నేరెళ్ల ఘటనలో ఏడున్నర ఏళ్లయినా దోషులకు శిక్ష పడకపోవడంవిడ్డూరం.
హైకోర్టు ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలు ప్రభుత్వ అసమర్ధతకు అద్ధం పడుతుంటే
న్యాయ వ్యవస్థ కూడా సంధిగ్ధంలో పడడం పెద్ద గందరగోళం.
పేదలoటే ఇంత నిర్లక్ష్యం పనికిరాదు.
---- వడ్డేపల్లి మల్లేశం
ప్రభలమైన సాక్షాలు, ప్రజా మద్దతు, ప్రతిపక్షాల ప్రతిఘటన, విశేష ప్రచారం జరిగినప్పటికీ 7న్నర ఏళ్ల క్రితం సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో జరిగిన అమానవీయ సంఘటనలో పేదలు అన్యాయానికి గురైతే అక్రమంగా హింసించి బంధించి చిత్రవదలకు గురిచేసిన పోలీసులు, ఇసుక మాఫియా పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం భారతదేశ న్యాయ వ్యవస్థ ప్రభుత్వాల మధ్యనున్న గందరగోళం సమన్వయ లోపానికి అద్ధం పడుతుంది. అందునా సామాన్యులు పేద వర్గాలు నిందితులైతే సాక్షాలను పోలీసులు ప్రభుత్వాలు సృష్టించి హింసించడం తప్ప రక్షించిన దాఖలాలు లేకపోవడం కూడా రాజ్య హింసకు మరొక లక్షణంగా భావించవలసి ఉన్నది.
2025 జనవరి 2 గురువారం రోజున తెలంగాణ హైకోర్టులో జరిగిన నేరెళ్ల ఘటన పైన విచారణలో హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని అదనపు అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించిన తీరు ఈ దేశంలో కేసులు ఎన్ని దశాబ్దాలు అయినా విచారణ లేకుండా ఉంటాయి అనడానికి పెద్ద ఉదాహరణ. " అక్రమాలకు పాల్పడ్డ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినారా? నమోదైతే ఛార్జి సీటు దాఖలు చేసినారా ?నేరెళ్ల ఘటనకు సంబంధించి దర్యాప్తు ఏ స్థాయిలో ఏ దశలో ఉంది? " అని టిఆర్ఎస్ హయాములో 2017 జూలై 2న జరిగినటువంటి సంఘటన ఆ తదనంతరం జులై ఏడవ తేదీన అరెస్టు చేసి అమాయకుల పైన పెట్టిన కేసులకు సంబంధించి ప్రశ్నించిన తీరు ఏడేళ్లుగా కేసు విచారణ లేకుండా దోషులకు శిక్ష పడకుండా సాగుతున్న తీరుకు దర్పణంగా మనం భావించాలి. అంతేకాదు కేసు యొక్క స్థాయి స్థితిగతులు తెలియకుండా హాజరైన ప్రభుత్వ న్యాయవాది పైన ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కేసు వివరాలు తెలియకుండా గడువు కోరడం కోసం హాజరు కావడంలో అర్థం ఏమిటి? అని మందలించడం అంటే ప్రభుత్వం యొక్క ఒంటెద్దు పోకడ, నత్త నడక ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు
నేరెళ్ల ఘటన పూర్వపరాలు:-
సిరిసిల్ల జిల్లా కొదురుపాక చీర్ల వంచ ప్రాంతాల నుంచి వందల ఇసుక లారీలు ట్రిప్పర్లు నేరెళ్ల గుండా నడిచేవి. ఈ క్రమంలో వేగంగా వచ్చే లారీల కారణంగా సుమారు 42 ప్రమాదాల్లో మొత్తం నలుగురు చనిపోయినట్లు గణాంకాలు చెబుతుంటే 2017 జూలై 2 తేదీన నేరలకు చెందిన ఎరుకల భూమయ్య అనే వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడంతో ఆగ్రహించినటువంటి స్థానికులు ఐదు ఇసుక లారీలను త గలబెట్టడంతో కేసు పెద్ద మలుపు తిరిగింది. దానితో పోలీసులకు స్థానిక ప్రజలకు వివాదం నెలకొనగా 13 మంది పైన పోలీసులు కేసు నమోదు చేసినట్లు నాలుగవ తేదీ రాత్రి 11:30 గంటలకు నేరెళ్ల,రామచంద్రాపూర్, జిల్లెల్ల గ్రామాలకు చెందిన వారిని అదుపులోకి తీసుకొని జూలై 7వ తేదీన అరెస్టు చేసినట్లుగా తెలుస్తున్నది. .చిత్రహింసలకు గురిచేసిన తర్వాత ఆ కేసు పరిస్థితులు బయటి లోకానికి తెలవకుండా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ ఘటనలో బీసీలు దళితులను పోలీసులు చిత్రహింసల గురి చేశారని బాధ్యులైన ఎస్పీ పోలీస్ అధికారులతో పాటు బాధ్యుల పైన చర్యలు తీసుకోవాలని బాధితులకు 10 లక్షల పరిహారం చెల్లించాలంటూ హైకోర్టులో ఇటీవల పౌ రహక్కుల సంఘం నాయకులు గడ్డం లక్ష్మణ్ గారు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్ గారు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ కేసు ప్రస్తుత o ప్రజల దృష్టికి వచ్చింది. లేకుంటే ఇంకా ఎన్ని దశాబ్దాలు అయినా మూలకు పడి ఉండేదే. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించగా ఆనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ గారలు బాధితులను పరామర్శించి న్యాయం చేస్తామని ప్రకటించడం జరిగింది.
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాల పైన విచారణ సందర్భంగా గురువారం 2 తేదీ 2025 జనవరి రోజున హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి సమక్షంలో విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని వేసిన ప్రశ్నలు
చాలా ఆలోచింప చేసేవి గా ఉన్నాయి. కేసు నమోదు అయినదా లేదా? దాఖలు చేశారా లేదా? ఇంతవరకు ప్రభుత్వపరంగా ఏమి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలు ఏడున్నర సంవత్సరాల పాలనలోని డొల్లతనాన్ని తెలియజేస్తుంటే ఏమాత్రం సమాచారం లేకుండానే అడ్వకేట్ జనరల్ దాఖలు చేయడానికి సమయం కావాలని అడగడంతో ఆగ్రహించిన కోర్టు ముందు అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ గారు స్పందిస్తూ ఇప్పటికే పిటిషణర్లు కోరినట్లుగా కేసు నమోదు అయినందున ఈ పిటిషన్లను విధిగా విచారించవలసిన అవసరం లేదని పేర్కొనడం అంతటితో సంతృప్తి చెందని ధర్మాసనం రెండు వారాల్లో దర్యాప్తు ఏ దశలో ఉందో తెలియజేయాలని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేయడం అంటే సామాన్యుల పక్షాన అడిగేవాడు లేకుంటే ఎన్ని దశాబ్దాలు అయినా కేసు పడి ఉంటుందని, నిజమైన నేరస్తులు తప్పించుకోవడానికి ఆస్కారం ఉన్నదని భారత న్యాయవ్యవస్థ లేదా క్రిమినల్ వ్యవస్థ పనితీరు ద్వారా అర్థమవు తున్నది.
పేదల పట్ల ఇంత నిర్లక్ష్యం పనికిరాదు:-
పిడికెడు మెతుకుల కోసం, జానెడు గుడ్డ కోసం అనివార్యమైన పరిస్థితుల్లో దొంగతనం చేసిన వాళ్లను నేరస్తులుగా చిత్రీకరించి జైలు పాలు చేసి శిక్షిస్తుంటే బడా నేరగాళ్లు పేదలను చిత్రహింసలకు హింసించినటువంటి పోలీసులు ఇతర సిబ్బంది ఇసుక మైనింగ్ మాఫియా దొంగలు లేనిపోని అక్రమ కేసులను పేదవాళ్లపైన బనాయించి ఆత్మ రక్షణ కోసం పోరాడిన సందర్భంలో వాళ్లపైన అనేక రకాల చిత్రహింసలకు పాల్పడినటువంటి ఘటనలు ఎన్నో. భారతదేశంలోనే చట్టసభల్లో పార్లమెంటులోని ఉభయ సభల్లో నేరస్తులు నేర చరిత్ర కల వాళ్ళు రాజ్యమేలుతుంటే తప్పులేదు దానిని ప్రశ్నించిన వాడు లేడు కానీ పేదలు ఈ రకంగా తమ అస్తిత్వం కోసం, ఉనికి కోసం, ఆత్మ రక్షణ కోసం గుండాలు రౌడీలను అడ్డుకున్న సమక్షంలో పోలీసులు కూడా వాళ్ల పక్షమే వహించి పేదలను ప్రశ్నించిన వాళ్లను చిత్రహింసలకు గురి చేయడంతో గత ఏడున్నర సంవత్సరాలుగా ఈ కేసు ఎందుకు చర్చకు రాలేదు ఎందుకు పరిష్కారం కాలేదు అని సామాన్యులు ప్రశ్నించే రోజు వచ్చింది. ఏడు సంవత్సరాల క్రితం ఈ సంఘటనలో బాధితులైన వాళ్లను హుస్నాబాద్ జేఏసీ పక్షాన పరామర్శించడానికి వెళ్లిన సందర్భం పరామర్శించిన జ్ఞాపకం మాకు ఉండనే ఉన్నది. కానీ మాజీ న్యాయమూర్తి పౌరహక్కుల సంఘం నాయకులు ఆలస్యంగానైనా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేసి హైకోర్టులో చర్చకు వచ్చేదాకా ఆ కేసు గురించి ఆలోచించనే లేదు అంటే ఈ దేశంలో ఇలాంటి వందలాది వేలాది కేసుల్లో పేదలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఈ సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసులు ప్రభుత్వం ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పైన తగిన విచారణ జరిపించి ఆ సంఘటనలో దోషులను గుర్తించడం ద్వారా తగిన శిక్ష విధించాలని ప్రజల పక్షాన బుద్ధి జీవులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు న్యాయ వ్యవస్థను కోరుతున్నారు. ప్రభుత్వాన్ని సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు .భారతదేశ వ్యాప్తంగా ప్రచారమైన నేరెళ్ల సంఘటన బాధ్యులపై అక్రమ చర్యల పైన కఠిన చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు. సంబంధిత నేరస్తులు లేదా బాధ్యులు పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఉంటుంది.
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )