77 ఏళ్లు గడిచినా 2 శాతం దాటని  విద్యా బడ్జెట్

Aug 20, 2024 - 08:05
Aug 21, 2024 - 21:00
 0  1
77 ఏళ్లు గడిచినా 2 శాతం దాటని  విద్యా బడ్జెట్

 వికసిత భారత్ పేరుతో  ప్రజలను నమ్మిస్తే  ఆచరణలో పథకాలు కొనసాగాలి కదా !

దోపిడీ, పీడన, వంచన , ఆకృత్యాలు, అత్యాచారాలు, పేదరికము, నిరుద్యోగము,

 ఆకలి చావులు, ఆత్మహత్యలు,మానవ అక్రమ రవాణా కొనసాగడమేనా ఈ దేశంలో


----వడ్డేపల్లి మల్లేశం 

ప్రపంచ దేశాలకే తలమానికంగా  ప్రజల హక్కులు  ప్రాథమిక విధులతో పాటు పరిపాలకుల బాధ్యతలు  ఆదేశిక సూత్రాలతో పాటు స్వతంత్ర న్యాయ వ్యవస్థను  అక్షర బద్ధం చేయడంతో పాటు  స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగబద్ధ సంస్థలను నె లకొల్పి  వాటి  ఉనికి ప్రశ్నార్థం కాకుండా చూడాలని ఆదేశించిన భారత  రాజ్యాంగంను  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలోని రాజ్యాంగ రచన కమిటీ 2 సంవత్సరముల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి  అప్పగించడం జరిగింది  .రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్లమెంటులో  న్యాయశాఖ మంత్రిగా  కొనసాగ లేక    రాజీనామ పర్వంతో ఏ రకంగా స్వతంత్ర భారత వ్యవస్థ ప్రారంభమైందో మనం అర్థం చేసుకోవచ్చు.  అదే సందర్భంలో భారత రాజ్యాంగ పరిషత్ కు రాజ్యాంగాన్ని అప్పగించిన సందర్భంలో  అంబేద్కర్ చేసిన హెచ్చరిక  పాలకులను కళ్ళు తెరిచేలా    ప్రజలకు సేవకులమే కానీ శాసనకర్తలు కాదు అని  అంగీకరించేలా  ఉన్నప్పటికీ    స్వార్థం,  దోపిడి ,పీడన వంచన ,అత్యాచారాలు, హత్యలు,  ఆత్మహత్యలు ,పేదరిక నిరుద్యోగాలకు నిలయంగా ఈ దేశాన్ని పాలకులు దిగజార్చినారు అంటే అతిశయోక్తి కాదు  ."ప్రజల, రాజ్యాంగ మౌలిక లక్ష్యాలకు అనుగుణంగా  పాలకులు ప్రజలకు సేవ చేయాలి.  రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినా, పెట్టుబడజారి వర్గానికి తొత్తుగా వ్యవహరించినా, వ్యవస్థను ఖూనీ చేసినా  అనివార్యమైన పరిస్థితులలో ప్రజలు ఆ వ్యవస్థను  కూలదోసి  తమకు నచ్చిన  రాజకీయ యంత్రాంగాన్ని  సిద్ధం చేసుకుంటారు ఆ శక్తిని ఎవరూ ఆపలేరు" అని  ఘాటుగా వక్కానించినా  జరుగుతున్న అనర్థాలు , స్వార్థ చింతన ,పెట్టుబడిదారీ విధానం , న్యాయ  రాజ్యాంగబద్ధ సంస్థల  స్వయం ప్రతిపత్తిని కూలదోస్తున్న పాలకవర్గాల విధానం పక్షి తన పిల్లలను తానే పొడుచుకు తిన్నట్లుగా ఉన్నది.
        
1966 లో నివేదిక సమర్పించిన కొఠారి కమిషన్ కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో  10 శాతం విద్యారంగానికి నిధులు కేటాయించాలని,కామాన్స్కూల్కై సూచించినప్పటికీ  77 ఏళ్ల తర్వాత ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన 2024 -25  బడ్జెట్లో విద్యా రంగానికి 2 శాతం నిధులను  కేటాయించడం అంటే  పేద వర్గాలు  చదువుకునే ప్రభుత్వ విద్యారంగాన్ని ఖూనీ చేసీ ప్రైవేటు విద్యారంగాన్ని ప్రోత్సహించడమే అవుతుంది .
      వికసిత భారతంలో  వికసించని కుసుమాలు:-
***********
 బంగారు తెలంగాణ పేరుతో  కెసిఆర్ ప్రభుత్వము  ఉదృత ప్రచారం కావించి ప్రజలను ఏరకంగా మోసగించినదో  అదే రకంగా కేంద్రంలోని గత ప్రభుత్వాలతో సహా ప్రస్తుత ప్రభుత్వం కూడా  దేశం వెలిగిపోతున్నది , వికసితభారత్,  20047 టార్గెట్ , వెయ్యిండ్ల ప్రణాళిక మావద్ద ఉన్నది అంటూ   ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ప్రజల మౌలిక అంశాలను మాత్రం విస్మరించడం విచారకరం . 48 లక్షల 20వేల 512  కోట్లతో కేంద్రం  బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ  విద్యకు 2 శాతం  ప్రభుత్వ ప్రైవేటీకరణ ధోరణికి మచ్చుతునక కాథా?  ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న గత  హామీ  లక్షలకు పడిపోతే  15% జనాభా ఇప్పటికీ దారిద్రరేఖ దిగువన అల్లాడుతూ ఉండడం  భారతావని వికసించినట్లు ఎట్లా అవుతుంది?  ఇక బడ్జెట్లో నిధులు  ప్రకటించినప్పటికీ  90 శాతం గా ఉన్నటువంటి సామాన్య అట్టడుగు పేద వర్గాలకు  6 నుండి 10 శాతం  వాటా కూడా దక్కడం లేదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తుంటే  ఏ వర్గ ప్రయోజనం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.  గత పది ఏళ్లుగా భారతదేశంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థలు  ప్రైవేటీకరించబడి  ఉద్యోగాలు కోల్పోయి  ప్రజా సంపద కొల్లగొట్టబడిన కారణంగా పేదరికం విచ్చలవిడిగా పెరిగిపోయింది . మరొకవైపు 40 శాతం సంపద కేవలం  1శాతం సంపన్న వర్గాల చేతిలో విలవిలలాడుతుంటే  పేదవర్గాలు,  వారి అభివృద్ధికి సంబంధించిన నినాదాలు కేవలం  ప్రకటనల కేనా  ?ప్రధానమంత్రి తన సొంత రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని కొనసాగించిన  అనుభవాన్ని  కనీసం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి పూనుకోకపోవడం విచారకరం  ఇటీవల కాలంలో ఒకటి రెండు రాష్ట్రాలు  స్వయంకృషితో మధ్య నిషేధాన్ని అమలు చేస్తూ ఉంటే  మద్యం   6 నుండి 10% క్యాన్సర్ రోగాలు రావడానికి కారణమని నిపుణులు చెప్పినప్పటికీ  నిషేధించడానికి పూనుకోకపోవడం అంటే ఆదాయ వనరుగా మద్యాన్ని భావించడమేనా  ?అదే వారసత్వాన్ని అన్ని రాష్ట్రాలు కూడా కొనసాగిస్తున్న తరుణంలో  పెద్దన్న పాత్ర వహించవలసిన కేంద్రం  ఎవరి దారిన వారిని విడిచి పెడితే  సామాన్య ప్రజలు   గద్దలు ఎత్తుకుపోయిన కోడి పిల్లలు లాగా విలవిలలాడక  ఇంకేం చేస్తారు? ఇదేనా పరిపాలనకు నిర్వచనం ? రాష్ట్రాలు తమ బడ్జెట్లో విద్యకు 30% కేటాయించవలసి ఉంటే  ఢిల్లీ గోవా చెన్నై కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు  25 శాతం నుండి 15% వరకు అయినా అమలు చేస్తుంటే  ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న టీఆర్ఎస్  తన పదేళ్ల కాలంలో 6 శాతం కూడా విద్యకు కేటాయించకపోవడం  బంగారు తెలంగాణకు దర్పణమా?  ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తన బడ్జెట్లో  విద్యకు 8 శాతం మాత్రమే కేటాయించడం కూడా విచారకరం  కనీసం ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా 15% నిధులను కేటాయించి రాబోయే కాలంలో తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ప్రజలు ప్రజాస్వామికవాదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

 చేదు అనుభవాలు,  అమానవీయ సంఘటనలు,  కొనసాగుతున్న దోపిడి వర్గాల పీడన , దోపిడి వర్గాలకు  కేంద్ర ప్రభుత్వం అప్పనంగా మాఫీ చేసిన 16 లక్షల  కోట్ల రుణం  78వ స్వాతంత్ర దినోత్సవ వేల  చర్చ అయినప్పుడు  స్వతంత్ర దేశమని సంబర పడదామా  ?పరాయి పాలన లాంటి పరిస్థితులు కొనసాగుతున్నందుకు బాధపడదామా?  ఆలోచించుకోవలసిన తరణం ఆసన్నమైనది  .కొన్ని రంగాలకు బడ్జెట్లో భారీగా కేటాయించినట్లు కనిపించినప్పటికీ ఆచరణలో ఖర్చు చేయకపోవడం విడ్డూరం . 2023 -24 సంవత్సరాలకి కేంద్రం తన బడ్జెట్లో వ్యవసాయం గ్రామీణాభివృద్ధి ఇందన లాంటి ఏడు కీలక రంగాలకు కేటాయించిన కోటానుకోట్ల రూపాయల లో  సుమారు 1.21 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయలేకపోయినారని  పరిశీలకులు వెల్లడించడాన్ని  ఏమనాలి.  ఆర్థిక సర్వే మేరకు నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటే 2030 నాటికి ప్రతి ఏటా 78.5 లక్షల ఉద్యోగాల సృష్టి జరగాల్సిన అవసరం ఉన్నదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు  అందుకు తగిన నిధి సమకూర్చుకోవడం ప్రస్తుతం ఉన్న పెను సవాల్.  ఇక ఆకాశంలో సగం అని భావిస్తున్న మహిళలను గూర్చి ఆలోచిస్తే  అంగడి సరుకుగా ఆట బొమ్మగా  చిత్రీకరించబడుతున్న మహిళల  దుస్థితి పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలేవు. పర్యవసానంగా అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు  స్టీలపై లైంగిక వేధింపులు అఘాయిత్యాలు  జరుగుతూనే ఉన్నాయి  .మహిళలు ఇలా  తోటి సమాజం  పెట్టుబడిదారులు భూస్వాములు  సంపన్న వర్గాల చేతిలో  పీడించబడి దోపిడీకి  వేధింపులకు బలవుతుంటే  వెయ్యేండ్ల ప్రణాళిక  ఏది అని సామాన్యులు అడుగుతున్న ప్రశ్నకు   ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయి ?. 2018 -22 మధ్యకాలంలో 4 లక్షల పైచిలుకు మహిళలు, 1.27 లక్షల మంది చిన్నారులు  అదృశ్యమైనట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి  వారిలో   2.05 లక్షల మంది మహిళలు 80,561 మంది చిన్నారుల ఆచూకీ లభించిందని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  ఇటీవల చెప్పినప్పటికీ  ఇంకా లక్షలాది మంది ఆచూకీ తెలియకపోవడం   పాలనలోని డొల్లతనాన్ని తెలియచేస్తున్నది . మరొకవైపు మానవ అక్రమ రవాణా  యదేచ్చగా కొనసాగుతుంటే 2020లో  1, 714 కేసులు నమోదైతే 2022 నాటికి ఆ సంఖ్య 2250 కి ఎగబాకినదంటే  ప్రజా జీవితం చిద్రమవుతున్న సంఘటనలే  ఎక్కువ అని తెలుస్తున్నది . 77 ఏళ్లు  ముగించుకున్న స్వతంత్ర దేశంలో  సామాన్యుని ఆవేదనను ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకొని  ఈ సమస్యలను పునరావృతం కాకుండా  చూడడంతో పాటు మరింత మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి  ప్రజలు ప్రజాస్వామ్య వాదులతో కూడిన కమిటీల ద్వారా  ప్రణాళికలు ప్రారంభిస్తే సమయోచితంగా ఉంటుంది .అప్పుడు గాని రాజ్యాంగ ఫలాలు చట్టబద్ధంగా పేద అట్టడుగు వర్గాలకు అందవు.
(  ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333