నాటి అత్యవసర పరిస్థితి పై దేశవ్యాప్త చర్చ అవసర మే .*
ఎందుకంటే నేడు దేశంలో కొనసాగుతున్న పాలకుల పోకడలు సమీక్షించుకోవడం అనివార్యం కనుక.
అత్యవసర పరిస్థితి నుండి నేటి సమాజం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా?
పాలకుల జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయకపోతే రాబోయేది గ డ్డు కాలమే సుమా!
---వడ్డేపల్లి మల్లేషము
పాలకులు ప్రజలకు సేవకులే కానీ శాసించే వాళ్ళు కాదని, నిర్బంధం అణచివేతతో ప్రజలను స్వామిక వాదులను తొక్కి పెట్టడానికి ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భారత దేశ పరిపాలనలో గత అనుభవాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదే సందర్భంలో చట్టాన్ని ఆధారం చేసుకుని రాజ్యాంగంలోని నిబంధనల సాకుతో దేశంలో 1975 జూన్ 25వ తేదీన అత్యవసర పరిస్థితిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా గాంధీ నాయకత్వంలో అమలు చేసిన తీరు ఎంత ప్రజా వ్యతిరేకంగా జరిగిందో ఒక్కసారి గతంలోకి వెళితే కానీ తెలియదు.1977 మార్చి 21 వరకు కొనసాగినటువంటి ఎమర్జెన్సీ కాలంలో జరిగిన దారుణ మారణకాండ, అణచివేత దాడులు, సిగరెట్ల తో కాల్చడం, పోలీసుల చేతిలో గాయాలపాలై చిత్రవధకు గురైన వారి ఫోటో ప్రదర్శన19 78లో స్వయంగా చూసిన నా అనుభవాల ఆధారంగా అత్యవసర పరిస్థితి గురించినటువంటి చర్చ చేయాల్సిన అవసరం ఉంది. చరిత్ర చదవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది. ఆనాటి పరిస్థితిని చీకటి అధ్యాయంగా భావించిన సందర్భంలో ఈ మధ్యనే అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టి 49 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులోనూ సర్వత్ర ప్రజల మధ్యన చర్చ జరుగుతున్నది ఇదే సందర్భంలో ఇటీవల ప్రధానమంత్రి కూడా ఎమర్జెన్సీ ప్రవేశపెట్టిన జూన్ 25వ తేదీని హత్యా దివస్ గా నిర్వహించాలని పిలుపు ఇవ్వడం లో కొంత వాస్తవం ఉండవచ్చు కానీ ఆనాటి పరిస్థితులే అప్రకటిత అత్యవసర పరిస్థితి రూపంలో నేడు భారతదేశంలో కొనసాగడాన్ని గమనించినప్పుడు నాటికి నేటికి పెద్ద తేడా లేధని పరిశీలకుల అంచనా. అధికారాన్ని కొనసాగించడానికి ఆనాడు ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని అనివార్యంగా ఉపయోగించుకుంటే నేడు ప్రజల ఆమోదంతో ఎన్నికైనప్పటికీ నిర్బంధ విధానం కొనసాగడంలోని సామ్యాలు తేడాను గమనించవలసిన అవసరం ఉన్నది.
ఎమర్జెన్సీ చీకటి రోజుల గూర్చి కొంత:-
********* విదేశీ దురాక్రమణ అంతర్గత కల్లోలం వంటి భయంకరమైన సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే అత్యవసర పరిస్థితి విధించవలసిన అవసరం ఉంటుంది రాజ్యాంగపరంగా. కానీ నాటి ఎన్నికల్లో రాయబరేలి నియోజకవర్గంలో ఇందిరపైన పోటీ చేసి ఓడిపోయిన రాజు నారాయణ అలహా బాద్ హైకోర్టులో చేసిన ఫిర్యాదు ఆమోదించిన హైకోర్టు న్యాయమూర్తి జగన్మోహన్లాల్ సిన్హా ఇందిరా ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వడంతో ఆనాటి ప్రభుత్వంలో ఆందోళన ప్రారంభమైనది. ఆ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసి స్టే పొందినప్పటికీ తర్వాత సుప్రీంకోర్టు స్టేను ఎత్తివేయడంతో అసలు కథ ప్రారంభమైనది . అనివార్యమైన పరిస్థితిలో అధికారాన్ని కొనసాగించడానికి ప్రత్యామ్నాయ పద్ధతులను ఆలోచించిన సందర్భంలో అత్యవసర పరిస్థితి విధించడం అవకాశంగా భావించిన ఇందిరా సూచన మేరకు ఆనాటి రాష్ట్రపతి ప్రకృతి అలీ అహ్మద్ 352 రాజ్యాంగ నిబంధన వినియోగించుకొని ఎమర్జెన్సీ విధించడం ద్వారా కోర్టు తీర్పును కూడా కాదని ప్రభుత్వం ఈ దేశంలో కొనసాగిన పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు.
ఎన్నికలలో ఆనాడు ఇందిరా డబ్బు , రగ్గులు, మద్యం ప్రజలకు పంపిణీ చేశారని, కొందరు అధికారులను అక్రమంగా వినియోగించుకొని గెలిచిందని తన పిటిషన్ లో పేర్కొన్న వాదనలతో అనివార్యమైన పరిస్థితి లోపల ఈ అత్యవసర పరిస్థితి విధించడం కేవలం ఇందిర అధికారాన్ని కొనసాగించడం కోసమేనని ఆనాడు నేడు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుమారు రెండు సంవత్సరాల అత్యవసర పరిస్థితి కాలంలో పౌరులు ప్రజాస్వామికవాదులు ఇందిరకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు తీవ్రమైన అణచివేతకు గురికాగా 1.5 లక్షల మంది జైలు పాలైనట్లు ప్రాథమిక హక్కులు ప త్రికా స్వేచ్ఛ బలైపోయినట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ రాజ్యాంగ నిబంధనలను వినియోగించి హైకోర్టులు అనేక మందిని జైలు పాలు కాకుండా కాపాడిన కారణంగా ఇందిరా ప్రభుత్వం 16 మంది హైకోర్టు న్యాయమూర్తులకు బదిలీ వేటు వేసి తన అక్కసు వెళ్ళ తీసుకున్నట్టు తెలుస్తున్నది . కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం, కొన్ని రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించడం వంటి చర్యలు ఈ ఎమర్జెన్సీ కాలంలో కొనసాగడం దారుణం కదా! ఆనాటి ప్రభుత్వం అనుకూలంగా రాజ్యాంగ సవరణలతో పాటు పలు మార్పులు చేయడం, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించిన ఏడో షెడ్యూల్ను సవరించడం, ప్రాథమిక హక్కుల కన్నా ప్రాథమిక బాధ్యతలకు ప్రాధాన్యతను ఇవ్వడం ద్వారా హక్కులను ఖూనీ చేయడం జరిగిన కొన్ని పరిణామాలు. న్యాయ వ్యవస్థను రాజ్యాంగాన్ని కూడా కాదని కేవలం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా సంక్రమించిన అధికారం ముసుగులో అంతటి క్రూరమైన పరిపాలన జరిగినట్లు తెలుస్తుంటే ఇటీవల ఎమర్జెన్సీ పైన దేశవ్యాప్తంగా జరిగిన చర్చ, ఎమర్జెన్సీ ద్వారా గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ప్రజలకు పాలకులకు ఎంతో ఉన్నది.
నేటి పాలన అప్రకటిత ఎమర్జెన్సీ ని తలపిస్తున్నది:-
***********
ఎన్నికలు పార్లమెంటు ఇతర రాజ్యాంగబద్ధ సంస్థలు న్యాయవ్యవస్థ కొనసాగుతూ దేశవ్యాప్తంగా పరిపాలన ప్రజలకు అందించబడుతున్నప్పటికీ ప్రకటించకుండానే అంతర్గతంగా ఈ దేశంలో ప్రజల హక్కులు కాలరాచి వేయబడుతున్నవి అని అనేకమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే నేడు కూడా ఆనాటి పోకడలే కొనసాగుతున్నాయని ప్రభుత్వాన్ని పారదర్శకంగా వ్యవహరించే విధంగా బాధ్యురాలని చేయడం ద్వారా ప్రజలు తమ డిమాండ్లను సాధించాలని అందుకు ప్రజా పోరాటాలే మార్గమని బుద్ధి జీవులు మేధావులు, ప్రజాస్వామి కవాదులు పిలుపు ఇవ్వడాన్ని మనం సాగతించవలసిన అవసరం ఆలోచించవలసిన సందర్భం కూడా ఉన్నది . ప్రజాస్వామ్య వ్యవస్థల పైన దాడులు జరగడంతో పాటు ,ప్రభుత్వం చేతిలోని చట్టబద్ధమైన సంస్థలు ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల పైన దాడులకు పాల్పడడాన్ని ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. చట్టసభలలో నేరస్తులు నేరచరిత్ర ఉన్నవాళ్లు కొనసాగుతూ ఉంటే వారి పట్ల అనుకరించని కొత్త విధానం నిర్బంధం అణచివేతను ధిక్కరించి ప్రజల కోసం పనిచేసే ప్రజాస్వామ్య వాదుల మీద ఉగ్రవాదుల మాదిరిగా చర్యలకు ఉపక్రమించడాన్నీ ఏ రకంగా చూడాలి ? ఇప్పటికీ దేశద్రోహ చట్టం కొనసాగడం అనేకమంది పైన ఆ చట్టాన్ని అక్రమంగా వినియోగించడం....... ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విచారణ ఖైదీలుగా మాత్రమే జైల్లో మగ్గుతూ సంవత్సరాల తరబడి శిక్షించబడుతున్నారు వారి నేరాన్ని మాత్రం కోర్టులు లేదా ప్రభుత్వాలు రుజువు చేయకపోవడం అంటే మానవ హక్కులను హరించి వేయడమే కదా! ప్రస్తుతం కూడా పత్రికల పైన ప్రజాస్వామ్యవాదుల పైన నిర్బంధం అణచివేత సెన్సార్షిప్ కొనసాగుతున్నది. ఇటీవల ఢిల్లీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను అక్రమంగా నిర్బంధించి సుమారు పది సంవత్సరాల తర్వాత నిర్దోషి అని సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించడం ద్వారా బయటికి వచ్చినప్పటికీ ఆ పది సంవత్సరాల పాలకులను బాధ్యులు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. నేరగాళ్లు శిక్ష నుండి తప్పించుకుంటూ ఉంటే నిర్దోషులు శిక్షించబడడం ఈ దేశంలో కొనసాగితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అది మరోరకంగా ఎమర్జెన్సీ కాదా ?ఇటీవల కాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టిందని ప్రతిపక్షాల ఆరోపణ బలంగా వినిపిస్తున్నది. పత్రికా యాజమాన్యాలు విలేకరుల పైన ప్రభుత్వ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి, ఆధునిక కాలంలో కూడా ఇలాంటి అఘాయిత్యాలు చట్టానికి అతీతంగా జరుగుతున్నటువంటి దుర్మార్గపు పోకడలను ప్రజా పోరాటాల ద్వారా అరికట్టకుంటే మరో రూపంలో అత్యవసర పరిస్థితి నాటి శిక్షలు అనుభవించినట్లే కదా! ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశమని చెప్పుకుంటూ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగి ఉండి దాడులకు బలి కావడం అవమానకరం కాదా! అందుకేనాటి ఎమర్జెన్సీ కాలంనాటి పరిస్థితులను బేరీజు వేసుకుంటూ నేడు ఉన్నటువంటి ప్రజాస్వామిక పరిస్థితులు లేదా అప్రజాస్వామిక నిర్బంధాలను సమీక్షించుకోవడం మనందరి బాధ్యత. నాటి ఎమర్జెన్సీ నుండి మనందరం పొందాల్సిన గుణపాఠం కూడా అదే.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)