వానరమూకల బెడదను నివారించలేమా?

Feb 18, 2025 - 11:37
 0  0

వానరమూకల బెడదను నివారించలేమా?* రోజుకు ఎందరో ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం పట్టనట్లు ఉంటే ఎలా?* కోతుల కట్టడి చేయడానికి ఏదో ఒక పాలసీ ఉండాలి కదా!* నిపుణులతో ఆలోచిస్తే పరిష్కారం కుదరదా?*

****************************************

---వడ్డేపల్లి మల్లేశం 9014206412 

---20...11...2024**********************

 ఒకనాడు చిట్టడవులు, దట్టమైన పొదలు, గుబురు వృక్షాలు మాత్రమే కోతులకు నిలయంగా ఉండేది. అయినా అప్పుడు వాటి సంఖ్య కూడా పరిమితంగా ఉన్న జ్ఞాపకం నాది. చిన్నపిల్లల చేష్టలను కోతి చేష్టలతో పోల్చినా కోతులను చూసిన అనుభవం ఆనాడు అంతగా పిల్లలకు పెద్దలకు ఉండేది కాదు. కోతికి ఒక డ్రెస్ తొడిగి దానితో ఊరి మధ్యన,పాఠశాలల్లో ఆటలాడించి నేర్పిన విన్యాసాలతో రకరకాల చేష్టలు మనుషులకంటే మిన్నగా చేస్తూ ఉంటే పిల్లా పెద్దలు అందరూ సంతోషించేవారు. ఆనాడు చెట్ల పండ్లు, కాయలు, గడ్డలు, వేర్లు, పువ్వులు రకరకాల ఆహార పదార్థాలు ప్రకృతిలో దొరికేవి అపారంగా అందుబాటులో ఉండడంతో అవి కనీసం మనుషుల వైపు కన్నెత్తి కూడా చూసేది కావు. ఉపాధి లేకనే ఊర్లను విడిచి పట్టణాలకు నగరాలకు కానరాని దేశాలకు ప్రజలు వలస పోతున్న విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలతో పాటు చత్తీస్గడ్ ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన వాళ్లు అప్పటికి ఇప్పటికీ వలస బాటలోనే జీవిస్తున్న అనుభవాలను గమనించినప్పుడు అదే మాదిరిగా అడవులను చెట్లను, గుబుళ్లను విడిచి ఊర్లకు వలస వస్తున్న కోతులు వాటి చేష్టలు ఎందరినో కరుస్తూ ఉంటే ఆసుపత్రుల పాలవుతున్న అనుభవాలు జ్ఞాపకం వస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా క్రమక్రమంగా ఈ వలస బాట రోజురోజుకు క్రమంగా పెరుగుతూ ఉంటే అడవుల్లో నిల్ ఊర్లలో ఫుల్ అనే మాదిరిగా కోతుల జాడ కనపడుతున్నది. పట్టణాలను కూడా వదిలిపెట్టకుండా తమ ఆహార మంచినీటి ఇతర అవసరాల కోసం అనివార్యంగా ప్రజల పంచన చేరక తప్పడం లేదు అని అనుభవజ్ఞులు వృద్ధులు చెబుతున్న మాటలు వింటే చాలా సందర్భాలలో వాటి పట్ల జాలి కలుగుతుంది. కానీ అదే సందర్భంలో అవి రెచ్చిపోయి ఇండ్లల్లో తినుబండారాలు ఆహార పదార్థాలను ఇష్టమున్నట్టుగా దోచుకెళ్లి వృధా చేసి పారబోసి ఎవరికీ కాకుండా చేస్తున్న సందర్భాలు ఒక ఎత్తు అయితే నమ్మించి మోసగించినట్లుగా నడి నెత్తిలో, వీపులో, ముఖం పైన దు మికి తీవ్రమైన గాయాలు చేసి ఆసుపత్రులకు పంపిస్తున్నాయి అంటే ఒక్కొక్కసారి వాటి పట్ల కోపము, అసహ్యము, ఆవేశం కూడా కలుగుతున్నట్లు బాధలు, గాయాలైన వారి అనుభవాల ద్వారా తెలుస్తున్నది.

         ప్రభుత్వ పాలసీ ఏమిటి ?

*****************************

ప్రజలకు కనీస అవసరాలను సౌకర్యాలను సమకూర్చడంతో పాటు ఆరోగ్యము రక్షణ చికిత్సలు తగు ఏర్పాట్లను చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది. అదే సందర్భంలో ప్రజా జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తూ, నిత్యజీవిత కార్యకలాపాలను ఆటంకపరుస్తూ, రోజు కేందరినో గాయాలపాలు చేస్తూ, భయంకరమైనటువంటి వ్యాధుల బారిన పడే విధంగా మనుషులను కరుస్తున్నటువంటి కోతుల చర్యల పట్ల పాలకులకు ఆలోచన లేదా అని ఎంతో మంది ముక్కున వేలేసుకుంటున్నారు కూడా. స్థానికంగా ఎన్నికల సందర్భంలో కొన్నిచోట్ల "ఈ ఎన్నికల్లో నేను గెలిస్తే ఈ గ్రామంలో లేదా ఈ ప్రాంతంలో లేదా ఈ మండలంలో కోతులు లేకుండా చేస్తాను కొండెంగలను తీసుకువచ్చి కోతులు పారిపోయేలా చర్యలు చేపడతాను. ప్రభుత్వ సహకారంతో తగు విధమైనటువంటి ఆలోచన చేసి వీటి బెడద నుండి ప్రజలను రక్షిస్తాము" అని హామీ ఇచ్చిన సందర్భాలు కూడా అనేకం. కానీ ఎక్కడ కూడా నాకు తెలిసి ప్రభుత్వపరంగా ప్రజాప్రతినిధుల పక్షాన ఎలాంటి చర్యలు తీసుకోలేదు పైగా కోతుల బెడద రోజురోజుకు ఎక్కువైపోయింది. వీటిని కంట్రోల్ చేయడం మన సాధ్యం కాదు అని నిట్టూర్పు విడిచినటువంటి వాళ్లే ఎక్కువ. ఇక ప్రభుత్వపరంగా అధికారులు ప్రజా ప్రతినిధులు మంత్రివర్గం ఏనాడు కూడా వీటి పట్ల చర్చ చేసిన దాఖల నా వరకు తెలియదు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా ఈ సమస్య ప్రజలను వేధిస్తున్నది. ఇది కేవలం ఆటంక పరచడమే కాదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో వీటి నుండి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాకపోగా ఇంట్లో చొరబడి, ఎన్నో ఆహార పదార్థాలను విచ్చలవిడిగా పారబోసి, నష్టం చేస్తున్న సందర్భాలు కూడా అనేకం. ఎవరి పంచన వారే వీటి పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, బాధపడుతూ, కర్రలతో బాధితు ఉన్నారే తప్ప సమగ్రమైనటువంటి సామూహికమైనటువంటి కార్యాచరణ ఎక్కడ కూడా ఇంతవరకు ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల కొంతమంది వీటి పట్ల స్థానికులకు ఫిర్యాదు చేయడం లేదా నిరసన తెలుపడం వంటి చర్యలు చేపట్టినప్పటికీ తాత్కాలిక చర్యలు చేపట్టినారే తప్ప శాశ్వతంగా వాటిని తరిమికొట్టిన సందర్భాలు లేవు. కొన్నిచోట్ల వాటిని తీసుకువెళ్లి చాలా దూరంలో విడిచిపెట్టి వచ్చినట్లు చెబుతున్నప్పటికీ మళ్లీ వాటి స్థానం ఏదోరకంగా ఎక్కడినుండో భర్తీ అవుతూనే ఉన్నది. వీటన్నింటికీ ప్రధానమైనటువంటి కారణాలను, జన జీవితాలకు దూరంగా వెళ్లిపోయే పరిష్కార మార్గాలను వెతకవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇటీవల ముఖ్యంగా కుక్కల దాడిలో అనేకమంది పిల్లలు చనిపోయిన సంఘటనలు చట్టసభల్లో చర్చకు వచ్చినప్పటికీ వాటిని నివారించే విషయం లోపల నామమాత్రపు చర్యలను ప్రకటించి గ్రామపంచాయతీలు పురపాలక సంఘాలు కనీసం గానైనా అమలు చేసినట్లు తెలుస్తూ ఉంటే కోతుల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు మనకు కనిపించడం లేదు. కేవలం ఆసుపత్రిలో టీటీ ఇంజక్షన్లతోపాటు ప్రత్యేకమైనటువంటి డోస్ మందుల చికిత్స ద్వారా గాయాలను నివారించి ప్రమాదం నుండి రక్షించడానికి ఏర్పాట్లు ఉన్నాయి. అంతే కాదు గాయాలయితే చికిత్సకు పరిమితమైతే సరిపోదు. ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించినా వాటి భద్రత రక్షణను వాటికి ఏర్పాటు చేస్తూనే వాటి దాడి నుండి ప్రజలను రక్షించడానికి వ్యూహరచన చేయాలి, నిపుణులు మేధావులతో సంప్రదించాలి, వనాలను విడిచి జనాలకు రావడానికి గల కారణాలను విశ్లేషించాలి. కొన్నిచోట్ల వీటి బెడదను భరించలేక తోటలు చెట్లు పొలాలు పంటచేలలో జరుగుతున్న నష్టాన్ని తట్టుకోలేక విషమిచ్చి చంపిన సందర్భాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ రకంగా వాటి జాతి మృత్యువాత పడడం కూడా వాంఛనీయం కాదు అదే సందర్భంలో వాటి దాడికి గురై ప్రాణాలు కోల్పోవడం నాగరిక సమాజం యొక్క అజ్ఞానాన్ని తెలియజేస్తుంది.

కొన్ని సూచనలు 

***************-*

    

  ----ప్రజలు ఎక్కడికక్కడ స్థానిక అధికారులు ప్రజాప్రతియులకు ఫిర్యాదు చేయాలి.

  ---ప్రభుత్వం చట్టసభలో వీటిపైన చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలి.

 --- ఇతర రాష్ట్రాలు ప్రాంతాలలో ప్రభుత్వ పాలసీని తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయాలి.

----జనావాసాల నుండి తరిమి వేయడం ఒక ఉద్యమంలా జరగాలి.

  ----మనుషులను పంటలను వీటి దాడి బెడద నుండి రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వాలదే.

 --- ప్రకృతి సమతుల్యత రీత్యా కోతుల సంఖ్యను కూడా కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత. అయినప్పటికీ ప్రత్యామ్నాయ దారి వెతకాలి ఇతర ప్రాణికోటికి హాని కలగ కుండా చూడాలి.

           ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో వీటి బెడద ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. తమ ఆత్మ రక్షణ కోసం కోతులు ప్రజల పైన దాడి చేయడం, కోపంతో మనుషులు వాటిని చంపి వేయడం రెండు కూడా ప్రకృతి ధర్మానికి విరుద్ధమే. ఈ అవగాహనతో మనుషులు సహకరించాలి ప్రభుత్వాలు తమ బాధ్యతను నిర్వహించాలి . కోతుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉంటే రెచ్చిపోయి మనుషుల పైన విపరీతమైన దాడులకు పాల్పడుతూ ఉంటే ప్రాణహాని పెద్దగా జరగవచ్చు. ఈ ప్రమాదాన్ని మరింత ముందుగానే పసికట్టి ప్రత్యేక ఏర్పాటు బాధ్యత సమాజముతో పాటు ప్రభుత్వం పైన కూడా ఉన్నది. గమ్మత్తయిన విషయం ఏమిటంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవచ్చు కానీ ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ఇతర కమిటీలకు కూడా ఈ ఆలోచన రాకపోవడం ఘోరాలు రోజురోజుకు ఎక్కువగా జరిగిపోతూ ఉండడం ఆశ్చర్యపరిచే విషయం.

  కోతి నుండి వచ్చినాడు మానవుడు అనే జీవపరిణామ సిద్ధాంతానికి బాసటగా కోతులను రక్షించుకుందాం. అదే సందర్భంలో వాటి మనుగడకు ఆటంకం అవుతున్నటువంటి పరిశ్రమలు, గనులు, గుట్టలు, ప్రకృతి విధ్వంసం తో పాటు ఇతర కార్యకలాపాలను కూడా తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది.అస్థాయిలో సమాజం చైతన్యం కావడం కూడా కీలకం.

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333