దోమలు బాబోయ్ ..కాపాడండి

ప్రధాన పట్టణాల్లో అపారిశుధ్యం....
కానరాని బ్లీచింగ్ పౌడర్ ఫాగింగ్, మందు పిచికారీ, స్ర్పేయింగ్, యాంటీ మస్కిటో లార్వా ఆయిల్‌బాల్స్ స్ర్పేయింగ్.....
వ్యాధుల బారిన పడుతున్న , పట్టణ వాసులు...
ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు.....
పట్టించుకోని మున్సిపల్ అధికారులు.....
తిరుమలగిరి 17 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ వ్యాప్తంగా అపారిశుధ్యం తాండవిస్తోంది. ప్రధాన రహదారుల్లో పారిశుధ్యంపై దృష్టి సన్నగిల్లింది. దీంతో ఎటు చూసినా దోమలు బాబోయ్ దోమలు అంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. ఇక తట్టుకోలేం దోమల దాడి నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. తిరుమలగిరి నగరపాలక సంస్థ, పరిధిలోని మురుగునీరు, ఇళ్లలోని వాడకం నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన డ్రైనేజీల్లో పూడిక తీత పనులు చేపట్టకపోవడంతో సిల్ట్ పేరుకుపోతోంది. దీంతో డ్రైనేజీల్లో వ్యర్ధాలు, చెత్తాచెదారం పెరిగిపోతోంది. ఆ పేరుపోయిన వ్యర్ధాలు, చెత్తాచెదారాలను దోమల ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. లార్వా ద్వారా దోమల వృద్ధి చెంది విజృంభిస్తున్నాయి. దీంతో దోమల బెడ ద ఎక్కువైంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలను కంటిమీద కునుకు లేకుండా విసిగిస్తున్నాయి. రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. తిరుమలగిరి లో పలు కాలనీల పరిధిలో మేజర్, మైనర్ డ్రైనేజీలు ఉన్నాయి. అలాగే వాటర్ స్టోరేజీ చెరువులు నగరంలో ప్రధానంగా రెండు ఉన్నాయి. వాటిలో దోమల ఉత్పత్తి నానాటికీ పెరుగుతూ అది అధికమై పగలు రాత్రి తేడా లేకుండా ఊరు మీద పడి దాడి చేసి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఫలితంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా, పసుపు జ్వరాలు వ్యాపిస్తున్నాయి. నగరపాలక సంస్థ గతంలో తరచూ ఫాగింగ్ చేసేది. యాంటీ మస్కిటో లార్వా ఆయిల్‌బాల్స్ స్ర్పే చేసేవారు. ఈ ఫాగింగ్ రసాయనాల వల్ల గుడ్డు దశలోనే దోమ నశించేది. కొంతమేరకు దోమల బెడద తగ్గేది. కొద్దిరోజులుగా నగరంలో యాంటీ లార్వా బాల్స్ స్ర్పే చేయడం, వీధుల వెంబడి ఫాగింగ్ చేయడం వంటివి నిర్వహించడంలో నగర పాలక సంస్థ నిర్లక్ష్యం వహించింది. దీంతో దోమలు పెద్దఎత్తున పెరిగి పోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ప్రజలు కోరుతున్నారు....