ప్రజల ఆకాంక్షలు సఫలం కావడంలో చట్టసభల పాత్ర.
ప్రజల ఆకాంక్షలు సఫలం కావడంలో చట్టసభల పాత్ర.* వివిధ లోక్సభల కాల పరిమితిలో ప్రజా సమస్యల చర్చ తీరుతెన్నులు.* రాజకీయ పార్టీల వైఖరి మారితేనే సభలో చర్చలు మరింత ఫలప్రదం అయ్యి పేదలకు న్యాయం జరుగుతుంది.*
*************************.*********
---వడ్డేపల్లి మల్లేశం 90142 06412
---21...11...2024*********--******
రాష్ట్రాల చట్టసభలతోపాటు భారత పార్లమెంటు వరకు ప్రజల ఆకాంక్షల పైన చర్చించే సందర్భంలో భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాల తొలినాళ్లలో నిబద్ధతగా కేటాయించిన సమయాన్ని మించి చర్చిస్తే క్రమక్రమంగా 18వ లోక్సభ కాలం2024 వచ్చేనాటికి ఆ క్రమం మారిపోవడం చర్చించే బదులు కమిటీలకు అంశాన్ని అప్పగించడంతో చట్టసభల చర్చను ముఖ్యంగా లోక్సభలో చర్చను తొందరగా ముగించి కొన్ని అంశాల్లోనైతే చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించిన సందర్భాలను చూస్తే జాలి వేస్తుంది. గత నాలుగు సంవత్సరాల క్రితం భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ ఎన్వి రమణ గారు భారత పార్లమెంటులో ప్రజా సమస్యల పైన చర్చలు చేయకుండా బిల్లులను ఆమోదించడం అప్రజా స్వామీకమని హెచ్చరించిన తీరు దేశ చట్టసభల పనితీరుకు దర్పణం పడుతుంది. భిన్నమైన కులాలు, మతాలు, సాంప్రదాయాలు సంస్కృతులు ఉన్న భారతదేశంలో అన్ని వర్గాల వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, అవకాశాలను, మానవ ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి చట్టసభల్లో చర్చించి వ్యూహాత్మకంగా సమానత్వాన్ని సాధించడం అంతరాల లేని వ్యవస్థను ఆవిష్కరించడం కీలకమైన సందర్భంలో దేశ పార్లమెంటులోని ఉభయ సభలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నవి. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకొని అధికారాన్ని అప్పజెప్పినటువంటి చట్టసభల పనితీరు క్రమక్రమంగా దాటవేత ధోరణి అవలంబించడాన్ని పరిశీలిస్తే ఏ రకంగా దిగజారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఫిరాయింపుల నిరోధక చట్టం అమరులో ఉండడంతో సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తపరచకుండా పార్టీ తీసుకున్న వైఖరిని గుడ్డిగా అనుసరించవలసి రావడం కూడా చర్చ లేకపోవడానికి కారణం అవుతున్నది. పార్టీ జారీ చేసిన విప్పును దిక్కరిస్తే సభ్యులు శిక్షలకు గురవుతున్న నేపథ్యంలో చర్చించడానికి అవకాశం లేనప్పుడు కమిటీలను ఏర్పాటు చేసి ఆ అంశాన్ని కమిటీలకు అప్పగించడం ప్రారంభమైంది. అయితే అదే సందర్భంలో మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కూడా కమిటీలు ఉపయోగపడుతున్న సందర్భంలో ఇటీవల కాలంలో చర్చనీ అంశాలను కమిటీలకు పంపడం కూడా తగ్గడం వలన చట్టసభల లక్ష్యం నెరవేరడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.
కేంద్ర చట్టసభల పనితీరు పరిణామక్రమాన్ని క్రమంగా పరిశీలిస్తే
*******************-*--*----
1962 నుండి 67 వరకు మూడవ లోక్సభకు కేటాయించబడిన సమయంలో అంతకుమించి 107% గా పనిచేయడం గొప్ప విషయం కానీ 2009 నుండి 2014 వరకు కొనసాగిన 15వ లోక్సభలో కారణాలు ఏమైతేనేమి కేటాయించిన సమయంలో 61 శాతం మాత్రమే లోక్ సభ ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితోపాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల యొక్క బాధ్యత కూడా చట్టసభల పనితీరు మరింత మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది. ప్రతిపక్షాల యొక్క బాధ్యత సభ నిర్వహణకు అంతరాయం కలిగించడం కాదు. నిర్మాణాత్మక సూచనలు చేయడం ద్వారా ప్రజల ఆకాంక్షలకు మరింత బలాన్ని చేకూర్చడమే అనే సోయి ప్రతిపక్షాలకు ఉండాలి. అంతకుమించినటువంటి సమయాన్ని కేటాయించాలి అనే సామాజిక బాధ్యత అధికార పక్షానికి కూడా ఉండవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇది కేవలం పార్లమెంటుకు మాత్రమే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల చట్టసభలకు కూడా ఉన్నప్పుడే భారత ప్రజాస్వామ్యం సఫలం అవుతుంది. చట్టసభల్లో అధికార ప్రతిపక్షాల మధ్యన అనవసరమైన చర్చ జరుగుతూ ఉంటే ఇటీవల కాలంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నటువంటి ప్రజలు ఈసడించుకునే ప్రమాదం ఉంటుందని గుర్తిస్తే మంచిది. స్వతంత్రం వచ్చిన తొలినాలలో ప్రభుత్వాలు సుదీర్ఘంగా చర్చించడంతోపాటు మరింత లోతుగా అధ్యయనం చేయడానికి కమిటీల వ్యవస్థను ఏర్పాటు చేసి అమలు చేసినటువంటి వ్యవస్థనుండి ప్రభుత్వo ప్రతిపక్షాలు కూడా క్రమంగా దిగజారి లోక్సభలో చర్చించకపోవడం కమిటీలకు ఆ అంశాలను అప్పగించకుండా బిల్లులను నామమాత్రపు చర్చ తోనే ఆమోదించి చట్టాలుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి అంటే దాటవేత ధోరణి ఎంత కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 15వ లోక్సభలో 71% బిల్లులను కమిటీలకు పంపగా 2019 నుండి 2024 వరకు గల 17వ లోక్సభ నాటికి కమిటీలకు పంపిన బిల్లుల సంఖ్య 16%కి తగ్గినట్టు తెలుస్తుంది. బిల్లులను కమిటీలకు పంపడం క్రమంగా తగ్గుతున్న కొద్దీ ప్రజాస్వామ్యంలో చట్టసభల లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది .మొదటి లోక్సభలో 45.8% సమయం చట్టాలపై చర్చించడానికి కేటాయిస్తే ఎనిమిదవ లోక్సభ వచ్చేనాటికి 24.9 శాతానికి తగ్గిపోయినట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇటీవలి కాలంలో చర్చించడానికి కేటాయించిన సమయం 20 శాతానికి పడిపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా భావించవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వ పక్షాన ప్రధాని మంత్రులు సిద్ధంగా లేకపోవడం, ప్రజల సమస్యల పైన ఆసక్తి కనబరచకపోవడం, ప్రతిపక్షాలు కూడా మొక్కుబడిగా వ్యవహరించడం లేదా గందరగోళం సృష్టించే సందర్భాలను కూడా మనం గమనించినప్పుడు 2007 నుండి ఇటీవల వరకు 47% బిల్లులు దాదాపుగా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించబడడం, చట్టాలుగా మారడం, అమలు కావడం జరుగుతున్నదంటే చట్టసభల పనితీరు ఎంత లోప భూయిష్టంగా కొనసాగుతున్నదో అర్థం చేసుకోవచ్చు.
మౌలికమైన అంశాలు లేదా ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించవలసినటువంటి సమయాన్ని కుదించుకోవడం లేదా ఉద్దేశపూర్వకంగానే సమయం కేటాయించకుండా మొక్కుబడిగా బిల్లులను ఆమోదించడం వలన సమగ్రమైనటువంటి ప్రజా ప్రయోజనకరమైన చట్టాలను దేశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇటీవల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడం, రైతు సమస్యల పైన సంవత్సరాల తరబడిగా సమ్మె జరిగిన పరిష్కారము దిశగా సమగ్ర చర్చ జరగకపోవడం, ప్రభుత్వం దేశ ప్రజలకు ఇచ్చినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పేదరిక నిర్మూలన వంటి అంశాల పైన జరగవలసిన స్థాయిలో చర్చ జరగని కారణంగానే అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు అనేది విశ్లేషకుల విమర్శ. ఈ లోపం ఒక రకంగా దేశాభివృద్ధిని ఆటంక పరచడమే అవుతుంది. రాజకీయ పార్టీలు అధికార పక్షం తరచుగా ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజా సమస్యల పైన లోతుగా చర్చించడానికి కార్యాచరణ తీసుకోవడం చాలా అవసరం. అందుకు రాజకీయ పార్టీలు తమ పని విధానాన్ని, ఆలోచన సరళిని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు కూడా ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాయో వారి సొంత ఆస్తిగా గుర్తించబడుతున్న కారణంగా కూడా రాజకీయ పార్టీల్లోని కిందిస్థాయి క్యాడర్ వరకు అవకాశం లేకపోవడంతో నిర్మాణాత్మక సూచనలు ఆ పార్టీ ప్రతినిధుల ద్వారా చట్టసభల్లో చోటు చేసుకోవడం లేదు. రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా క్రింది స్థాయి కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా తెలుసుకొని చట్టసభల్లో ప్రస్తావించడానికి అవకాశం ఉండాలి ఆ వైపుగా ప్రక్షాళన జరగాలి. ప్రధానమైన అంశాల పైన చర్చ జరుగుతున్న సందర్భంలో రాజకీయ పార్టీలు విప్పు జారీ చేయడం వలన కూడా సభ్యులు చర్చలో పాల్గొనక బొమ్మలుగా మిగిలిపోవడం కూడా ప్రజాస్వామ్యానికి నష్టమే. 40 శాతం సంపద కేవలం ఒక్క శాతం ఉన్న సంపన్న వర్గాల చేతిలో బందీ కావడ, సుమారు 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారుల ఎగవేతజరిగితే, అసమానతలు అంతరాలు ప్రశ్నించి ప్రతిఘటిస్తే అణచివేసే ధోరణి ఈ దేశంలో నిరంతరం కొనసాగుతూ, ప్రజల జీవించే హక్కును కాలరాస్తూ, స్వదేశీయులనే భారత ప్రభుత్వము బలి తీసుకుంటున్న సందర్భంలో ఈ అంశాల పైన ఎక్కడ చర్చ జరగకపోవడం, చట్టసభలోనే ఏ ప్రతిపక్ష సభ్యుడైన ప్రశ్నిస్తే అతన్ని ఉగ్రవాదిగా ప్రభుత్వం గుర్తిస్తున్నదంటే ఈ దేశంలో చట్ట సభల్లో నిజమైన చర్చ జరగడం లేదని భావించవలసి ఉన్నది. చట్టసభల పనితీరు, పార్టీ సభ్యుల ప్రశ్నించే హక్కును భారత న్యాయవ్యవస్థ సుమోటోగా స్వీకరించడం ద్వారా మరింత మెరుగైన ప్రజాస్వామి క విలువలను పరిరక్షించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అరసం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )