పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే ఉద్యోగాల కొరత ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎలా సాధ్యం?

Apr 7, 2024 - 12:16
 0  1

 కేరళ వంటి రాష్ట్రాల  పనితీరు చూసి  వెంటనే సంస్కరించుకోవాలి.

యూపీఎస్సీ  సలహా  కోరడం మంచిదే.

పారదర్శకత, నిబద్ధత లేకనే కదా  గత పాలనలో లీకేజీల పర్వం తో రాష్ట్రానికి అప్రతిష్ట యువతకు ద్రోహం తలపెట్టింది.

--- వడ్డేపల్లి మల్లేశం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో క్రియాశీలక పాత్ర పోషించే పబ్లిక్ సర్వీస్ కమిషన్  కూర్పు, ఉద్యోగుల  భర్తీ, లక్ష్యాలు,  ఆచరణలో  పనితీరు  అర్థవంతంగా ఉన్నప్పుడు మాత్రమే  లక్షలాది నిరుద్యోగులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది.  కానీ దానికి భిన్నంగా గత బారాసా ప్రభుత్వ హయాంలో  వ్యవస్థాగత లోపాలు ప్రభుత్వ వైఫల్యం కారణంగా  నిర్వహించిన ప్రతి పరీక్ష కూడా లీకేజీ కావడంతో  రద్దు చేయడం  ఆందోళన కలిగించిన విషయం.  ఒక దశలో తమకేమీ సంబంధం లేదని  ప్రభుత్వం అంటే  ఎన్నికల సమయంలో మాత్రం ప్రక్షాళన చేస్తామని నమ్మబలకడం  గత ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనంకాదా?.  ఏది ఏమైనా  ప్రస్తుత ప్రభుత్వం దాని బలోపేతానికి కృషి చేస్తేనే తప్ప నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చలేరు.  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  సహకారంతో సంస్కరించాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్న తరుణంలో  కేరళ వంటి ఇతర రాష్ట్రాల పనితీరును కూడా పరిశీలించి  రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను బలోపేతం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ప్రభుత్వం పైన ఉన్నది.

     దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష కేంద్రాల ఏర్పాటు, అభ్యర్థులకు కేంద్రాల కేటాయింపు,  మూల్యాంకరము, తుది ఫలితాల  ప్రకటన,  ధ్రువీకరణ పత్రాల పరిశీలనతో పాటు  భర్తీ ప్రక్రియకు సంబంధించి  న్యాయ  వివాదాల పరిష్కారానికి సంబంధించి కూడా  కమిషన్ సిబ్బంది చూడవలసి ఉంటుంది.అన్ని  రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు మన రాష్ట్ర కమిషన్ లో ఉన్న సిబ్బంది తక్కువగా ఉండడం ఆందోళన కలిగించగా  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  సిబ్బంది నియామకం పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం  వలన జరిగిన వైఫల్యాలను  ఎదుర్కోవడానికి  పూర్తిస్థాయిలో సిబ్బంది నిపుణుల నియామకాలను  చేపట్టవలసిన అవసరాన్ని ప్రస్తుత ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. ప్రతిపక్షాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు  ఒత్తిడి చేయవలసిన అవసరం కూడా ఉన్నది.

సిబ్బంది గణాంకాలు చూస్తే  సిగ్గుపడాల్సి వస్తుంది:-

రాష్ట్ర విభజన సందర్భంగా  ఏపీపీఎస్సీ నుంచి  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు 114 మంది సిబ్బందిని కేటాయిస్తే  1o 6 మంది మాత్రమే చేరినట్లు  అందులో కూడా 20 మంది నాలుగో తరగతి సిబ్బంది ఉన్నట్లు  తెలుస్తుంది.  అదనంగా మంజూరై న వాటితో కలిపి 127  పోస్టులతో టీఎస్పీఎస్సీ ఏర్పాటు అయితే  నాలుగో తరగతి సిబ్బంది  పరిపాలనా సిబ్బందిని పక్కన పెడితే  కేవలం 30 మంది మాత్రమే పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూడడం  తలకు మించిన భారంగా పరిణమించినది.  ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలంటే 341 మంది కనీసం ఉండాలని  కమిషన్  గత ప్రభుత్వానికి నివేదిస్తే  అదనంగా 214 పోస్ట్ లు  మంజూరు చేయాలని   నిపుణుల కమిటీలు సూచించినట్లు తెలుస్తుంది . గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 38 పోస్టులు మాత్రమే   భర్తీ చేయగా 165కు సంఖ్య పెరిగినప్పటికీ  పదవి విరమణ చేసిన వారు కొందరు చేరని వారి వలన  కార్యకలాపాల నిర్వహణ కష్టసాధ్యంగా మారడంతో పాటు పారదర్శకత లోపం,  ప్రభుత్వ వైఫల్యం, పని భారం  కారణంగా ప్రశ్నపత్రాల లీకేజీ  నిర్వహణ వైఫల్యం  రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చగా నిరుద్యోగుల పాలిట శాపంగా మారి  మొన్నటి ఎన్నికల్లో  బారాస ప్రభుత్వ ఓటమికి  ప్రధాన కారణంగా మిగిలిన విషయం తెలిసినదే.  చైర్మన్ కమిషన్ సభ్యులు ఉన్నప్పటికీ  ఇతర రాష్ట్రాల తరహాలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్  పోస్టును నియమించినప్పటికీ  ప్రస్తుతం ఖాళీ కావడం భర్తీ చేయకపోవడం  ప్రభుత్వాల ఉదాసీనతకు నిదర్శనం.

కొత్త ప్రభుత్వం ముందున్న సవాళ్లు :-

గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి  ప్రభుత్వంపై నిరుద్యోగులు పెట్టుకున్న నమ్మకాన్ని  కాపాడాలంటే  ప్రత్యేక యువజన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించడంతోపాటు  ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడం  అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడం  చాలా అవసరం.  గతంలోనే తీర్మానించినట్లు సక్రమ  నిర్వహణకు 341 మంది సిబ్బంది  అవసరమనుకుంటే  ప్రస్తుతం ఉన్న 165 కు అదనo గా  176 పోస్టులను మంజూరు చేసి  నియమించవలసి ఉన్నది.  ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ  విరమణ చేసేనాటికే కొత్త ఉద్యోగుల నియామకాలు  పూర్తి చేసి  ఉద్యోగుల కొరత లేకుండా చూస్తున్న  కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను  ఆదర్శంగా తీసుకోవడం చాలా అవసరం.  చరిత్రా త్మక విషయం ఏమిటంటే  కేరళ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 1600 మంది పనిచేస్తున్నట్టు  దేశంలోనే అత్యధిక స్థాయిలో  ఉద్యోగులున్న పెద్ద కమిషన్ గా గుర్తింపు పొందిన విషయాన్ని  ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుంటే మంచిది.  పోలీసు, పాఠశాల విద్యా నియామకాలు మినహాయిస్తే మిగతా అన్ని పోస్టులను కూడా  కేరళ ప్రభుత్వం  సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్టు తెలుస్తుంది . అంత పెద్ద నియామక ప్రక్రియను విజయవంతంగా  నిర్వహిస్తున్న కేరళ  పి ఎస్ సి ని  తెలంగాణ ఉన్నతాధికారులు ఇప్పటికే సందర్శించినట్లు తెలుస్తుంటే   జిల్లా స్థాయిలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లు  ఏర్పాటు చేసి  నియామక ప్రక్రియను విజయవంతంగా ముగించినట్లయితే యువతకు విశ్వాసం పెరుగుతుంది.  ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరుతుంది.  అందుకు ప్రభుత్వం  బడ్జెట్లో అధిక నిధులను కేటాయించడంతోపాటు  అనేక విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను  మంజూరీ చేస్తెనే  సమర్థవంతమైన పాలన అందించడానికి ఆస్కారం ఉంటుంది.  గతంలో జరిగిన లీకేజీల పైన కూడా విచారణ జరిపించి  జరిగిన అవినీతి  నిర్ధారణ చేసి దోషులను శిక్షించడం కూడా  భవిష్యత్తులో సమర్థవంతంగా నిర్వహించడానికి  ఉపయోగపడుతుంది .

( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు , ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌ టపల్లి) జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333