విద్యా రంగాన్ని బలోపేతం చేయాలంటే

విద్యా వ్యవస్థలో మౌలిక మార్పులు అవసరం

May 26, 2024 - 21:31
Jun 6, 2024 - 15:25
 0  14
విద్యా రంగాన్ని బలోపేతం చేయాలంటే

విధానపరమైన ప్రకటనతోనే 

ప్రజల్లో ప్రభుత్వం పై విశ్వాసం పెరుగుతుంది.

అల్పాదా య వర్గాల పిల్లల  

చదువుకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి .

విద్యాహక్కు చట్టాన్ని  పకడ్బందీగా అమలు

చేయడంతో పాటు  పీజీ వరకు  ఉచిత విద్య కొనసాగిస్తే మంచిది.

విద్యా వైద్యాన్ని ప్రజలందరికీ ఉచితంగా అందించడం ద్వారా ప్రభుత్వం తన సామాజిక కర్తవ్యాన్ని బాధ్యతను రుజువు చేసుకోవలసిన అవసరం ఉన్నది . కొఠారి కమిషన్ సూచించిన మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  10 శాతం 30 శాతం నిధులను బడ్జెట్లో కేటాయించే  విషయాన్ని ఏనాడో మరిచి నామమాత్రం  కేటాయించడం ద్వారా  వ్యాపార ధోరణికి అలవాటు పడిన విషయం మన అందరికీ తెలుసు. అందుకే ప్రభుత్వ విద్య  పై నమ్మకం లేక ప్రైవేటు విద్య  అనివార్యమైపోతున్నది . దీనివల్ల పెట్టుబడి దారి ఉన్నత వర్గాలకు ప్రమాదం లేదు కానీ సామాన్య పేద వర్గాలకు క్రమంగా నాణ్యమైన విద్య అందకుండా పోయే ప్రమాదం ఉన్నది పైగా  అల్పాదాయ వర్గాలు  ఫీజుల జులుం బారిన చిక్కి  మరింత అప్పుల పాలు అయ్యే ప్రమాదం లేకపోలేదు . ఈ సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత ఎక్కడైనా ప్రభుత్వానిదే  ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పదేళ్లలో విద్యారంగంపై ఏనాడు కూడా  సమీక్ష చేయని కారణంగా  ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నామమాత్రంగా ప్రవేశపెట్టి  పూర్తి సౌకర్యాలను కల్పించకపోవడంతో  ప్రభుత్వ విద్యా రంగం అస్తవ్యస్తమైపోయింది  .
పదేళ్ల కాలంలో 6000 పాఠశాలలను విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వమే  మూసి వేయించినటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు  టిఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి.  మన ఊరు మనబడి మన సిటీ మనబడి పేరుతో  ప్రణాళిక రచించినప్పటికీ నిధులను కేటాయించకపోవడం  ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సమీక్షలు నిరంతరం కొనసాగకపోవడంతో  నామమాత్రంగా మిగిలిపోయి ఎక్కడ అభివృద్ధి కానరాకపోవడం  దానివల్ల ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం సన్నగిల్లి  పేద వర్గాలు కూడా ప్రైవేటు పాఠశాలలపై మోజు పెంచుకోవడంతో  అల్పాదాయ వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితి చిక్కుల్లో పడిపోయింది  .సంపన్న వర్గాలు, మధ్యతరగతి ఏ రకంగానైనా తమ పిల్లలను చదివించుకుంటారు కానీ పేద ప్రజలకు  విద్యా భరోసా ఇవ్వని ప్రభుత్వం ఉంటేనేమి ఊ డితేనేమి?  2009లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన విద్యాహక్కు చట్టం ప్రకారంగా  ఎనిమిదవ తరగతి వరకు అంటే 14 సంవత్సరాల వయస్సు వరకు ప్రభుత్వమే ఉచిత నాణ్యమైన విద్యను హక్కుగా అందించవలసిన అవసరం ఉన్నది అందుకు అనుగుణమైన పాఠశాలలను అందుబాటులో ఉంచడం ద్వారా  ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సకల సౌకర్యాలు కల్పించాలి .కానీ అందుకు భిన్నంగా దేశవ్యాప్తంగా ఉభయ రాష్ట్రాలలోనూ ముఖ్యంగా తెలంగాణలో  ఉన్న పాఠశాలలను మూసి వేయించి  బోధన బోధ నేతల సిబ్బందిని అందుబాటులో ఉంచకుండా అరకొర సౌకర్యాలతో  ప్రభుత్వ విద్యను నడిపించిన తీరు మనందరికీ తెలుసు. బడ్జెట్లో కేవలం 6 శాతం మాత్రమే కేటాయిస్తే  ఉమ్మడి రాష్ట్రంలో 17 శాతం ఉన్న నిధులు  ఏ 0త దిగజారినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ప్రభుత్వ విద్య ఏ రకంగా నాణ్యతగా ఉంటుందో  రాజకీయ వర్గాలు ఆలోచించుకోవాలి . ప్రైవేటు పాఠశాలల్లో  25 శాతం సీట్లను పేద వర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించవలసిన నిబంధన  విద్యాహక్కు చట్టంలో ఉన్నప్పటికీ ఆ  కృషి, ప్రయత్నము, ఆచరణ కొనసాగడం లేదు.  డబ్బున్న వాళ్లు ప్రైవేట్ పాఠశాలలకు పేదవాళ్లు అరకొర పాఠశాలలకు వెళుతుంటే  అసలు పిల్లలకి చదువు అందుబాటులో ఉందా? సౌకర్యాలు ఉన్నాయా? అనే సోయి లేకుండా గతంలో ప్రభుత్వాలు కొనసాగిన కారణంగా  పేద వర్గాల పిల్లలకు  నాణ్యతలేని  నామం మాత్రం విద్య మాత్రమే అందుతుంటే ప్రభుత్వాలు చూస్తూ ఉండడం  బాధ్యతారాహిత్యమే కదా ! .

కొత్త ప్రభుత్వం  విధాన ప్రకటన చేయాలి:-

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 2023లో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా విద్యారంగాన్ని పరిరక్షించాలి, సంస్కరించాలి, మార్పులు తీసుకురావాలి ,.అందుకు అనుగుణమైనటువంటి విధాన ప్రకటన వెంటనే చేయాలని పేద వర్గాలు మేధావులు బుద్ధి జీవులు విద్యావంతులు కోరుతున్నారు . విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా 14 సంవత్సరాల వయస్సు వరకు అమలు చేస్తూనే  ప్రైవేటు పాఠశాలల లోపల కూడా  ఆ సౌకర్యాన్ని వీలైతే కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి.  25 శాతం సీట్లను పేద వర్గాలకు ఇచ్చే నిబంధన పటిష్టంగా అమలుపరచాలి 

 గతంలో మూయించిన 6వేల పాఠశాలలను తిరిగి తెరిపించాలి,  మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసాన్ని భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.  అనేక చోట్ల ముఖ్యంగా నగరాలలో ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవడం,  అరకొర సౌకర్యాలతో ఆ పాఠశాలలు అంటేనే విసిగి  పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నా తమ పిల్లలను ప్రైవేటుకు పంపడం అనేది ఈ రాష్ట్రంలో దేశంలో కొనసాగుతున్న   దౌర్భాగ్యంగా భావించక తప్పదు.  విద్యను ఉచితంగా అందించడానికి రాజ్యాంగంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో విద్య పైన పేద వర్గాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించడానికి  సిద్ధంగా ఉండాలి ఆ వైపుగా ప్రకటన చేయాలి.  

 ఉపాధ్యాయ, సిబ్బందిని నియ మించే లోపున తాత్కాలి  విద్యా వాలంటీర్లను నియమించాలి.  నాలుగవ తరగతి ఇతర పారిశుద్ధ సిబ్బందిని కూడా నియమించి సకాలంలో సరైన వేతనాలను ఇచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాలి  .ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క బదిలీలు పదోన్నతులను ఎప్పటికప్పుడు  నిర్వహించడం ద్వారా  సిబ్బందిలో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని చైతన్యాన్ని  నింపి వాళ్ల భాగస్వామ్యాన్ని తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది . ఉద్యోగులు ఉపాధ్యాయులకు రావలసినటు వంటి వివిధ పద్దుల కింద బకాయిలు BRS ప్రభుత్వ  దివాలకోరు తనం కారణంగా గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు మాదిరిగా  ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి పకద్భందీగా  అమలు చేస్తున్న తీరు లోనే తెలంగాణ రాష్ట్రం లోపల కూడా  ఆంగ్ల మాధ్యమాన్ని పటిష్టంగా,  తెలుగు మాధ్యమాన్ని కోరిన చోట ప్రభుత్వాలు  నిర్వహించాలి.  విద్యారంగాన్ని పరిపుష్టి చేయడానికి విద్యావేత్తలతో రాష్ట్రంలో ఒక సలహా మండలి ఏర్పాటు చేయడం  ఆ మండలి పర్యవేక్షణలో ప్రభుత్వ విద్యారంగాన్ని  మరింతగా తీర్చిదిద్దడం  ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకోవాలి. ఆంగ్ల మాధ్యమములో విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఆంగ్ల భాషకు సంబంధించి అదనంగా  పీ రియడ్లను కేటాయించడం ద్వారా  స్పోకెన్ ఇంగ్లీష్ కు విధిగా  సిబ్బందిని నియామకం చేయడం ద్వారా  కాలానుగుణంగా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నది.  
100% అక్షరాస్యతను సాధించే క్రమంలో  ఇంటింటి సర్వే చేయించడంతో    పిల్లలందరూ నమోదయ్యే విధంగా చూడాలి.

 అంతేకాకుండా  ఆ కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితులను  సమగ్ర గణన జరిపించి  అల్పాదాయ కారణం చేత ఏ పిల్లలు కూడా పాఠశాలకు దూరం కాకుండా  చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.  చదువు సంపన్న వర్గాల సొత్తు మాత్రమే కాదు,   ప్రతిభ ఉండి కూడా ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకోలేని కుటుంబాలకు  పీజీ వరకు  అన్ని రకాల ఉన్నత విద్యను  ప్రజలకు ప్రభుత్వం  ఉచితంగా  అందించడానికి కార్యాచరణ ప్రకటించాలి . పార్లమెంట్లో ఆమోదం పొందిన విద్యాహక్కు చట్టాన్ని కేవలం  14 ఏళ్ల వయసుకు మాత్రమే పరిమితం చేయడం  సమంజసం కాదు, కాలానుగుణంగా మారుతున్న విలువల నేపథ్యంలో  అత్యున్నత స్థాయి విద్య వరకు కూడా  ఉచితంగా పొందడానికి గల అవకాశాలను పార్లమెంటు మరొక్కసారి సమీక్షించడం ద్వారా  రాష్ట్రాలకు తగిన సూచనలు జారీ చేయాలి. సమర్థవంతమైన ప్రభుత్వాలు  కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు సూచనలు లేకపోయినప్పటికీ  తమ రాష్ట్రాలలో  అన్ని వర్గాలకు కూడా ఉచిత విద్యను అందించడానికి పూనుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు.

 కానీ  ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకు దూరం అవుతున్న సందర్భంలో ఆ ప్రభుత్వాన్ని దో షిగా నిలబెట్టవలసిన బాధ్యత అవసరమాత్రం మనందరిపై ఉన్నది . ఈ విషయంలో న్యాయవ్యవస్థ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు  రాజ్యాంగంలోని నిబంధనల మేరకు  ఉచిత విద్యను చట్టబద్ధం చేసే విధంగా  ఆదేశాలు జారీ చేయడం ద్వారా  వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టాలి. ఆ ప్రారంభం తెలంగాణ రాష్ట్రంతో నే  మొదలు కావాలి . ప్రజలందరూ విద్యావంతులైతే పాలకులను ప్రశ్నిస్తారు అని అనుమానం  రాజకీయ వర్గాలకు లేకపోలేదు కానీ  ఆ కుంటి సాకుతో ప్రజలకు విద్యను దూరం చేస్తే  ఆ వర్గాలు  పాలకులను కూడా  పరిపాలనకు దూరం చేస్తారని తెలుసుకుంటే మంచిది.


---  వడ్డేపల్లి మల్లేశం

(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం(  చౌటపల్లి)  .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333