గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై  కేంద్రం,  రాష్ట్ర కాంగ్రెస్  చేసిన బలమైన ఆరోపణలు  ఏమైనవి

Nov 1, 2024 - 18:50
Nov 7, 2024 - 20:27
 0  8
గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పై  కేంద్రం,  రాష్ట్ర కాంగ్రెస్  చేసిన బలమైన ఆరోపణలు  ఏమైనవి

 ప్రజాధనాన్ని ఎవరు   దొంగిలించినా  బోనులో నిలబడాల్సిందే .

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం   చిత్తశుద్ధిగా విచారణ జరిపించి  చేసిన కామెంట్లను  రుజువు చేయాలి. కేంద్రం చర్యలేవీ?

---- వడ్డేపల్లి మల్లేశం

ఒక ప్రభుత్వం పై  రాజకీయ పార్టీలు లేదా కేంద్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలు  ఆ తర్వాత కాలంలో కనుమరుగు కావడాన్నీ  ఇటీవల కాలంలో ఎక్కువగా గమనించవచ్చు.  మాటకు మాటగా ఆరోపణలు ప్రత్యారోపణలకు పాల్పడి  ఆ తర్వాత  ఆరోపణలు చేసిన పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా  కఠిన చర్యలు తీసుకోకపోవడం,  మొక్కుబడిగా వ్యవహరించడం , దోపిడికి గురైన ప్రజాధనాన్ని  నేరస్తుల నుండి కక్కి0చకపోవడం నిజంగా నేరమే.   ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా  సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణల పైన ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించినప్పటికీ  అదే సమయంలో ప్రతీకార  చర్యలకు పాల్పడడం లేదని  చట్టం తన పని తాను చేసుకు పోతుందని చెప్పడం అంటే  అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా  ఇదే ధోరణి వ్యవహరిస్తుందా అనే సందేహం కలగక మానదు.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో  టిఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో  ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు,  ప్రజాధనం వృధా  వంటి అనేక అంశాల పైన  రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ఆరోపణలు  వేగం తగ్గించినట్లుగా తెలుస్తున్నది.  అంతేకాదు కేంద్ర ప్రభుత్వం కూడా  టిఆర్ఎస్ ప్రభుత్వానికి కాలేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం గా మారిందని , లక్షలాది రూపాల ప్రజాధనం కొల్లగొట్టినారని,  అవసరమైతే చర్యలు తీసుకోవడానికి వెనుకాడేది లేదని  కేంద్ర బిజెపి అధ్యక్షులతో పాటు ప్రధానమంత్రి   గతంలో  హాట్ కామెంట్స్ చేసినప్పటికీ  ఆ రకమైన చర్యలు కనిపించడం లేదు.  పైగా ప్రస్తుత ప్రభుత్వం సిబిఐ ఎంక్వయిరీ  కోరితే  విచారణ జరిపిస్తాము అనీ మాట్లాడితే  రాష్ట్ర ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచన చేయకపోగా  ఫోన్ టాపింగ్,  కాలేశ్వరం ప్రాజెక్టు పైన  కొంత హల్చల్ చేసినప్పటికీ  ప్రస్తుతం స్తబ్దంగా ఉండడాన్ని బట్టి  ఎప్పుడైనా ప్రజాధనం దుర్వినియోగం  కావాల్సిందేనా? ఏ ప్రభుత్వం వచ్చినా  ప్రజలు ఓడిపోవాల్సి0దేనా? అనే అనుమానం కలగక మానదు.
       ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు కాంగ్రెస్ పార్టీ   అధ్యక్షులుగా ఉన్న కాలంలో  నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడినాడని,  రాష్ట్ర సంపదను పెద్ద మొత్తంలో ఆ కుటుంబం దోచుకున్నదని , రైతుబంధు తో సహా అనేక ప్రభుత్వ పథకాలలో  అవినీతి పేరుకుపోయిందని,  అధికారంలోకి రాగానే విచారణ జరిపించి చెర్లపల్లి జైలుకు పంపిస్తామని  అనేకసార్లు మాట్లాడినప్పటికీ ఆ వైపుగా అడుగులు పడడం లేదు.  ఫామ్ హౌసుల సంస్కృతి మీద,  భూస్వాములకు, పండించని కాళీ భూములకు రైతుబంధు చెల్లించిన విధానం పైన,  రాష్ట్ర ప్రభుత్వ భూములను అప్పన0 గా కొన్ని సంస్థలకు కట్టబెట్టిన విధానం పైన  ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తో సహా అనేకమంది టిఆర్ఎస్ ప్రభుత్వం పైన  ఆరోపణలు చేయడం జరిగింది.brs  ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం  గతంలో వచ్చిన అన్ని రకాల ఆరోపణలతో పాటు తమ పార్టీ పరంగా చేసిన  కామెంట్ల పైన సమగ్రమైన విచారణ జరిపించడానికి  ఎందుకో సందేహిస్తున్నట్లుగా  ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ప్రాజెక్టులు కాలువలు  ప్రభుత్వ భవనాలు దేవాలయాలు అన్ని రకాల నిర్మాణాలలో కూడా అవినీతి జరిగిందని, చివరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా కూలిపోయినాయని  అనేక రకాల వార్తలు వచ్చిన విషయం,  నేటి ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నాయకత్వంలో వాటిని పరిశీలించిన సందర్భం మనకు తెలిసిందే . ప్రజాధనంతో చేసిన నిర్మాణాలు చేసిన   పది కాలాలపాటు  ఉండాలి కానీ   కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, ప్రభుత్వం  అక్రమ సంపాదన కోసం ఈ రకంగా  నిర్మించిన అన్నింటి పైన కూడా విచారణ జరిపించాల్సిందే. అంతే కాదు  కాలేశ్వరం ప్రాజెక్ట్  టిఆర్ఎస్ పార్టీకి ఏటీఎం లా మారిందని కేంద్రంతో సహా  రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఆనాడు ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే . ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలు  ప్రధానమంత్రి తో సహా  కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు పార్టీ నాయకులు  చేసిన విమర్శలపై   చర్యలు ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు . ఫోన్ టాపింగ్  పైన కొంత  అలజడి  రేగినప్పటికీ ఆ అంశం కనుమరుగు కావడం  ప్రతి పథకంలోనూ అవినీతి జరిగినట్లు  నిర్ధారణకు వచ్చినప్పటికీ కూడా  సమగ్ర విచారణకు ఆదేశించకపోవడం  పట్ల ప్రజలు ప్రజాస్వామ్య వాదులు  కొంత ఆందోళన చెందుతున్నారు.  అక్రమంగా సంపాదించిన  ఆస్తులను ప్రభుత్వం  తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా  నేరస్తులను శిక్షించడంతోపాటు అట్టి డబ్బుతో  ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు చెల్లించడం , భూమిలేని కార్మికులకు రైతు భరోసా కల్పించడం,  అశేష పేద ప్రజలకు  ఉపాధి అవకాశాలతో పాటు  ఇల్లు లేని వారందరికీ ఇండ్ల నిర్మాణం చేపట్టి  తోడ్పాటు అందించవచ్చు కదా!  అంతేకాదు గత ప్రభుత్వం విద్యారంగానికి 6శాతం కూడా మించని పరిస్థితిలో  విద్యను కులాలవారీగా,  విడదీసి కామన్ స్కూలు  విధానం అమలు చేయకుండా,  ప్రభుత్వ పాఠశాల వ్యవస్థను నిర్వీర్యపరిచిన విషయం తెలుసు.  అంతేకాకుండా గత ప్రభుత్వం  ఫీజు రియంబర్స్మెంట్ ఉపకార వేతనాలకు  చెల్లించలోవలసిన కోట్లాది రూపాయలు బకాయి పడితే  ఆ బకాయి 7700 కోట్లకు చేరినట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నవి.  ప్రభుత్వ  వివిధ డిపార్ట్మెంట్లో  కోట్లాది రూపాయల బిల్లులు చెల్లింపు జరగకుండా  ఆ వర్గాలు ఇబ్బంది పడుతున్నట్లుగా మనకు తెలుస్తున్నది.  ఇలాంటి పరిస్థితుల్లో అక్రమంగా  సంపాదించినటువంటి గత ప్రభుత్వ  పాలకులు అధికారులు  ఉద్యోగులు ఎవరైనా  విచారణ జరిపించి దోషులుగా తేల్చి  ప్రభుత్వ ఖాతాకు  అక్రమ సొమ్మును జమ చేయడం ద్వారా ఇలాంటి అనేక బకాయిలకు చెల్లింపులు జరిపి  ప్రభుత్వంపై వస్తున్న ఒత్తిడి తగ్గించుకోవచ్చు కదా! 
       ఇక కేంద్ర ప్రభుత్వం కూడా  టిఆర్ఎస్ తో అనేక  విమర్శలకు గురైనప్పటికీ   రెండు పార్టీలు ఒకటే అనే ఆరోపణలు సర్వత్రా విడబడుతున్నప్పటికీ  ఆ విమర్శల నుండి విముక్తి పొందడానికి  తనకున్న అధికారాన్ని ఉపయోగించి  కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా  గత టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క  అవినీతి బంధుప్రీతి  పైన గతంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ప్రస్తుతము కూడా తీసుకోవడానికి సిద్ధపడినట్లుగా కనిపించడం లేదు. అంటే  ప్రజాధనాన్ని కాపాడే విషయంలో కేంద్రం కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదంటే  ఇక ఆ ప్రజాధనాన్ని  కాపాడే వాళ్ళు ఎవరు?  ఇప్పటికైనా  చిత్తశుద్ధిని ప్రదర్శించి  బాధ్యతలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం  గత బిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి అన్ని రకాల అవినీతి ఆరోపణల పైన సమగ్రమైన విచారణ జరిపించి దోషులను శిక్షించి  ప్రజాధనాన్ని కాపాడవలసిందిగా  ఈ రాష్ట్ర ప్రజానీకం  విజ్ఞప్తి చేస్తున్నది
  అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల కూడా గత జగన్ ప్రభుత్వం పైన వచ్చిన అన్ని రకాల ఆరోపణలను  ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని  నిక్కచ్చిగా  దర్యాప్తు జరిపించాల్సిందే.  నేరం ఎవరు చేసినా శిక్షకు అర్హులే  చిత్తశుద్ధి ఉంటే  నేరస్తులను ఉక్కు పాదంతో అణచివేయాలి.  భవిష్యత్తులో అలాంటి దృశ్చర్యలకు ఎవరు పాల్పడకుండా  ప్రజాక్షేత్రంలోనూ,  చట్ట పరిధిలోను  శిక్ష అనుభవించినప్పుడే  ప్రజాధనాన్ని కాపాడుతారు, ప్రజలను ప్రభువులు గా చూసే సంస్కృతి అలబడుతుంది.

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అ ర సం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333