కోవిడ్ సంక్షోభం, ప్రభుత్వాల నిర్లిప్తతతో పేదలకు దూర భారమైన పోషకాహారం
నిస్సత్తువ బందీలో బాల్యం, పేదరికం.*
ప్రకటనలకే పరిమితం కాకుండా అభివృద్ధిని ఆచరణలో చూపాల్సిన కేంద్రం. జాతీయ పంపిణీ వ్యవస్థతో పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే తరువాయి కావాలి.
-----వడ్డేపల్లి మల్లేశం
2019లో కోవిడ్ ప్రపంచ మహమ్మారిగా పరిణమించిన వేళ ఏ దేశాన్ని కూడా వదలకుండా తన దుష్ప్రభావాన్ని చూపి ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నా బిన్నం చేసిన విషయం అందరికీ తెలిసినదే . 2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ప్రజలు పేదరికంలోకి జారుకున్నారని , పేదరికం మరింత పెరిగింది ప్రపంచంలో కేవలం భారతదేశంలోనేనని గణాంకాలు చెబుతుంటే పెట్టుబడిదారుల ఆదాయాలు మాత్రం రెట్టింపు కావడాన్ని ప్రభుత్వాలు ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సంక్షోభ సమయంలో కూడా భారతదేశంలో పెట్టుబడిదారులు లాభాల పంట పండించినారంటే సామాన్యులు పేదల శ్రమతోనే అని తెలిసిపోతున్నది. కోవిడ్ సందర్భంలో లాక్ డౌన్ల కారణంగా, వ్యాపారాలు మార్కెట్లు దారి తప్పి, ఉపాధి అవకాశాలను సామాన్య జనం కోల్పోయి, వ్యాపారాలతో పాటు చిన్నాచితక జనం జీవితాలు అగాధములోకి నెట్టి వేయబడ్డాయి. దేశ జనాభాలో 15 శాతానికి పైగా దారిద్ర రేఖ దిగువ న జీవిస్తున్నట్లు ఇటీవల నీతి అయోగ్ ప్రకటిస్తే సుమారు 15 కోట్లకు పైగా వలస కార్మికులు ఇబ్బందులకు గురైనట్లు ఎంతోమంది ప్రయాణంలో మార్గమధ్యంలోనే చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. ఆ త దనంతర కాలంలో కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై ధరలు రోజురోజుకు పెరిగిపోతుంటే పేదరికం మరీ పెరిగిపోయి ఆకలి మంటలు సామాన్య ప్రజానీకాన్ని దహిస్తుంటే ఆ మంటల్లో చిన్నారులు ముఖ్యంగా మహిళలు సుమారు 20 కోట్ల మంది రక్తహీనత పోషకలేమితో బాధపడుతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కోవిడ్ కారణంగా ప్రభుత్వ పథకాలు అయినటువంటి సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ,పోషకాహార పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా నామమాత్రం కాగా పాఠశాలలు మూతపడడంతో బాలలకు ఆమాత్రమైన మధ్యాహ్న భోజనము ద్వారా లభించే ఆహారం అందక అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందవలసిన పోషకాహారం మొక్కుబడి అయిన విషయం తెలిసిందే .
రేపటి తరం అయినటువంటి చిన్నారుల శారీరక మానసిక ఎదుగుదలకు విటమిన్లు, ఖనిజలవణాలు , ఇతర పోషక విలువలు ముఖ్యం కాగా ఆహారంలో అవి లోపించడం వల్ల వయసుకు తగిన ఎత్తు బరువు పెరగకపోవడం, రోగనిరోధక శక్తి క్షీణించడం, నిరంతరం వ్యాధులకు గురికావడం వంటి లక్షణాలతో బాల్యం పేదరికం అనారోగ్యం చేతిలో బందీ కాక తప్పలేదు. అన్నింటికంటే విలువైన మానవ వనరులలో బాలలు పోషకాహార లోపంతో అనారోగ్యానికి గురికావడం కొత్త విషయాలను ఆసక్తిగా నేర్చుకునే ఉత్సాహం లేకపోవడంతో అన్ని రంగాలలో వెనుకబడినట్లు నిపుణులు తెలియజేస్తుంటే ఆ లోటును భర్తీ చేసుకోవడానికి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం గుర్తించకపోతే ఎలా?
మరింత లోతుగా పరిశీలిస్తే
*************
కరోనా సమయములో కనీసం రెండు మూడు సంవత్సరాల పాటు పాఠశాలలు నా మ మాత్రం కావడంతో అప్పటి బాలలకు విద్య అందకుండా పోవడంతో పాటు బాలలు పరస్పరం కలుసుకునే అవకాశం లేకపోవడంతో ఎదుగుదల కూడా క్షీణించినట్లు తెలుస్తున్నది. కోవిడ్ అనంతరం పరిస్థితులను గమనించినటువంటి ప్రభుత్వం 2022 నాటికి సామాన్య పేద ప్రజలను పోషకాహార లేమి నుండి కాపాడాలని తగిన పోషకాహారం సరఫరా చేయడం ద్వారా ప్రజలను జనజీవన స్రవంతిలో చేర్చాలని ఆశించినప్పటికీ ఆ లక్ష్యం నెరవేరలేదని తెలుస్తున్నది. ఇక అదే సందర్భంలో 2013 ఆహార భద్రత చట్టం మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆహార భద్రతను కల్పించడంలో కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ నిధుల కొరత, చిత్తశుద్ధి లేమి వంటి కారణాల వలన కేవలం నామమాత్రంగానే మిగిలిపోగా పోషకాహార సరఫరా మాత్రం ఎండమావి గాని మిగిలిపోయింది. కోవిడ్ సందర్భంలో వైద్య నిపుణులు పేద ప్రజలను కోవిడ్ వంటి భయంకర రుగ్మతల నుండి భవిష్యత్తులో కూడా రక్షించేది కేవలం పోషకాహారమెననిచెప్పినప్పటికీ కేంద్రం ఇప్పటికీ కేవలం బియ్యం గోధుమలను మాత్రమే పేద వర్గాలకు ఉచితంగా అందిస్తూ ఇదే పోషకాహారమని ప్రకటనలు చేస్తే నమ్మేది ఎవరు? ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ గుర్తింపు స్థాయిలోకి వస్తుందని, అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడబోతుందని కేంద్రం ప్రకటన చేస్తూ 2025 నాటికి 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ఆరాటపడుతున్నట్లు నటించినప్పటికీ పోషకాహారం పేద ప్రజల పాలిట కడుపు నింపినప్పుడు మాత్రమే ఈ మాటలకు అర్థం ఉంటుంది . ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో కేవలం ఉచిత బియ్యాన్ని సరఫరా చేస్తూ 2028 వరకు ఉచితంగా సరఫరా చేస్తామని కేంద్రం ప్రకటించడం అంటే అసలే పోషక విలువలు లేని బియ్యం రసాయనిక ఎ రువులు పురుగు మందుల వాడకం ద్వారా ఉత్పత్తి అయినటువంటివి ఏ రకంగానూ ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడని గుర్తించడం అవసరం . కరోనా దాటికి భారతదేశంలో ఆహార వ్యవస్థ తో పాటు ఆర్థిక వ్యవస్థ కూడా సంక్షోభంలోకి వెళ్లిన సందర్భంలో పిల్లలు ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందినటువంటి మహిళలు పురుషుల ఆరోగ్యం పట్ల కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉత్పత్తిలో క్రియాశీలక పాత్ర పోషించే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి పేద కుటుంబాల వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. అందుకు అనుగుణంగా జాతీయ పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం కు తోడుగా పప్పు ధాన్యాలు, వంటనూనెలు, సిరి ధాన్యాల వంటివి నామ మాత్రపు రేటుకు సరఫరా చేయడం ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది .అదే సందర్భంలో సేంద్రీయ విధానంలో వ్యవసాయ రంగాన్ని పరిపుష్టి చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకొని రసానికి ఎరువులు పురుగుమందుల వాడకాన్ని వ్యవసాయంలో తగ్గించగలిగినప్పుడు మాత్రమే ఆమాత్రమైన పోషక విలువలు ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పోషక విలువలు కలిగిన ఆహార ఉత్పత్తికి సంబంధించి కొత్త వంగడాలను సృష్టించడంతో పాటు, సేంద్రీయ విధానాలను ప్రోత్సహించి , పరిశోధనలకు పెద్దపీట వేసి, పేదల కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రజల ఆరోగ్య రికార్డును ఎప్పటికప్పుడు పరీక్షించి , పరీక్షలకు అనుగుణంగా ఆహార సరఫరాతో పాటు వైద్య చికిత్సలను అందుబాటులో ఉంచడం ద్వారా ముఖ్యంగా బాలల పట్ల తగిన శ్రద్ధ తీసుకోవడంతో భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. ప్రస్తుతo నిర్లక్ష్యం వహిస్తే బాలల భవిష్యత్తు అంధకారమయ్యే ప్రమాదం ఉంటుంది . "ఎదగని ,ఆరోగ్యంగా లేని మానసిక దౌర్బల్యము కలిగినటువంటి మానవజాతి ఏ రకంగానూ దేశ భవిష్యత్తుకు తోడ్పడదు" అనే సామాజిక చింతన ప్రభుత్వాలకు ఉన్నప్పుడు మాత్రమే ఆశయం నెరవేరుతుంది. పెట్టుబడుదారి వర్గానికి చెందినటువంటి వారి రుణాలను 14 లక్షల కోట్ల రూపాయలను ప్రభుత్వం మాఫీ చేసిందంటే ఏ వర్గ ప్రయోజనం కోసం పనిచేస్తున్నదో అర్థం చేసుకోవచ్చు . ఇక విదేశాల్లో దాగి ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలను వేస్తానని ప్రధాని 2014లో ఇచ్చిన మాట ఇప్పటికీ అమలు కాలేదు అంటే ఈ పేద ప్రజల జీవితాల గురించి ఆలోచించే తీరిక ఉందా అనే అనుమానం కలగక మానదు. అయినప్పటికీ ఎన్నికల్లో గెలవాలని అధికారం చలాయించాలని ఆరాటపడుతున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా పేద ప్రజల పోషకాహారం, పేదరిక నిర్మూలన, ఉపాధి హామీ, ఆరోగ్య పరిరక్షణ వంటి అంశాల పైన తమ మేనిఫెస్టోలో స్పష్టంగా ప్రకటించడం ద్వారా చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఆచరణలో చూపకుండా గంటల కొద్ది ప్రసంగాలు చేసే నాయకులు ఈ దేశానికి అవసరం లేదు . ఇటీవల ప్రధానమంత్రి 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి చేసినట్లు ప్రకటించినప్పటికీ ఇంకా దారిద్ర రేఖ దిగువన ఉన్న వాళ్ళ సంఖ్య గణనీయంగానే ఉండడంతో పాటు మౌలిక సౌకర్యాలు లేని పేదలు ఇంకెంతకాలం అనాధలుగా జీవించాలో ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది .
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం )