అహంకారమే ఓడించినదని సొంత పార్టీ వాళ్లే చెప్పినా మారని బి ఆర్ ఎస్ వైనం .
పార్టీ నిర్మాణమే సరిగా లేకుండా 60 లక్షల సైన్యం అని గొప్పగా చెప్పేవాళ్లు.
పార్టీ పైన విశ్వాసం లేక బి ఆర్ ఎస్ ను నాయకులు వీడుతున్నట్లు
సీనియర్ నాయకుల కథనం. తిరిగి చూడకపోతే భవిష్యత్తు అంధకారం.
---- వడ్డేపల్లి మల్లేశం
2023 నవంబర్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓటమిపాలైన టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమీక్షా సమావేశాలలో నాయకులు కార్యకర్తలు అనేక చోట్ల ప్రశ్నించడం తమ అభిప్రాయాలకు ఏనాడు నాయకత్వం విలువ ఇవ్వలేదని తమ ఆలోచనలు రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లాలని చెప్పిన ఆ ప్రయత్నం జరగలేదని ఆరోపించిన విషయం మనందరికీ తెలుసు. క్రింది స్థాయి నేతలు కార్యకర్తల మనోభావాలను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇతర సీనియర్ మంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలని కార్యకర్తలు కోరిన వెళ్లి కలిసి వచ్చినట్లు నటించారే కానీ ఏనాడు కలవలేదని కూడా అనేక సమీక్ష సమావేశాలలో వెల్లడైన విషయాన్ని పత్రికల ద్వారా మనం చదివి ఉన్నాము .
అంటే పదేళ్లపాటు ఈ రాష్ట్రంలో కొనసాగిన అధికార పార్టీ తన నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వహించినదని కేవలం తెలంగాణ సాధించినామనే డాంబికముతోనే ముందుకెళ్ళింది కానీ నిర్మాణాత్మకంగా లేని కారణంగా పీక మేడలా కూలిపోయినదని దాని పర్యవసానమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అని అనేక మంది విశ్లేషకులు అభిప్రాయపడిన రీతిని పార్టీ నాయకత్వం ఆనాటి నుండి గత నాలుగు మాసాలుగా ఏనాడు కూడా సమీక్షించుకోకపోగా ప్రతిరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం మీద దృష్టి పెట్టడం అంటే ఓటమిని అంగీకరించక చిలిపిగా వ్యవహరించడమే. ఇందుకు సంబంధించి సొంత పార్టీ నాయకులే చేసిన విమర్శలు ఇటీవల కే కేశవరావు కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి మారిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలను గమనిస్తే పార్టీ ఎంత నిరంకుశంగా వ్యవహరించిందో తెలుసుకోవచ్చు. అయితే ఒక పార్టీ యొక్క నిర్మాణం నడవడి అంతరంగిక విషయమే కావచ్చు కానీ పార్టీ నిర్మాణం పైననే గత పదిఏళ్ల పాలన కొనసాగింది కనుక పాలనలో తప్పిదాలకు పార్టీ అంతర్గత నిర్మాణం బాధ్యత వహించవలసి ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయక తప్పడం లేదు . పైగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా, పదేళ్ల కాలంలో కనీసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కూడా నిర్మించకుండా, చేసిన నిర్మాణాలు ప్రాజెక్టుల్లో అవినీతి చోటు చేసుకోవడంతో పాటు, అస్తవ్యస్తo ,ఆర్థిక విధ్వంసం కొట్ట వచ్చినట్లు కనపడినప్పటికీ దానిని కప్పిపుచ్చుకునే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ఆడ లేక మద్దెల ఓడినది అని చెప్పినట్లే కదా! అందుకే సొంత పార్టీ నాయకులు చేసిన విమర్శల పరంపరలో భాగంగా ప్రస్తుత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలను పరిశీలించవలసినటువంటి అవసరం ఎంతగానో ఉన్నది.
శాసనమండలి చైర్మన్ గారి ఘాటు వ్యాఖ్యలు:-
బిఆర్ఎస్ నుండి శాసనమండలి చైర్మన్గా ఎంపిక చేయబడినటువంటి సుఖేందర్ రెడ్డి గారు పార్టీలోని లోపాలను బహిరంగంగా విమర్శించిన సందర్భంలో వ్యక్తుల ప్రైవేటు బ్రతుకు వారి వారి సొంత పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం అని హెచ్చరించిన శ్రీశ్రీ గారి హెచ్చరిక మేరకు టిఆర్ఎస్ పార్టీ గతంలో పరిపాలించిన తీరుపైన చర్చించుకోవడానికి ఈ రాష్ట్రంలోనూ దేశంలోనూ ప్రతి ఒక్కరికి అర్హత ఉంటుంది అందుకే ఈ సమీక్ష.
-- పార్టీ పేరు చెబితే చాలు ఎవరిని అభ్యర్థిగా ఉంచిన గెలుస్తారు అనే గుడ్డి నమ్మకం పార్టీలో బలంగా ఉండేది అని సుఖేందర్ రెడ్డి గారి వ్యాఖ్యలు, అంతేకాదు వారి మాటల్లోనే ఈ క్రింది విషయాలను గమనిద్దాం.
-- పార్టీ నిర్మాణమే ఇప్పటికే సరిగా లేదు కేవలం సెంటిమెంట్ ఆధారంగా పనిచేయడం వల్ల పార్టీ ఓటమి కాక తప్పదు అనే భావనను వ్యక్తం చేయడం బలమైన నిర్మాణం ఎంత అవసరమో తెలియ చెప్పినట్లు అయినది.
- పార్టీలో సమన్వయ లోపం బాగా ఉందని , ఏకపక్షంగా సునాయాసంగా గెలుస్తామని అహంకారంతో వ్యవహరించిన కారణంగానే బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిందని వారు చేసిన ప్రకటన పైన రాష్ట్ర ప్రజానీకం దృష్టి సారించాలి సమీక్ష చేయాలి. బాధ్యతలు సరిగా పంపిణీ చేయకుండా కొద్దిమంది చేతుల్లోనే అధికారం ఉండడంతో ఇప్పటికీ సరైన నిర్మాణం లేని కారణంగా ఏకపక్షంగా వ్యవహరించడమే ఓటమికి కారణమైనదని స్వయంగా పార్టీ నుండి గెలిచి శాసనమండలి చైర్మన్గా పనిచేస్తున్న నాయకులు ప్రకటించడాన్నీ ఆ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోవడం కనీసం ఆలోచించకపోవడం ఆ పార్టీ పతనానికి నాంది అని చెప్పక తప్పదు. టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేనే సుప్రీమనీ అన్నిట్లో ఎమ్మెల్యే నే కీలకమని ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ నడిపించారని అది సరైన పద్ధతి కాదని వారి ఆరోపణ. ఇక ఎంపీ అభివృద్ధి నిధులకు సంబంధించి నియోజకవర్గానికి ఎంపీలు మూడున్నర కోట్లు కేటాయించాలని ఒకటిన్నర కోట్లు తమ దగ్గరే పెట్టుకోవాలని కార్యక్రమాలకు శాసనసభ్యులు పిలిస్తేనే వెళ్లాలి లేకపోతే వెళ్ళద్దు అని శాసన సభ్యులను ఎంపీలను విడదీసినటువంటి ఆనాటి ప్రభుత్వ ధోరణిని చైర్మన్ ఎండగట్టిన తీరు అంతకుమించి ఎమ్మెల్సీల పరిస్థితి అయితే కూరలో వాడి పడవేసిన కరివేపాకు చందమని వారికి ఎలాంటి ప్రాధాన్యత పాత్ర లేదని వారి ప్రకటన ద్వారా తెలుస్తున్నది.
-- తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యంగా 19 94 లో ప్రారంభమైనటువంటి పోరాట ప్రజాసంఘాల ప్రజా ఉద్యమాల నేపథ్యంలో తారాస్థాయికి చేరుకున్న తర్వాత 2001లో కేసీఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ ఆ ఉద్యమాన్ని కొనసాగించిందని కానీ ప్రతిదానికి తామే తెలంగాణ సాధించినామని చెప్పుకోవడాన్ని గనుక మనం గమనిస్తే ఉద్యమ కారుల పేరుతో అధికారంలోకి వచ్చిన చాలామంది అక్రమార్జన ద్వారా కోటీశ్వరులైనారని చైర్మన్ ఆరోపించడాన్నీ మనం పరిశీలించవలసిన అవసరం ఉంది . ఇటీవల కెసిఆర్ పార్లమెంటు ఎన్నికల సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లు లిల్లీపుట్గాలని విమర్శించార ని కానీ ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అనేకమంది లిల్లీపుట్లను తయారు చేశారని ఈ సందర్భంగా వారు విమర్శించడం అంతేకాకుండా పల్లీలు బఠానీలు అమ్ముకున్న టువంటి కార్యకర్తలు నాయకులు కూడా టిఆర్ఎస్ పేరు చెప్పుకొని కోట్లకు పడగలెత్తారని ఘాటైన విమర్శ చేసిన మండలి చైర్మన్ విలువలకు కట్టుబడి ఉన్న తనను టిఆర్ఎస్ నేతలు విమర్శించడాన్నీ మానుకొని ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరుతున్నారంటే బి ఆర్ ఎస్ పార్టీలో అంతర్గతంగా ఎంత కుమ్ములాటలు కొనసాగుతున్నాయో, ఏకపక్ష విధానాలు, అహంకారం, అవినీతి , అక్రమార్జన ఎంత తారాస్థాయికి చేరుతుందో అర్థం చేసుకోవచ్చు.
-- తనను విమర్శిస్తున్న టిఆర్ఎస్ నాయకుల బండారం బయటపెడతానని హెచ్చరిస్తూనే ప్రస్తుతం ఏర్పడిన కాంగ్రెస్ పాలన పైన ప్రజలలో భారీ అంచనాలు విశ్వాసం ఉన్నదని ఖజానా ఖాళీగా ఉండడంతో కనీసం ప్రభుత్వానికి ఏడాదైనా గడు ఇవ్వాలని కోరడాన్ని విజ్ఞతగా సంస్కారంగా మనం భావించాల్సిన అవసరం ఉన్నది .
- ప్రభుత్వ యంత్రాంగంలో తప్పుడు నిర్ణయాల కారణంగా టిఆర్ఎస్ పార్టీ నిర్వీర్యమై గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడమే కాకుండా ఇటీవల పే క మేడల్లా కూలిపోవాల్సి వచ్చిందని అనేకమంది నాయకులు కార్యకర్తలు పార్టీని వీ డుతున్నారని ఎవరికి నాయకత్వ బాధ్యతలు మంత్రి పదవులు అప్పజెప్పినారో వారి వల్లనే నష్టం జరిగిందని మండలి చైర్మన్ ఘాటుగా సూటిగా చెప్పడాన్ని స్వాగతించాలి. ఇదే సందర్భంలో గత శాసనసభ్యుల్లో 30 నుండి 40 మంది పైన అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అభ్యర్థులను మార్చితే ప్రభుత్వం వచ్చేదని అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైనప్పటికీ అదే అవినీతిపరులకు తిరిగి అభ్యర్థిత్వాన్ని కట్టబెట్టడం వల్ల పార్టీ ఓటరి పాలు కాక తప్పడం లేదని మనకు తెలిసిపోతున్నది .
ఇక పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తాను ప్రస్తుతం ఆ నివార్యమైన పరిస్థితిలో బి ఆర్ ఎస్ యొక్క వైఫల్యాలు ఓటమిని మాట్లాడవలసివచ్చినదని ఏ రాజకీయ పార్టీ అయినా గెలిచిన ఓడిన తప్పకుండా అందుకు గల కారణాలను సమీక్ష చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఈ విషయాలను తాను మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్ కు చెప్పామని కెసిఆర్ కు చెప్పే అవకాశం ఇవ్వలేదని దానివల్లనే పార్టీ కూలిపోతున్న ధని టిఆర్ఎస్ పార్టీ ద్వారా పదవిలో ఉన్న ప్రస్తుత మండలి చైర్మన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్నీ ఇప్పటికైనా టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కానీ అసమర్థ ప్రభుత్వాన్ని అందించి అనేక వైఫల్యాలతో కొనసాగిన ఆ పార్టీకి ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదనేది మనందరం నిలదీసి ప్రశ్నించవలసిన చారిత్రక సందర్భమిది . అందుకు సొంత పార్టీ నేతల అనుభవాలను మనం పెద్ద మొత్తంలో ఉపయోగించుకోవలసి ఉంటుంది. అయితే ఈ వైఫల్యాలు ప్రతి రాజకీయ పార్టీకి తప్పనిసరి అని గుర్తించడం అవసరం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ )