. అలాంటి విశ్వాసాలు కలిగి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో తొలి సాయుధ పోరాట యోధుడిగా నిలిచిన వారే చంద్రశేఖర ఆజాద్.
దేశ ప్రజల విముక్తి కోసం ధర్మ యుద్ధమే సరైనదని దానికి సాయుధ పోరాటమే మార్గమని గట్టిగా నమ్మి చివరివరకు ఆచరించి చూపాడు. 1919 ఏప్రిల్ 13 వ తేదీన జలియన్వాలాబాగ్ సంఘటనలో
అమరులైన వందలాది మంది మృతి పట్ల కలతచెంది తన జీవితాన్ని దేశ మాత సేవలో గడిపి స్వేచ్ఛకై పోరాడాలని కఠోర నిర్ణయం తీసుకొని బ్రిటిష్ వారితో పోరాడుతూ
అసువులు భాషా డు. పోరాడుతూ బ్రతికింది 25 సంవత్సరాలు మాత్రమే అయినా చరిత్రలో మహనీయుడు గా నిలిచి పోయినాడు . ఆ స్ఫూర్తి నేడు కావాలి.
జననము, బాల్యము:-
--------------------------------
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావో జిల్లా బాధర్కా
గ్రామములో 1906 జూలై 23న పండిట్ సీతారాం తివారి జగ రాణి దేవి లకు ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినాడు. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర సీతారాం తివారి, panditji అని కూడా పిలుస్తారు. ప్రాథమిక విద్యను సొంత ఊర్లో పూర్తి చేసిన అనంతరం వారణాసిలో హైయర్ సెకండరీ విద్యను సంస్కృత పాఠశాలలో
అభ్యసించాడు. చదువు పట్ల పెద్దగా ఆసక్తి లేని కారణంగా పండితుడు కావాలన్న వారి తల్లిదండ్రుల కోరిక తీరక పోగా చిన్ననాడే ఇంటి నుండి పారిపోయి కూలీ పనులు చేసి ప్రజల కష్టసుఖాలను కూడా అవగాహన చేసుకున్నాడు. ఆ స్ఫూర్తి ఉండడం వల్లనే ప్రజాజీవితాన్ని ప్రజల ఇక్కట్లను బాధ్యతగా తీసుకొని స్వాతంత్ర పోరాటంలో పనిచేయడం నేటి మన తరానికి ఎంతో ఆదర్శం .ఏమంటారు?
ఉద్యమంలో ప్రధాన భూమిక:-
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తించినపోరాట వీరుడైన చంద్రశేఖర ఆజాద్ కు సహచరులు కూడా ఉద్యమంలో బాగా పేరుగాంచిన వాళ్లే. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్ ,ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్ లు ఆజాద్ మార్గదర్శకత్వంలో పనిచేసిన వారే.
1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర్య పోరాటం తర్వాత బ్రిటిష్ వారితో సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడిగా చరిత్రలో నిలిచిపోయాడు.
వ్యక్తిగత జీవితం కంటే దేశం గొప్పది. దేశమాత సంకెళ్లు తెంపడం తన కర్తవ్యంగా భావిస్తున్న తరుణంలో పదిహేనేళ్ల వయసులో 1921లో గాంధీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ ఉద్యమం అతని ఆలోచన కు ప్రేరణగా ,వేదికగా పనిచేసింది. ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ప్రత్యేకతను చాటుకున్నందు
కు చిన్న వయస్సులోనే అరెస్టయి తన కర్తవ్యం పట్ల మరింత కసిని పెంచుకున్నాడు.
సహాయ నిరాకరణ ఉద్యమం ఏ విధంగా ప్రేరేపించింది:-
----------------------------
ఆయనలో పౌరుషాగ్ని తట్టిలేపింది. విప్లవ కారుని మేల్కొలిపింది. భారతదేశాన్ని బ్రిటిష్ కబంధహస్తాల నుండి విడిపించాలని మరింత పట్టుదల పెరిగింది. అరెస్ట్ అయిన తర్వాత విచారణ సందర్భంలో కోర్టులో మెజిస్ట్రేట్ నీ పేరేంటి అని అడిగితే" ఆజాద్" అని పెద్ద శబ్దంతో అరిచాడట. అందుకు న్యాయమూర్తి 15 కొరడా దెబ్బలు శిక్షగ విధిస్తే ప్రతి దెబ్బ దెబ్బ కు" భారత్ మాతాకీ జై "అంటూ గొంతెత్తి నినదించాడు. నాటి నుండి చంద్రశేఖర ఆజాద్ గా పేరు స్థిరపడిపోయింది. ఆజాద్ అంటే స్వాతంత్రం అని కదా అర్థం. వీరుని ప్రతాపం ముందు చట్టాలు, న్యాయస్థానాలు దిగదుడుపే అని తేలిపోయింది. బ్రతికితే అలాంటి బ్రతికే బతకాలి. మనకంటూ ఓ చరిత్రను నిర్మాణం చేసుకోవాలి. ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే.
ఉద్యమ కార్యాచరణ ఉధృతి:-
------------------------------------
నవ జవాన్ భారత్ సభ, కీర్తి కిసాన్ పార్టీలతో సంబంధాలు కలిగి అనేక ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ప్రధానంగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపించి ఆ సంస్థ ఆధ్వర్యంలో అనుచరులతో కలిసి అనేక ఉద్యమాలు నిర్వహించాడు. కకోరి ట్రైన్ దోపిడి ,వైస్రాయ్ రైలు దహనం, ఉన్నత పోలీసు అధికారి జెపి సాండర్స్ కాల్చివేత తదితర హింసాత్మక కార్యక్రమాల్లో సాయుధులుగా పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి వెన్నులో చలి పుట్టించినాడు. ఉద్యమానికి ఆటంకం కలిగిస్తున్న తన హిట్ లిస్టులో ని పోలీసు అధికారులను కాల్చివేసి తన చేతిలో తాను చనిపోయేవరకు పోలీసులకు చిక్కకుండా వీర మరణం పొందిన ధీరుడు
మరణంలోనూ చంద్రశేఖర్ ది ప్రత్యేకతే:-
----------------------------------------------------
చంద్రశేఖర్ ను ప్రాణాలతో అరెస్టు చేయాలని పోలీసులు ఆశపడితే సహచరులను చూడడానికి అలహాబాద్ లోని ఆల్ఫ్రెడ్ పార్క్కు వెళ్లిన చంద్రశేఖర్ ను
పోలీసులు చుట్టుముట్టి లొంగి పొమ్మని హెచ్చరించగ పోలీసులను కాల్చి చంపి చివరికి తన బుల్లెట్లతో తానే చంపుకొని పోలీసుల ఆశను నిరాశ చేయడం ఎంత ఆత్మాభిమానానికి నిదర్శనం.
ఆ శవాన్ని ప్రజల మధ్య ప్రదర్శనకు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా పోరాడితే ఇదే గతి పడుతుందని పోలీసులు హెచ్చరించారు. కానీ దుర్భరమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తూ ఉండగా నాటి ప్రజల్లో, విప్లవకారుల లో చంద్రశేఖర్ మరణం పట్టుదలను దేశభక్తిని రగిలించిన ది. పోరాటానికి ప్రోత్సహించింది. ధైర్యాన్ని ఇచ్చి త్యాగాలకు ప్రేరణ అయింది.
అనంతర కాలంలో అహింసా పద్ధతిలో అక్కడక్కడ సాయుధ పోరాట ముతో భారత దేశానికి స్వాతంత్రం సంపాదించినప్పటికీ
భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో చంద్రశేఖరుడు నిజంగా ఆజాదే.
నాటి స్ఫూర్తిని నేటి తరానికి అందించడానికి ఈ చరిత్ర:-
-----------------------------------
నిండైన జీవితంతో ఎంతో గొప్పగా బ్రతకాలి అని ఆశ పడుతున్న మనం ఒక్కసారి నాటి వారి పోరాట స్ఫూర్తిని నెమరు వేసుకుంటే భారతదేశంలో నేటికీ మనం నిర్వహించవలసిన కర్తవ్యాలు చాలా ఉన్నాయని విజ్ఞులైన మనందరికీ తెలుస్తూనే ఉన్నది. సమాజం గురించి ,అసమానతలు అంతరాలు, భావప్రకటన స్వేచ్ఛ లేని నిర్బంధాల గురించి భారతదేశంలో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. అతి చిన్న వయస్సులోనే జీవితాన్ని పోరాటంలో భాగంగా దేశం కోసం అర్పించినా
దేశ ప్రజల గుండెల్లో చంద్రశేఖర్ ఆజాద్ నిరంతరం జీవించే ఉంటాడు. మనలను తట్టి లేపుతూ మట్టి మనుషుల పురోగతి కోసం సామాజిక బాధ్యతను నిర్వర్తించమని హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ సోయి మనకు ఉంటేనే మనం ఆయన వారసులు అవుతాం.
ఆలోచించండి! సామాజిక రుగ్మతలపై పోరాడటానికి స్పందించండి. ఇదే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి.
వడ్డేపల్లి మల్లేశం సామాజిక విశ్లేషకులు,
అధ్యక్షులు జాగృతి కళాసమితి, హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట
9014206412