ఉషశ్రీ ఒకేషనల్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

తిరుమలగిరి 14 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండల కేంద్రం బాలాజీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఉషశ్రీ ఒకేషనల్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ వేముల బాలరాజు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి కన్న తల్లిదండ్రులతో పాటు విద్య నేర్పిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ పాలబిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుమలగిరి మండల కేంద్రంలో 2011 లో కళాశాల స్థాపించి ప్రతి సంవత్సరం అత్యుత్తమ మార్పులు సాధిస్తున్న ఏకైక కళాశాల ఉషశ్రీ అన్నారు. అత్యుత్తమ సుదీర్ఘ అనుభవం గల అధ్యాపకులచే పటిష్టమైన విద్యా ప్రణాళిక ద్వారా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపల్ నెలుట్ల రాజు మాట్లాడుతూ కళాశాల స్థాపించిన నాటి నుండి నేటి వరకు మండలంలో అత్యుత్తమ ఫలితాలతో ఒక తిరుగులేని శక్తిగా ఉషశ్రీ కళాశాల పేరొందుతుందన్నారు. విద్యార్థులు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకొని వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలని, అలాగే పోటి ప్రపంచంలో విద్య తో పాటు అన్ని రంగాల్లో రాణించినప్పుడే చదివిన చదువుకు సార్ధకత ఉంటుందన్నారు. అదేవిధంగా విద్యార్థులు కష్టపడి చదివి కళాశాలను జిల్లా స్థాయిలో నిలబెట్టాలని కోరారు. అధ్యాపకులు ప్రభాకర్, శ్రీనివాస్ మాట్లాడుతూ మంచి హోదా, గుర్తింపు రావాలంటే చదువే శరణ్యమని, చదువే జీవితానికి మంచి విలువ అని అన్నారు. అనంతరం ఇంటర్ మొదటి మరియు ద్వితీయ విద్యార్థిని విద్యార్థులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థినిలు గిరిజన డాన్స్ ప్రదర్శనలతో పలువురుని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రభాకర్,శ్రీనివాస్, సీమ,తిలక్ మరియు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.