ప్రకృతి పరిరక్షణ బాధ్యత  పాలకులతో పాటు ప్రజలది కూడా.*

Jul 25, 2024 - 09:56
Aug 26, 2024 - 17:47
 0  5
ప్రకృతి పరిరక్షణ బాధ్యత  పాలకులతో పాటు ప్రజలది కూడా.*

మాటలకే పరిమితం కావడం క్షమించరాని నేరం.

పాలకులు చట్టాలను అమలు చేయడం ద్వారా  ప్రజలు పరిరక్షణ

చర్యలను ఆచరించడం ద్వారా  తమ నిజాయితీని, చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి .

---వడ్డేపల్లి మల్లేశం 

నీ కడుపు చల్లగా ఉండాలి , నీకు మేలు జరగాలి,  మీ పిల్లలు సంతోషంగా బ్రతకాలి"  అని దీవించి ఆశీస్సులు అందించే వాళ్ళు  అభాగ్యులు, యాచకులే కావచ్చు కానీ పిడికెడు మెతుకులు  సంపాదించుకున్నంత మాత్రాన  ఇంటి వాళ్లకు అందించే  అమృత వచనాలు ఎంత గొప్పవోమానవత్వమున్నవాళ్ళకి తెలుస్తుంది . త్యాగం లేని వాళ్ళు,  దానం చేయని వాళ్ళు,  తోటి మనిషిని సాటి మనిషిగా చూడని వాళ్ళు,  బాధ్యతలు నిర్వహించని వాళ్ళు,  పేదవాళ్లు వృద్ధులను అవమానించి అగౌరవపరిచే వాళ్లకు  మంచి చెడుల విచక్షణ కానీ  పేదలు యాచకుల  ఆందోళన కానీ ఏమి తెలుస్తుంది . అయినా పిడికెడు మెతుకులు   ఉచితంగా తిన్నందుకు బిచ్చగాళ్ల,ఆకలితో మాడే వాల్లు  కృతజ్ఞత వ్యక్తం చేయడం ఒకబాధ్యత.సంస్కారం. అలా అని పేదలు పేదలు గానే ఉండాలని  యాచ కులుగానే బ్రతకాలని కాదు అంతరాలు అసమానతలు లేని సమ సమాజం కోసం పోరాటం జరుగుతున్న ఈ నేపథ్యంలో  పెట్టుబడిదారుల పక్షం వహించి పేదల పట్ల బాధ్యతను విస్మరిస్తున్న పాలకులకు  జ్ఞానోదయం అయిన రోజున ఈ అంతరాలు సమస్య అంతమై  పోతాయి.  కానీ ప్రకృతి  నుండి    మానవుడు మాత్రం తన లబ్ధి  విస్తృత ప్రయోజనం కోసం  ప్రకృతిని విషతుల్యం చేస్తూ  అమితంగా వినియోగించుకుంటూ  భవిష్యత్తు తరాలకు తీరని ద్రోహం తలపెడుతున్నాడు. ప్రకృతి చెట్లు, పుట్టలు, కాయలు, గడ్డలు, వేర్లు, జంతు సంపద ,పశుసంపద,  నీరు, గాలి, ఆహారం,ఔషధాలు,  అన్ని రకాలుగా మనకు అందజేస్తున్నా  మన కుసంస్కారం వల్ల ప్రకృతిని నిట్ట నిలువునా  విషపూరితం చేస్తున్నాం.  అయినప్పటికీ ఈ ప్రకృతి  "భవిష్యత్తు తరాల కోసం  పర్యావరణమంతా పరిరక్షించబడాలని, సంస్కారం  బాధ్యతతో  మానవాళిని పాలకులను  ప్రకృతిని పచ్చగా ఉంచండి, లోకాన్ని కాపాడండి అని మనల హెచ్చరిస్తూ,దీవిస్తూ, కన్నీరుపేడుతున్న విధానం చూస్తే ఆందోళన కలగక మానదు . నిజంగా ప్రకృతిని పరిరక్షించి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనదైతే మన స్వార్థం కోసం ప్రకృతిని  అల్లకల్లోలం చేస్తున్న మన దుర్మార్గ ప్రవృత్తికి అడ్డుకట్ట వేసుకోవలసిన బాధ్యత అటు పాలకవర్గాలకు ఇటు ప్రజలకు ఉన్నది అనే సోయి మనం ఇకనైనా తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. యజమానికి బిచ్చగాడి  కృతజ్ఞత వ్యక్తం చేసినట్లు  వేధింపులకు గురైన ప్రకృతి కూడా  ఈ లోకం పచ్చగా ఉండాలని ఆశిస్తూ  భావితరాలకు ఈ మేలు జరగాలని కోరుకుంటున్న తీరును చూసి  ఇకనైనా మనం మారకపోతే ఎలా ?
    మాటలకే పరిమితం కావద్దు:-
********
శాస్త్ర సాంకేతిక రంగాలలో విప్లవాత్మకమైన మార్పుల ద్వారా ఆధునిక సమాజం  అభివృద్ధి పథంలో కొనసాగుతుందని మనం అనుకుంటున్నాము కానీ  అభివృద్ధి పేరుతో ప్రకృతి విధ్వంసం కావడాన్నీ ఇప్పటికీ మనం గ్రహించకపోవడం విచారకరం.  విచక్షణారహితంగా  అడవులను నరికి వేయడం  తిరిగి నాటే విషయంలో  బాధ్యతలను విస్మరించడం  నాటిన  మొక్కలైనా నైనా రక్షించుకోకపోవడం  విద్యుత్ తీగల కింద  చెట్లను పెంచి ఆటంకమని తిరిగి నరికి వేయడం  వంటి అనేక కారణాల వలన అడవుల శాతం  జాతీయ అటవీ విధానం ప్రకారంగా 33% ఉండాల్సింది కేవలం 20 శాతానికి  పరిమితం కావడం  మన కంట్లో మన వేలును పొడుచుకోవడమే కదా ! మానవ అవసరాలు క్రమంగా పెరుగుతున్న కొద్దీ  సుఖవంతమైన జీవితానికి అలవాటు పడిన కారణంగా ప్రతిదీ ప్లాస్టిక్  రూపంలో వినియోగించుకోవడం  ప్లాస్టిక్ వాడకం పెరగడం వల్ల నదులు సముద్రాలు  చెరువులు విషపూరితమై జలచరాలు చావడం, భూమిలో కలిసి పోలేక భూమి కూడా కాలుష్యమయమై పంటలు పండక పోవడం పండిన పంటల ద్వారా  విష పదార్థాలు  ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం . ఇక వాహనాల వినియోగం  అవసరానికి మించి,  విలాసం, హోదా,  మితిమీరిన ఆత్మవిశ్వాసం  వంటి అనేక కారణాల వలన లెక్కకు మిక్కిలి  వినియోగించబడుతుండడంతో కర్బన ఉద్గా రాలను  తగ్గించ లేకపోవడం వల్ల పర్యావరణం కలుషితమై  ప్రకృతి మానవాళిని కన్నెర చేయడాన్నీ మనం నిత్యం గమనిస్తూనే ఉన్నాం.  పాలకుల యొక్క బాధ్యతారాహిత్యం  ఇలాగే కొనసాగితే రానున్న కొద్ది సంవత్సరాలలో  మానవ మనుగడ ప్రశ్నార్థకం కాక తప్పదు .
  
     త్రాగడానికి మంచినీరు శ్వా సించటానికి ఆక్సిజన్ 
గగనమవుతున్న పరిస్థితుల్లో  నిత్య జీవిత  వాడకం వలన వ్యర్త పదార్థాలు  గుట్టలుగా పేరుకుపోయి  రీసైక్లింగ్ పైన శ్రద్ధ లేని కారణంగా  ప్లాస్టిక్ రేణువులు మనుషుల శరీరాల్లోకి  వాటిని మేసిన పశువులు  జంతువుల కడుపులో చేరి  అనారోగ్యాన్ని తెచ్చి పెడుతున్న విషయం కాదనలేము.  "అవసరానికి వాడుకోవడం వేరు అంతులేని కోరికల ద్వారా  వనరులను అంతం చేయడం వేరు " ఈ సందర్భంలో మహాత్మా గాంధీ ప్రకృతి వనరుల పట్ల  చేసిన హెచ్చరికను గమనించవలసిన అవసరం ఉన్నది  ."ప్రకృతి మానవ అవసరాలను మాత్రమే తీర్చగలదు  కానీ అంతులేని మన కోరికలను కాదు అది అసాధ్యం అది ప్రకృతికే ప్రమాదం ." ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు  ఉత్పత్తి పైన నియంత్రణ విధించి  కనీసంగా వినియోగిస్తున్న దాన్ని రీసైక్లింగ్ ద్వారా  అదనపు వ్యర్థ పదార్థంగా మిగలకుండా చూడవలసిన బాధ్యత శాస్త్ర సాంకేతిక రంగం పైన దానికి ఆధిపత్యం వహిస్తున్న పాలకుల పైన ఉన్నది . ఇక  ప్లాస్టిక్ ని అతిగా వినియోగించకుండా ప్రత్యామ్నాయాలను వెతకడం, స్వచ్ఛందంగా బహిష్కరించడం,  వీలున్న మేరకు వ్యర్థాలను  తగ్గించుకోవడం ద్వారా  పాలకుల పైన పారిశుద్ధ్య కార్మికులకు వైన  పడుతున్న భారాన్ని తగ్గించవలసిన బాధ్యత పౌర సమాజానిదే.  "మనిషి ప్రకృతిని ఓడించడానికి,  జయించడానికి,  దుర్మార్గంగా దోపిడీ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మానుకొని  స్నేహంగా  మసల డానికి ప్రయత్నిస్తేనే భవిష్యత్తు తరాలకు మార్గం ఉంటుంది"  .జల వనరులను  కలుషితం కాకుండా చూస్తూ  థర్మల్ ఇతరత్రా   విద్యుత్ శక్తి వల్ల  ప్రకృతి కలుషిత మవుతుంది కనుక ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్తు పైన ఎక్కువగా  ఆధారపడే వ్యవస్థను నిర్మించడం చాలా అవసరం.  కెనడా అమెరికా భారత దేశంలో ఉత్తర ప్రాంతంలో  ఇంకా అనేక దేశాలలో అడవులు   దహించుకుపోవడాన్ని  కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది కారణాలను వెతకాలి  అడవి సంపదను కాపాడుకోవాలి . వాహనాలను సంఖ్యను తగ్గించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తూ  అతినీల లోహిత కిరణాల ద్వారా  ప్రజలకు జంతువులకు పశుపక్షాలకు జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి ఓజోన్ పొరను రక్షించుకోవడానికి కృషి చేయవలసిన అవసరం కూడా  అందరి పైన ఉంది  ."దుర్మార్గ స్వభావం, అత్యాశ వంటి కారణాల వలన ప్రస్తుతం జరుగుతున్నటువంటి నష్టంలో సగభాగం  మానవ తప్పిదమే కనుక మనుషులు  మానవత్వాన్ని  ప్రేమిస్తేనే ఈ విధ్వంసాన్ని ఆపడం సాధ్యమవుతుంది  ప్రకృతి ప్రపంచం  పచ్చగా కళకళలాడుతుంది."
        పర్యావరణ పరిరక్షణ ప్రకృతి సంరక్షణ ఒక దేశానికి మాత్రమే పరిమితం కాదు కనుక   అంతర్జాతీయ ఒప్పందాల మేరకు కలిసి  పనిచేసి  నియంత్రించడం ద్వారా  భవిష్యత్తు తరాలకు  వనరులను మనం వారసత్వంగా అందించాలి.  ముఖ్యంగా పాఠశాల నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు  విద్యార్థులకు మొక్కల పెంపకం, ప్లాస్టిక్ నిషేధం,  ప్రకృతి పర్యావరణం యొక్క పాత్ర, భవిష్యత్తు సవాళ్లు  వంటి అంశాల పైన అవగాహన కల్పించడం  ఉపాధ్యాయ అధ్యాపకులతో పాటు సమాజంకు కూడా  బాధ్యత ఉన్నదని గుర్తిస్తే మంచిది.  ప్రకృతి సజీవంగా ఉంటే   భౌతిక వనరులన్నీ మనకు మేలు చేస్తాయి.  "మనం విధ్వంసానికి పాల్పడితే ప్రకృతి ప్రకోపించి  ప్రతి చర్యకు పాల్పడుతుంది  ప్రకృతిని ప్రేమించి ఆదరించి  బాధ్యతలను సరిగా నిర్వర్తించి  ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారించినట్లయితే  ప్రకృతి పచ్చగా వర్ధిల్లుతుంది . దురాశతో  కొల్లగొట్టే దుర్బుద్ధికి స్వస్తి పలికి  అవసరం మేరకే ప్రకృతి పైన ఆధారపడే  సంస్కారాన్ని పెంపొందించుకుంటే  ఈ ప్రకృతిని  భవిష్యత్తు తరాలకు  కాపాడే అవకాశం ఉంటుంది అది నేటి మన అందరి బాధ్యత."
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333